"ఆగండి" అని ఆమె దారికి అడ్డుగా వచ్చి నిల్చింది. నావంక పరిశీలనగా నిశితంగా అవలోకిస్తోంది. చివరకు, ఆమెకు ఏమి కనిపించిందో రెండు చేతులూ కలిపి, నమస్కారం చేస్తున్న భంగిమలో నిల్చుంది. "బహుశా నాకంటే చిన్నవారనుకుంటాను. అయినా చేయెత్తి దణ్ణం పెడుతున్నాను. గవర్నమెంటు ఆసుపత్రులంటే వున్న దురభిప్రాయాన్ని పోగొట్టారు అప్పుడు, మనుషులంటే దురభిప్రాయాన్ని తొలగించారిప్పుడు. మీరు పెద్ద....ఎవరూ ఊహించలేనంత పెద్ద డాక్టరవుతారు....ఒకసారి పాపను చూసి వెళ్ళిపోండి" గాద్దదికంగా అని ప్రక్కకి తిరిగింది.
"పదండి" అని వెనక్కి తిరిగాను.
లోపలవున్న మరో గదిలోకి తీసుకువెళ్ళింది. పాప ఉయ్యాలలో పడుకుని నిశ్చితంగా నిద్రపోతోంది. బక్కపల్చగా, ఎర్రగా వున్న ఆ పాపలో అందమూ, ఆకర్షణా వున్నాయి.
చప్పున ఎక్కడో చదివిన ఓ కథ గుర్తు వచ్చింది. ఒక భావుకుడు ముద్దులొలికే ఏడాది నిండని పసిపాపని ఓ వ్యభిచార గృహంలో ఎప్పుడో చూస్తాడు. పద్దెనిమిదేళ్ళ తర్వాత ఆ పసిపాప జ్ఞాపకం వస్తుంది. ఆనాటి పాప యిప్పుడు యుక్తవయస్కురాలై ఏ దశలో వుందో అన్న భయంకరమైన ఆలోచన అతని మృదువైన మనస్సును కలచివేస్తుంది.
చేయి చాచి, ప్రేమగా, ఓసారి పాలుగారే ఆ బుగ్గలు నిమిరాను.
ఆమె ణా ప్రక్క నిల్చుంది. "పాపాయిలంటే మీ కిష్టమా ?" అని అడిగింది.
"పాపాయిలంటే ఎవరి కిష్టముండదు ?"
ఆమె ముసిముసిగా నవ్వింది.
"నేనూ ఒక ప్రశ్న అడుగుతాను _ మీ రన్యధా భావించకపోతే ?" అడగమంది.
"ఈ పాపకు తండ్రి ఎవరు ?"
ఆమె ముఖం వెలవెలపోయింది "తెలియదు" అంది, పొడిగా.
తర్వాత వెళ్తానని చెప్పి, అక్కణ్నుంచి బయటకు వచ్చేశాను.
ఇహ ఆ సమయంలో నారాయణ గది వెతుక్కుంటూ వెళ్ళే ఇచ్ఛ నశించింది. ఆ సందు దాటి పెద్దరోడ్డు మీదకు వచ్చి హాస్పిటల్ వైపు నడవసాగాను.
అలా నడుస్తూంటే పాతకాలంనాటి సంఘటన ఒకటి గుర్తువచ్చింది. రెండేళ్ళ క్రిందట సంగతి. మా వూరి నుంచి యిక్కడకు దూరం ముప్పయి మైళ్ళే అయినా పాసింజరు బండిలో మూడు గంటలు ప్రయాణం. ఎప్పుడూ బస్సులోనే వచ్చేవాణ్ని. ఆసారి రైల్లో వెళ్దామని బుద్దిపుట్టి, సెకండ్ క్లాసు తీసుకుంటే వంటరిగా కూర్చోవచ్చని, ఆ టిక్కెట్ కొని రైల్లో ఎక్కాను. కంపార్టుమెంటులో నేను తప్ప యింకెవరూ లేరు. ఒక రూపాయి ఎక్కువ ఖర్చుకు నాకు దొరికిన ఏకాంతానికి సంతోషిస్తూ, బ్యాగ్ లోంచి ఓ తెలుగు పత్రిక తీసి చదువుకుంటున్నాను. ఇలాగే ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు తెలుగు పత్రికలు చదవటం నాకెంతో సరదా నిచ్చేది.
రైలు మూడు నాలుగు మైళ్ళన్నా పోకుండానే, తరువాతి స్టేషన్ లో ఆగి, యిలా తల త్రిప్పి చూసేసరికి ఓ స్త్రీ నేనున్న కంపార్టుమెంటులోకి ఎక్కుతోంది. ఏకాంతం భగ్నమయిన విసుగుతో ఆమెవైపు చూశాను.
"అబ్బ ? అంతా ఖాళీగా వుందే" అంటూ ఆమె నాకెదురుగా వున్న సీట్లో కూర్చుని చేతిలోని సంచి ప్రక్కన పెట్టుకుంది. నావైపో దృష్టి పారేసి, తర్వాత ముఖం అటు త్రిప్పి కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది, మధ్య మధ్య కాళ్ళాడిస్తూ.
ఇరవై, ఇరవై రెండేళ్ళ మధ్య వుంటుందామె వయస్సు. పుష్టిగా వున్న శరీరం, కొట్టొచ్చినట్లు కన్పిస్తున్న చీరె, దాని మీద ఏమాత్రం అతకని జాకెట్టు, వింతగా తిరిగిన జుట్టుముడి, అందులో కాసిని పూలు....
ఒక నిముషం మాత్రం ఆమెవైపు చూసి, నేను మళ్ళీ పత్రికా పఠనంలో నిమగ్నమయాను.
ఓ పావుగంట గడిచాక ,చదువుతూన్న కథ పూర్తికాగా, కొత్త కథ ప్రారంభించబోతూ యధాలాపంగా కిటికీలోంచి బయటకు చూసి, దూరంగా కనిపిస్తూన్న కొండలమీది ప్రకృతి సౌందర్యానికి చలించి, అటువైపే దృష్టి నిల్పాను.
"ఆ పత్రిక ఒకసారి యిస్తారూ ?"
ఆ అభ్యర్ధన విని ఆమె వైపు చూసేసరికి, అడగటం పూర్తిచేసి యివ్వమన్నట్లు చేయి జాపుతోంది.
చదువుతూన్న పుస్తకం అడిగే ధోరణిని బట్టే ఆమె సంస్కారం ఎటువంటిదో తెలుస్తోంది.
"చదువుతున్నాను" అని జవాబు చెప్పాను ,నిర్మొహమాటంగా.
"చదవటం ఆపి ఎటో చూస్తున్నారుగా !"
ఆమె పరిహాసోక్తి అర్ధంచేసుకున్నాను. "చదువుతూ చదువుతూ మధ్య మధ్య ఆలోచించటం నా కలవాటు" అన్నాను.
"పోనీ ,యింకేవైనా పుస్తకాలుంటే యివ్వండి."
వెంటనే నాకో వింత ఆలోచన వచ్చింది. అలాగే అన్నట్లు తల ఊపి, నా బ్యాగ్ తెరిచి అందులో భగవత్ గీత తీసి ఆమె కందిస్తూ "ఇది చదవండి, బాగుంటుంది" అన్నాను.
ఎంతో ఆశగా అందుకున్న ఆమె, పుస్తకం మీది పేరు చూడగానే ,ముఖంమీది రంగులు మారగా, బయటపడటం యిష్టంలేక పుస్తకం తెరిచి పేజీలు త్రిప్పుతోంది.
నేను పత్రిక చదువుకుంటూ మధ్య మధ్య ఆమెను గమనిస్తున్నాను.
పది నిమిషాలు మాత్రం ఎలాగో పేజీలు త్రిప్పగలిగి, తర్వాత ఓ సారి ఆవులించి "ఇదేం బాగుండలేదు." అని ముందుకు వొంగి నా ముందు పెట్టేసింది.
నేను పత్రికలోంచి ముఖం ఎత్తి "బాగుండలేదూ ? నేను రోజూ ఉదయం నిద్రలేవగానే కాసేపు చదువుతాను. బాగానే వుంటుందే" అన్నాను.
నా ప్యాంటు, బుష్ షర్టూ చూసి ఆమె మోస'పోయి వుంటుంది. ఎప్పుడో పదియుగాల వెనక పుట్టవలసిన చాందసుణ్ణ ఆమెకేం తెలుసు ?
నా వంక ఆశ్చర్యంగా చూసి "రోజూ చదువుతారా ?" అని ప్రశ్నించింది.
అవునన్నట్లు తల వూపాను.
తర్వాత ఆమె యింకేమీ మాట్లాడలేదు .ముఖం ప్రక్కకి త్రిప్పి బయటి దృశ్యాలను చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుంది. నేనంతకన్నా మాట్లాడలేదు.
మరో అరగంట గడిచాక ఆమె దిగవలసిన స్టేషన్ వచ్చినట్లుంది. లేచి నిలబడి, చప్పున నా వంక తిరిగి చేతులు జోడించి "నమస్కారం బాబుగారూ !" అని తన సంచీ అందుకుని క్రిందికి దిగి, వెళ్ళిపోయింది.
నేను విస్మితుణ్ణయి అలానే చూస్తూ వుండిపోయాను. ఆ మాట అన్నప్పుడు ఆమె కంఠంలో వినిపించిన అణుకువ, ముఖంలో కనిపించిన వినమ్రత జీవితంలో మరిచిపోలేను.
ఆ సంఘటన జ్ఞాపకం వచ్చిందీరోజు.
మరునాడు నారాయణ కోపంగా ముఖంపెట్టి అడిగాడు. "మీ సత్యసంధత మీద నాకున్న నమ్మకాన్ని పాడుచేశారు. మీ కోసం ఎదురు చూసి చూసి నా ప్రాణం విసిగిపోయింది" అన్నాడు.
"క్షమించండి. రాత్రి ఎంత వెదికినా మీ గది గుర్తించలేకపోయాను తప్పు నాదే" అన్నాను. అంతకంటే యింకేం చెప్పలేదు.
మరో రెండు రోజులకు పిడియాట్రిక్ పోస్టింగ్ పూర్తయిపోయింది.
* * *
తర్వాత క్యాజుయాలిటీ. ఎంత థ్రిల్ వుంటుందని యిందులో ఉదయం పదకొండు దాటిపోయాక, మరునాడు ఉదయం ఎనిమిది గంటల వరకూ హాస్పిటల్ కి వచ్చే ప్రతికేసూ క్యాజుయాలిటీ శాఖకు ముందు రావల్సిందే.
ఎన్ని రకాల కేసులు వస్తాయని ! సర్జికల్, మెడికల్, చిన్నపిల్లల కేసులు _ప్రతిదీ చూడవచ్చు.
ప్రమాదాల కేసులు, నిప్పంటుకున్నవి, రైలు క్రిందపడినవి, కారు క్రింద పడినవి, మోటారు సైకిలు యాక్సిడెంట్లు, తన్నులాడుకుని తల పగలకొట్టుకున్న కేసులు, విషం త్రాగినవి, నీటిలో మునిగినవి, షాక్ కొట్టి పడిపోయినవి ఎన్నో.
ఆరుగురం వుండేవాళ్ళం హౌస్ సర్జన్లం. డ్యూటీ మూడు భాగాలుగా విభజించబడింది. పదిరోజులు ఉదయం ఎనిమిది నుంచి రెండు గంటలవరకూ, మరో పదిరోజులు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటలవరకూ యిన్ జక్షన్ చేసి, భోజనం చేసి రెండుగంటలకి వచ్చి, అప్పటి నుంచి ఎనిమిదింటివరకూ, మరో పదిరోజులు రాత్రి ఎనిమిదింటి నుంచి ఉదయం ఎనిమిదివరకూ __అట్లా విభజించబడింది. ఒక్కొక్క బ్యాచికి యిద్దరిద్దరు. సి.ఎమ్.ఓ.లు ప్రతి ఎనిమిది గంటలకూ ఒకరు చొప్పున మారేవారు.
నా పార్టనర్ రాజేశ్వరి.
క్యాజుయాలిటీకి ఆస్తమా కేసులు విపరీతంగా వచ్చేవి. ఇహ ఎప్పుడైనా వర్షంపడిన రోజున చూడాలి. క్యాజుయాలిటీ ఎడతెరిపి లేకుండా ఆస్తమా పేషంట్లతో నిండివుండేది, కొందరయితే ఆ రోజు ఉబ్బసపు రోగం వస్తుందని ముందుగానే అనుమానించి హాస్పిటల్ స్థలాలలోనే ఏ చూరుక్రిందో పడుకుని, ఎటాక్ రాగానే పరిగెత్తుకు వచ్చేవారు.
డిపార్ట్ మెంటంతా రొప్పు, వగర్సు, గురగురమని చప్పుళ్ళు.
ఉబ్బసపురోగిని అంతదూరంలోనే చూసి "అదిగో గూడ్స్ బండీ వచ్చింది" అనేది రాజేశ్వరి.
"తప్పు అలా అనకూడదు. మనకే అలాంటి బాధ వుంటే ?" అని మందలించేవాణ్ని.
ఉబ్బసపు స్థితినిబట్టి ఒక్కోసారి ఎడ్రినలిన్, ఒక్కోసారి వెయిన్ లోకి ఎమైనోఫిలిస్ యిచ్చేవాళ్ళు.
అసలు వాళ్ళనే అడిగేవాళ్ళం, "కండలో యిచ్చేది కావాలా? నరం యింజక్షన్ కావాలా ?" అని. వెయిన్ కు నరం అనేది తప్పు అనువాదమే అయినా వాడుకగా అలా అనేవాళ్ళు.
ఒక్కొక్క ఉబ్బసరోగికి ఒక్కో ఫేవరేట్ వుండేది. కొందరికి ఇన్ ట్రావీనస్....
ఒక్కోసారి స్టేటస్ ఆస్థమాటికస్ వచ్చేది. ఉబ్బసం మొండికేసేది, మొదట ఎడ్రినలిన్, తర్వాత ఎమైనోఫిలిస్ తగ్గకపోతే కార్డినల్. అప్పటికీ జవాబు చెప్పకపోతే ఆక్సిజన్, యిలా నానా అవస్థపడి ప్రయోజనం లేకపోతే వార్డులో ఎడ్మిట్ చేసేవాళ్ళం.
