Previous Page Next Page 
హౌస్ సర్జన్ పేజి 32


    అంతా అంటారు  గవర్నమెంటు  ఆసుపత్రులు  నరకానికి  దారులని. అక్కడక్కడ  నరకమని  అనిపిస్తే  అనిపించవచ్చుగాక. "సర్వీస్ టు హ్యుమానిటీ" కూడా  అక్కడే  కనబడుతుంది.

    పొరపాట్లు  చేయటం  మానవసహజం. నేను తప్పులు  చేసిన  సందర్భాలు లేకపోలేదు. ఒక రాత్రి  ఎన్ కెఫలైటిస్  కేసొకటి  సీరియస్ గా వుంటే  వార్డులోనే  వుండిపోవాల్సి  వచ్చింది. ఆ రోజు  వంట్లో  ఏం బాగుండలేదు. కొద్దిగా జ్వరమూ, తలనొప్పిగా కూడా వుంది. కేసుకు  రెండు మూడుసార్లు  అటెండ్  అయివచ్చి  బల్లమీద  తల ఆన్చి  కుర్చీలో  కూర్చున్నాను. స్టాఫ్ సిస్టర్ ప్రక్క గదిలో  కూర్చునే  నిద్రపోతున్నారు. నాకు ఎంతో మగతగా  వుండి కళ్ళు  మూసుకోగానే  నిద్రపట్టేసింది. బహుశా అంత మంచి  నిద్ర వార్డులో  కూర్చుని  ఎప్పుడూ  పోయి వుండను. "బాబీ బాబూ !" అని ఎవరో  పిలుస్తూంటే  మెలకువ  వచ్చింది. అతి కష్టంమీద కళ్ళు  తెరిచి  చూసేసరికి  ఆ మసక  వెల్తురులో  ఓ స్త్రీ మూర్తి గోచరించింది.

    "మా పిల్లకు  ఎక్కువగా  వుంది, బాబుగారూ !" దీనంగా  అర్ధించిందామె.

    నా శరీరం పూర్తి విశ్రాంతి  కోరుతోంది. లేచి పని  చేయటానికి  యిష్టపడటం  లేదు. అయినా  ఎలాగో లేచి నిల్చుని "పద" అని  ఆమె వెంట  బయల్దేరాను.

    అది రాజేశ్వరి చూస్తూన్న  జాండిస్ కేసు. ఆ నిద్రమత్తులో  ఏం చూశానో, ఏమి పరీక్ష చేశానో నాకు  తెలియదుగాని, సీరియస్ గా  వున్నట్లు  నాకేం  కనిపించలేదు. "ఏం పర్వాలేదు లేమ్మా. బాగానే  వుంది" అని  అక్కణ్నుంచి  వచ్చేసి కుర్చీలో  కూలబడ్డాను.

        ఆ స్త్రీ నా వెంటనే  వచ్చింది. "సరిగ్గా  చూడండి డాక్టరుగారూ! నాకు చాలా భయంగా  వుందండి" అని అక్కణ్నుంచి  కదలకుండా  ప్రాధేయపడటం  మొదలు పెట్టింది.

    నాకు కళ్ళు  మూతలు పడిపోతున్నాయి. జ్వర  తీవ్రతకూడా ఎక్కువగానే  వున్నట్లుంది. "మరేం కొంప మునగదులే, వెళ్ళవమ్మా" అని కసిరాను.

    ఆమె నా వంక  ఒక నిమిషం  ఆ నిమిషంగా  చూసి  "కొంప మునిగితే  మాత్రం  చేసేదేముందీ ?" అని పమిటి  చెంగుతో  కళ్ళు  తుడుచుకుంటూ  అక్కణ్నుంచి వెళ్ళిపోయింది.

    నేను అదిరిపడి  ఆమె వెళ్ళినవైపే  చూస్తూ  కూర్చుండిపోయాను. విసుగుదలతో  అన్న  ఆ మాటకు  అంత పెడర్ధం  తీస్తుందనుకోలేదు.

    నాలో  రేగిన  అహంభావం  ఆత్మపరిశీలనకు  అవకాశమివ్వలేదు. 'మూర్ఖురాలు' అనుకుంటూ  తిరిగి మత్తులో  పడిపోయాను.

    తెల్లవారాక  ఆ కేసును  గురించి  మరిచిపోయి  క్వార్టర్స్ కు  వెళ్ళిపోయాను. ఆ పూట హాస్పిటల్ కు రావటం  మానేసి  సెలవు పెట్టేద్దామా అనిపించింది. కాని హౌస్ సర్జన్సీ  మొదలైనప్పటినుంచి  ఒకనాడు కూడా సెలవు పెట్టలేదు. అదీగాక  స్నానం చేసి వేడి వేడి కాఫీ  త్రాగాక ,వంట్లో  బాగానే వున్నట్లనిపించేది. మామూలుగా  ఎనిమిది గంటలకు  బట్టలేసుకుని  వార్డుకి  వెళ్ళిపోయాను.

    అప్పుడు గుర్తువచ్చింది, జాండిస్ కేసు  విషయం. గబగబ ఆ బెడ్ దగ్గరకు వెళ్ళి  చూశాను. ప్రక్క  ఖాళీగా వుంది.

    గుండె  ఎవరో  చిదిపినట్లయింది. పీడకల  వెక్కిరించినట్లయింది. "ఈ బెడ్ మీద పాపాయి ఏమయిపోయింది ?" అనడిగాను  ప్రక్కనున్న వారిని, వొణికే  గొంతుతో.

    "ఏడు గంటలకు  చనిపోయిందండీ. వెంటనే  తీసుకెళ్ళిపోయినారు."

    జవాబు ముందుగానే  ఊహించగలిగాను.

    కళ్ళముందు  చీకటి తెరలు  రెపరెప లాడుతున్నాయి. రాత్రి నేను అశ్రద్ధచేయక, బుద్ధికుశలత  ఉపయోగించి ఆ పాపని చూస్తే  బ్రతికి వుండేదా ? అసలు రాత్రి వార్డుకి  నేను రానవసరం  లేదు. నా ఆసక్తి కొద్దీ  వచ్చాను. నేను రాకపోతే యీ సమస్య  ఉత్పన్నమయేది కాదు  గదా. డ్యూటీ హౌస్ సర్జన్ కు  కబురు  చేసేవారు. వాళ్ళ తిప్పలు  వాళ్ళు పడేవారు.

    ఇలా  ఎన్నో  ఊహలు  చెలరేగాయి. నా ఊహలకు  నాకే  అసహ్యం వేసింది. ఈ విశాల విశ్వంలో ,నేనెంత అల్పజీవినో  అప్పుడు బోధ పడినట్టయింది. నా పశ్చాత్తాపానికి  అవధులులేవు.

    పిల్లల వార్డులో  పని చేస్తున్నప్పుడే  మరో చిత్రమైన  సంఘటన జరిగింది. నారాయణ అతని  గదికి  రమ్మని ఎప్పుడూ  బలవంతం  చేసేవాడు. అతనా క్వార్టర్స్ లో  వుండటంలేదు. బయటెక్కడో  వుండేవాడు.

    ఒకరోజు  ఉదయం  "యీ వేళ  సాయంత్రం  గదికి వస్తాను" అని చెప్పాను.

    అతను నవ్వి ,తన గది ఎక్కడవుందో  గుర్తులు చెప్పి  "తప్పకుండా  రండి. సాయంత్రం ఆరుగంటలకు  మీ కోసం ఎదురుచూస్తూ వుంటాను. అయితే నా రూమ్ కనుక్కోవటం  చాలా కష్టమండోయ్, ఆ సందులన్నీ  చాలా  గజిబిజిగా  వుంటాయి .ఏమాత్రం  దారితప్పినా  లొకాలిటీ  మారి డేంజరస్ లో  పడతారు" అన్నాడు.

    "పర్వాలేదు లెండి. గుర్తులు  చెప్పారుగా. కనుక్కుంటాను" అన్నాను ధీమాగా.

    ఆ సాయంత్రం  వార్డులోకి  వెళ్ళేసరికి, మామూలుకంటే  కొంచెం ఎక్కువ పని  తగిలింది. హాస్పిటల్ గేటుదాటి బయటకు వచ్చేసరికి  చీకటి పడిపోయింది .అప్పుడు హడావిడిగా  నారాయణ గదికి  నడుస్తూ  బయల్దేరాను .ఎందుకో  రిక్షా ఎక్కాలనిపించలేదు.

    అతను  చెప్పిన  మూడు లైట్ల  జంక్షన్ దాటి  కొంచెం దూరం పోయాక ఎటు పోవాలో  పోల్చుకోలేకపోయాను. అతను  చేబుతూన్నప్పుడు  అర్ధమయినట్టే  అనిపించింది  గాని, ఆ వంకరదారులూ  అవీ  చూస్తే ఏమీ బోధపడటంలేదు. ఆ వాడకట్టు  నాకు మరీ క్రొత్త .ఎప్పుడూ  అటుకేసి పోలేదు.

    ఆలోచిస్తూ  ఓ సందుగుండా  నడుస్తున్నాను. వీధి దీపాలున్న  చోట మినహాయించి  బాగా చీకటిగా  వుంది ఆ సందు. ఓ పెంకుటింటి ముందుకు  వచ్చి ఆగాను. ప్రక్కన  మూడంతస్తుల మేడా ,అదీ చూస్తే  అతను చెప్పిన యిల్లు అదే అనిపించింది.

    ఇంటి గుమ్మంలో  ఓ స్త్రీ  నిలబడి  వుంది. చీకటిగా  వుండబట్టి  ఆమె ముఖం  సరిగ్గా  కనబడటం లేదు.

    ఒకటి రెండు నిమిషాలు  అలాగే  తటపటాయిస్తూ  నిలబడ్డాను. నేనట్లా సంకోచిస్తూ  ఎదురుగా  నిలబడటం  చూస్తే  ఆమె ఏమైనా  అనుకోవచ్చునని  కూడా  నాకు స్పురించలేదు.

    ఆమె కళ్ళు మాత్రం  నావంక పరీక్షగా  చూస్తున్నట్లు  కనిపిస్తున్నాయి.

    చివరకు  తెగించి  "ఇక్కడ  నారాయణ అనే డాక్టరుగారు  వుంటున్నారాండి ?"  అని అడిగాను, చొరవ చేసుకుని.
    "ఉన్నారు. రండి" అని ఆమె లోపలకు  నడిచింది.

    "హమ్మయ్య ! బ్రతికాను" అని సంతోషిస్తూ  ఆమె వెంట  లోపలకు నడిచాను. లోపల గదిలో  దీపం వెలుగుతోంది.

    "ఏం ? నారాయణ అనేవారెవ్వరూ  యిక్కడ  లేకపోతే లోపలకు రాకూడదా ?" అంది. హఠాత్తుగా వెనక్కి తిరిగి నవ్వుతూ, ఆ స్త్రీ.    

    ఆమె ధరించిన  వస్త్రాల  తీరు ,తల్లో  పువ్వులు ,తాంబూలం వేసుకున్న  పెదవులు, ఆమె వంటిమీద  నుంచి  వీస్తూన్న  గులాబీ సెంటు వాసన, ప్రక్క గదిలో  అగరొత్తుల పొగ, దాని  తాలూకు మృదుసుగంధం. అక్కడి పందిరి మంచం ,దాని మీద  మాసిన తెల్లని  దుప్పటి, టేస్ట్ తెలియని  మనిషి  తగిలించుకున్నట్లు  గోడలకున్న  పటాలు  చూడగానే  ఆమె ఎవరో, ఏ తరగతి  స్త్రీయో  వెంటనే  బోధపడింది.

    అనుకోకుండా  ఆమె వంక  పరిశీలించి  చూశాను. ఇదివరకెప్పుడో చూసినట్లనిపించింది.

    "ఎవరి పేరో  చెప్పి  వంకపెట్టకపోతే. లోపలికి  రావచ్చుగా  అని అడగకూడదా ?" అంది మళ్ళీ, నవ్వుతూనే.
 
    నేను కలవరపాటును  అణుచుకుంటూ  "క్షమించండి. మీరు పొరబడు తున్నారు. నా కలాంటి  ఉద్దేశం ఏమీలేదు" అన్నాను. నిజంగా  నాకు చాలా భయంవేసింది. అలాంటి ఇళ్ళలో  ఇదివరకెన్నడూ  ప్రవేశించలేదు.

    ఆమె ఒక అడుగు  ముందుకువచ్చి ,నాకు  దగ్గరగా  నిల్చుంది. దూరం నుంచి  అంత ఖాళీగా  కనిపించిన  ఆ స్త్రీ నాకు  అంత  సమీపంలోకి  రాగానే, సన్నగా ,బొమ్మలా  కనిపించింది. నేను ఎంతో  భారీగా, ఎత్తుగా  పెరిగిపోయినట్లనిపించింది.

    "నన్ను  గుర్తుపట్టలేదా  డాక్టరుగారూ !" ఆమె కంఠం  మందంగా  వినిపించింది. ఉలిక్కిపడి  చూశాను.

    "నా రెండేళ్ళ  కూతుర్ని  చిన్నపిల్లల  వార్డులో  చేర్పించాను, ఇరవై రోజుల క్రిందట. వారంరోజులు  హాస్పిటల్ నే  వున్నాను. దాని పరిస్థితి చూస్తే  పిల్ల  బ్రతుకుతుందా  అని ఏ కోశానా  ఆశలేదు  నాకు. కాని మీరే బ్రతికించారు  పెద్ద డాక్టర్లేం  చేశారు ? ఊరికినే  వచ్చి  ఓ నిమిషం  చూసి ఏవేవో మందులు  ఇమ్మని  చెప్పి  వెళ్ళిపోయేవారు. కాని అంతా మీరేచేశారు. రాత్రింబవళ్ళు  కష్టపడి  ఎంతో  ఆత్మీయుడిలా  సపర్యలు  చేశారు. మీ కృషి వల్లే  పాప జీవించింది." ఆమె కంఠం  ఎంతో  ఆవేశంగా  పలుకుతోంది.

    అప్పుడు  గుర్తు వచ్చింది ఆమె  పిల్లకు  యు.ఆర్.ఐ. అప్పర్ రెస్పిరేటరీ యిన్ ఫెక్షన్, బ్రతకదనుకున్నాం  మొదట.

    "మీరేమిటో, మీ పని  ఏమిటో  తప్ప  తలఎత్తి  చూసేవారు కాదు .మీరూ  యిలాంటి...." మాట  పూర్తిచేయకుండా  నా చెయ్యి  తన చేతిలోకి  తీసుకుని  వ్రేళ్ళు  సవరిస్తోంది.

    మెదలకుండా  చూస్తున్నాను.

    "రండి మీరు నాకు చిల్లి  గవ్వయినా  యివ్వక్కర్లేదు, ఈ రాత్రంతా  గడిపి, తెల్లవారుఝామునే  వెళ్ళిపోండి" ఆమె  నా చెయ్యిపట్టి  లాగినట్లయింది.

    "అలాకాదు.చూడండీ" అని ఆమె  చేతినుండి  నా చెయ్యి  మృదువుగా  విడిపించుకున్నాను. "మీరు నన్ను  సరిగ్గా  అర్ధంచేసుకోలేదు. డాక్టరు  మిత్రుణ్ని కలుసుకుందామని  వచ్చి, దారి తప్పి మీ ఇంటికి  వచ్చాను. వేరే తలపు  ఏమిలేదు. శ్రమ యిచ్చాను, క్షమించండి  వస్తాను" అని అక్కణ్నుంచి  కదలబోయాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS