"తెచ్చానుకాని ఆ పుస్తకం చదివితే నువ్వు పెద్ద పెద్ద కేకలు వేస్తావు" అంది నవ్వుతూ. "నువ్వు మరీనూ" అంది ఇంద్రసేన మూతిముడుస్తూ.
"అవునమ్మా సగం దూరం వెళ్ళిన తరువాత నీ కేకలు వినిపిస్తే అక్కడ నన్ను ఒంటరిగా వదిలేసి మీ అన్నయ్య పరుగెత్తుకు వస్తారు. అదీ నా భయం" అంది.
జయరాం నవ్వాడు. "మా అన్నా, చెల్లెల్ని మరీ గేలిచేస్తున్నావు" అన్నాడు.
"మీరే చూస్తారుగా ఆ పుస్తకంయిస్తే మీ చెల్లెలు చదువుతూ కేకలు వేస్తుంది ఏమిటా అని మీరు పరుగెత్తుకు వస్తారు."
"ఏమిటి వదినా ఏది ఆ పుస్తకం ఇలా ఇవ్వు" అంటూ తీసుకుంది.
"నేను ఏం భయపడి అరవనుగాని మీరు వెళ్ళిరండి" అంది నవ్వుతూ.
"ఉహూ నేను నమ్మను" అంది అంబిక వస్తున్న నవ్వు దాచుకుంటూ.
"అన్నయ్యా! నేను కేకలువెయ్యను. ఒకవేళ వదిన చెప్పినట్లు కేకలు వేసినా నువ్వు రావద్దు, వదినతో పందెం వేద్దాం" అంది.
జయరాం, అంబిక కూడా హుషారుగా పందెం అనుకున్నారు.
జయరాం, అంబిక షికారు బయలుదేరారు. కారు తీసుకెళ్ళలేదు.
ఇద్దరూ మెల్లగా నడక ప్రారంభించారు.
బంగళాకి వెనక మరో త్రోవవుంది. అది తోటవేపుగా దారి వుంది.
అలా వెళుతూ ఇద్దరూ ఓ చెట్టుదగ్గర కూర్చున్నారు కాసేపు సరదాగా.
వాళ్ళు కూర్చుని పావుగంటయింది.
బంగాళావైపుగా కెవ్వుమన్న కేక వినిపించింది. జయరాం ఆ కేక వింటూనే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
అంబిక నిటారుగా అయింది.
మళ్ళీ కెవ్వుమన్న కేక వినిపించింది. ఆ కేక ఇంద్రసేనదే నని తెలుస్తుంది.
"ఏమిటి పెద్దకేక వేసింది" అన్నాడు జయరాం గాబరాగా.
"నేను చెప్పలేదు ఆ పుస్తకం చదివి అరుస్తుంది" అని.
"పుస్తకం చదివావా!" అర్ధంకానట్లు చూశాడు.
"ఆ పుస్తకం చదువుతుంటే అంత భయంవేస్తుంద. నేను చదువుకునే రోజుల్లో ఆ పుస్తకం రాత్రి పదిగంటలకు చదువుతుంటే అలాగే కెవ్వుమని అరిచి పెద్ద పెద్ద కేకలు వేశానట.
హాస్పిటల్లో ఉన్నవాళ్ళందరు పరుగెత్తుకు వచ్చాశారు.
హాస్పిటల్లో అందరికి కంగారయిపోయింది.
"అప్పుడు వాళ్ళకి తెలిసింది, నేను ఆ పుస్తకం చదువుతూ కేకలు వేశానని"
"అందరూ నవ్వేశారు."
"నాకు గొప్ప సిగ్గేసింది" అంది అంబిక భర్తతో.
జయరాం తల పంకించాడు. ఏదో ఆలోచిస్తూ.
"ఏమండీ ఏమిటి అలా ఉన్నారు!" అంది నవ్వుతూ.
"అబ్బే ఏం లేదు" అన్నాడు కాస్త తడబడుతూ.
"పోనీ వెళ్ళి చూసిరండి, చూసి వచ్చేదాకా మీ మనసు అటే లాగుతుంది" అంది.
అతనికి వెళ్ళి చూసి రావాలని ఉన్నా పందెం సంగతి గుర్తువచ్చి బెట్టుగా కూర్చున్నాడు.
"వెళ్ళిరండి ఫర్వాలేదు ఓడిపోతాను అని భయమా!" కొంటెగా చూసింది భర్త వైపు.
అతను నవ్వాడు.
"నాకు ఏం భయంలేదు. ఇందూ సరదాగా కూడా అరచి ఉండొచ్చు, మనం వస్తామా లేదా అని" అన్నాడు.
"నిజమేనండి ఇందూ చాలా కొంటెపిల్ల" అంది. నిజమే అంబికా ఇందూ వట్టి అల్లరిపల్లి అంత అమాయకురాలు కూడా అన్నాడు.
పాపం మీరూ అమాయకులే అనుకుంది మనసులో, పైకి చిన్నగా నవ్వుకుంది.
"అన్నయ్యా!" అంటూ ఇందూ మళ్ళీ పెద్దగా అరిచింది.
జయరామ్ అలా ఉండిపోయాడు.
అంబిక నవ్వింది "భలే అల్లరిపిల్ల" అంది.
"అన్నయ్యా వదినా వెంటనే వచ్చేయండి నాకు భయం వేస్తుంది" అంది గొంతు చించుకొని ఇరుస్తూ.
అంబిక భర్తవైపు చూచింది.
వెళతారా వెళ్ళండి అన్నట్టు.
అతను మాట్లాడలేదు.
"దొంగ... దొంగ..." మళ్ళీ కెవ్వుమని అరిచింది. "వెళ్ళండి పాపం ఆ పుస్తకం చదివి కేకలు వేస్తుంది భయపడి" అంది భర్తని.
జయరాం లేవబోయి మళ్ళీ ఏదో ఆలోచించుకుని అలాగే కూర్చుండి పోయాడు.
అక్కడ తోటమాలి ఉన్నాడు కదా.
అంత అరుస్తుంటే తోటమాలికి వినిపించదా!
అంబికను ఆడించడానికి ఇందూ అలా కేకలువేస్తుంది అని అనుకుని నవ్వుకున్నా.
"వెళ్ళరా! వెళ్ళండి" అంది.
"అతడు నవ్వి నేను చెప్పానుగా ఇందూ అల్లరిపిల్ల అని. పద అలా ముందుకి వెళదాం" అన్నాడు.
అంబికకూడా లేచి అతని చెయ్యి పట్టుకుని ముందుకి వెళ్ళసాగింది.
"అన్నయ్యా! అన్నయ్య!" గొంతు చించుకుని వెర్రిగా అరవసాగింది ఇందూ.
జయరాం ఆలోచిస్తూ ముందుకి నడవసాగాడు. భర్తవైపు ఓరగా చూస్తూ తనలో తాను నవ్వుకోసాగింది.
"అన్నయ్య త్వరగా రా వీడు...వీడు...అబ్బా...ఆ..." అంటూ పిచ్చిగా కేకలు పెట్టింది.
జయరాం మనసు ఎందుకో కలుక్కుమంది.
నిజంగా పుస్తకం చదివే అలా వేస్తుందా ఆ కేకలు. నిజంగా దొంగ ఎవరైనా బంగళాలోకి ప్రవేశించాడా!
తోటమాలి వాళ్ళు అందరూ ఉన్నారే!
అతనికి మనసు ఒప్పటం లేదు. వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది. వెళితే భార్య నవ్వుతుంది అనిపిస్తుంది.
