Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 38

   

                                  57


    ఇంద్రసేన ఆమెతో ఏం మాట్లాడలేదు.


    కారు ముందుకు సాగిపోతుంది.


    ఆమె ఒకసారి ఇందూవేపు చూసింది.


    ఇందూకూడా తలతిప్పి చూసింది.


    ఆమె చిరునవ్వు నవ్వింది.


    "నీకు అంబిక వదిన అవుతుందా!" అడిగింది.


    అవునన్నట్లు చెప్పింది.


    "ఇంకా పెళ్ళి కాలేదుగా."


    ఇంద్రసేన మాట్లాడలేదు.


    "చక్కగా అందంగా ఉన్నావు నీలాంటి చక్కనివాడే నీకు జంటగా వస్తాడు" అంది ఆమె.


    ఆ మాటలకి ఇందూ చెంపలు ఎర్రబడ్డాయి.


    ఆమె వేపుచూసి చిరునవ్వు నవ్వి ఊరుకుంది.


    "నిన్ను పెళ్ళి చేసుకునేవాడు నిజంగా అదృష్టవంతుడు" అంది ఇందూవేపు పరీక్షగా చూస్తూ.


    ఆమె మాట్లాడలేదు.


    "ఆ వచ్చే పెళ్ళికొడుకు నిన్ను ఎగరేసుకెళ్ళి మరీ పెళ్ళి చేసుకుంటాడు" అంది ఓరగా చూస్తూ.


    ఆ మాటలకి ఇంద్రసేన ఉలిక్కిపడ్డట్టు అయింది.


    ఆమెవేపు అదోలా నుదురు చిట్లించి చూసింది.


    ఆమె వెంటనే ఫక్కున నవ్వేసి


    "నీ అందం అటువంటిది. ఆడదాన్నైన నాకే నిన్ను చూస్తుంటే...." అంటూ కంఠస్వరం తగ్గించి డ్రయివర్ వింటాడన్నట్టు.


    "నీ బుగ్గలు... " అంటూ ఆమె చెవితో గుసగుసలాడింది నవ్వుతూ.


    ఇంద్రసేన సిగ్గుపడిపోయింది.


    మనసులో గర్వపడిపోయింది.


    తనంత అందగత్తె ఈ ప్రపంచంలో లేదన్నట్లుగా తలపోస్తూ తన ఫ్రెండ్స్ బంధువులు తనని ఎంతగా పొగిడేవారో గుర్తు తెచ్చుకుంటూ నవ్వసాగింది.


    ఆమె ఏదో మాట్లాడుతుంది.


    ఇంద్రసేన పరధ్యానంగా వింటుంది.


    ఆమె మనసంతా పరధ్యాసగా వింటుంది.


    ఆమె మనసంతా ఏమిటోగా ఉంది.


    కృష్ణమౌళి తనని ఎత్తుకుపోయి పెళ్ళి చేసుకుంటానని శపధం చేశాడు.


    ఆమె పళ్ళు పటపటలాడించింది.


    వదినే గనుక తనకి సహాయంగా ఉండకపోతే ఛీ ఛీ ఈ మాటలన్నీ అన్నయ్యకు, డాడీకి, మమ్మీకి ఏం చెప్తుంది!


    వదిన చదువుకున్నది,


    తెలివయినది చెప్పినది అర్ధం చేసుకోగలదు.


    అందుకే అంత తెలివిగా తను చెప్పింది విని తనని ఫ్రెండ్ యింటికి పంపిస్తుంది.


    అదే ట్రైన్ లో తను వెళ్ళేటట్టు అయితే అతను అదే ట్రైన్ లో తనని వెంటాడి నిజంగా ఎత్తుకు పోయేవాడు.


    వదిన ఫ్రెండ్ వెళుతుంటే కారులో పంపిస్తుంది. ఇప్పుడు కృష్ణమౌళి కాదుకదా ఆ బ్రహ్మదేవుడికి కూడా తను వైజాగ్ దాటి వచ్చేసింది అన్న సంగతి తెలీదు.


    ఇంద్రసేనకి చాలా సంతోషంగా వుంది.


    వదిన చెప్పిన కృష్ణతో తనకి పెళ్ళి నిశ్చయం చేస్తాను అంది.


    అతను వదిన మాట విని ఒప్పుకుంటాడా!


    అతను చాలా అందంగా ఉంటాడు అట.


    అతన్ని ఒక్కసారి చూస్తే!


    ఇందూ చిరునవ్వు నవ్వుకుంటూ తియ్యని ఆలోచనల్లో తేలిపోసాగింది.


    ఆమె మళ్ళీ ఇందూవైపు పరీక్షగా చూస్తూ "ఏమిటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు!" అడిగింది.


    "అబ్బే ఏం లేదండీ" అంది తడబడుతూ.


    "ఏం లేదంటే మాత్రం నేను గ్రహించుకోలేనా! పెళ్ళికాని అమ్మాయిలు కాబోయే వరుడు గురించి తియ్యగా ఆలోచించుకుంటారు. అవునా!" అంది సూటిగా చూస్తూ.


    ఇందూ మాట్లాడలేదు.


    "చూడు అమ్మాయి! చెంపలు ఒక్కసారి అద్దంలో చూచుకో ఎలా ఎర్రబడ్డాయో" అంది నవ్వుతూ.


    ఇంద్రసేన మాట్లాడకుండా కూర్చుంది. ప్రతీ విషయం ఈమె పసిగట్టేస్తున్నట్టే ఉంది. ఆమెతో వాదించేకంటే ఊరుకోవటమే మంచిది అనిపించింది ఇందూకి.


    ఆమె మాటలలో పడి ఎంతదూరం వచ్చారో ఏమిటో తెలియటంలేదు.


    మధ్య ఒకచోట ఆపించి కూల్ డ్రింక్స్ త్రాగారు. కారు మళ్ళా బయలుదేరింది.


    కారు చాలా స్పీడుగా వెళుతుంది.


    ఇంద్రసేన కళ్ళు మూసుకుని సీటుకి చేరబడింది.


    నిద్రపోలేదు. కళ్ళు మూసుకుని చేరబడితే ఆమె ఏం పలకరించదు అన్న ఉద్దేశంతో.


    కారు బయలుదేరి నాలుగు గంటలసేపు అయింది. ఉన్నట్టుంది కారు సడన్ గా ఆగింది.


    ఏమిటి అన్నట్టు చూసింది.


    ఎదురుగా ఒక కారు ఆగింది.


    కారులో నుండి ఒక అతను దిగి ఇటుగా వచ్చాడు. ఆమె అతన్ని చూస్తూనే నువ్వా ఏమిటి అడిగింది ఆత్రుతగా.


    అతను ఆమె దగ్గరగా వచ్చి చాలాసేపు ఏదో మాట్లాడేడు. ఆమె కంగారుగా, బెంగగా వింటుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS