ముందుకి మెల్లగా నడవసాగాడు.
56
ఇంద్రసేన గదిలో మంచంమీద పడుకుని పుస్తకం చదవసాగింది.
ఆ పుస్తకం చదువుకుంటూ నవ్వుకుంది తనలో తాను.
వదిన చెప్పినంత భయంగా ఏం లేదు.
ఇంతకంటే భయంవేసే నవల్సు ఎన్ని తను చదివింది.
వదిన కబుర్లు అన్నీ ఇంతే.
పాపం అనవసరంగా అన్నయ్యనుకూడా భయపెట్టేసింది.
అన్నయ్య ముఖం చూస్తూంటే నవ్వు వచ్చింది.
వదిన గెలిచి తీరుతుంది అనుకుంది పాపం.
తమ అన్నాచెల్లెళ్ళే గెలుస్తారు.
పుస్తకం చదువుతూ నవ్వుకుంది.
అప్పుడే తలుపు చప్పుడు అయింది. గుమ్మం తలుపు కాక పక్క గది గుమ్మం తలుపు.
తోటగల అతను వచ్చాడేమో అనుకుని అటు చూడకుండా పుస్తకం చదవసాగింది.
లాంగ్ కోటు వేసుకుని తలమీద హేట్ పెట్టుకుని ముఖం సరిగ్గా కనిపించనివ్వకుండా చేసుకుని.
చేతిలో రివాల్వర్ పట్టుకుని గుమ్మం పొడుగునా ఒక అతను నిలబడి ఉన్నాడు.
ఎందుకనో తల తిప్పి అటు చూసింది.
అంతే! ఇంద్రసేన చేతిలో పుస్తకం జారి క్రింద పడిపోయింది.
కెవ్వుమంది. ఆ కేక బంగళాయే కాకుండా తోట అంతా ప్రతిధ్వనించింది.
అతను క్రూరంగా నవ్వాడు.
అతను నవ్వగానే బంగళా అంతా ఉలిక్కిపడినట్టు పెద్దగా మారుమ్రోగింది.
ఇంద్రసేన భయంతో ఒణికిపోయింది.
అతను క్రూరంగా చూస్తూ ఒక్కో అడుగు వేస్తు దగ్గరకు వస్తున్నాడు.
ఆమెకు ముచ్చూరి చెమటలు పట్టేశాయి.
గొంతుక తడారిపోయింది.
మాటరావటం లేదు.
కనురెప్పలు అలా నిలబడిపోయాయి. రెప్ప వెయ్యాలన్నా సాధ్యం కావటం లేదు.
దగ్గరగా వచ్చేశాడు.
ఇంకా దగ్గరకు వచ్చేసి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఇంద్రసేన దొంగా దొంగా అంటూ గట్టిగా అరుస్తూ కెవ్వుమంటూ కేకలు వేస్తు మంచం మీదనుండి లేవబోయింది.
అతను లేవనివ్వలేదు.
ఆమె నోరుమూసి "అరిస్తే చంపేస్తాను" అన్నాడు కోపంగా.
అతని ముఖం కనిపించటంలేదు. తల నుదురు కప్పేసి ఉంది హేట్.
ఆనవాలు తెలీకుండా చాలా జాగ్రత్త తీసుకున్నాడు.
అతని చేతిని విడిపించుకోడానికి చూసింది. అతను వదల్లేదు ఆమెను బలంగా పట్టుకున్నాడు.
ఇంద్రసేన అతని పట్టు అతికష్టంమీద విడిపించుకుంటూ మంచము మీదనుండి లేచిపోయింది.
ఆమెకు భయంతో తెలివితప్పి పోతున్నట్లుగా ఉంది.
కళ్ళముందు చీకటి వలయంలా తిరుగుతుంది. కళ్ళకి ఏం కనిపించటం లేదు.
ఒళ్ళు అంతా చెమట పట్టేస్తుంది.
అన్నా వదినా ఇప్పుడే వెళ్లారు.
తన కేక వినిపించలేదా!
వినిపించి ఉంటుంది. అన్నయ్య పరుగున వస్తాడు వచ్చేస్తుంటాడు ఈపాటికి.
ఈ దొంగని చిత్తుగా మెత్తగా తన్ని బయటకు ఈడ్చేస్తాడు.
ఇంద్రసేన మనసులో ధైర్యం తెచ్చుకోసాగింది.
అతను కోపంగా చూశాడు.
"నన్ను తప్పించుకుందామన్నా నీ ఎత్తులు, వీల్లేదు" అంటూ అరిచి ఆమెను పట్టుకోబోయాడు. ఇంద్రసేన మళ్ళీ పెద్ద కేక వేస్తూ దొంగ దొంగ అని అరిచింది.
అతను ఇంకా మండిపడిపోయాడు.
"నువ్వు అరిస్తే అందరూ వస్తారనా? వచ్చి నిన్ను రక్షిస్తారనా? మీ అన్న మీ వదినతో ,షికారుకు పోయాడు. నువ్వు అరిచినా వినిపించదు తోటమాలి వాళ్ళు ఎవ్వరూ లేరు అందరూ పోయారు. ఈ తోటలో ఈ బంగళాలో మనమే వున్నా" మంటూ గట్టిగా నవ్వేశాడు.
ఇంద్రసేన అదిరిపడింది.
భయంతో గజగజ ఒణికిపోయింది.
ఇతన్ని తప్పించుకోవటం ఎలా!
తప్పించుకునే మార్గం లేదు.
భగవంతుడా ఇక్కడ తన చావు వ్రాసి పెట్టి ఉందా!
తన ప్రాణం తియ్యడానికి వచ్చాడు.
తనవంటిమీద వస్తువులు ఉన్నాయి.
అవి తీసుకుంటాడు. చంపేసి ఆనవాలు తెలీకుండా ముఖమంతా కత్తితో చెక్కేసి రివాల్వర్ పై వేలిముద్రలు లేకుండా జాగ్రత్తపడి వెళ్ళిపోతాడు.
తన చావుకి కారణం ఎవరో ఏమిటో ఎవ్వరికీ తెలీదు.
భగవంతుడా! ఆమె ఒణికిపోసాగింది.
కొద్దినిమిషాల్లో ఈ దొంగ తన ప్రాణం తీసేస్తాడు. ఇంద్రసేన అలా నిలబడిపోయింది.
ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు.
"నన్ను చంపకు నీకు పుణ్యం ఉంటుంది. నన్ను వదిలేయి నీకు కావలిస్తే ఈ వస్తువులు ఇచ్చేస్తాను" అంటూ చేతిగాజులు మెడలో గొలుసు తీసి ఇవ్వబోయింది.
