'ఇష్టంలేదని' సూచిస్తూ రెండుసార్లు శబ్దం వినబడింది.
డిస్పరేట్ గా అయిపోతున్నాడు నిఖిల్. ప్రశ్నల పంథా మార్చాడు. నగరాన్ని జోన్స్ గా విభజించి ప్రొసీడ్ కాదల్చుకున్నాడు.
"మీరు సికిందరాబాద్ వైపుంటున్నారా?"
ఆశ్చర్యకరంగా ఒకటేసారి చప్పుడు.....
ప్రాణం లేచి వచ్చినట్లయింది నిఖిల్ కి. సికిందరాబాద్ చిన్న ఏరియా, హైదరాబాద్ అంత పెద్దది కాదు. తన పని సులువయిపోయింది ఇప్పుడు.
"సికిందరాబాద్ లో మారేడ్ పల్లా?"
కాదన్నట్లు చప్పుడు గుండెలు అవిసిపోయేలా రొప్పు!
త్వరత్వరగా లొకాలిటీలు మార్చాడు నిఖిల్. జీరా, వాకర్ టవున్, పద్మారావ్ నగర్, గన్ రాక్ ఎన్ క్లేవ్, మల్కాజ్ గిరి, అల్వాల్....
కాదు.....
కాదు....
కాదు.....
కాదు.....
బొల్లారం?
కాదు....
మేడ్చెల్?
ఈసారి అవుననీ, కాదని సమాధానం రాలేదు. దానికి బదులు ఆపకుండా కంగారుగా టకటకటక రిసీవర్ మీద కొట్టడం వినబడింది.
నుదురు చిట్లించాడు నిఖిల్.
"బొల్లారంకీ, మేడ్చల్ కీ మధ్యనా?"
ఒక్కసారి దీర్ఘంగా శ్వాస తీసుకున్న చప్పుడు. రిసీవర్ మీద ఒక్క దెబ్బ.
బొల్లారంకీ, మేడ్చెల్ కీ మధ్య ఉన్న ప్రాంతాలు ఒక్కొక్కటీ చెప్పడం మొదలెట్టాడు నిఖిల్.
కాదు.....
కాదు....
కాదు....
కాదు....
'అవును!' పెద్దగా ఒక దెబ్బ.
తర్వాత గబగబ మిగతా ప్రశ్నలు అడిగాడు నిఖిల్! ఏ వీధి ఎటు పక్క? చటుక్కున ఏదో స్ఫురించింది అతనికి. ప్రశ్నలు అడగడం ఆపేశాడు. అతని మొహం సీరియస్ గా మారిపోయింది.
ఆ ఫోన్ కాల్ తన ఇంట్లోనుంచే చేస్తున్నారు ఎవరో??
ఎవరు?
"ఒక్కనిమిషం! ప్లీజ్ హోల్డాన్!" అన్నాడు నిదానంగా.
రిసీవర్ క్రెడిల్ మీద పెట్టకుండా టేబుల్ మీద ఉంచి మెల్లిగా కారిడార్ లోకి నడిచాడు. ఒక్కొక్క గది దాటివెళ్తూ చివరికి ఒక రూము ముందు ఆగాడు. అతని క్రేప్ సోల్ షూస్ అసలు శబ్దమే చెయ్యడంలేదు.
నెమ్మదిగా తలుపు నెట్టాడు.
లోపల మంచం మీద బోర్లాపడుకుని ఉంది రాధ. ఆమెపక్కనే షెల్ఫ్ మీద ఫోన్ ఉంది. టెలిఫోన్ రిసీవర్ చేతిలో పట్టుకుని దానివైపు ఇష్టంగా చూస్తోంది రాధ.
ఆమె మొహంలో అల్లరీ, ఆనందం అన్నీ కలిపిన కాక్ టెయిల్ లాంటి భావం కనబడుతుంది. ఉండిఉండి గట్టిగా మూలుగుతోంది. మూలిగి నవ్వాపుకుంటోంది.
చరచర లోపలికి వెళ్ళి ఆమె చేతిలోని రిసీవర్ లాక్కుని క్రెడిల్ మీద ఉంచేశాడు నిఖిల్.
"రాధా! వాటీజ్ దిస్!"
బెదిరిపోయి మంచం దిగి నిలబడింది రాధ. భయంగా అతనివేపు చూసింది.
"చిన్న ప్రాక్టికల్ జోక్....."
"ఇంకెప్పుడూ ఇలా సిల్లీగా బిహేవ్ చెయ్యకు. సరేనా!" అన్నాడు గదమాయిస్తూ.
"చెయ్యను!" అన్నట్లు బుద్దిగా తల ఊపింది రాధ.
ఇంకా టీనేజ్ లోనే ఉన్న ఆమెవైపు పరీక్షగా చూశాడు నిఖిల్. "నీకు 'నాన్నా పులి' కథ తెలుసునా?" అన్నాడు.
"ఒక పిల్లాడు తండ్రితోబాటు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళి తండ్రిని తమాషా చెయ్యడానికి నాన్నా పులి అని అరుస్తూ తండ్రివచ్చి ఫూలయిపోతుంటే నవ్వుతుండగా ఒక నిజం పులి వచ్చి అతన్ని తినెయ్యబోతున్నా ఈసారి తండ్రి అబద్దమనుకుని రాకపోతే పిల్లాడు పులికి టిఫినై పోతాడు. అదేనా?" అంది కామా లేకుండా.
ఆమె చెబుతున్న పద్దతి చూసి అతనికి కోపం తగ్గి నవ్వొచ్చింది. అయినా నవ్వు కనబడకుండా పెదాలు బిగబట్టి అన్నాడు. "ఇలా ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ పోయావంటే ఈసారి నీకు నిజంగా ప్రమాదం వచ్చినా ఎవరూ పట్టించుకోరు! జాగ్రత్త! క్షణక్షణం మృత్యువుతో రణం చేస్తుంటాం మనం. అన్యాయానికి సమాధికట్టి శవాల తోరణం తగిలించాలని తాపత్రయ పడుతుంటాం రాధా! గుర్తుంచుకో! నువ్వు ఇక్కడ ఉండదలుచుకుంటే పిల్ల తరహా చేష్టలు మానెయ్యాలి! తెలిసిందా?"
"తెలిసింది!" అని ఆగి అంది రాధ. తర్వాత సంజాయిషీ చెబుతున్నట్లు అంది. "నేనెప్పుడూ ఎవరితోనూ ఇలా తమాషాలు చెయ్యను. మీరు నాకు కావలసిన వారు. నాకు చాలా దగ్గర మనిషి అనిపించి మీరేమీ అనుకోరన్న ధయిర్యంతో అలా చేశాను"
