ఒకసారి నైట్ డ్యూటీ చేస్తూంటే సి.ఎమ్.ఓ. వచ్చి "టీ త్రాగి వద్దాం వస్తారా?" అని అడిగాడు ఆయన చాలా చిన్నవాడు, సరదాగా వుంటాడు. ఎమ్.ఎస్. ఓసారి అప్పియరై, పోతే సి.ఎమ్.ఓ.గా చేరాడు.
"అందరూ లేకుండా వెళ్ళిపోతే ఎలా ?" అన్నాను అనుమానిస్తూ.
రాజేశ్వరి అభయమిస్తూన్నట్లు "నేను టీ త్రాగాను. వర్క్ చూస్తూ వుంటాను. మీరు వెళ్ళిరండి" అంది.
సరేనని మేమిద్దరం వెళ్ళిపోయాం. పన్నెండు దాటిపోవటంచేత దగ్గర్లో హోటళ్ళెక్కడా తెరిచి లేవు. టీ కోసం యించుమించు నాలుగయిదు ఫర్లాంగులు పోవల్సివచ్చింది.
తిరిగి వచ్చేసరికి ఎంతలేదన్నా నలభయి అయిదు నిమిషాలు పట్టింది. డిపార్ట్ మెంట్ లోకి వచ్చేసరికి రాజేశ్వరి లోపల ఎవరిమీదో పెద్దగా కేకలేస్తూ కనిపించింది.
ఏమిటా అని విచారణచేశాం. తేలిన సమాచార మేమిటంటే, మేము వెళ్ళిన పావుగంటకే రాజేశ్వరికి నిద్రవచ్చి స్క్రీన్ అవతల వున్న బెడ్ మీదకు వెళ్ళి పడుకుందిట. అమాంతం నిద్ర ముంచుకు వచ్చేసింది. ఇంతలో ఆస్తమా పేషెంటు వచ్చాడు. బయట బల్లమీద కునికిపాట్లు పడుతూన్న స్టాఫ్ ని లేపబోతే 'లోపల డాక్టరుగారున్నారు వెళ్ళ' మని పడుకుందిట. అతను లోపలకువచ్చి చూసేసరికి ఎవరూ కనిపించలేదు. ఒక వైపు బాధ ఎక్కువగా వుండి ఊపిరాడటం లేదు. ఆ అవస్థలో స్క్రీన్ పక్కకులాగి చూసేసరికి గాఢ నిద్రలో మునిగివున్న రాజేశ్వరి కనిపించిందిట. ఎన్నో సార్లు "అమ్మగారూ అమ్మగారూ" అని పిలిచాడు. ఆమెకా పిలుపు చేరలేదు. చేతితో ప్రక్కమీద చప్పుడు చేశాడుట. ఫలితం కనిపించలేదు. ఇహ చేసేదిలేక, భుజం మీద చేయి తట్టి లేపాడుట. అంతే. రాజేశ్వరి మేలుకుని జరిగింది గ్రహించి, ఉగ్రరూపం ధరించి అతనిమీదకు దండయాత్రకు వెళ్ళింది....ఆ అభాగ్యుడు వణుకుతూ, చేసిన తప్పును ఒప్పుకుంటూ, క్షమించమని ప్రాధేయపడుతున్నాడు.
మేము నవ్వాపుకుని ఆమెకు సర్దిచెప్పి, అతనికి యింజక్షన్ చేసి పంపేశాము.
మొత్తంమీద రాజేశ్వరి సుఖమైన నిద్రకు ఏ రోజూ అంతరాయం కలగలేదు. సాధారణంగా పదకొండు గంటలు దాటగానే "అబ్బ? నిద్రవస్తూన్నది డాక్టర్ ! ఇహ పోయి పడుకుంటాను. మీకూ తర్వాత నిద్రవస్తే పడుకోండిగాని, పడుకునే ముందు మాత్రం నన్ను లేపండి. అంతేగాని నా ప్రక్క బెడ్ మీద మీరు పడుకుంటే నాకు చచ్చే సిగ్గు వేస్తుంది" అనేది. అలాగే అని తల ఊపేవాణ్ని కాని ఆమెకు చచ్చే సిగ్గు వేసేలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఆమె మాత్రం ఆరింటికి నిద్రలేచి "అయ్యో! రాత్రంతా ఒక్కరే మేలుకుని వున్నారా ? కాసేపు నన్ను లేపలేకపోయారా?" అనేది. "నాకు నిద్రరాలేదు లెండి" అని జవాబిచ్చేవాణ్ని.
ఒకసారి అర్ధరాత్రి క్యాజుయాలిటీలో మామూలుగా కూర్చుని వున్నాను. రాజేశ్వరి మామూలుగా నిద్రపోతోంది. సి.ఎమ్.ఓ. తన గదిలో పడుకుని నిద్రపోతున్నారు.
ఒకవ్యక్తి నాలుగేళ్ళ కొడుకుని ఎత్తుకుని లోపలకు వచ్చాడు. ఆ వ్యక్తి లుంగీ, చొక్కా వేసుకుని, నలభయి ఏళ్ళకు పైబడిన వాడిలా వున్నాడు.
"మా అబ్బాయికి జ్వరంలా వుంది. చూడాలి" అన్నాడు. చూస్తే చదువుకున్న వాడిలాగే వున్నాడుగాని, కంఠస్వరం ఏ మాత్రం సౌమ్యంగా లేక, కొట్టొచ్చినట్లుగా వుంది.
కుర్రాడిని బల్లమీద పడుకోబెట్టి జాగ్రత్తగా పరీక్ష చేశాను. స్టాఫ్ వచ్చి జ్వరం చూసింది. నూట ఒక్క డిగ్రీ వుంది అర్దరాత్రి పూట పరుగెత్తుకు రావలసినంత ప్రమాదం, అవసరం నాకేం కనబడలేదు. చీటీమీద మందులు రాసిచ్చి వెళ్ళితీసుకోమన్నాను.
అతను దానిమీద నేను రాసింది చదువుకొని జేబులో పెట్టుకుంటూ "అయిపోయిందా మీ ట్రీట్ మెంటు ?" అన్నాడు వ్యంగ్యంగా.
అతని వైఖరి నాకు నచ్చక "అయిపోయింది" అన్నాను ముక్తసరిగా.
ఒక నిమిషం మాట్లాడకుండా నిలబడి, తర్వాత ఎత్తుకున్న కుర్రాణ్ని దించి కుర్చీతో కూర్చో పెడుతూ "వీడి హిస్టరీ చాలా వుందీ, కాస్త చెప్పాలి" అన్నాడు.
"చెప్పండి"
"మొదట ఒక ప్రశ్న అడుగుతున్నాను. అసలు వీడి జబ్బేమిటి?"
"ఒక్క అయిదు నిమిషాలు పరీక్ష చేసినంతలో ఎటువంటి కేసునైనా విప్పి చెప్పేయకల శక్తిసామర్ధ్యాలు నాకు లేవు. తాత్కాలికంగా ఉపశాంతి కలగటానికిప్పుడు మందులు రాసిచ్చాను. రేపు ఉదయం చిన్నపిల్లల ఓ.పి.కి తీసుకువెళ్ళండి. అవసరమని తోస్తే వాళ్ళు వార్డులో చేర్చుకుని, యిన్ వెస్టిగేషన్స్ చేసి, డయాగ్నసిస్ కి వస్తారు" అని వివరించాను.
అతని పెదవులపై పరిహాసంతో కూడిన చిరునవ్వు కనిపించింది. "మా పిల్లవాణ్ని ఊళ్ళో అందరు డాక్టర్ల వద్దకూ త్రిప్పాను. మీరు చెప్పిన పిల్లల వార్డులో కూడ యిదివరలో నెల రోజులు వుంచాను. ఒకళ్ళూ సరిగ్గా చెప్పలేక పోయారు. ఏమీ నయం చెయ్యలేకపోయారు. పైకి మెహర్భానీగా అంతా పటాటోపం, డాబుసరి క్రియ మాత్రం సున్నా. నెల రోజులు వార్డులో వుంచుకుని, రక్తం తీసి, యింకేవేవో పరీక్షలు చేసి చివరకేమీ లేదని బయటికి పంపించేశారు. ఏమీ లేకపోవట మేమిటి ? లేకపోతే జ్వర మెందుకు వస్తుంది ?"
నేను అతని మాటలు వింటూ ,జవాబు చెప్పకుండా ప్రక్కకి చూస్తున్నాను.
"ఇప్పుడు మీ పద్ధతికూడా నాకేం నచ్చలేదు కుర్రాణ్ని జ్వరంలో తీసుకువచ్చినప్పుడు తలకి ఐస్ పెట్టటం, అదీ ఏమీ లేకుండా రెండు మాత్రలను, చీటీ రాసిస్తే అయిపోయిందా ?"
నాకు కోపం వచ్చింది. "ఐస్ ఎప్పుడు పెట్టాలో ఎప్పుడు పెట్టకూడదో మాకు తెలుసులెండి" అనాలనుకున్నాను. అయినా తమాయించుకుని ఊరుకున్నాను.
అతను క్రమక్రమంగా ఉద్రిక్తుడవుతూ, తన కసినంతా వెళ్ళగ్రక్కటం మొదలు పెట్టాడు.
"ఎందుకండీ యీ ఆసుపత్రులు ? వందలకు వందలు జీతాలు పుచ్చుకుంటూ పనిచేయటం ప్రజాసేవ చెయ్యటానికి గాకుండా నెత్తిమీదెక్కి సవారి చేయటానికండీ ? రోగులు ఏం బాధ పడుతున్నారో ఒక్కడికీ పట్టదు. వాళ్ళ అవస్థలు ,మొర ఒక్కరూ వినిపించుకోరు మీ ఆర్భాటాలూ, మీ విలాసాలు, మీ వినోదాలు...."
ఇహ నేను ఆవేశం అణుచుకోలేక "చూడండి మేష్టారూ" అని అతన్ని మాట మధ్యలోనే ఆపుచేశాను. "మీరు చాలా బాగా మాట్లాడారు, అభినందిస్తున్నానుగాని, ఒక వైపు నుంచే మీ విమర్శనా చాతుర్యాన్ని నరుక్కుంటూ రావటం సహృదయత అనిపించుకోదు అందులోని చెడునే ఎత్తి చూపుతున్నారుగాని, ఎన్నివేల మంది ప్రయోజనం పొందుతున్నారో ఆలోచించారా? ఒక కేసు నయం కాలేదన్నంత మాత్రాన అందర్నీ తీసిపారేస్తారా? డాక్టరు సర్వజ్ఞుడు కాదు, అజేయుడు అంతకన్నా కాదు. అతను తన శాయశక్తులా ప్రయత్నించ గలడు గాని, విధిని శాసించలేడు" అన్నాను.
"ఒక చిన్న కుర్రాడి జబ్బేమిటో కనుక్కోలేకపోతే ఎందుకండీ యీ డిగ్రీలూ వాళ్ళకాడూనూ. ఏమన్నారు ? ఒక్క కేసు నయం చేయలేక పోవటమా ? ఒక్కటేమిటి ! నా కుటుంబాన్నంతా పొట్ట పెట్టుకుంది కదండీ మీ హాస్పిటల్ ? నా భార్య యిందులోనే చనిపోయింది. నా యిద్దరు కూతుళ్ళూ యిందులోనే మరణించారు. ఒక్కరికి....ఒక్కరికి యిందులో న్యాయం జరిగిందా ? నా కర్మకాలి, శక్తిలేదు కాబట్టి, యింకే వూరికీ పోలేక దీనిచుట్టూ తిరుగుతున్నాను" అతని కళ్ళలో ఎర్రజీర, కాస్త తడీ కనిపించాయి.
రెండు క్షణాలు మెదలకుండా ఊరుకుని "మీరెవరు ?" అని ప్రశ్నించాను నెమ్మదిగా.
"నేనా ?" అన్నాడు, మారిన కంఠస్వరంతో. "మీ కందరికీ స్వరాజ్యం తెచ్చి పెట్టింది నేనే' అన్నాడు.
అదిరిపడినట్లయి ముందుకు వొంగాను _"ఏమిటీ ?" అంటూ.
నా వంక కసిగా చూశాడు. "మేమంతా కష్టపడి సంపాదించిన ఫలాన్ని మీరెలా అనుభవిస్తున్నారో చూశారా ?" అన్నట్లుంది ఆ చూపు. "అవును. సర్వస్వం త్యాగంచేసి రక్తం వోడ్చి మేమంతా ఆనాడు స్వాతంత్యం సంపాదించి పెట్టాం. దానికి ఫలితంగా యువకులైన మీరంతా ఏం చేశారు ? ఇదిగో యిట్లా తగలబెట్టారు దేశాన్ని."
కుర్చీలోంచి కుర్రాణ్ని తీసి భుజానికి ఎత్తుకున్నాడు. "రా నాన్నా" అంటూ. నా వంక తిరిగి "మీరేదో ఉద్దరిస్తారని యీ అర్ధరాత్రి వేళ వీడిని ఎత్తుకుని రాలేదు. మీరంతా ఎంత శ్రద్దగా పనిచేస్తున్నారో కాసేపు వినోదం తిలకించి పోదామని వచ్చాను. ముచ్చట తీరింది" అని రెండడుగులు వేసి మళ్ళీ ఆగి, "ఒక సంగతి మాత్రం గుర్తుంచుకోండి. నాకు చివరికి మిగిలిన యీ ఒక్కగా నొక్క యీ కుర్రాడికి ఏమైనా జరిగిందా ? నా చేతుల్తో రెండు ఖూనీలు జరుగుతాయి. ఒకటి మీ సూపరింటెండెంట్, రెండవది పిడియాట్రిషియన్" అంటూ యిహ అక్కడ ఆగకుండా గబగబ బయటికి వెళ్ళిపోయాడు.
నా తల కొట్టేసినట్లయింది. మత్తు వొదిలినట్లు, కొత్త సత్యాలు ఎదరైనట్లు విభ్రాంతుణ్నయి కూర్చుండిపోయాను.
అతని మీద నాకేం కోపంరాలేదు, అందుకే అతన్నేమీ నిందించలేకపోయాను. అతని పరిస్థితిలో వున్న వారెవరైనా, అలానే మాట్లాడతారేమో అనిపించింది. ఎవరి దగ్గరకైనా పని వుండి వెళ్ళి, ఒక అరగంట నిరీక్షించవలసివస్తే, కాలమంతా వృధా అయినట్లు తెగ చిరాకుపడి పోతామే, రోజులు తరబడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ,ఏ ఫలితమూ కనిపించకపోతే వాళ్ళ మనసులు ఎలా చిన్నా భిన్న మవుతాయో కొంతవరకూ ఊహించుకోవచ్చు.
మిగిలిన రాత్రంతా పిల్లాణ్ని భుజంమీద కెత్తుకుని, లుంగీ ,చొక్కా వేసుకుని దబాయిస్తూ మాట్లాడిన ఆ వ్యక్తిరూపమే కళ్ళ ముందు కనిపించసాగింది.
మరునాడు మళ్ళీ పని హడావుడిలోపడి క్రమంగా అతన్ని దూరంగా నెట్టి వేయగలిగాను.
నైట్ డ్యూటీ ప్రతిరోజూ ఏదో సీరియస్ కేసు వస్తూనే వుండేది. ఒకసారి 'టిక్....ట్వెంటీ'__నల్లుల మందు తాగి నురగలు క్రక్కుతూన్న ముప్పయి ఏళ్ళ కొడుకుని తీసుకుని ఒక వృద్ధుడు వచ్చాడు, నేను, సి.ఎమ్.ఓ. ఆ యువకుణ్ని బ్రతికించాలని అమిత ప్రయాసపడ్డాం. స్టమక్ వాష్ చేసి, ఆ నీరంతా కడుపులోంచి తిరిగి బయటకు తోడుతున్నప్పుడు భరించరాని దుర్గంధం వ్యాపించి, కడుపులో దేవింది. నాకు డోకులు వెళ్ళి పోతాయనిపించింది కష్టంమీద ఆపుకున్నాను. ఆ మందు ఎలా త్రాగాడో అని ఆశ్చర్యపడ్డాను. ఇద్దరం ఒకరు తర్వాత ఒకరు చొప్పున చేతులు నొప్పిపుట్టేటట్లు రొమ్ము నొక్కుతూ కృత్రిమ శ్వాస కలిగించటానికి ప్రయత్నించాం .ఎన్నో యింజక్షన్ లు చేశాము. మా శరీరాలు అలిసిపోయి, చెమటలు క్రమ్మాయిగాని రవ్వంతకూడా ఫలితం కనిపించలేదు కాని వృద్ధుడు మనోనిబ్బరాన్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. ముఖంలో ఏమీ ఆతృతలేకుండా ప్రశాంతంగా, గడ్డం రాసుకుంటూ జరిగేదంతానిర్వికారంగా తిలకిస్తూ నిలబడ్డాడు. అప్పుడప్పుడు మేమడిగే ప్రశ్నలకు యాంత్రికంగా సమాధానాలు చెబుతున్నాడు. వారిద్దరి మధ్యా ఎటువంటి మనస్పర్ధలు చెలరేగాయో, కొడుకు విషం త్రాగాడంటే ఎంతటి తీవ్రమైన విష వాతావరణం ఏర్పడి వుంటుందో, కొడుకుమీద ఎంత ఆగ్రహం, అసహ్యం కలిగివుండకపోతే తండ్రి అంత ఏమీపట్టనట్లు వుండగలుగుతాడో అనిపించింది. చివరికి అతను మరణించాడని మేము చెప్పినప్పుడు కూడా వృద్ధుడిలో చలనంలేదు.
