కొద్దిగా ఆశాభంగం కనబడింది తరుణ్ మొహంలో. కానీ వెంటనే తేరుకున్నాడు.
"నెవర్ మైండ్ అమూల్యా! నెవర్ మైండ్! ప్రయత్నం చెయ్యడమే మన వంతు. ఫలితం మన చేతిలో లేదు - అవునా?"
బలవంతంగా పెదిమల మీదికి చిరునవ్వు తెచ్చుకుంది అమూల్య. "కానీ నేను పూర్తిగా ఫెయిలయిపోలేదు మిస్టర్ తరుణ్! నాకు చేతనయినన్ని రహస్యాలు గ్రహించాను వాళ్ళ దగ్గరనుంచి!
తరుణ్ మొహం మళ్ళీ ప్రకాశవంతంగా అయింది. "ఏమిటవి?" అన్నాడు ఉత్సుకతతో.
వాళ్ళు ప్రతి రెండు రోజులకీ కోడ్ లాంగ్వేజ్ మారుస్తున్నారు. లేటెస్ట్ గా వాళ్ళు ఉపయోగిస్తున్న కోడ్ లలో విజిల్ భాష ఒకటి. కేనరీ ద్వీపాల్లో ఆ విజిల్ భాష మాట్లాడతారట."
చిన్నగా నవ్వుతూ అమూల్య వెన్ను నిమిరాడు తరుణ్. ఇంతా చేస్తే ఇదా అమూల్య కనుక్కున్న రహస్యం! ఇది తనకి ఇంతకుముందే తెలిసిపోయింది కదా!
అమూల్య ఇంకా చెబుతూనే వుంది. ఆమె చెబుతున్నవన్నీ నిఖిల్ తనంతట తానూ బయట పెట్టిన రహస్యాలే! తరుణ్ కి నమ్మకం కలిగించడానికి విడుదల చేస్తున్న వివరాలే!
అవన్నీ జాగ్రత్తగా విన్నాడు తరుణ్. వాటిలో చాలా "రహస్యాలు" అతను ఇదివరకే కనుక్కున్నవి! మిగతావేమో ఎందుకూ పనికిరానివి. రొటీన్!
వెనకటికి ఒక ఇల్లాలెవరో బియ్యం, పొట్టూ వేరుచేసి పొట్టుదాచి బియ్యం పారబోసేసిందట. అలా ఉంది ఈ అమ్మాయి కష్టపడి తెచ్చిన సమాచారం. ఆమె ఏదో అధ్భుతాలు చేస్తుందని ఆశించి తను నిఖిల్ దగ్గరికి పంపాడు. అనుకున్నంత గొప్పగా ఏమీ చెయ్యలేకపోయింది.
కానీ తను చేతనయినంత ఏదో చెయ్యాలని తాపత్రయపడింది ఈ అమ్మాయి. చేసింది కూడా! ఆ చేసినది తనకు పనికి వస్తుందా రాదా అనేది వేరేమాట! తన మాటను పాటించి సింహంనోట్లో తలపెట్టి మళ్ళీ అంతలోనే భయపడి పారిపోయి వచ్చింది. పాపం!
ఒక్కసారిగా ఆ అమ్మాయిమీద అభిమానం ముంచుకొచ్చేసింది తరుణ్ కి. అప్రయత్నంగానే ఆమె చుట్టూ అతని చేతులు బిగుసుపోయాయి.
అతని చేతుల్లో తను ఉండడం అప్పుడే మొదటిసారిగా గమనించినట్లు మెల్లిగా వదిలించుకుని కొంచెం దూరంగా జరిగి, పమిట సవరించుకుంది అమూల్య.
'సారీ' అన్నాడు తరుణ్ ఇబ్బందిగా జరిగినదానికి అమూల్య ఏమన్నా అనుకున్నదేమో అన్నట్లు ఒక్కసారి ఆమె మొహంలోకి వెదుకుతూ చూశాడు.
తర్వాత అన్నాడు...."ముందు మనం ఇక్కడనుంచి వెళ్ళిపోవాలి. నిఖిల్ మనుషులు మిమ్మల్నీ నన్ను కూడా తరుముతూ రావచ్చు. లెటజ్ గో!"
సందిగ్ధంగా చూసింది అమూల్య. అతి తేలిగ్గా కనబడుతున్న ఒక స్పోర్ట్ బైక్ మాత్రం ఉంది అక్కడ. దానిమీద తనని కూడా ఎక్కమంటాడా? పరాయి మొగాడితో బాటు అంతదూరం సైకిల్ మీద ఎలా ప్రయాణం చేస్తుంది తను! అసలు ఇద్దరి బరువు మోసెంత గట్టితనం ఉందా ఈ అల్పంగా కనబడుతున్న సైకిల్ కి?
ఆమె ఆలోచనలు అర్ధం చేసుకున్నట్లు అన్నాడు తరుణ్. "మనం త్వరగా ఇక్కడనుంచి వెళ్ళిపోవాలంటే ఈ బైక్ తప్ప వేరే సాధనం లేదు. ఇది దాదాపు స్కూటర్ అంత వేగంగానూ వెళ్ళగలదు - తొక్కగలిగితే! కార్బన్ ఫైబర్ బాడీ, మనిద్దరినీ కూడా మోస్తుంది. అయినా మీరెంత బరువుంటారనీ! ఏడు మల్లెల ఎత్తు ఉంటారా?" అన్నాడు చిరునవ్వుతో.
ఒకసారి అతనివైపు చూసి తల తిప్పుకుంది అమూల్య.
ఆమె హాండిల్ బార్ మీద కూర్చున్న తర్వాత తను సీటుమీద కూర్చుని సైకిల్ ముందుకు పోనిచ్చాడు తరుణ్. పుష్టిగా, మృదువుగా ఉన్న అమూల్య ఎడమభుజం అతని రోమ్ముకి తగులుతోంది. సరిగ్గా అతని పెదిమల దగ్గరికి వస్తోంది ఆమె తల. సిక్లులా ఉన్న ఆమె జుట్టు గాలికి ఎగిరి అతని మొహాన్ని తాకుతుంటే పరవశం కలిగించే పరిమళం అతని నాసికాపుటాలకి సోకుతోంది.
తరుణ్ తన వృత్తిపరంగా రకరకాల స్త్రీలను చూశాడు. "వృత్తి" చేసే అమ్మాయిల దగ్గర్నుంచి చిత్రమైన ప్రవృత్తులు గల అమ్మాయిల వరకూ. అవసరం కొద్దీ అతనితో చనువు పెంచుకోవాలని చూసే ఆడవాళ్ళు కొందరయితే, అనవసరంగా అతనిమీద పడిపోతూ శృంగార వికారాలని ప్రదర్శించే వాళ్ళు మరికొంతమంది. వాళ్ళతో ఎంత సన్నిహితంగా ఉండవలసి వచ్చినా ఎప్పుడూ హద్దులు దాటలేదు అతను.
ఎంతమంది స్త్రీలను చూసినా చలించని తను ఇవాళ ఈ అమ్మాయిని చూడగానే ఎందుకిలా రియాక్ట్ అవుతున్నాడు.
బాడీ కెమిస్ట్రీనా? అర్ధం కాలేదు తరుణ్ కి.
దారి గతుకులుగా ఉంది. కుదుపులవల్ల ఆమె మెత్తటి ఒళ్ళు మాటిమాటికీ అతనికి తగులుతోంది.
నగరం సమీపిస్తుండగా ఒకచోట సైకిలు ఆపాడు తరుణ్. ఎదురుగుండా ఒక గ్యారేజీ ఉంది. తాళం తీసి లోపలికెళ్ళి పెట్టేశాడు. గ్యారేజ్ లో వున్న ఫియట్ కారు బయటికి తెచ్చాడు.
నిర్లిప్తంగా చూస్తోంది అమూల్య. మూడు నెలల క్రితం అయితే ఇలాంటివి అన్నీ చూసి ఆశ్చర్యపడి ఉండేదే తను.
కానీ ఈ మూడు నెలల్లో తను చాలా అనుభవం గడించింది. దొరల్లా తిరిగే దొంగలూ, దొంగల్లా తిరిగే దొరలూ, మారువేషాలూ, మారుతాళం చెవులూ, ఇవన్నీ అలవాటయిపోయాయి ఇప్పుడు.
కార్లో అమూల్యని ఆమె అపార్ట్ మెంట్ దగ్గర దింపేశాడు తరుణ్.
మళ్ళీ మర్నాడు కలుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిన తర్వాత ఒక అరగంట ఆగి బయటకువెళ్ళి ఒక జనరల్ స్టోర్స్ నుంచి నిఖిల్ డైరెక్టు నెంబర్ డయల్ చేసింది అమూల్య.
"హలో!" అన్నాడు నిఖిల్. మాన్లీగా ఉంటుంది అతని గొంతు. ఆ సమయంలో అతను ఎలా ఉంటాడో ఊహించగలిగింది అమూల్య. సింహం సింహాసనంమీద కూర్చున్నంత దర్పంగా తన రివాల్వింగ్ ఛెయిర్ లో కూర్చుని ఉంటాడు అతను.
