Previous Page Next Page 
రాజ హంస పేజి 33

 

    "దిలీప్ ! దిలీప్ ! మన ఇద్దరి మధ్యా ఎలాంటి ఎడబాటు రాకూడదు . మనిద్దరి మధ్యా ఎవరికీ చోటుండకూడదు."
    అతని చేతిని చెక్కిలి కానించుకుని కనులు మూసుకుని మౌనంగా వుండిపోయింది.

        
                                                         18

    పాండురంగ హాస్పిటల్లో అనీల్ బెడ్ ప్రక్కన కూర్చుని వున్నాడు.
    బెడ్ మీద అనీల్ అపస్మారక స్థితిలో పడి వున్నాడు.
    తన తల్లి చనిపోయి రెండేళ్ళయింది. అప్పట్నుంచీ పని మనిషి సాయంతో అనీల్ ని చాలా జాగ్రత్తగా పెంచుకున్నాడు. ఇంతలో ఈ ఉపద్రవ మొచ్చింది.
    డాక్టర్లూ, చాలా శ్రద్దగా చూస్తున్నారు. లక్షణాలను బట్టి రిపోర్ట్స్ ని బట్టి మొదట మెనింజైటిస్ అనుకున్నారు. రోజు రోజుకూ పరిస్థితి దిగజారుతుంది గాని ఇంప్రూవ్ మెంట్ కనబడటం లేదు.
    నిద్రా విశ్రాంతి లేకపోవటం వల్ల ముఖం పీక్కుపోయి, కళ్ళు ఎర్రబడి వున్నాయి.
    ఓ అరగంట గడిచాక డాక్టరు లోపలి కొచ్చారు. పాండురంగ లేచి నిలుచున్నాడు.
    "మిస్టర్ పాండురంగా మీతో కొంచెం మాట్లాడాలి" అన్నాడు డాక్టర్.
    "చెప్పండి సర్"
    "అనీల్ కేసు డయాగ్నోసిస్ సరిగ్గా కుదరటం లేదు. ఈ ఊళ్ళో సి.టి. స్కానింగ్ లేదు. ఒకవేళ స్కానింగ్ లో ఇంకేదయినా కంప్లికేషన్ బయటపడినా ట్రీట్ మెంట్ ఇవ్వటానికి సమర్ధుడైన న్యూరోఫిజిషియన్ గాని, న్యూరో సర్జన్ గానీ లేరు. అనీల్ ని వెంటనే మద్రాసు తీసుకెళితే బావుటుంది."
    పరోక్షంగా "ఇక్కడ ఇంతకంటే చెయ్యగలిగింది లేదు" అని చెప్పేశాడు.
    పాండురంగ ముఖంలో నెత్తురు చుక్కలేదు.
    దగ్గరున్న డబ్బంతా అయిపొయింది. చేతిలో చిల్లి గవ్వ లేదు.
    డాక్టరు బయటికెళ్ళిపోయాడు.
    పాండురంగ నీరసంగా వున్నట్టనిపించి మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు.
    ఏం చెయ్యాలి?
    మద్రాసు వెడితే అక్కడ పెద్ద పెద్ద హస్పిటల్సూ ఫీజులు, రకరకాల టెస్టులూ....వేలకు వేలయిపోతుంది. వాళ్ళ మాటల్ని బట్టి బ్రెయిన్ ట్యూమరుందేమోనని అనుమానిస్తున్నట్లుగా వుంది. ఒకవేళ అదే నిజమైతే ఆపరేషన్ అవసరమైతే....
    ఇదంతా....
    అలా ఆలోచిస్తూ అనీల్ ను విధికి వదిలెయ్యటమేనా?
    బయట అడుగుల చప్పుడ యింది. గదిలో కెవరో ప్రవేశించారు. ఆలోచనలో వుండి అతను గమనించలేదు.
    "ఎక్స్ క్యుజ్ మీ సర్" ఠీవిగా , సౌమ్యంగా వున్న గొంతు.
    ఉలికిపడి తలెత్తి చూశాడు.
    ఇంచుమించు తన వయసే వున్న యువకుడు, ప్యాంటూ టీ షర్టూ వేసుకుని చేతిలో బ్రీఫ్ కేసుతో హుందాగా నిలబడి వున్నాడు.
    "నేను....."
    "తెలుసు" అన్నాడు పాండురంగ.
    "జరిగినదంతా తెలుసుకున్నాను. డాక్టరు గారితో మాట్లాడాను, బ్రెయిన్ ట్యూమర్ ససిపెక్టు చేస్తున్నారు. తొంబయి వంతులు మేలిగ్నేన్సీ కాకుండా ట్యూమర్ అయి వుండవచ్చు నంటున్నారు. అలా అయితే ఆపరేషన్ చేస్తే తప్పకుండా కేసు సక్సెసవుతుందట."
    అతనేందు కిక్కడి కొచ్చాడో , ఎందుకీదంతా చెబుతున్నాడో పాండురంగ కర్ధం కావటం లేదు.
    అతను బ్రీఫ్ కేస్ అక్కడున్న చిన్న టేబుల్ మీద వుంచి, ఓపెన్ చేసి అందులో నుంచి కొన్ని నోట్ల కట్టలు బయటకు తీశాడు.
    "యాభయి వేలు యివి వుంచండి. అనీల్ ను వెంటనే టాక్సీలో మద్రాస్ తీసుకెళ్ళండి. అక్కడున్న పెద్ద న్యూరో సర్జన్ దగ్గరకు.....
    "క్షమించండి మీ సహాయం స్వేకరించలేను?"
    అతను పాండురంగ భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అన్నాడు . "దయవుంచి నిరాకరించకండి. ఇది మీకు నాకూ సంబంధించిన విషయం కాదు. అనీల్ సమస్య ప్లీజ్....
    పాండురంగ అతని ముఖంలోకి కొన్ని సెకండ్ల పాటు తదేకంగా చూశాడు.
    కళ్ళలో కనిపించీ కనిపించనట్టు కొంచెం తడి.
    "థాంక్స్" అంటూ ఆ డబ్బు అందుకున్నాడు.
    'చూడండి డబ్బు మరికొంత అవసరమైతే సందేహకించకండి. ఈ విజిటింగ్ కార్డులో నా హైదరాబాద్ ఆఫీసు అడ్రస్ ఫోన్ నెంబర్లు వున్నాయి. రేపట్నుంచీ పది రోజుల దాకా హైదరాబాద్ లో వుంటాను. ఒకవేళ నేను పోయినా మా మేనేజర్ కు ఇన్ స్ట్రక్షన్స్ యిచ్చి వెడతాను. అతను ఎరేంజ్ చేస్తాడు."
    మరోసారి పాండురంగ భుజం మీదచేయ్యి వేసి ఆప్యాయంగా నిమిరి, తర్వాత బ్రీఫ్ కేస్ తీసుకుని బయట కెళ్ళిపోయాడు.


                                                          *    *    *

    తన అపార్టు మెంట్ లో దిలీప్ సోఫాలో వెనక్కి వాలి కూర్చుని వున్నాడు. అతని కెదురుగా వున్నా సోఫాలో ఊర్వశి కూర్చుని వుంది.
    ఈ ఊళ్ళో అతనికి నెలకయిదారు రోజుల కన్నా ఎక్కువ పని వుండదు. అయినా తన ఆఫీసు పనులకూ, అవార్డులు వుంచుకోవటానికి తనతో పని వున్న వాళ్ళు వచ్చి కలుసుకోటానికి తేలిగ్గా వుంటుందని , హోటల్లో దిగకుండా యిక్కడే వుంటాడు!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS