ఆ బుల్లెట్ లు ఒక మనిషికోసం రిజర్వుడు. వాటిని వృధా చెయ్యకూడదు తను!
ఎలుక అతని కాలిమీద నుంచి మరింతపైకి ఎగబాకింది.
అక్కడ డెక్ పైన -
కుమార మంగళం లేచి నిలబడి బార్ దగ్గరికి నడిచాడు. గుండెలో నుంచి పైకి తన్నుకొస్తున్న భయాన్ని రమ్ముతో ముంచెయ్యాలని ఉంది అతనికి.
రమ్ముసీసా అందుకుని గటగట సగం బాటిలు తాగేశాడు. తర్వాత మళ్ళీ ఆలోచించడం మొదలెట్టాడు.
తను ఫెర్నాండెజ్ ని హత్య చేసినట్లు తన క్రూకి ఇంకా తెలియదు. తను కట్ త్రోట్ అని, అవసరమైతే అక్క చెల్లెళ్ళను కూడా అమ్మేసేరకం అనీ వాళ్ళందరికీ తెలుసు కానీ.....
కానీ.....ఇది హత్య! నిజంగా హత్య!
తను హత్య చెయ్యడం ఇదే మొదటిసారి, అందుకనే తెగించి శవాన్ని సముద్రంలోకి తోసెయ్యలేకపోయాడు.
వాళ్ళెవరైనా చూస్తారేమో అన్న భయంతో.
ఇవాళ రాత్రికి శవాన్ని ఎలాగైనా నీళ్ళలోకి తోసెయ్యాలి. అది మళ్ళీ పైకి తేలకుండా బరువు ఏదయినా కట్టాలి.
అక్కడనుంచి టూల్ రూంలోకి వెళ్ళి బరువైన వస్తువు ఏదన్నా దొరుకుతుందా అని వెదకడం మొదలెట్టాడు కుమార మంగళం. పెద్దఇనుప చట్రం ఒకటి దొరికింది. నైలాన్ తాడు ఒక చుట్టుకూడా దానిదగ్గర పెట్టాడు అతను.
రాత్రికి తను ఫెర్నాండెజ్ శవాన్ని ఈ ఇనుపచట్రానికి బిగించి సముద్రపు లోతుల్లోకి తోసేస్తాడు. అంతటితో ఈపీడ విరగడయిపోతుంది.
ఏదో శబ్దం వినబడింది దూరంగా - అస్పష్టంగా.
ఛుగ్ ఛుగ్ ఛుగ్ ఛుగ్.....
ఉలిక్కిపడ్డాడతను.
నిజమా? తన భ్రమా?
చెవులు రిక్కించి విన్నాడు కుమార మంగళం.
చిన్నప్పటి నుంచి సముద్రాలమీదే పెరిగిన కుమార మంగళం చెవులు తప్పు సమాచారాన్ని అందించవు.
దూరంగా దెయ్యం తాలూకు నాడి కొట్టుకుమ్తున్న్ట్లు మోటారు బోటు చప్పుడు వినబడుతోంది.
నిశ్శబ్దంగా నిలబడి వింటున్నాడు కుమార మంగళం.
కొద్దినిమిషాల తర్వాత ఆ చప్పుడు బాగా దగ్గరయి ఆగిపోయింది.
మాటలు! మాటలు వినబడుతున్నాయి!
"కెప్టెన్! కెప్టెన్!" అంటూ వెదుకుతున్నాడు ఎవరో తనకోసం, వాడు సరంగు జానీమియా అయివుండాలి.
కుమార మంగళం బయటకు రావడానికి కదిలే లోపలే నిఖిల్ గొంతు వినబడింది.
"ఏడీవాడు?" అతి తీవ్రంగా ఉంది నిఖిల్ గొంతు.
ఎవరు? తనని గురించేనా నిఖిల్ అడుగుతోంది? తను ఫెర్నాండెజ్ ని ఫినిష్ చేసినట్లు అప్పుడే తెలిసిపోయిందా నిఖిల్ కి.
ముచ్చెమటలు పోశాయి కుమార మంగళానికి. అప్రయత్నంగానే అతని చేతులు నడుముకి తగిలించి ఉన్న రివాల్వర్ మీదికి పోయాయి.
నిఖిల్ అడుగుల చప్పుడు దగ్గరవుతోంది. మరునిమిషంలో అతని తల గుమ్మంలో కనబడింది.
వెంటనే రివాల్వర్ తొ షూట్ చేశాడు కుమార మంగళం.
ఒక్క ఉదుటున పక్కకి తప్పుకున్నాడు నిఖిల్.
కుమార మంగళం పరిగెత్తి బయటకు వచ్చి నిఖిల్ వైపు గురిపెట్టి అయిదుసార్లు వరసగా కాల్చాడు.
అయితే గజగజ వణుకుతున్న అతని చెయ్యి సరిగా గురిపెట్టలేకపోయింది.
మళ్ళీ ట్రిగ్గర్ నొక్కాడు కుమార మంగళం. ఊరికే 'క్లిక్' మని శబ్దం, అంతే! బుల్లెట్లు అయిపోయాయి.
భయంతో ఊపిరందడంలేదు కుమార మంగళానికి. అతనికి హఠాత్తుగా గుర్తొచ్చింది. తనకూ ఫెర్నాండెజ్ కూ జరిగిన ఘర్షణలో ఫెర్నాండెజ్ తనపైకి మూడుసార్లే కాల్చాడు. స్మిత్ అండ్ వెస్సన్ గన్ లో ఐదుగుళ్ళుంటాయి. ఆ చివరి రెండు బుల్లెట్ లూ వెలువడేలోగానే తను అతన్ని చంపాడు.
కాబట్టి ఇంకో రెండు బుల్లెట్లు ఉండాలి ఫెర్నాండెజ్ గన్ లో, తను అది అందుకుని నిఖిల్ ని చంపాలి.
అంతే! మరో మార్గంలేదు!
సన్నటి ఇనుపనిచ్చెన లాంటి మెట్లుదిగి షిప్ తాలూకు హోల్డువైపు పరిగెత్తాడు కుమార మంగళం. వెనక నిఖిల్ అడుగుల చప్పుడు అతన్ని మృత్యువులా తరుముతోంది.
ఫెర్నాండెజ్ పడివున్న కంపార్ట్ మెంట్ లోకి రొప్పుతూ వచ్చాడు కుమార మంగళం. అక్కడంతా గాడాంధకారంగా ఉంది. అదీ ఒకవిధంగా మంచిదే అనుకున్నాడు అతను. చీకట్లో అయితే తనని వెంటనే నిఖిల్ గమనించలేడు.
గట్టిగా శ్వాసతీసుకుని ఫెర్నాండెజ్ శరీరంకోసం తడమడం మొదలెట్టాడు కుమార మంగళం. పెట్టెలు సామాన్లు తడుముతూ ఉంటే ఏదో అతని చేతిమీదకు గభాలున పాకింది.
ప్రాణం పోయినట్లనిపించింది అతనికి.
అతని మీదకు పాకిన ఎలుక బెదిరి కిందకు దూకేసి పారిపోయింది.
చెయ్యి ముందుకు జాపాడు కుమార మంగళం. బూటు తగిలింది.
చెయ్యి ఇంకా పైకి చాపాడు.
