Previous Page Next Page 
మారణహోమం పేజి 37

 

    "నన్ను కావాలనుకునే వాళ్ళందరికీ నేను దగ్గరివాడినే! కానీ రాధా! విషయాలని సీరియస్ గా తీసుకోవడం నేర్చుకో!"    
    మళ్ళీ తల వూపింది రాధ.    
    అతను తలుపులు వేసి వెళ్ళిపోయాడు.    
    తియ్యటి కలలుగంటున్న దానిలా పెదిమల మీద చిరునవ్వుతో అతను వెళ్ళినవైపే చూస్తూ చాలాసేపు నిలబడిపోయింది రాధ.
    
                                                * * *
    
    హాంకాంగ్ నుంచి వస్తున్న ఆ షిప్పు ఇండియాను సమీపిస్తోంది. సరుకులు రవాణాచేసే చిన్న షిప్పు అది. డెక్ మీద కూర్చొని పళ్ళు కుట్టుకుంటూ ఆలోచిస్తున్నాడు కెప్టెన్ కుమార మంగళం. మొరటు మృగంలా ఉంటాడతను. వారానికోసారి స్నానం చేసే అతని వంటి వాసనకి, టాయిలెట్లు క్లీన్ చేసే కళాసీలు కూడా ముక్కు మూసుకుంటారు.    
    లోకమంతా పచ్చగా కనబడుతోంది కుమార మంగళానికి. చుట్టూ ఉన్న సముద్రమంతా నీరెండలో కరిగిన బంగారంలా కనబడుతోంది. షిప్పు తాలూకు గర్భంలో ఒక సీక్రెట్ కంపార్ట్ మెంట్ లో దాచివున్న వెయ్యి కిలోల దొంగ బంగారమే దానికి కారణం.
    దాని ఖరీదు ఎంత ఉంటుంది? రహస్యంగా ఎక్కడ అమ్మెయ్యవచ్చు తను? అమ్ముతూ దొరికిపోతే నిఖిల్ తనని ఏం చేస్తాడు?    
    నిఖిల్ ని తలుచుకోగానే భయంతో అతని వంటిమీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అచ్చం ఒక ఎలుగ్గొడ్డులా కనబడుతున్నాడు ఇప్పుడతను. అతని చెయ్యి అప్రయత్నంగా కుడిచెవిమీదికి పోయింది. అక్కడ చెవిలేదు! చిన్న చర్మపుముక్క ఒకటి వికారంగా వేలాడుతోంది. షేవ్ చేసుకుంటున్నప్పుడు పొరబాటున తెగిపోలేదు ఆ చెవి.    
    నిఖిల్ కోసేశాడు నిర్ధాక్షిణ్యంగా! నిర్దయగా!    
    చాలారోజుల క్రితం జరిగిన ఆ సంఘటన గుర్తుకురాగానే అతనికి వెన్నెముకలోంచి చలి పుట్టుకొచ్చింది.    
    కానీ అంతలోనే అత్యాశ!    
    ఆ అత్యాశ భయాన్ని బలవంతంగా తొక్కెయ్యాలని చూస్తోంది.    
    ఈ దొంగ బంగారం నిఖిల్ ది. యానాం ప్రాంతంలో నిఖిల్ మనుషులు వచ్చి దాన్ని కలెక్ట్ చేసుకుంటారు. 'సరుకుని' జాగ్రత్తగా చూసుకోవడానికీ, దింపుకోవడానికీ, తనని ఓ కంట కనిపెట్టి ఉండడానికి నిఖిల్ అనుచరుడు ఫెర్నాండేజ్ ఈ షిప్పులోనే ప్రయాణం చేస్తున్నాడు.    
    నిఖిల్ ని మోసంచేస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయి. తను ఇదివరకు చేసిన చిన్నతప్పుకే చెవి కోసేశాడు నిఖిల్. ఇప్పుడు తను తడిగుడ్డతో నిఖిల్ గొంతు కోయబోతున్నాడు. దానికి బదులుగా నిఖిల్ ఏం చేయబోతున్నాడు?    
    తలచుకోడానికే భయం వేసింది కుమార మంగళానికి.    
    కానీ ఇప్పుడు వెనకడుగు వెయ్యడానికి వీల్లేదు. ఇప్పటికే ఫెర్నాండేజ్ ని చంపేశాడతను.    
    కడుపుని ఎలుకలు దొలిచేస్తున్నట్లు దిగులు అతన్ని కొరికేస్తుంది.    
    సరిగ్గా అదే సమయంలో.    
    ఒక ఎలుక, షిప్పుగర్భంలో చీకట్లో ఫ్లోర్ మీద పడివున్న ఫెర్నాండేజ్ శరీరాన్ని సందేహంగా సమీపించి ముందు కాళ్ళు ఆనించి చటుక్కున అతని మీదకు గెంతింది.    
    అతని పొట్టమీద బుల్లెట్ గాయం రక్తపుష్పంలా విచ్చుకుని ఉంది.    
    బావిగట్టు మీదనుంచి తొంగి చూచినట్లు ఆ గాయంలోకి తొంగి చూసింది ఎలుక. అతను మూడురోజులనుంచి అచేతనంగా అలాగే పడివున్నాడు. మూడురోజుల నుంచి కాచుకునే ఉంది ఎలుక. ఇందాకటిదాకా అతను మూలుగుతూనే ఉన్నాడు. ఆ మూలుగు ఎలుకని భయపెట్టి దూరంగా ఉంచగలిగింది.    
    ఇప్పుడు ఫెర్నాండెజ్ మూలగడం ఆపేశాడు. దుర్భరమైన బాధతో ప్రయాసతో అతను ఊపిరి పీలుస్తున్న శబ్దం మాత్రం వినబడుతోంది.    
    ధైర్యం చేసి పరిశోధించడం మొదలెట్టింది ఎలుక. నెమ్మదిగా పాకుతూ అతని గెడ్డం దగ్గరికి వెళ్ళింది, అతని ఊపిరికి దాని మీసాలు అల్లల్లాడుతున్నాయి.    
    వళ్ళు జలదరించింది ఫెర్నాండేజ్ కి. అతికష్టంమీద ఎడమ చెయ్యెత్తి దాన్ని అదిలించాడు.    
    ఆ కాస్త కదలికకే పొట్టమీద గాయం రాజుకుని భగ్గున మండినట్లయింది.     
    చటుక్కున క్రిందికి దూకి పారిపోయింది ఎలుక. అతనికి అందనంత దూరంలో ఆగి వెనక్కి తిరిగి మళ్ళీ ఇంకో అవకాశం కోసం ఎదురు చూడసాగింది.    
    ఫెర్నండేజ్ కళ్ళు మూతలు పడిపోయాయి. అతనికి స్పృహ తప్పుతున్నట్లు అనిపిస్తోంది. ఆ మగతలోనే తెరలు తెరలుగా భయం - ఎలుక మళ్ళీ వస్తుందేమోనని.    
    కొద్దినిమిషాల తర్వాత -    
    అతని ఫ్యాంటుని ఎవరో పట్టుకు పీకుతున్నట్లు అనిపించింది.    
    అతను గ్రహించినది స్పర్శవల్ల కాదు! అలికిడివల్ల!    
    అతనికి నడుముకింద నుంచి స్పర్శజ్ఞానం పోయింది. ఎలుక కాలి మీదికి ఎక్కి ఉండాలి. కానీ తగలడంలేదు.    
    ఒక వెచ్చటి కన్నీటిబొట్టు చెంపలని తడుపుతూ అతని చెవి దగ్గరికి వచ్చి ఆగింది. కుడిచేతిలో ఉన్న స్మిత్ అండ్ వెస్సన్ రివాల్వర్ చుట్టు అతని వేళ్ళు బిగుసుకున్నాయి. మామూలుగా అన్ని రివాల్వర్ లలో ఉన్నట్లు ఆరుగుళ్ళు ఉండే రివాల్వర్ కాదది. దాన్లో ఐదే బుల్లెట్స్ ఉంటాయి. వాటిలో మూడుగుళ్ళు మూడురోజుల క్రితం కుమార మంగళంతొ జరిగిన ఘర్షణలో ఖర్చయిపోయాయి.    
    రెండే బుల్లెట్లు మిగిలాయి.
    ఇంకా ఆ రెండు బుల్లెట్ లలో ఒకదానితో ఎలుకని చంపెయ్యాలని, రెండోదానితో తనని తానే కాల్చుకుని చనిపోవాలని అతనికి తీవ్రమైన కోరిక కలిగింది. అతికష్టంమీద అణుచుకున్నాడు దానిని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS