అలాగే ఓ సారి యాక్సిడెంట్ లో యిరుక్కున్న ఒక లారీ డ్రైవర్ ను మోసుకొచ్చాను. అతని శరీరంలో విరగని భాగం ఏదయినా వుందా అనిపించింది. ఎక్కడికక్కడ రక్తసిక్తమైన అవయవాలన్నీ వొంకరటింకరగా తిరిగిపోయి, అతి భయంకరంగా వుందతని రూపం.
ఆశ్చర్యమేమిటంటే అతను స్మారకం కోల్పోకుండా వుండి మాట్లాడుతున్నాడు. పైగా, "నాకు దాహమేస్తోంది. మంచినీళ్ళివ్వండి" అని గొడవ పెడుతున్నాడు. అతని కుడిచెయ్యి ఒక చెయ్యిలాలేదు. వ్రేళ్ళు నలువైపులకూ అర్ధం లేకుండా, వొంకర్లు తిరిగి అర్ధం లేకుండా వుంది.
అతని రూపం చూస్తుంటే _ఏవిధంగానైనా యీ మనిషి బ్రతకటం అసంభవమనిపిస్తోంది. మాటలు, తెలివి చూస్తుంటే చనిపోవటం సంభవం అనిపిస్తోంది.
గబగబ షాక్ తగ్గటానికి మార్ఫియా యిచ్చాము. కోరమిన్ యిచ్చాము.
ఇహ గాయాలకు డ్రెస్సింగ్ చేద్దామనుకుంటున్నాము. ఇంతలో అతని వళ్ళు చల్లగా తగిలింది. చూసేసరికి చనిపోయి వున్నాడు. అయిదు నిమిషాల క్రితం వరకూ మాట్లాడిన అతనిలో యిప్పుడు జీవంలేదు.
అట్లా జరిగిపోయేవి సంఘటనలు.
నైట్ డ్యూటీ పదిరోజులూ అయిపోయాయి. డే డ్యూటీలోకి వచ్చాం. పనిలో ఊపిరి సలపటంలేదు. యాబ్సిన్ ల ఓపెన్ చెయ్యటం రేగిన గాయాలకు కుట్లు కుట్టడం, మైనర్ ఆపరేషన్లు, ఇంజక్షన్లు _ దెబ్బలు తగిలిన వారికి ఎ.టి.ఎస్. ఇంజక్షన్లు, పిచ్చికుక్క కరిచినవారికి పొట్టమీద యాంటీ రేబిస్ ఇన్ జక్షన్లూ, సాయంత్రంపూట ఆర్.టి.సి.వారికీ, ఎన్.బి.జి.వో. క్లినిక్ వారికి ఇంజక్షన్లూ, సీరియస్ కేసులూ....ఊపిరి సలపకుండా వుండేది.
మెడికల్ రిప్రజంటేటివ్ లు హౌస్ సర్జన్ లని చూడడానికి వస్తుండేవారు. ఉత్తరోత్రా ఈ రిప్రజంటేటివ్ లను కలుసుకోవటంలో సరదాపోయి ఒక్కోసారి బాధాకరంగాకూడా అనిపిస్తుందిగాని, హౌస్ సర్జన్ పీరియడ్ లో మాత్రం వాళ్ళు రావటం, తను ప్రొడక్ట్స్ ని పరిచయంచేస్తూ మాట్లాడటం, శాంపిల్స్ ఇవ్వటం గొప్ప సరదాగా వుండేది. కొంతమంది హౌస్ సర్జన్లయితే తమని వాళ్ళెక్కడ మరిచిపోతారో అని వారి దృష్టి తమవైపు ఆకర్షించటానికి కూడా ప్రయత్నిస్తుంటారు.
ఒక్కోసారి కొద్దిగా అపహాస్యంగా కూడా వుండేది. రిప్రజెంటేటివ్ తో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు, చీఫ్ పిలవటం, ఏదోపని పురమాయించటం, కొన్ని సందర్భాలలో కేకలుకూడా వేస్తూ వుండటం జరుగుతూ వుండేది.
కొంతమంది రిప్రజింటేటివ్ లు వొట్టి లిటరేచర్ మాత్రం ఇచ్చి, గంటసేపు ఉపన్యాసమిచ్చి శాంపిల్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయేవారు.
ఒకసారి నిర్మొహమాటంగా రాజేశ్వరి ఒకతన్ని పట్టుకుని దులిపేసింది. "మీరు శాంపిల్స్ పట్టుకురాకుండా, వొట్టి కాగితాలిచ్చి వెళ్ళిపోయేటట్లయితే, యిహనుంచీ మమ్మల్ని చూడటానికి వీలుండదు" అంది.
అతని ముఖం మాడిపోగా బలవంతంగా నవ్వటానికి ప్రయత్నిస్తూ, "మీకేం కావాలో అడగండి డాక్టర్ ! తెచ్చిస్తాను" అన్నాడు.
"నేను కావలసినవి అడగటమూ, మీరు దయ తలుస్తూన్నట్లు తెచ్చివ్వటమూ కాదు. మీ ప్రొడక్ట్స్ ని మీరు యింట్రడ్యూస్ చేసేటప్పుడు శాంపిల్ యివ్వాలి."
"చూడండి డాక్టరుగారూ! హాస్పిటల్లో వున్న హౌస్ సర్జన్లందరికీ శాంపిల్స్ యివ్వాలంటే యెంత కష్టమో ఆలోచించండి."
"అంత కష్టమైతే కలుసుకోవటం మానేయ్యండి. ఊరికినే ఉపన్యాసాలు యిచ్చి మా టైమ్ వేస్ట్ చేయటమెందుకు ?" అని, అతనక్కడ కూర్చుని వుండగానే కుర్చీలోంచి లేచిపోయింది.
ఒకసారి తలకి దెబ్బతగిలించుకుని ఓ పదహారేళ్ళ అరవ కుర్రాడు వచ్చాడు. మెట్రిక్ పరీక్షలకని ఈ ఊరు వచ్చాడట రోడ్డుమీద నడుస్తూ వుంటే సైకిలు ఢీకొని క్రిందపడగా నెత్తి చిల్లుపడింది.
తలమీద అతనికి కుట్లు వేశాక అతనికి పెన్సిలిన్ ఇంజక్షన్, ఎ.టి.ఎస్. చేసి మరునాడు రమ్మని చెప్పి పంపించేశాను. సరిగ్గా ఒక అరగంటకూడా గడిచివుండదు. ఆ కుర్రాడిని అతని స్నేహితులు మోసుకొచ్చారు. మొదట గుర్తుపట్టలేకపోయాను. ముఖమంతా పొంగిపోయి, ఇంతలోతైపోయి భయంకరంగా వుంది. వళ్ళంతా కూడా పొంగిపోయింది. దురదలు, బాధతో మూలుగుతున్నాడు.
రియాక్షన్ ! ఎ.టి.ఎస్. రియాక్షన్ యిచ్చింది. అప్పటికి ప్రతి ఎ.టి.ఎస్. యాంప్యూల్ లోనూ రెండు చుక్కలు ఎడ్రినలిన్ కలిపి ఇస్తూ వుంటాము. అలా చేసివుండకపోతే ఆ కుర్రాడికి మరింత ప్రమాదం సంభవించి వుండేది.
గబగబ బల్లమీద పడుకోబెట్టి సిస్టర్ని ఎడ్రినలిన్ తీసుకురమ్మని కేకేశాను. తీసుకురాగానే యిందాకా ఎ.టి.ఎస్. చేసిన చోటనే ఒక ఆఫ్ సి.సి. ఇంజక్ట్ చేసేశాను. తర్వాత వెయిన్ లోకి ఎవిల్ ఇంజక్షన్ చేసేశాను. రాజేశ్వరి ప్రక్కన నిలబడి చూస్తోంది లోపలినుండి సి.ఎమ్.ఓ. పరిగెత్తుకు వచ్చాడు, ఏమిటేమిటంటూ జరిగింది చెప్పాను.
మధ్య మధ్య పల్స్ చూస్తూ, అవసరమొస్తే కార్దిసోన్ కూడా యిద్డామా అని ఆలోచిస్తున్నాను. నా గుండె వడి వడిగా కొట్టుకుంటోంది. ఎక్కడో పరాయి దేశం నుంచి పరీక్ష రాయటానికి వచ్చిన కుర్రాడు, అతనికేమైనా జరిగితే ఆ ఉసురు నాకు తగుల్తుంది.
ఉన్నట్లుండి అతనో వాంతి చేసుకున్నాడు. అతని కళ్ళ వెంబడి నీళ్ళు కారుతున్నాయి. నాకు గాబరా ఎక్కువయింది. అతన్తో వచ్చిన కుర్రాళ్ళు మరింత బెంబేలు పడిపోతున్నారు. నన్ను ఇవతలకు పిలిచి "సార్ ! మద్రాస్ వైర్ ఇమ్మంటారా" అని అడిగాడు అందులో ఓ అబ్బాయి, దీనంగా. నాకు దుఃఖం వచ్చింది. నిగ్రహించుకుని, పర్వాలేదని అతనికి ధైర్యం చెప్పి బల్ల దగ్గరకు వచ్చాను.
కొంతసేపటికి అతను బాగా కోలుకున్నాడు. వంటిమీద పొంగు ఆశ్చర్యం కలిగించేటట్లు_చాలా వరకూ తగ్గిపోయింది. ఇందాకటి నుంచీ మాటా పలుకూ లేకుండా పడుకున్న అతను "నేను మా ఊరు వెళ్ళిపోతాను" అంటూ ఏడవసాగాడు.
"మీకు పరీక్ష లెప్పట్నుంచి ?"
"ఎల్లుండి నుంచి" అని కూడా వున్నవారిలో ఎవరో జవాబు చెప్పారు.
నే నతని భుజంమీద చేయివేసి భయంలేదనీ, రాత్రికి హాయిగా చదువుకోవటానికి వీలవుతుందనీ, పరీక్షలకు నిశ్చింతగా హాజరు కావచ్చననీ నచ్చజెప్పి పప్పించేసరికి గగనమై పోయింది ఎలాగో ఒప్పించి ధైర్యం చెప్పి పంపించాను.
వారంరోజుల తర్వాత ఆ కుర్రాడు వచ్చాడు, చిరునవ్వు ముఖంతో
"పరీక్షలు బాగా రాశావా ?" అని అడిగాను.
"ఫస్ట్ గా రాశాను సార్ ! మీ రా రోజు ధైర్యం చెప్పకపోతే ఊరు వెళ్ళిపోయి వుండేవాణ్ని" అన్నాడు తల వంచుకుని, సిగ్గుపడుతూన్నట్లుగా.
నా గుండెలమీద బరువు తీరిపోయినట్లయింది.
"కుట్లు తీయించుకుందామని వచ్చానండీ. రేపు సాయంత్రం వెళ్ళిపోతాను" అన్నాడు మళ్ళీ.
సరే అని అతన్ని లోపలకు తీసుకువెళ్ళి కుట్లు తీసేసి "ఈ అనుభవాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుని, యింకెప్పుడూ ఏ ఇంజక్షన్ తీసుకోవలసి వచ్చినా మీ వంటి తత్వాన్ని గురించి డాక్టరుకు తెలియజేయండి" అని సలహా యిచ్చాను.
"ఎంత జబ్బుచేసినా మాత్రలే మింగుతానుగాని యింజక్షన్ తీసుకోను సార్ !" అంటూ నమస్కారం చేసి, వెళ్ళిపోయాడు.
అలాంటిదే మరో సంఘటన జరిగింది, కొద్ది రోజుల్లోనే. అయితే ఈసారి అదృష్టం దక్కలేదు.
ఓ మధ్యాహ్నం చిన్నపిల్లాణ్ని ఎత్తుకుని ఎవరో తల్లిదండ్రులు వచ్చారు. నేను అప్పటికే మరోకేసు చూడటంలో నిమగ్నుణై వుండటంవల్ల ఆ కేసు రాజేశ్వరి చూసి ,ఏదో యిన్ జక్షన్ చేసి పంపించేసింది.
ఒక గంట గడిచాక ఆ తల్లిదండ్రులు పిల్లాణ్ని ఎత్తుకుని లోపలకు గాభరాగా పరిగెత్తుకు రావటం చూశాను. రాజేశ్వరి గబగబ వారి దగ్గరకు వెళ్ళి పిల్లాణ్ని పరీక్ష చేసి, నా దగ్గరకు వచ్చి "ఇలా రండి డాక్టర్ !" అని స్క్రీన్ వెనక్కి నడిచింది. ఆమె గొంతులో మార్పు కనిపెట్టిచప్పున లేచి లోపలకు వెళ్ళాను.
లోపల రాజేశ్వరి వణికిపోతూ నిల్చుంది. నా రెండు చేతులూ గబుక్కున పట్టుకొని "నన్ను ఎలాగో ఒడ్డున పడవేయండి డాక్టర్ ! ప్రమాదంలో చిక్కుకుపోయాను" అంది దీనంగా.
రాజేశ్వరిని అంత దైన్యావస్థలో ఎప్పుడూ చూడలేదు. హృదయం ద్రవించగా "ఏమయింది డాక్టర్ !" అనడిగాను, ఆదరంగా.
"ఇందాక ఆ పిల్లాణ్ణి జ్వరమని తీసుకువస్తే పెన్సిలిన్ యింజక్షన్ చేసి పంపేశాను డాక్టర్ ! వాళ్ళిప్పుడు గాభరాపడుతూ హఠాత్తుగా వళ్ళు చల్లబడిపోయిందని తీసుకువచ్చారు. తీరా చూస్తే పిల్లాడు చచ్చిపోయి వున్నాడు." దుఃఖాన్ని ఆపుకుంటూ, అంది.
