"నీ డాబు, దర్పం ఈ రోజుతో సరి. నేను తలుచుకున్నాను అంటే నిన్ను ఈ క్షణంలో..." అంటూ ఆమె చెయ్యిపట్టి దగ్గరకు లాక్కున్నాడు.
ఆ లాక్కోవటంలో విసురు, పొగరు, కోపం కలబోసి ఉన్నాయి.
"వదలండి ఏమిటిది" అంది కోపంగా.
"వదలకపోతే" అన్నాడు పంతం పట్టినట్లుగా.
"చంపేస్తాను!"
"చంపు" అన్నాడు మొండిగా ఆమెను ఇంకా దగ్గరకు లాక్కుంటూ.
"ఛీ... వదలండి.... వదలమంటే.... వదులుతారా లేదా!" అంది పట్టు విడిపించుకోవడానికి చూస్తు.
అతను విసురుగా తల ఎత్తి.
"పౌర్షం పడుతున్నావు నానుండి తప్పించుకోలేవా?" అన్నాడు వెటకారంగా.
"మగవాడి బలంముందు, అతడి మూర్ఖత్వం, రాక్షసత్వం ముందు స్త్రీ ఓడిపోక తప్పదు. కాని... కాని.... మిమ్మల్ని... నేను ఒదిలిపెట్టను... ప్రాణంతీసి నా ప్రాణం తీసుకుంటాను" అంది పౌర్షంగా.
"నా ప్రాణం తియ్యటం అంత సులభంకాదు. నీ ప్రాణం తీసుకోవటం అంతకన్నా సులభంకాదు. నువ్వు నా గుండెల్లో ఉంటావు ఎప్పుడూ."
"ఛీ ఆ మాట అనవద్దు నాకు అసహ్యం" అందిక కోపంగా.
"ఇందూ!" అన్నాడు కోపంగా.
అతనికేక ఆ బంగళా అంతా ప్రతిధ్వనించింది.
ఇందూ కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోయింది.
"నీకు అసహ్యమా!"
"నేను నీ భర్తను."
"ఆ మాట అంటే మర్యాద దక్కదు."
"ఆ మర్యాద నేను దక్కించుకుంటాను. మీ నాన్న, మీ అన్న తల భూమిలోకి వంచుకునేటట్లు చేస్తాను. వాళ్ళని నా కాళ్ళదగ్గరకు రప్పిస్తాను" అన్నాడు పంతం పట్టినట్లుగా.
"హు" అంది తల ఎగరేస్తూ.
"నిన్ను ఇప్పుడు ఈ క్షణంలో ఏం చేసినా దిక్కు లేదు"
"కాని నేను అంత కిరాతకుడ్ని కాదు అందుకే వదిలేస్తున్నాను" అంటూ ఆమెను వదిలి దూరంగా జరిగాడు.
"నిన్ను నా బలంతో లొంగదీసుకుని అత్యాచారం చెయ్యటం నాకు ఇష్టంలేదు. నా భార్యగా నీకు నువ్వు నీ మనసుని, నీ శరీరాన్ని, నీ ప్రేమను, నీ అనురాగాన్ని నిండు మనసుతో నాకు అర్పించినప్పుడే నీ శరీరంపై చెయ్యి వేస్తాను అంతవరకూ నిన్ను ముట్టుకోను"
"ఈ రోజుకి సరిగ్గా వారం రోజులు టైము ఉంది" అంటూ ఆగాడు.
ఇంద్రసేన తల తిప్పేసింది. ఆ మాటలు తను విననట్టుగా.
"ఆ రోజున నీకు కూడా తెలీకుండా నిన్ను తీసుకెళ్ళి పెళ్ళి చేసుకుంటాను. ఆ మాట ఖాయం."
"నీ అన్నకి నీ తండ్రికి చెప్పుకో. వాళ్ళు ఎలా నిన్ను కాపాడుతారో కాపాడుకోమను" అన్నాడు.
ఇంద్రసేన రోషంగా చూసింది.
"మీతో నా పెళ్ళా!" హేళనగా అంది.
"మీరు పగటికలలు కంటున్నారు. ఆ ఆశ వదులుకోండి. నాలుగు రోజులపాటు బ్రతకాలని ఆశించండి. పరుగెత్తి పాలు త్రాగటం కంటే నిలబడి నీళ్ళు త్రాగటం మంచిది అని గ్రహించుకుని మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోండి"
"అంతస్తులు తెలుసుకుని మాట్లాడండి. ఆకాశానికి నిచ్చెనలు వెయ్యకండి" అంది కోపంగా.
అతను నవ్వాడు.
ఆ నవ్వు చాలా శాంతంగా, హుందాగా అనిపించింది. ఆమె మాటలకి అతను ఆవేశపడి కోపం తెచ్చుకోలేదు.
"నేను వస్తాను గుర్తు ఉంచుకో. వారం రోజుల్లో నీ మెడలో మూడు ముళ్ళు వేస్తాను. నువ్వు నా అర్ధాంగివి అవుతావు నా పంతం నెరవేరుతుంది. ఈ కృష్ణమౌళి అంటే ఏమిటో మీకు అందరికి తెలియచేస్తాను" అంటూ చెప్పి మరోమాటకు అవకాశం ఇవ్వకుండా అతను వెళ్ళిపోయాడు.
ఇంద్రసేన అలా బొమ్మలా నిలబడిపోయి చూడసాగింది. అతను వెళ్ళినవైపే చూస్తూ.
కృష్ణమౌళి వెళ్ళిపోగానే.
ఆమె ధైర్యం అంతా గాలిలో కలిసిపోయినట్లు అయింది.
మొదలు నరికిన చెట్టులా మంచంమీద పడిపోయిం. ఆమెకు దుఃఖం ఆగలేదు!
తనని అతను ఎత్తుకుపోయి పెళ్ళి చేసుకుంటాడా!
అయ్యయ్యో ఇంకేమయినా వుందా.
తండ్రి అంతస్తు ఏం కాను!
తన జీవితం ఏం కాను!
అతను ఎవరు? తనకి అతను భర్తవటానికి వీల్లేదు.
అలా జరగడానికి వీల్లేదు.
పంతం పట్టి ఉన్నాడు.
అతన్ని తప్పించుకోవటం ఎలా!
భగవంతుడా అనుకుంటూ కుమిలిపోయి ఏడ్చింది.
అలా ఏడుస్తూ పడుకుంది.
ముందుగా అంబిక వచ్చింది.
కావాలనే భర్తను తరువాత రమ్మనీ ఏదో పని పురమాయించింది ఆమె.
అంబిక వచ్చేసరికి ఇందూ ఏడుస్తూ పడుకుంది. అంబిక కంగారు పడిపోయింది.
"ఏమిటి ఇందూ ఏమయింది!"
ఆమె మాట్లాడలేదు.
"ఇందూ!"
ఆమె తల ఎత్తలేదు. దుఃఖం ఆపుకోలేనట్లు తల విదిలించేసింది.
