Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 2 పేజి 35


               జ్ఞానాందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం
               ఆధాంసర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే
       
                 ఆంధ్రవచన ఋగ్వేద సంహిత
                                        ఏడవ మండలము

 మొదటి అనువాకము మొదటి సూక్తము మండల ద్రష్ట వసిష్ఠునకు నమస్కారము.
 ఋషి - వసిష్ఠుడు, దేవత - అగ్ని, ఛందస్సు 1-18 విరాజి, మిగిలినవి త్రిష్టుప్.

    1. అగ్ని ప్రశస్తుడు. దూరస్థితుడు. గృహపతి. గతిశీలుడు. ఋత్విక్కులు అట్టి అగ్నిని రెండు చేతులలో కఱ్ఱలు పట్టుకొని అంగుళులతో చేసిన రాపిడి ద్వారా ఉత్పన్నము చేస్తారు.

    2. అగ్ని గృహమున నిత్యపూజనీయుడు. అన్నివిధముల భయముల నుండి రక్షించుటకుగాను అటువంటి అగ్నిని వసిష్ఠ గణములు గృహమునందు స్థాపించుకున్నారు.

    3. అగ్ని యువతముడు. అత్యంత సమృద్ధుడు. సంతత జ్వాలా సుందరుడు. అట్టి అగ్ని మాముందు ప్రదీప్తుడు కావలెను. అగ్నీ ! నీవద్ద అనంత అన్నము ఉన్నది.

    4. సుజన్ములగు ఋత్విక్కులు అగ్ని వద్ద కూర్చున్నారు. ఆ అగ్ని లౌకిక అగ్నులకన్న విశిష్ఠమైనది. అతడు అధిక దీప్తిమంతుడు. కళ్యాణవాహి. పుత్ర పౌత్రప్రదుడు. విశేష రూపమున దీపించువాడు.

    5. అగ్నీ ! నీవు శత్రుపరాభవ నిపుణుడవు. హింసక శత్రువు బాధింపలేనట్టి, కళ్యాణకరము, పుత్రపౌత్రాది సుందర సంతతియుక్త ధనమును స్తోత్రములు విని-మాకు ప్రసాదించుము.

    6. హవ్యయుక్త జుహువు, యువతి, రాత్రింబవళ్లు అగ్ని వద్దనే ఉంటుంది. తన దీప్తితో స్తోతలకు ధనము అభిలషించును. అగ్నివద్ద నిలుస్తుంది.

    (జుహువు అగ్నికి ఆజ్యాదులు అర్పించు చెక్కతో చేసిన గరిటివంటి చమసము) 

    7. అగ్నీ ! నీవు నీ తేజమున కఠోరశబ్దముచేసి రాక్షసులను దహింతువు. అట్టి తేజముననే సకల శత్రువుల కాల్చివేయుము. దేహతాపము దూరము చేయుము. వ్యాధిని నష్టపరచుము.

    8. అగ్నీ ! నీవు శ్రేష్ఠుడవు. శుభ్రుడవు. దీప్తుడవు. పావకుడవు. నిన్ను సమిద్ధుని చేయువానితో సమముగానే మా స్తోత్రములకు ప్రసన్నుడవగుము. ఈ యజ్ఞమున నిలువుము.

    9. అగ్నీ ! పితృ హితైషులు, మానవులు నిన్ను అనేక దేశములకు పంచినారు. వారితో సమముగనే మా స్తోత్రములకు ప్రసన్నుడవగుము. ఈ యజ్ఞమున నిలువుము.

    10. నా యొక్క శ్రేష్ఠ కర్మను స్తుతించువారు వీరులు, నేతలు అగుదురు. యుద్ధమున ఆసురీమాయను అణచి వేతురు.

    11. అగ్నీ ! మేము శూన్య గృహమున ఉండము. ఇతరుల ఇండ్లలో కూడ ఉండము. గృహహితైషి అగ్నీ ! మేము పుత్రశూన్యలము. గృహ రహితులము. నీ సేవచేయుచు మేము సంతాన సంపన్న గృహమున ఉండవలెను.

    12. ఏ యజ్ఞాశ్రయ గృహమునకు అగ్ని నిత్యము వేంచేయునో అట్టి పరిచారక యుక్తము సుందర సంతాన సహితము, ఔరస పుత్రులతో వర్థిల్లు గృహమును మాకు ప్రసాదించుము.

    13. మమ్ము అప్రీతికర రాక్షసులనుండి రక్షింపుము. అదాత, పాపి, హింసకుని నుండి రక్షించుము. మేము నీసాయమున సేనలను అభిలషించు వ్యక్తిని పరాజితుని చేయగలము.

    14. మా పుత్రుడు బలవంతుడు. ధృడహస్తుడు. అనంత అన్నవంతుడు. అతడు అక్షయస్తోత్రమున అగ్నిని సేవించును. ఆ అగ్నియే ఇతర అగ్నులను ఆవిర్భూతము చేయవలెను.

    15. యజ్ఞకర్తలయి ప్రబోధకులను హింసకులనుండి రక్షించువాడు. కులీన వీరగణములు సేవించువాడే అగ్ని అగును.

    16. అగ్నిని సమృద్దులు, హవిష్మంతులు దీపింప చేస్తారు. యజ్ఞమున దేవతలను ఆహ్వానిస్తారు. అట్టి అగ్నిని అనేక దేశములవారు ఆహ్వానింతురు.

    17. అగ్నీ ! మేము ధనపతులమై నిన్ను నిత్యము నుతింతుము. ఉక్థలతో యజింతుము. విశేష హవ్యము సమర్పింతుము.

    18. అగ్నీ ! దేవతలందరు మా శుభప్రదమగు హవ్యము కోరుదురు. నీవు ఈ అత్యంత కమనీయ హవ్యమును సర్వదా దేవతలకు చేర్చుము.

    19. అగ్నీ ! మమ్ము సంతానహీనులను చేయకుము. మాకు చెడిన బట్టలు ఇవ్వకుము. కుబుద్ధి ఇవ్వకుము. రాక్షసులచేత పడనీయకుము. సత్యవంత అగ్నీ ! మమ్ము గృహమునగాని అరణ్యమునగాని బాధించకుము.

    20. అగ్నీ ! మా అన్నమును చక్కగా సంస్కరింపుము. యాజకులకు అన్నము అందించుము. మేము ఇరువురము స్తోత, యజమానులను నీ దానమందు ఉండవలెను. నీవు అన్నివేళల మమ్ము స్వస్తి ద్వారా పాలింపుము "యూయం పాత స్వస్తిభిః సదానః"

    21. అగ్నీ ! నీవు శుభ ఆహ్వానవంతుడవు. రమణీయదర్శనుడవు. శుభంకర దీప్తితో ప్రజ్వరిల్లుము. మాకు సహాయకుడవగుము. ఔరస పుత్రుని దహించకుము. మానవహితైషులగు మా పుత్రులకు హాని కలుగరాదు.

    22. అగ్నీ ! మాకు సహాయకుడువు అగుము. ఋత్విక్కులచే సమిద్ధులయిన అగ్నిగణములతో మమ్ము సుఖములందు ఉంచి భరించుమని చెప్పుము.

    23. అగ్నీ ! నీవు చక్కని తేజోవంతుడవు. దేవతాత్మవు. నీకు హవ్యము సమర్పించువాడు మాత్రమే ధనవంతుడగును. ధనాభిలాషియగు స్తోత జ్ఞానార్థియై ఎవరి వద్దకు వెళ్లునో ఆ అగ్ని యజమానిని రక్షించును.

    24. అగ్నీ ! మేము చేయు మహా సంక్షేమ కార్యములు నీకు తెలియును. బలపుత్రా ! మేము నీ స్తోతలము. మాకు అక్షయము, పూర్ణాయుష్మంతము, పుత్ర పౌత్రాది సంపన్నయుతము, ప్రసన్నతమ అగు ధనమును ప్రసాదించుము.

    25. అగ్నీ మా అన్నమును చక్కగా సంస్కరింపుము. యాజకులకు అన్నము అందించుము. మేము ఇరువురము స్తోత యజమానులము నీ దానమునందు ఉండవలెను. నీవు అన్నివేళల మమ్ము స్వస్తి ద్వారా పాలింపుము.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత ఐదవ అష్టకము ఏడవ మండలము మొదటి అధ్యాయము సమాప్తము)


        ఓం వతామినన్తిమాయినో నధీరావ్రతా దేవానాం ప్రథమాద్రవాణి
        వరోదసీ అద్రుహా వేద్యాభిర్నపర్వతావి నమే తస్థివాంసః


                         రెండవ అధ్యాయము   రెండవ సూక్తము

     ఋషి - వసిష్టుడు, దేవత - తనూనపాదుడు అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్నీ ! నేడు మా సమిధలు స్వీకరించుము. యజ్ఞమునకు యోగ్యమగు పొగతో అత్యంత ప్రజ్వలితుడవగుము. తప్త జ్యావామాలతో అంతరిక్ష తటమును అంటుము. అక్కడ సూర్యకిరణములతో కలసిపొమ్ము.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS