Previous Page Next Page 
రాజ హంస పేజి 36

 

    "నీ ఉలుకూ కులుకూ చూసి నువ్వే అనుకున్నాలే"
    "ఎవరు మీరు?"
    "చెబుతా" అంటూ ఆమెను తోసుకుని లోపలి కొచ్చి సోఫాలో కూచుంది.
    ఆ స్త్రీ అహంకారం, దుడుకుతనం, ధీమా, యివన్నీ చూస్తూ రాజహంస విస్మయంగా నిలబడిపోయింది.
    "నేనెవర్నని అడిగావు కదూ. నాపేరు మనోరమ అలా అంటే నీ కర్ధం కాదు. నువ్వు మొగుడ్ని, పిల్లాడ్నీ విడిచి ఎవడితో నయితే లేచివచ్చి నా మొగుడని బడాయిలు చెప్పుకుంటూ వూరేగుతున్నావో - అతడి అసలు పెళ్ళాన్ని.
    తలమీద పిడుగు పడినట్లయింది. పాదాల క్రింద భూమి కదిలిపోయింది. కళ్ళముందు ఏవో ఆకారాలు వలయాలు వలయాలుగా తిరుగుతున్నాయి.
    శరీరంలోని శక్తినంతా కూడదీసుకుని అన్నది "ఏమిటి మీరనేది?"
    "ఏం? నమ్మలేకపోతున్నావా? దిలీప్ నా మొగుడు. మాకు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలు. ఆఫ్ ట్రాల్! నువ్వు ఉంపుడు గత్తె స్థానంలో ఉన్నదానివి. స్థానంలో ఉండటమేమిటి? ఉంపుడుగత్తేవి. ఏ మందు రుజువు పర్చుకోవలసిన అవసరం లేదనుకో. అయినా నీ కళ్ళ ముందున్న పొరలు విచ్చుకోవాలి కదా! అందుకని" అంటూ చేతిలో వున్న బ్యాగ్ లోంచి కొన్ని ఫోటోలు తీసి ఆమె ముందు గిరాటేసింది.
    రాజహంస వంగి, వణికే చేతుల్తో ఆ ఫోటోలు అందుకుంది.
    కొన్ని ఆ స్త్రీ పద్దెనిమిది, పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో వున్నప్పుడు అప్పటికి ఇరవై ఇరవై రెండేళ్ళ వయసులో వున్నట్లు కనబడుతున్న దిలీప్ తో పెళ్ళి ఫోటోలు. బెల్లం, జీలకర్రా పెట్టటం, మంగళసూత్రం కట్టేటప్పుడు , తలంబ్రాలు పోసుకునేటప్పుడు , రకరకాల వ్యక్తులతో గ్రూపు ఫోటోలు, తర్వాత భార్య భర్త, అటూ ఇటూ ఇద్దరమ్మాయిలు , ఒకబ్బాయి.
    "ఏమిటిది?"  ఎందుకిలా జరిగింది?"
    "తెలిసిందా దిలీప్ నా మొగుడు. నువ్వు కేవలం ఉంపుడుగత్తెవు. అదయినా ఇన్నాళ్ళూ నా దృష్టికి రాకపోబట్టి ఆ స్థానంలో వుండగలిగావు. ఇప్పుడు మీ రహస్యం బట్టబయలయింది కాబట్టి ఇహ ముందు సాగదు. నేనెవర్నో తెలుసా? మనోరమను. మీ ఇద్దరి ఆటలూ ఎలా అణగద్రోక్కేయ్యాలో నాకు తెలుసు నీ ఆరోగ్యం కోసం చెబుతున్నా. ఎలా వచ్చానో అలాగే తొలగిపో. లేకపోతే ...."
    ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు అన్నట్లు ఓ చూపు చూసి తల ఎగరేసి, సుడిగాలిలా ఎలా వచ్చిందో అంతే విసురుగా బయటి కెళ్ళి పోయింది.
    ఎంత నిర్దయగా, క్రూరంగా, వికృతంగా ఈ సన్నివేశం విరుచుకు పడింది. అసలెందుకిలా జరిగింది?
    మనుషుల జీవితాలు సాఫీగా సాగిపోకూడదా? ఆ అర్హత వారికి లేదా?
    తలలో ఏదో హోరు. పెనుతుఫాను వీస్తున్నట్టు, మహారణ్యం తగలబడుతున్నట్లు , అగ్ని పర్వతం బ్రద్దలవుతున్నట్లు.
    చివరకు ఫిట్స్ వచ్చినట్లు మెదడు మొద్దుబారిపోయింది.


                                                             20

    "నేను...... ఇది నమ్మలేకపోతున్నాను" అంది రాజహంస.
    దిలీప్ ఆమె కెదురుగా వున్న సోఫాలో కూర్చుని వున్నాడు. మొన్నటికన్నా ఇంకా కృశించిపోయి వున్నాడు.
    "ఏదో ఒకరోజు నీ ముందు ఇలా దోషిగా నిలబడాల్సి వస్తోందని తెలుసు. సాధ్యమయినంత వరకూ ఇలాంటి  దురిద్దిన్నాన్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తూ వచ్చాను. ఇంత కంటే నావల్ల కాలేదు."
    "దిలీప్! ఎంతో నిర్మలంగా , నిష్కల్మషంగా, అమాయకంగా కనిపించేవాడిని. ఇంత భయంకరమయిన రహస్యాన్నిఎలా దచగాలిగావు. నిన్నే సర్వస్వం అని నమ్ముకున్న నన్నింత దారుణంగా ఎలా మోసం చెయ్యగలిగావు?"
    అతడు మౌనంగా నేరస్తుడిలా ఆమె ముఖంలోకి చూస్తున్నాడు.
    "నీకు గుర్తుందా దిలీప్! మనిద్దరం అన్ని విధాల దగ్గర కాకముందు నువ్వు నాకు కనిపించకుండా దోబుచులాడుతుంటే 'దిలీప్ నన్నెందుకు మోసం చేస్తున్నావు?" అని అడిగితె 'నాకు జీవితంలో చేతకానిది నిన్ను మోసం చెయ్యటమే నన్నావు. అదే నిజమనుకుంటూ ఇన్నాళ్ళూ నీతో కలిసి ఎంతో నిర్మలంగా ప్రయాణం చేశాను. నీ కోసం నా అనుకున్నావన్నీ నా గతాన్ని నిర్ధాక్షిణ్యంగా చెరిపేసుకున్నాను ఎందుకు? నీకోసం అటువంటిది నువ్వే నా సర్వస్వం అనుకుంటున్నదాన్ని ఎలా మోసం చెయ్యగలిగావు?"
    అతనింకా జవాబు చెప్పకుండా నిశ్శబ్దంగా వుండిపోయాడు.
    "మాట్లాడవేం దిలీప్? ఎందుకిలా చేశావో చెప్పు?"
    "రాజా!" అన్నాడు. అప్పటికీ, ఇప్పటికీ , ఎప్పటికి నిన్ను మోసం చేసే శక్తి లేదు. నన్ను నేనే దారుణంగా మోసం చేసుకున్నాను."
    ఆమె అతని వంక కళ్ళప్పగించి చూస్తోంది.
    "రాజా! ఇలా ఎందుకు జరిగిందో నా చరిత్ర చెబుతాను విను. ఇహ నీ ముందు ఏమీ దాచి పెట్టలేను.
    "నేను.....అతి పేద కుటుంబంలో పుట్టాను. మా వూరు రేపల్లె. నాకయిదో ఏడు వచ్చేసరికే నా తండ్రి చనిపోయాడు. మా అమ్మ పోలమెళ్లి కూలీ పని చేస్తూ నన్ను స్కూల్లో చేర్పించింది. నేను కూడా ఆమె పడుతున్న కష్టాలు చూస్తోన్న వాడిని కాబట్టి ఆ లేత వయసు నుంచే జీవితాన్నర్ధం చేసుకుని, కష్టపడి చదివేవాడ్ని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS