Previous Page Next Page 
మారణహోమం పేజి 33

 

    "గుడ్ బై మై ఫ్రెండ్! మే గాడ్ బ్లెస్ యూ!" ఒక్క నిమిషం సేపు మౌనంగా కళ్ళు మూసుకుని, తన సహచరుడి ఆత్మశాంతి కై దేవుడిని ప్రార్ధించాడు తరుణ్. తర్వాత ఆ ఆస్థిపంజరం మీద మట్టి పోసి "వెళ్ళి వస్తాను మోషి!" అన్నాడు మెల్లగా.
    "అప్పుడే వెళ్ళిపోతారా దొరా! మా ఇంటికి రావా?" అంది మోషి.
    "ఇప్పుడు కాదు మోషి! తొందరగా వెళ్ళిపోవాలి నేను......"
    మాట్లాడకుండా తన మనసు అతనికి అర్ధమయ్యేలా ఒక చూపు చూసింది మోషీ. ప్రకృతి బిడ్డ ఆమె. కృత్రిమమైన మాటలూ, చేతలూ, మనసు దాచి దోబూచులాడే ఆటలూ ఆమెకు చేతకావు. బలంగా, అందంగా ఉన్న తరుణ్ ఆమెకి నచ్చాడు.
    నచ్చితే నాన్చడం తెలియదు మోషికి. నోరు తెరిచి అడగడానికి నామోషి పడడం కూడా తెలియదు మోషికి.
    నవ్వాడు తరుణ్ "వెళ్ళిపోవాలి మోషీ!"
    హటాత్తుగా రెండు చేతులూ చాచి అతన్ని వాటేసుకుంది మోషీ! అంత నాజూగ్గా కనబడే ఆ అమ్మాయి కౌగిలి బలంగా ఉండడం గమనించి ఆశ్చర్యం కలిగింది తరుణ్ కి.
    మళ్ళీ విజిలు వినబడింది.
    విని "అమ్మ పిలుస్తోంది.  అన్నానికి రమ్మని" అంది మోషీ.
    తరుణ్ సైకిల్ దగ్గరికి నడిచి టైర్లు నొక్కి చూశాడు. కొంచెం గాలి తగ్గినట్లనిపించింది. సైకిలుకే గాలికొట్టే పంపు ఒకటి అమర్చి వుంది. దాన్ని తీశాడు.
    "హాయ్ హాండ్సమ్ ! ఒక్కసారి వెనక్కి తిరుగు!" అని వినబడింది మోషీ గొంతు పరిహాసంగా.
    గిరుక్కున వెనక్కి తిరిగాడు.
    మోషి చేతిలో ఒక బాణం ఉంది. మాములు బాణం కాదు అది. వెస్టర్న్ కంట్రీస్ లో లేటెస్ట్ క్రేజ్ అయిన "రామ్ బో" అది. తుపాకీ కంటే తీక్షణమైన గురి దానిది. వాడి చూపుల్లా అతనికి గుచ్చుకుంటున్నాయి ఆమె చూపులు.
    తొణకలేదు తరుణ్. బాణాన్నీ ఆమెను మార్చి మార్చి చూసి "హాయ్ బ్యూటీ పుల్!" అన్నాడు నవ్వుతూ.
    "ప్రొఫెసర్ తాజుద్దీన్! అవునా! మిస్టర్ తరుణ్? ఎందుకీ చేతకాని దొంగవేషాలు?"
    "నువ్వు నిఖిల్ మనిషివి. అవునా?"
    "యా! నువ్వేమో 'రా' ఏజంటువి ! అవునా!"
    తల పంకించి "మీ విజిల్ భాష బాగుంది. మీ లేటెస్ట్ కోడా?" అన్నాడు తరుణ్.
    "అవును! థాంక్స్ ఫర్ ద కాంప్లిమేంట్! ఇందాక నీ స్నేహితుడి ఆత్మకోసం దేముడిని ప్రార్ధించావు. ఇప్పుడు నువ్వు కూడా చివరిసారి ప్రార్ధన చేసుకుంటావా లేకపోతే నువ్వు చచ్చాక నీకోసం నేను ప్రార్ధన......"
    "ఫట్!" మని చిన్న శబ్దం వచ్చింది తరుణ్ చేతిలో వున్న సైకిల్ పంపులో నుంచి ఆ పంపులో నుంచి, ఆ పంపులోనే చిన్న గన్ అమర్చి వుంది సైలెన్స్ర్ తో సహా. అది తెలియదు మోషికి.
    ఆమె రక్తం పౌంటెన్ లా వెలువడి మట్టిని తడిపేసింది. కిందికి వోరిగిపోయింది మోషీ.
    విషాదంగా ఆమె వైపు ఒకసారి చూశాడు తరుణ్. కొద్ది క్షణాల పాటు అతని మనసు బాధతో విలవిల్లాడింది.
    ఒక నిండు ప్రాణాన్ని అందులోనూ, ఒక ఆడపిల్ల ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా తీశాడు తను. కానీ తప్పదు. దేశ రక్షణ కోసం ఏ పనయినా చేస్తాడు తను. చెయ్యాలి కూడా. చంపదానికీ, చావదానికీ కూడా తను సతతం సర్వసన్నద్ధంగా ఉంటాడు.
    ఆమెని తను చంపకపోతే తనని ఆమె చంపి వుండేది. నో డవుట్! తమ వృత్తే అలాంటిది! క్లాక్ అండ్ డాగర్ గేమ్ లాగా!
    ఒక్కసారి తల విదిలించి ఆ ఆలోచనల్లోంచి బయటపడ్డాడు తరుణ్. సో! ఇవాళ తను రెండు పనులు చేయగలిగాడు. ఒకటి తన కొలీగ్ డేనియల్స్ చనిపోయాడని నిర్ధారణ చేసుకున్నాడు. రెండు దానికి కారణం నిఖిల్ ముఠానే అని తెల్చుకున్నాడు .
    "వాట్ నెక్స్ ట్?!"
    తన ఫ్యూజ్ సైకిల్ ఎక్కి కొండదారి వెంబడి దిగడం మొదలెట్టాడు తరుణ్. మధ్యలో ఒక పెద్ద బండ సెంట్రీలా నిలబడి వుంది. రోడ్డు షార్ప్ గ మలుపు తిరిగింది అక్కడ.
    సైకిల్ మలుపు తిరగ్గానే ఎదురుగా పరుగెత్తి వస్తున్న ఒక అమ్మాయిని డాష్ కొట్టింది. వెంటనే కిందపడిపోయింది ఆ అమ్మాయి.
    సైకిల్ దిగాడు తరుణ్. విరబోసికొని ఉన్న జుట్టు ఆ అమ్మాయి మొహాన్ని కవర్ చేస్తోంది. జుట్టు పక్కకి తీసుకుని అతని వైపు చూసింది ఆమె.
    'అమూల్యా!" అన్నాడు తరుణ్ ఆశ్చర్యంగా.
    "మీరా" అంది అమూల్య విస్తుపోతూ. అతన్ని చూడగానే ఆమె మోహంలో అప్పటిదాకా ఉన్న భయాందోళనలు తొలిగిపోయి సంతోషం కనబడింది. 'మీరా! మీరు నిజంగా మీరేనా! దేవుడు దయతలచి పంపిన దూత లాగా సమయానికి ......." అంటూ ఒక్క ఉదుటున అతన్ని చేరి గట్టిగా కావలించుకుంది అమూల్య. అయితే అలా చేస్తున్నందుకు ఆమె మనసంతా వెగటుగా అయిపొయింది. వళ్ళు అయిష్టంతో జలదరించింది. అయినా తప్పదు. నిఖిల్ అలా నటించమన్నాడు. నటించి తీరుతుంది తను.
    ఉత్తుత్తి వేక్కిళ్ళతో ఎగిరెగిరి పడ్డుతున్న ఆమె వీపుని ఆర్ద్రంగా నిమిరాడు తరుణ్.
    'అమూల్యా! ఏమయింది? ఎందుకంత భయపడిపోతున్నారు?"
    "తరుణ్! మీరు సర్పాలతో సహవాసం చెయ్యమని అక్కడికి నన్ను పంపించారు. మూడు  నెలలపాటు ఉండగలిగాను. ఇంకొక్క క్షణం అక్కడ ఉన్నా నాకు పిచ్చెత్తి పోతుందని పించింది. అందుకని వాళ్ళ కళ్ళలో దుమ్ముకొట్టి పారిపోయి వచ్చాను. క్షమించండి తరుణ్! నేను మీరు ఆశించినంతగా ఏమీ సాధించలేకపోయాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS