Previous Page Next Page 
రాజ హంస పేజి 37

 

    "నాకు పదేళ్ళ వయసొచ్చింది. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికొచ్చే సరికి జనమంతా గుమిగూడి గోలగా వుంది.
    "నాకు భయమేసి వణికిపోతూ లోపలకు పరిగెత్తాను.
    'అమ్మ.....విగతజీవురాలై పడి వుంది.
    "అమ్మా! అని ఒక్క గావు కేకపెట్టి తెలివితప్పి పడిపోయాను. నన్ను తన రెక్కల కష్టంతో అల్లారుముద్దుగా పెంచిన అమ్మ నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మ అలా ఎందుకు చేసింది?
    "తర్వాత మెల్లగా నిజం తెలిసింది. పొలంలో పని చేసుకుని వంటరిగా తిరిగి వస్తుండగా ఎవరో నలుగురు దుండగులు ఆమెను బలత్కారంగా చెట్లలోకి తీసుకెళ్ళి కిరాతకంగా పాడుచేశారు. ఆ అవమానం భరించలేక నా మీద మమకారాన్ని కూడా చంపుకుని ఆత్మహత్య చేసేసుకుంది.
    "ఉన్నట్లుండి నా జీవితం అంధకార బందురమై పోయింది. ఏం చెయ్యాలి? ఎలా చదవాలి?"
    "చదువు మానేసి పస్తులతో కాలం గడుపుతున్నాను. ఇహ ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేని స్థితిలో వాసుదేవరావు గారు నన్నాదుకున్నారు.
    "వాసుదేవరావుగారు ఆ ఊళ్ళోనే ధనవంతుడు. అడవులలో కలప కొలుగోలు చెయ్యటం, వాటిని హెచ్చు ధరలకు అమ్మటం , యింకా వడ్డీ వ్యాపారం.....యిలాంటివి కొన్ని వున్నాయి. ఎవరి ద్వారానో నా దీన స్థితిని విని నన్ను చేరదీసి యింట్లో ఆశ్రయమిచ్చాడు. ఇంట్లోనే వుండి చిన్న చిన్న పనులు చెయ్యటం, అయన నా ఫీజులు అవీ కట్టి చదువు చెప్పించటం.....అయన కొంతవరకూ కఠినంగా వున్నా మొత్తం మీద బాగానే చూసుకునే వారు రోజులు సజావుగానే సాగిపోతున్నాయి.
    "అయన కూతురే మనోరమ. ఒక్కటే కూతురు వేరే సంతానం లేదు- ఆమె బాల్యదశలో ఉన్నప్పుడే  తల్లి చనిపోవటం చేత వాసుదేవరావు గారు చాలా గారభంగా పెంచారు. అందువల్ల గానీ, సహజ స్వభావం వల్ల గానీ మనోరమ చాలా కటువుగా పెంకిగా అహంభావంగా తయారయింది. ఆమె ప్రవర్తనలో ఓ రకం రాక్షసత్వం కనబడుతూ వుండేది. ముఖ్యంగా నా మీద పగ సాధిస్తున్నట్లు ప్రవర్తించేది. స్కూల్ కెళ్ళే టైములో ఏదో పని చెప్పేది. ఇంట్లో చదువుకునేటప్పుడు అధార్టీ చెలాయిస్తూ పనులు పురమాయించేది. వీటన్నిటినీ తట్టుకుని నా చదువుని ఎలాగో ఓలా కొనసాగిస్తూ ఫస్ట్ మార్కులు తెచ్చుకునేవాడ్ని.
    'అలాగే .....ఒక్కొక్క ఏడూ గడుస్తూ కాలేజి జీవితంలోకి ప్రవేశించాను." ఇంటర్ ప్యాసయి బి.కాం లోకి ప్రవేశించాను.
    "నాకు వయసొచ్చాక ....మనోరమ చూపుల్లో హావభావాల్లో చేష్టలో ఒకరకమైన మార్పు కనిపించింది.  ఆమె మనస్తత్వం చాలా విచిత్రంగా వుండేది. ఒకవైపు నన్ను హీనంగా చూస్తూనే రెండో వైపు నుంచీ నన్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసేది. నేను బట్టలు మార్చుకుంటుండగా, ఎరగనట్టూ గభాల్న లోపలికి రావటం నేను చూస్తుండగా పమిట జార విడవటం, జాకెట్ హుక్స్ పెట్టుకోవటం .....యిలాంటి చేష్టలన్నీ చేసేది. యజమానురాలు కావటం వల్ల మొదట్నుంచీ ఆమె అంటే భయం. మొదట్నుంచీ తనంటే వున్న వైముఖ్యం....నేను ఆమె ప్రవర్తనకు చలించకుండా తప్పించుకు తిరుగుతూ వుండవాడ్ని.
    "ఓ రోజు ....అర్ధరాత్రి దాటి వుంటుంది. పన్నెండు గంటల దాకా చదువుకుని, మంచి నిద్రలో మునిగి వున్నాను. తొంటిమీద ఏదో స్పర్శ తెలిసేసరికి మెలకువ వచ్చింది. మనోరమ నన్ను చుట్టుకుని వుంది. "ఏమిటిది?" అంటూ ఆమెను బలంగా తోసేసి లేచి కూర్చున్నాను. ఆమెకూ నాకు మధ్య జరిగిన సంభాషణ చాలా లజ్జా హీనమైనది, ఆమె మాటలతో చేతలతో నన్ను రెచ్చగొట్టటానికి ప్రయత్నించింది. బెదిరించింది నేను నా విముఖత స్పష్టంగా వ్యక్తం చేశాను. " నిన్నెట్లా తల వోగ్గేలా నాకు తెలుసు" అంటూ సవాలు విసిరి విసురుగా వెళ్ళిపోయింది. వాసుదేవరావుగారికి నామీద కల్పించి చెప్పి యింట్లోంఛి వెళ్ళకోడుతుందేమోననుకున్నాను. అలా జరగలేదు. దెబ్బతిన్న బెబ్బులిలా ఆమె సమయం కోసం పొంచి వున్నట్టు అర్ధమయింది.
    "బి.కాం ప్యాసయ్యాక నా అబీష్టనుసారం ఎం.బి. ఏ లో చేర్పించారు వాసుదేవరావుగారు. అయన ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది.
    "ఓ ఏడాది గడిచాక సెలవుల కింటికి వచ్చినప్పుడు ఓ కోరిక కోరారు - మనోరమను పెళ్ళి చేసుకొమ్మని అయన అలా అడగటం వెనుక మనోరమ దృడ సంకల్పం వుందని తెలుసు.
    "నా చేతులు పట్టుకుని ప్రాధేయపడుతూ తన కోరిక వెలిబుచ్చారు. ఆయనంతగా ప్రాధేయపడటానికి నాకు రెండు కారణాలు కనిపించాయి. ఒకటి నన్ను తప్ప యింకోకర్ని చేసుకోనని ఆమె భీష్మించటం రెండు ఇంకొకరికి కిచ్చి చేస్తే ఆమె మనస్తత్వానికి వాళ్ళు ఎడ్జస్ట్ కాక జీవితాల్లో కార్చిచ్చులు రేగుతాయాన్న అనుమానం.
    "నా జీవితానికి ఓ రూపు రేఖలు దిద్ది పటిష్టమైన భవిష్యత్తుని ఏర్పరిచిన మనిషి అయన కోరిక ఎలా కాదనాలో తెలీక ఎం.బి.ఎ పూర్తయ్యాక పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చాను. అలా మాటయిచ్చి గదిలో నుంచి బయటకు వస్తోంటే బయట నిలబడి అంతా వింటోన్న మనోరమ చుపులోని కసి, హేళన నన్ను చీల్చి చెండాడాయి.
    "కక్ష అనే దానికి ఎన్ని రూపాలుంటాయో దాని విశ్రుంఖలత్వం ఎన్ని రకాలుగా ప్రదర్శిత మవుతుందో పెళ్ళయాక తెలుసుకున్నాను. మనోరమ నాతొ కాపురం చేస్తూనే వుండేది. కాని తన నిర్లక్ష్య వైఖరితో , అహంకారంతో , నెగటివ్ బిహేవియర్ తో అనుక్షణం నరకం చూపిస్తూ వుండేది. పెళ్ళి చేసుకున్నాను కదా. సంసారంలో అశాంతి ఎందుకు అన్న భావంతో నేను ప్రతిదానికి రాజీ పడుతూ సౌమ్యంగా వుండటానికి ప్రయత్నించే వాడిని, వాసుదేవరావుగారంటే వున్న గౌరవం, మొదట్నుంచీ ఆ యింట్లో ఓ పనివాడిగా పెరిగిన వాతావరణం నన్ను ఆమె ముందు బలహీనుడ్ని గా తయారు చేశాయి. పెదవి విప్పితే వ్యంగ్యం, చూపులలో హేళన చేతలలో అధికారం మానసికంగా కృంగిపోయెవాడ్ని కాని ఒక పురుషుడిగా భర్తగా నా హోదా ఆమె ముందు ప్రదర్శించలేకపోయేవాడ్ని. ఆమెలో ఆమె గయ్యాళితనంలో ఏ శక్తి వుందో ఎందుకు ఆమె ముందు తలవంచానో నాకు తెలీదు. ఒక పురుషుడిగా భర్తగా ఉపయోగపడింది. ఆమె నాకోసం బెడ్ మీద కొచ్చినప్పుడే అప్పుడూ ఆమె చేయ్యిమన్నట్లు చేసేవాడ్ని. ఆమెను ఓ టాయ్ లా ఉపయోగ పడ్డాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS