2. ఇంద్ర సోములారా ! ఉషను ప్రకాశింప చేయండి. సూర్యుని జ్యోతిని లేవనెత్తండి. అంతరిక్షము ద్వారా ద్యులోకమును స్తంభింప చేయండి. మాత పృథ్విని ప్రసిద్ధుని చేయండి.
3. ఇంద్రసోములారా ! జలములను కట్టిపెట్టిన వృత్రుని వధించండి. ద్యులోకము మిమ్ము సంవర్థితులను చేసినది. నదుల జలములను ప్రోత్సహించండి. సాగరములను జలముతో నింపండి.
4. ఇంద్రసోములారా ! అపక్వమగు గోవుల చన్నులందు పక్వమగు దుగ్ధమును ప్రవేశపెట్టినారు. నానా వర్ణ గోవులందు తెల్లని పాలనే కల్పించినారు.
5. ఇంద్రసోములారా ! మాకు తరింపచేయగలది. సంతానయుక్తమైనది, శ్రవణయోగ్యమగు ధనమును వెంటే ప్రసాదించండి. మానవులకు హితకరము. శత్రు సేనను ఓడించగల బలమును వర్థిల్ల చేయండి.
డెబ్బది మూడవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత బృహస్పతి ఛందస్సు - త్రిష్టుప్.
1. బృహస్పతి పర్వతములను పగులకొట్టినాడు. సర్వప్రథముడుగా జన్మించినాడు. సత్యస్వరూపుడు. అంగిరుడు. యజ్ఞపాత్రుడు. ఉభయలోకములకు సులభముగా వెళ్లగలవాడు. ప్రదీప్త స్థానమున ఉండువాడు. అందరి పాలకుడు. అట్టి బృహస్పతి వర్షించువాడై ద్యావాపృథ్వులందు గర్జించును.
2. బృహస్పతి యజ్ఞమున స్తోతకు స్థానము కల్పించును. వృత్రాది అనివార్య అంధకారములను అంతము చేయును. యుద్ధమున శత్రువును గెలుచును. విద్వేషులను పరాభవించును. అసుర పురములను ఛిన్నాభిన్నము చేయును.
3. ఈ బృహస్పతియే అసురుల ధనము, గోవుల సహితముగా గోచరులను గెలిచినాడు. అప్రతిహతుడై యజ్ఞకర్మలను అనుభవించ కోరినాడు. స్వర్గ శత్రువులను అర్చన మంత్రములతో వధించినాడు.
డెబ్బది నాలుగవ సూక్తము
ఋషి - భరద్వాజుడు - దేవత - సోమ - రుద్రులు ఛందస్సు - త్రిష్టుప్.
1. సోమరుద్రులారా ! మాకు అసురబలము ప్రసాదించండి. సమస్త యజ్ఞములు మిమ్ము ప్రతిగృహమున వ్యాపింప చేయవలెను. మీ వద్ద సప్త రత్నములు ఉన్నవి. అందువలన మాకు మీరు సుఖకరులు కండి. ద్విపద, చతుష్పాత్తులకు కూడ కళ్యాణకరులు కండు.
2. సోమరుద్రులారా ! మా ఇంట ఉన్న అంటువ్యాధిని పారద్రోలండి. దారిద్ర్యమును అది పారిపోవునట్లు బాధించండి. మా వద్ద సుఖప్రదమగు అన్నము ఉండవలెను.
3. సోమరుద్రులారా ! మాకు ఆరోగ్యము కలుగుటకు ప్రసిద్ధ ఔషధములను మీ వద్ద ఉంచండి. మేము చేసిన పాపములు మమ్ము అంటిపెట్టుకొని ఉన్నవానిని దూరము చేయండి.
4. సోమరుద్రులారా ! మీవద్ద దీప్తమగు ధనుస్సు తీక్ష మగు శరములు ఉన్నవి. మీరు శాంతమగు సుఖమును ఇవ్వగలవారు. మాస్తోత్రములను ఆశించండి. మాకు అనేక ఇహసుఖములను ప్రసాదించండి. వరుణపాశముల నుండి విడిపించండి. మమ్ము రక్షించండి.
డెబ్బది అయిదవ సూక్తము
ఋషి - భరద్వాజ పాయుడు, దేవతలు - వేరు వేరు ఛందస్సు - వివిధము
1. యుద్ధము రగిలినది. రాజు లోహకవచము ధరించినాడు. సాగినాడు. అప్పుడతను సాక్షాత్తు మేఘమువలె కనిపించినాడు. రాజా ! గాయపడని దేహముతో విజయము సాధించుము. మహిమ కవచమువలె నిన్ను రక్షించవలెను.
2. మేము ధనుర్థారులము. ధనుస్సుతో గోవులను యుద్ధమున జయింతుము. శత్రు సేనలను వధింతుము. శత్రువు కోఱికలను ధనుస్సును భగ్నము చేయవలెను. ఈ ధనుస్సుతో సమస్త దిశలందుగల శత్రువులను జయింతుము.
3. ధనుస్సుయొక్క జ్యా (నారి) యుద్ధ వేళలందు యుద్దమును దాటింపకోరును. ఆకర్ణాంతము లాగినపుడు అది ప్రియవచనము చెప్పవచ్చినట్లనిపించును. భార్యభర్తను ఆలింగము చేసికొని మాట్లాడినట్లు ఈ జ్యా ధనుస్సును ఆలింగనము చేసికొని ధ్వనిచేయును.
4. రెండు తూణీరములు (అమ్ములపొదులు) అన్య మనస్క యువతివలె శత్రువును ఆక్రమించును. తల్లివలె పుత్రుని వంటి రాజును రక్షించును. అవి తమ విధులను చక్కగా ఎరుగును. వెళ్లునపుడు రాజును ద్వేషించు వారిని వధించును. శత్రువులను నరికివేయును.
5. ఈ తూణీరము అనేక శరములకు తండ్రి. ఇతనికి అనేక శరపుత్రులున్నారు. బాణము వెడలునపుడు తూణీరము 'త్రిశ్వ' ధ్వని చేయును. ఇది యోద్ధవీపుకు తగిలి ఉండును. యుద్ధకాలమున బాణములు ప్రసవించును. సమస్త సేనలను గెలుచును.
6. సారథి రథమున కూర్చుండును. 'తనముందరి గుఱ్ఱములను అదిలించును. కోరిన చోటికి రథమును చేర్చును. కళ్లెములు గుఱ్ఱముల మెడలకు తగిలి పృష్టము వరకు వ్యాపించి సారథికి అనుకూలముగా ఏర్పరచబడును. కళ్లెముల మహిమను స్తుతించండి.
7. గుఱ్ఱపు డెక్కల నుండి దుమ్ము లేచును. రథమునులాగును గుఱ్ఱము సకిలించును. అది పారిపోదు. శత్రువును డెక్కలతో తన్నును.
8. హవ్యము అగ్నిని పెంచును. అట్లే ఈ రాజు రథము మోయు ధనము అతనిని పెంపొందించవలెను. రథము మీద ఈ రాజు కవచము, అస్త్రములు మున్నగునవి ఉండును. మేము ఎల్లప్పుడు ప్రసన్న చిత్రమును సుఖదాయకమగు ఆ రథము వద్దకు వెళ్లుదుము.
9. రథరక్షకులు శక్తిమంతులు. గంభీరులు. విచిత్ర సేనాయుక్తులు. బాణబల సంపన్నులు. అహింసకులు. వీరులు. మహానులు. అనేకమంది శత్రువులను జయించ సమర్థులు; వారు శత్రువునకు సంబంధించిన రుచికరమగు అన్నమును నష్టపరతురు. స్వపక్షీయులకు అన్నదానము చేయుదురు. విపత్కాలమున వీరిని ఆశ్రయించవలసి వచ్చును.
10. బ్రాహ్మణులారా ! పితరులారా ! యాజ్ఞక సోమ సమార్జకులారా ! మమ్ము రక్షించండి. పాపరహితమగు ద్యావా పృథ్వులు మాకు సుఖకరములు కావలెను. పూష మమ్ము పాపము నుండి రక్షించవలెను. పాపియగు మా శత్రువు ప్రభుత్వము చేయరాదు.
11. బాణములకు ఈకలుండును. మృగ శృంగము దీని దంతములగును. ఇది గోచర్మ బద్ధము. ఇది ప్రేరణపొంది వాలును. నేతలు ఒక్కరుగాగాని, ఒక్కటిగాగాని సంచరించిన చోట బాణము మమ్ము రక్షించవలెను.
12. బాణమా ! మమ్ము వర్థిల్లచేయుము. మా శరీరము రాతివంటిది కావలెను. సోముడు మా పక్షమున వాదించవలెను. అదితి సుఖములను ఇవ్వవలెను.
13. కశా-(కొరడా)! మరింత జ్ఞానియైన సారథి నీతో గుఱ్ఱపు తొడలమీద పిరుదులమీద కొట్టును. సంగ్రామమందు నీవు అశ్వములను ప్రోత్సహింతువు.
14. హస్తధ్నము వింటినారి బాధను నివారించును. సర్పమువలె చేతిమణికట్టుకు చుట్టుకొనును. తెలియవలసిన వానిని తెలిసికొనును. పౌరుషశాలి అయి నలుదిశలను రక్షించును.
(వింటినారి బాధ కలుగకుండ చేతికి కట్టుకొను చర్మ విశేషము హస్తధ్నము)
15. విషసిక్తమయినది, అగ్రభాగము హింసకమైనది, సుఖము లోహమయమైనది, పర్జన్యుని నుండి ఉత్పన్నమైనట్టి విశాల బాణ దేవతకు నమస్కారము.
16. బాణమా ! నీవు మంత్రమున పదునైనావు. హింసానిపుణవు. నిన్ను లాగి విడువగనే శత్రువుమీద పడుము. ఒక్క శత్రువును సహితము ప్రాణములతో విడువకుము.
17. ముండిత కుమారులవలె ఏ యుద్ధమున బాణములుపడునో అందు బ్రహ్మస్పతి మాకు సుఖములను ఇవ్వవలెను. అతిధి సుఖములు అందించవలెను.
18. రాజా ! నీ శరీర మర్మ స్థానములను కవచముతో కప్పుచున్నావు. సోమప్రభువు నిన్ను అమృతమున ఆచ్చాదించవలెను. వరుణుడు నీకు శ్రేష్ఠ తమ సుఖము నీయవలెను. నీవు గెలిచినపుడు దేవతలు సంతోషించవలెను.
19. మా విషయమున ప్రసన్నుడు కానట్టి వేరుగా ఉండి మమ్ము వధించ గోరునట్టి కుటుంబినిని సకలదేవగణములు వధించవలెను. మాకు మంత్రమే బాణనివారక కవచము.
(దాశరథి రంగాచార్యవిరచిత ఆంధ్ర వచన ఋగ్వేద సంహితమున ఆరవ మండలము సమాప్తము)
