"ఇందూ ఏమిటమ్మా ఏం జరిగింది! నిన్ను ఎవరు ఏమన్నారు!" అడిగింది ప్రేమగా.
"ఏం జరిగిందా! నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోయారు. నా ప్రాణం పోయినా అంతేనా!" అంది ఏడ్పు గొంతుతో.
"అదేమిటమ్మా నువ్వు వుంటానన్నావుకదా అందుకే వెళ్ళాం" అంది.
"అన్నాను అంటే మీరు నన్ను వదిలి వెళ్ళిపోవాలా" అంబిక మాట్లాడలేదు.
"వాడు...... వాడు...... వచ్చాడు" అంది ఏడుస్తూ.
"వాడా? ఎవరు?" అర్థంకానట్టు అడిగింది.
"అదే ఆ కృష్ణమౌళి."
"ఏమిటి కృష్ణమౌళి ఇక్కడికి వచ్చాడా!" అంది ఆశ్చర్యంగా కోపంగా.
"ఆ" అంది ఏడ్పుగొంతుకతో.
"మనం ఇక్కడికి వస్తున్నట్లు ఎలా తెలిసింది!"
"ఏమో ఎలా అయినా తెలుసుకువస్తారు వేషాలువేసి మోసాలు చెయ్యగలడు."
అంబిక కోపంతో ఉడికిపోయింది.
"వదినా నా రోజులు బాగున్నాయి లేకపోతే ఈ రోజు అతని కోరికలకి నేను బలయిపోయేదాన్ని."
ఆమె మాట్లాడలేదు.
"నన్ను లొంగదీసుకోవాలని చూశాడు కాని నేను ఎలాగో తప్పించుకున్నాను అందుకు భగవంతుడు సాయపడ్డాడు."
"ఏమనుకున్నాడో నా ఒంటిమీద చెయ్యి వెయ్యలేదు. పంతం పట్టినట్టుగా అన్నాడు ఈ రోజు మొదలు వారంలోపు నన్ను తీసుకెళ్ళి పెళ్ళి చేసుకుంటాడట."
"ఆ చేసుకుంటాడు. అతని ఆటలు నేను సాగనిస్తానా! నేను అంత తెలివితక్కువదాన్నా. అతని ఎత్తుకి పైయెత్తు వెయ్యనూ! ఎవరనుకుంటున్నాడు ఈ డాక్టర్ అంబిక అంటే" అంది అంబిక కోపంతో మండిపడ్తూ.
ఇంద్రసేన వదినవైపు చూస్తూండిపోయింది.
"వదినా!" అంది.
చెబుతాను ముందు నువ్వు ముఖం కడుక్కో. నువ్వు మీ అన్నయ్యకు ఏం చెప్పకు ఈ కృష్ణమౌళి పనిచెబుతాను. నిన్ను ఎవ్వరికి తెలియకుండా దాచేస్తాను" అంది.
ఇంద్రసేన ఆశ్చర్యపోయింది.
అంబికమీద నమ్మకంతో అన్నగారికి ఏం చెప్పదల్చుకోలేదు.
అతను వచ్చేసరికి ఇందు మామూలుగా కూర్చుంది.
"జయరాం వచ్చి "ఇందూ నువ్వేనా కేకలు వేశావు. నేను మొదట భయపడ్డాను, వచ్చి చూద్దామనుకున్నాను" అన్నాడు.
ఇందూకి నవ్వురాకపోయినా నవ్వింది.
"మీది మీచెల్లెలిది మరీ విచిత్రం! ఏదో పుస్తకం చదివి కేకలు వేసింది మనల్ని ఆడించడానికి లేకపోతే ఇక్కడికి దొంగలు ఎలా వస్తారు" అంటూ నవ్వుతూ ఇందువేపు ఓరగా చూసింది అంబిక. ఇందూ ముఖం నల్లగా మాడిపోయినట్లవటం జయరాం గ్రహించలేదు.
నవ్వేశాడు.
చెల్లెలు కేకవెయ్యడం వట్టిదేనని మనసు తేలికపడినట్టయింది.
ఆ రాత్రి ఉండిపోదామన్నా ఇందూ ఇష్టపడలేదు. వెళ్ళిపోదామని గట్టి పట్టుపట్టింది.
ముగ్గురూ కారులో ఇంటికి వెళ్ళిపోయారు.
అంబిక బాగా ఆలోచించి ఇంద్రసేనని పిలిచి చెప్పింది.
"ఇందూ నువ్వు ఈ ఊళ్ళో ఉండటం మంచిదికాదు."
"ఎలా వదినా! ఏం చెయ్యమంటావు" అంది భయంగా.
"నిన్ను ఏ ఊరయినా పంపించేస్తాను" అంది అంబిక.
"ఏ ఊరు?" అడిగింది.
"నీ స్నేహితురాలి యింటికి వెళతానన్నావుగా, మీ అమ్మ నాన్నగారితో చెప్పి అక్కడికి పంపిస్తాను. నువ్వు వారం రోజులు అక్కడే ఉండిరా" అంది రహస్యంగా.
ఇందూ ఉత్సాహంగా ఒప్పుకుంది.
అంబిక మనసులో నవ్వుకుంటూ.
అత్తగార్ని, మామగార్ని ఒప్పించింది.
వాళ్ళు కూతుర్ని పెళ్ళికి పంపించటానికి కోడలి మాటమీద ఒప్పుకున్నారు.
జయరాం ట్రయిన్ లో చెల్లెలని తీసుకునివెళ్ళి దిగబెట్టి వస్తానంటే అంబిక వద్దని ఆ ఊరు తన స్నేహితురాలు పని వుండి కారులో వెళుతుందని ఆమతో పంపిస్తానని చెప్పటంతో ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. సరేనని ఒప్పుకున్నారు.
ఇందు ఉత్సాహంగా ప్రయాణం అవసాగింది.
అంబిక ఎవరితోనో ఫోన్ లో చాలాసేపు మాట్లాడింది రహస్యంగా.
అంబిక మనసు తేలికయింది.
మనసంతా సంతోషంగా ఉంది.
ఆ మర్నాడు ఉదయం ఆమె స్నేహితురాలు కారు తీసుకువస్తుంది, ఆ కారులో ఇందూ వెళుతుంది, ఆమె ఫ్రెండ్ యింటికి.
మర్నాడు కారు రాగానే ఇందూ అందరికీ చెప్పి మహరాణీలా కారులో కూర్చుంది.
అంబిక తన స్నేహితురాలికి ఆడపడుచు జాగ్రత్త అని చెప్పింది.
కారు బయలుదేరి వెళ్ళిపోయింది.
అంబిక సంతోషానికి పట్టపగ్గాలు లేవు.
ఆమె ఉత్సాహంగా ఉంది.
ఆమె ఉత్సాహాన్ని మనసులో దాచుకుంది.
ఎవ్వరికీ తెలీదు.
అదే రహస్యం!
