7. మరుత్తులారా ! మీ రథము పాపరహితము. దానికి సారథిలేడు. స్తోత నడిపించును. అది అశ్వవ, భోజన, పాశ రహితమయ్యు, జలప్రేరకము, అభీష్టప్రదమై ద్యావాపృథ్వులు అంతరిక్షమున సంచరించును.
8. మరుత్తులారా ! మీరు యుద్ధమున రక్షించువానిని ప్రోత్సహించువాడు ఉండడు. హింసించువాడు ఉండడు. మీరు పుత్ర, పౌత్ర, గో, జల సంచయమున రక్షించువాడు యుద్ధమందు శత్రువుల గోసమూహములను చెదరగొట్టును.
9. అగ్నీ ! బలమున శత్రువులను అణచివేయువారును. భూమిని వడకించువారును. ధ్వనికారులు. బలశాలురగు మరుత్తులకు దర్శనీయ అన్నము ప్రసాదించుము.
10. మరుత్తులు యజ్ఞమువలె ప్రకాశమానులు. శీఘ్రగామి అగ్నిశిఖవలె దీప్తిమంతులు. పూజనీయులు. వారు శత్రువుల గడగడలాడించువారివలె వీరులు. దీప్తిశరీరయుక్తులు. అనభిభూతులు.
11. మరుత్తులు దీప్తిమంతులు. ఖడ్గయుక్తులు. రుద్రపుత్రులు. ఆ వర్ధమాన మరుత్తులనే నేను స్తోత్రములతో సేవింతును. స్తోతయొక్క నిర్మల స్తుతులు ఉగ్రములై మేఘమువలె మరుత్తుల బలమునకు సమానములు అగును.
అరువది ఏడవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - మైత్రావరుణులు, ఛందస్సు - త్రిష్టుప్.
1. మిత్రావరుణులారా ! మీరు సకల విశ్వమున శ్రేష్ఠులు. మిమ్ము స్తుతిద్వారా వర్థిల్ల చేయుచున్నాను. మీరు అసములు. చతుర శ్రేష్ఠులు. తాటితోవలె మీ భుజములతో మానవులను వెంటనడిపింతురు.
2. మిత్రావరుణులారా ! మా ఈ స్తుతి మిమ్ము ప్రచ్చాదితులను చేయును. హవ్య సహితముగా మీవద్దకు ఈ స్తుతియే చేరును. ఇదే మీ యజ్ఞమునకు చేరును. మాకు శీతాతప నివారకము అనభిభూతమగు గృహమును ఇవ్వండి.
3. ప్రియులగు మిత్రావరుణులారా ! అన్నము, స్తోత్రముతో ఆహూతులైరండి. పనిచేయ నియమించబడినవాడు, పనితో అన్నార్ధులగు వారిని కూర్చినట్లు మీరు మీ మహిమ ద్వారా కూర్చుడు.
4. మిత్రావరుణులు అశ్వమువంటి బలశాలురు. పవిత్ర స్తోత్రయుక్తులు. సత్యస్వరూపులు. వారిని అదితి గర్భమున దాల్చినది. జన్మించినంతనే మహానుల కన్న మహానులయినవారు. మానవహింసకులగు ఘాతకులు. మిత్రావరుణులను అదితి భరించినది.
5. పరస్పర ప్రీతియుక్తులై సమస్త దేవతలు మీ మహిమను కీర్తించినారు. బలవంతులయినారు. మీరు విశాల ద్యావాపృథ్వులను పరాభవించగలరు. మీ వెలుగు అహింసితము బహిరంగము.
6. మీరు నిత్యము బలవర్ధకులు అగుదురు. అంతరిక్షపు అత్యున్నత ప్రదేశము మేఘములేక సూర్యుని కొయ్యవలె గట్టిగా పట్టుకొనండి. మీరు బలపర్చిన మేఘము అంతరిక్షమున వ్యాపించును. విశ్వదేవతలు. సూర్యుడు మానవులు సమర్పించిన హవ్యమున తృప్తులై భూలోక ద్యులోకములందు వ్యాపిస్తారు.
7. సోమముతో కడుపునింపుకొనుటకు మీరు ప్రాజ్ఞవ్యక్తిని ఎంచుకుందురు. విశ్వజిత్తులగు మిత్రావరుణులారా ! ఋత్విక్కు యజ్ఞగృహము పూరించినపుడు మీరు జలము పంపుదురు. అప్పుడు నదులు, దిశలు దుమ్ముతో నిండవు, ఎండిపోకుండ, గాలిలేకుండ సంపన్నములగును.
8. ఘృతాన్నయుక్తులగు మిత్రావరుణులారా ! మేధావియగువాడు సదా తనవాక్కులతో మిమ్ము జలము కోఱును. యజ్ఞమునకు మీతో వచ్చువాడు మాయావికానట్లు మీ మహిమ సహితము కావలెను. హవ్యదాత పాపములను పోగొట్టండి.
9. మిత్రావరుణులారా ! మీరు నియమించిన మీకు ప్రియమైన కార్యములకు విఘ్నము కలిగించి వానిని మానవులు లేక దేవతలు స్తోతరహితుడైనవానిని కర్మ శీలుడయ్యు యజ్ఞరహితుడైన పుత్రవంతులు కాని వారిని నష్టపరచుడు.
10. మేధావులు స్తుతులు ఉచ్ఛరించునపుడు కొందఱు, కొందఱు స్తుతించి సూక్తపాఠము చేయునపుడు మేము మిమ్ము గూర్చి మంత్రములు పఠించినపుడు అప్పుడు మీరు మహిమాన్వితులై దేవతల వెంట వెళ్లకండి.
11. మిత్రావరుణులారా ! మీరు రక్షకులు. స్తుతులు ఉచ్చరించబడినప్పుడు సరళగామి, ఘర్షక, అభీష్టవర్షి సోమము యజ్ఞమునకు జత అయినపుడు మీరు గృహదానము చేయుటుకు వచ్చినపుడు మీరు దానముచేయు గృహము అవిచ్చినమగును. ఇది సత్యము.
అరువది ఎనిమిదవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రావిరణులు, ఛందస్సు - త్రిష్టుప్.
1. మహా ఇంద్రవరుణులారా ! యజమాని మనువువలె కుశలు పరచినాడు. అన్నము, సుఖము కొఱకు యజ్ఞము ప్రారంభించినాడు. నేడు మీ కొఱకు ఆ యజ్ఞమే ఋత్విక్కులచే సమర్పించబడుచున్నది.
2. మీరు శ్రేష్ఠులు. యజ్ఞమందు ధనదాతలు. వీరులలో అతిబలవంతులు. దాతలలో శ్రేష్ఠదాతలు. శూరులు. సత్యమున శత్రువును హింసించువారు. సకల ప్రకార సేవలు కలవారు.
3. ఇంద్రావరుణులు స్తుతి, బలము, సుఖములతో స్తుతించబడువారు. వారిలో ఒకరు ఇంద్రుడు వృత్రహంత. మరొకరు వరుణుడు ప్రజలను ఉపద్రవములనుంచి రక్షించుటకు బలశాలి అగువాడు.
4. ఇంద్రావరుణులారా ! మానవులలో స్త్రీ, పురుషులు, సమస్త దేవతలు స్వయముగా ఉద్యతులై మిమ్ము స్తుతులతో వర్థిల్ల చేసినపుడు మహిమాన్వితలు కండు. వారికి ప్రభువులు కండు. విస్తీర్ణ ద్యావాపృథ్వులారా ! మీరు వారికి ప్రభువులు కండు.
5. ఇంద్రావరుణులారా ! మీకు స్వయముగా హవి ఇచ్చు యజమాని దానశీలి, ధనవంతుడు, యజ్ఞశాలి అవుతాడు. అతడే దాత. జయమున సాధించిన అన్నముతో పాటు శత్రువు చేతనే గౌరవించబడును. అతనికి సంపన్నుడగు పుత్రుడు కలుగును.
6. ఇంద్రావరుణులారా ! మీరు హవ్యదాతకు ధనమును అనుగమించునదియు, అన్నశాలియునగు ధనము ప్రసాదింతురు. అది శత్రువుల దురాశయమును దూరము చేయును. అట్టి ధనమే మాకు లభించవలెను.
7. ఇంద్రావరుణులారా ! మేము మీ స్తోతలము. సురక్షితమగు ధనమును మాకు అందించండి. మా బలము యుద్ధమున శత్రువును అణచునట్టిది హింసకమై వెంటనే వారిని కీర్తిని తిరస్కరించునది కావలెను.
8. ఇంద్రావరుణులారా ! మీరు స్తుతులై మాకు మంచి అన్నమునకుగాను వెంటనే ధనము ఇవ్వండి. దేవతలారా ! మహామహులని మీ బలమును కీర్తించెదము. పడవతో ఏరు దాటినట్లు పాపములను దాటవలెను.
9. వరుణుడు మహిమాన్వితుడు. మహాకర్మి. ప్రజ్ఞాయుక్తుడు. కాంతి సంపన్నుడు. అజరుడు. విశాల ద్యావా పృథ్వులను భాసింప చేయువాడు. ఆ సామ్రాట్టు, విరాట్టు వరుణునిగూర్చి నేడు మనోహరములు, సర్వప్రకార బృహత్ స్తోత్రములను ఉచ్ఛరించండి.
10. ఇంద్రావరుణులారా ! మీరు సోమపానము చేయువారు. కావున ఇదిగో ఈ మాదక, అభిషుత సోమపానము చేయండి. దేవతల సోమపానమునకుగాను మీ రథము యజ్ఞమునకు నడిపించండి.
11. కోఱికలు తీర్చు ఇంద్రావరుణులారా ! మీరు మిక్కిలి తీయనిది, మనోరథపూరకమగు సోమమును పానము చేయండి. మీ కొఱకు మేము సోమరూప అన్నము ఏర్పరచినాము. కావున ఈ యజ్ఞమున ఆసీనులయి సోమము సేవించండి.
అరువది తొమ్మిదవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్ర విష్ణువులు ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇంద్రవిష్ణువులారా ! మిమ్ము స్తుతి, హవిద్వారా ప్రేరేపింతుము. ఈ కర్మ సమాప్తమైనంత మీరు యజ్ఞమును సేవించండి. ఉపద్రవశూన్య మార్గమున మమ్ము దాటించండి. మాకు ధనము ఇవ్వండి.
2. ఇంద్రవిష్ణువులారా ! మీరు స్తోత్ర జనకులు. కలశస్వరూపులు. సోమవిధాన విభూతులని స్తుతించు స్తోతలు మీకు లభించవలెను. స్తోతలగానము చేయు కీర్తనలు మీకు లభించునుగాత.
3. ఇంద్రవిష్ణువులారా ! మీరు సోమములకు అధిపతులు. ధనము ఇచ్చుచు సోమము ముందుకు విచ్చేయండి. స్తోతల స్తోత్రములు, ఉక్థలు మిమ్ము తేజస్సుతో వృద్ధిపరచవలెను.
4. ఇంద్రవిష్ణువులారా ! హింసాకారులను ఓడించునవి, మత్త అశ్వగణము మిమ్ము వహించవలెను. స్తోతల సకల స్తోత్రములను మీరు స్వీకరించండి. నా స్తోత్రములను, వచనములను కూడ వినండి.
5. ఇంద్రవిష్ణువులారా ! సోమమువలన కలిగిన మదము ఉత్సాహమున మీరు విస్తృతముగా పర్యటింతురు. మీరు అంతరిక్షమును విస్తృతపరచినారు. జగములను మేము జీవించుటకు ప్రసిద్ధము చేసినారు. మీ ఈ ఘనకార్యములన్నియు ప్రశంసనీయములు.
6. ఘృతాన్నయుక్తులగు ఇంద్రవిష్ణువులారా ! మీరు సోమమున వర్థిల్లుదురు. సోమపు అగ్రభాగమును సేవింతురు. నమస్కరించి యజమానులు మీకు హవ్యము ఇస్తారు. మీరు మాకు ధనము ఇవ్వండి. మీరు సముద్రసములు. మీరు సోమపుగనులు. కలశరూపులు.
7. దర్శనీయ ఇంద్రవిష్ణువులారా ! మత్తు కలిగించు ఈ సోమము త్రాగండి. కడుపునింపండి. మీ వద్దకు మదకర సోమరూప అన్నము చేరవలెను. నా స్తోత్రమును, ఆహ్వానమును వినండి.
8. ఇంద్రవిష్ణువులారా ! దిగ్విజయీభవ. మీరు పరాజయము ఎరుగనివారు. మీకు అసురులతో జరిగిన స్పర్ధత్రివిధము, లౌకికము, వేదము, వచనము. అవికాక అసంఖ్యాకములు. అట్లయ్యు మీరు పరాక్రమమున వారిని సాధించినారు.
డెబ్బదవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - ద్యావాపృథ్వులు ఛందస్సు - జగతి.
1. ద్యావాపృథ్వులారా ! మీరు జలవతులు. ప్రాణులకు ఆశ్రయభూతలు. విస్తీర్ణలు. ప్రసిద్ధలు. జలదోహనము చేయువారు. సురూపలు. వరుణుని ధారణతో పృథక్ రూపలు. నిత్యలు. బహుకర్ములు.
2.అసంగతలు, బహుధారావతులు, జలవతులు శుచికర్మలగు ద్యావాపృథ్వులు సుకృతము చేయువారికి జలము ఇస్తారు. ద్యావాపృథ్వులారా ! మీరు భువనములకు రాణులు. మాకు మనుష్యులకు హితము కలిగించు బలము ప్రసాదించండి.
3. సర్వ భువన నివాస భూతలగు ద్యావాపృథ్వులారా ! మీకు సరళ గమనమునకుగాను హవిస్సులు అందించు వ్యక్తి సిద్ధమనోరథుడగును. సంతానముతో వృద్ధిచెందును. కర్మల మీద మీరు చల్లని రేతస్సు నానారూపమగును. అది సమాన కర్మల ఉత్పత్తి కారకమగును.
4. ద్యావాపృథ్వులు జలముచే కప్పబడినవి. జలమును ఆశ్రయించునవి. అవి నీటిలో మునిగి తేలునవి. జలవర్ష విదాయినులు. విస్తృతలు. ప్రసిద్ధలు. యజ్ఞపురస్కృతలు. యజ్ఞమునందు విద్వాంసులు ద్యావాపృథ్వులను సుఖములు యాచింతురు.
5. ద్యావాపృథ్వులు జలాక్షరణలు. జలదోహలు. జలకర్మలు. వారు మాకు యజ్ఞము, ధనము, యశము, అన్నము, బలము ఇచ్చువారు. మమ్ము మేఘముతో తడుపవలెను.
6. పితా ద్యులోకమా ! మాతా పృథ్వీ ! మాకు అన్నము అందించండి. లోకములను ఎరుగువారు. సుకర్మలు, పరస్పర రమమాణలు, అందరికి సుఖములనిచ్చు ద్యావాపృథ్వులు మాకు పుత్రాదిబలము, అన్నము ఇవ్వవలెను.
డెబ్బది ఒకటవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - సవిత ఛందస్సు 1-3 జగతి, మిగిలినవి త్రిష్టుప్.
1. సుకృత సవిత దానము చేయుటకుగాను తన బంగారు చేతులను పైకిలేపును. సవిత విశాలుడు. తరుణుడు. విద్వాంసుడు. జగద్రక్షణకుగాను తన రెండు జలబావులను ప్రేరేపించును.
2. ఆ సవిత ఉత్పత్తి కార్యము, ప్రశస్త ధనదానము విషయమునను మేము సమర్థులము కావలెను. సవితా ! జగములందలి సమస్త ద్విపద చతుష్పాత్తుల స్థితి, ఉత్పత్తి విషయమున సమర్థుడవు.
3. సవితా ! నీ తేజము అహింసితము సుఖావహము. ఆ తేజమున మా గృహములను రక్షించును. నీ వాక్కు హిరణ్యము. మాకు నవసుఖములను ఇమ్ము. మమ్ము రక్షింపుము. మాకు కీడు చేయువారు ప్రభుత్వము చేయరాదు.
4. సవిత శాంత మనస్కుడు. హిరణ్యహస్తుడు. హిరణ్యహనువు. (దవడలు కలవాడు.) కీర్తిశాలి. మనోహరుడు. మధురవాక్కు. అతడు రాత్రి చివరను మేల్కొనవలెను. అతడు హవ్యదాతకు కోఱినంత అన్నము అందించవలెను.
5. సవిత వక్తవలె హిరణ్మయ, శుభంకర బాహువులను ఎత్తవలెను. అతడు భూమి నుండి ద్యులోకపు ఉన్నత ప్రదేశమునకు ప్రాకును. గతిశీలములగు మహా పదార్థములన్నింటిని సవిత ప్రసన్నములను చేయును.
6. సవితా ! మాకు నేడు ధనము ఇమ్ము. రేపు ఇమ్ము. నిత్యము ఇమ్ము. నీవు నివాసభూతమగు విశేష ధనదాతవు. కావున ఈ స్తుతితోనే మేము ధనము పొందెదము.
డెబ్బది రెండవ సూక్తము
ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రసోములు ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇంద్రసోములారా ! మీ మహిమ అపారము. గొప్పది మీరు గొప్పవారు, ముఖ్యములగు భూతములను సృష్టించినారు. మీరు సూర్యుని, జలమును సాధించినారు. సకల అంధకారములను, నిందకులను వధించినారు.
