Previous Page Next Page 
మారణహోమం పేజి 35

 

    "నేను" అంది అమూల్య.    
    "చెప్పు!"
    "ఇక్కడంతా సవ్యంగానే ఉంది!"    
    "సవ్యంగా వుంటే సరిపోదు. దివ్యంగా ఉండాలి. తెలిసిందా? జాగ్రత్త! గుడ్ లక్"    
    అతను ఇంకేదన్నా మాట్లాడతాడేమోనని ఎదురుచూసింది అమూల్య.    
    కాసేపు ఆలోచనలో ఉండిపోయినట్లు మౌనంగా ఉండి తర్వాత అన్నాడు నిఖిల్.    
    "ఈసారి నా నెంబర్ కి ఫోన్ చెయ్యకు! వేరే నెంబర్ ఇస్తాను."    
    హతాశురాలయి పోయింది అమూల్య. అయితే ఇకనుంచి తనకి నిఖిల్ గొంతు కూడా వినబడదన్నమాట! గుండెలు పిండేసేటట్లు ఉంది ఈ ఆలోచనే!    
    "ఆ నెంబరు ఎవరిది?" అంది దిగులు కప్పిపుచ్చుకుంటూ.    
    "తర్వాత తెలుస్తుంది నీకు"    
    "హలో....హలో"    
    జవాబు చెప్పకుండా ఫోన్ పెట్టేశాడతను.    
    'నిర్లక్ష్యం ముందు పుట్టి తర్వాత ఇతను పుట్టాడేమో!' అనుకుంది అమూల్య కోపంగా.    
    నిఖిల్ రిసీవర్ ని క్రెడిల్ మీద ఉంచీ ఉంచకముందే మళ్ళీ రింగయింది అతని ఫోను.    
    మళ్ళీ అమూల్యనా?    
    "హల్లో!"    
    లైన్లో నిశ్శబ్దం.    
    "హలో హలో" అన్నాడు అసహనంగా.    
    ఎవరో భారంగా అతికష్టంగా ఊపిరి పీలుస్తున్న శబ్దం.    
    "హలో! హూ ఈజ్ ఇట్?"    
    లైన్లో అవతల ఉన్నవాళ్లు గొంతు పెకలించుకుని మాట్లాడడానికి ప్రయాస పడ్తున్నట్లు సవ్వడి.    
    "హలో! ఎవరు మీరు?"
    దుర్భరమయిన బాధ అనుభవిస్తున్న వ్యక్తి మూలిగినట్లు మూలుగు.    
    కొద్ది కొద్దిగా అర్ధం అవుతోంది నిఖిల్ కి.    
    స్త్రీ కంఠం! ఎవరో ఆపదలో ఉన్న ఆడమనిషి? ఎందుకని మాట్లాడలేక పోతోంది.    
    అతని మెదడు చురుగ్గా ఆలోచించింది.    
    ఎవరో స్త్రీ! తనకి ఫోన్ చేసింది. కానీ నోరు తెరిచి ఏమీ చెప్పలేక పోతోంది? ఎందుకని? ఎవరన్నా వింటారని భయమా? లేకపోతే తీవ్రమైన అనారోగ్యమా? లేకపోతే మరేదన్నా ప్రమాదమా.    
    అనారోగ్యమయితే హాస్పిటల్ కి ఫోన్ చేయాలి. ప్రమాదమయితే పోలీసులకి రింగ్ చెయ్యాలి. తనకెందుకు చేస్తోంది.    
    నో డవుట్! తన మనుషులలో చాలామంది స్త్రీలు కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కూడా మెసేజ్ అందజేశాడు తను. ఇవాళనుంచి తన డైరెక్ట్ నెంబర్ కి ఎవరూ రింగ్ చెయ్యకూడదని ఇందాక అమూల్యకి చెప్పినట్లే -    
    అయినా ఇంకా తన మెసేజ్ అందని వాళ్ళెవరన్నా ఉన్నారా?    
    యమయాతన పడుతున్నట్లు మూలుగుతోంది లైనులో ఉన్న స్త్రీ.    
    ఆలోచనలన్నీ పక్కకి నెట్టేశాడు నిఖిల్. ఫస్ట్ థింగ్స్ 'ఫస్ట్!' ఆమె ఎవరన్నాగానీ ఆర్తితో ఉన్న ఆడమనిషి తను ఆదుకోవాలి. అంతే!"
    "ఎవరమ్మా నువ్వు!"    
    శ్వాస ఎగబీల్చినట్టు వినబడింది.    
    "మాట్లాడడం చేతకావడంలేదా?"    
    మూలుగు.    
    కనుబొమలు ముడివేసి ఒక్కక్షణం ఆలోచించాడు నిఖిల్. "అయితే ఒక పని చెయ్యి! నేను ప్రశ్నలు అడుగుతాను. డానికి జవాబు 'అవును' అయితే రిసీవర్ మీద ఒకసారి కొట్టు. జవాబు 'కాదు' అయితే రెండుసార్లు కొట్టు సరేనా?"    
    రిసీవర్ మీద వేలిగోటితో ఒకసారి కొట్టినట్లు చప్పుడు.    
    రిలీఫ్ ఫీలయ్యాడు నిఖిల్. ఫర్వాలేదు. ఆమె ఎవరోగానీ మెంటల్ గా ఇంకా అలర్ట్ గానే ఉంది. బాధ ఇంకా ఆమెకి మనసు స్థిమితం తప్పి పోయేలా చెయ్యలేదు.    
    "మీరు హైదరాబాద్ లోనే ఉంటారా?" అన్నాడు.    
    'అవును' అన్నట్లు ఒకసారి చప్పుడు.    
    "దిల్ సుక్ నగర్ ప్రాంతమా?"    
    కాదన్నట్లు రెండుసార్లు చప్పుడు.    
    "విజయ్ నగర్ కాలనీ ప్రాంతమా?"    
    రెండుసార్లు చప్పుడు.    
    "బంజారాహిల్సా?"    
    రెండుసార్లు చప్పుడు. ఆమె మూలుగు ఎక్కువయింది.    
    ఆరాటంగా రిసీవర్ వైపు చూశాడు. ఆమె నిశ్చయంగా ప్రమాదకర పరిస్థితిలో ఉంది. కానీ ఆమె ఎక్కడుందో తెలియకుండా ఎలా వెళ్ళగలడు తను? ఇలా ప్రశ్నలు, జవాబులతో లొకాలిటీ కనిపెట్టడం ఈ మహానగరంలో ఎంత కష్టం!
    పోలీసులకు చెబితే వాళ్ళు కాల్ ఎక్కడినుంచి వస్తుందో టెలిఫోన్ డిపార్ట్ మెంట్ వారిద్వారా ట్రేస్ చేసి ఆమెని కాపాడగలరు.    
    కానీ పోలీసులని కాంటాక్టు చెయ్యడం ఆమెకి ఇష్టం వుంటుందో లేదో పైగా తను పోలీసు గొడవల్లో ఇరుక్కుంటాడు. అయినా అడిగాడు "పోలీసులకు తెలియబర్చమంటారా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS