"నో, నేను కఠినంగా వుండాలి. కఠినాతి కఠినంగా వుండాలి. రాక్షసి అనుకుంటే అనుకోనియ్ తప్పదు.
"చూడండీ" అంది. ఆమె గొంతులో చిన్న వణుకు న్నా , సౌమ్యంగానే వుంది.
"ఓ కొత్త జీవితం ఎన్నుకుని, కోరుకుని యిందులోకి ప్రవేశించాను. అది చాలా దృడమైన నిర్ణయం. ఆ క్షణాన్నే నా గతాన్ని చంపేసుకున్నాను. అ అధ్యాయం , అందులో వున్న వ్యక్తులూ, నా తల్లీ తండ్రీ కుటుంబ సభ్యులూ, భర్తా, కుమారుడూ - కాలగర్భంలో కలిపేశాను. ఏ కారణంతోనైనా , ఏ రూపంలో నైనా తిరిగి అందులో అడుగుపెట్టే ప్రసక్తి లేదు. ప్లీజ్ వెళ్ళిపొండి.
"గతంలో అడుగు పెట్టమనీ మళ్ళీ అక్కడ ఓ పాత్ర నిర్వహించమనీ నిన్ను కోరడం లేదు రాజహంసా. గతాన్ని వోదులుకుని యివతలికి రాగలం గానీ, గతాన్ని మరిచిపోగలం గానీ, దాని తాలూకు వ్యక్తులున్నంతవరకూ ఆ నిజం తుడిచి పెట్టుకుపోదు. అనిల్ నీ కుమారుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా , గుర్తుంచుకున్నలేకపోయినా ఆ వాస్తవం చెరిగిపోదు. వాడి కండిషన్ యిప్పుడు సీరియస్ గావుంది కాబట్టి చెప్పటం నా బాధ్యతగా భావించి వచ్చాను.
"నో , మీరు వెళ్ళిపొండి."
"రాజహంసా మన నిర్ణయాలకూ, వ్యక్తిత్వాలకు మించినది ఒకటుంది. మానవతా దృక్పధం. నువ్వు తల్లివి ఈ మాతృత్వం అనేది ప్రేమ, స్వార్ధం, సొంత మార్గం - వీటన్నిటికన్నా గొప్పది"
"నో, నాకవెం చెప్పవద్దు. మీరిక్కడ నుంచి వెంటనే వెళ్ళిపొండి."
"రాజహంసా!"
"ఐసే యూ.....గెటవుట్."
అతనామే ముఖంలోకి రెండు క్షణాల పాటు తదేకంగా చూశాడు. ఆ చూపులో ఏ భావమూ లేదు. తర్వాత లేచి వెళ్ళిపోయాడు.
"నేను....నేను....నేనింత కఠినంగా...."
రరెండు చేతుల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
గుండెల్లో సన్నని మంట బయల్దేరింది. మంటో నొప్పో తెలీటం లేదు. భరించలేక వక్షస్థలం మీద చెయ్యి వేసి గట్టిగా అదుముకుంది.
గుండె వేగం , శబ్దం చేతికి తెలుస్తుంది.
"ఆ.....ఆ....ఆ......నీల్"
కళ్ళముందు చీకటి నల్లగా వ్యాపిస్తోంది.
డోర్ లాక్ చేద్దామని అడుగు ముందుకు వెయ్యబోయింది. కాళ్ళు కదలటానికి నిరాకరిస్తున్నాయి. శక్తి చాలటం లేదు.
చీకటి ఎక్కువవుతోంది.
అలా.....కొద్ది క్షణాలు గడిచాక ఫేయింటాయి పడిపోయింది.
* * *
కళ్ళు తెరిచేసరికి బెడ్ మీద పడుకుని వుంది. ప్రక్కనే దిలీప్.
చేయి చాపి అతని చేతిని పట్టుకుని , దగ్గరకు లాక్కుని వక్షస్థలానికి అదుముకుంది.
"రాజా! ఎలా వుంది?" అతని కంఠంలో మృదుత్వంతో బాటు చాలా ఆత్రుత.
"ఎప్పుడొచ్చారు ?" ఆమె గొంతు బలహీనంగా వుంది.
"పది నిముషాలయింది. వచ్చేసరికి నేలమీద స్పృహ లేకుండా పడి వున్నావు."
"నన్నెత్తుకుని ఇక్కడికి తీసుకొచ్చారా?" అంటూ అతని ముఖంలోకి చూసింది.
"నేనేంటే ఎందుకింత ప్రేమ మీకు?"
"రాజా! కారణం చెప్పగలిగేది ప్రేమ కాదు."
అతని చేతిని చెంపలమీధకు లాక్కుంది. అప్పుడు తెలిసింది చెంపలమీద , కళ్ళమీదా వున్న తడి.
"నా మొహం మీద నీళ్ళు జల్లారా?"
"మొదట కదిలించి చూశాను. ఎంతకీ తెలివి రావటం లేదు! నీళ్ళు జల్లి ప్రయత్నించి , అప్పటికీ ప్రయోజనం కన్పించకపోతే డాక్టరు గారికి ఫోన్ చేద్దామనుకున్నాను."
"నా కోసం ఎంత శ్రమ పడ్డారాండీ?"
"రాజా! చాలా నీరసంగా వున్నావు. గ్లూకోజ్ కలిపి తీసుకురానా?"
"వద్దండీ, మీరలా నా దగ్గరగా కూర్చుంటే నీరసం దానంతట తనే పారిపోతుంది."
"రాజా! ఇలా ఎందుకు జరిగింది?"
"ఎలా?"
"నువ్విలా ఫేయింటాయి పోవటం?"
"నేను నిద్రపోతున్నాను. ఇంతలో.....జరిగింది జరిగినట్టు చెబుదామనుకుంది. అతని ముందు ఏదీ దాచట మిష్టం లేదు. కాని ఇంత మరీ హృదయాన్ని క్షోభ పెట్టె విషయాలు అతనికి చెప్పి బాధ పెట్టటం ఈ ప్రశాంత వాతావరణంలో మంటలు రేపు కోవటం భావ్యమా?"
".....బయట్నుంచి ఎవరో బెల్ నొక్కినట్లు వినిపిస్తే ఉలికిపడి లేచి డోర్ తీశాను. ఎవరూ కనిపించలేదు. గాడమయిన నిద్రలో నుండి లేచి వచ్చానెమో కళ్ళు తిరిగినట్టు అయింది. డోర్ కూడా లాక్ చెయ్యలేకపోయాను. త్వరగా వచ్చి పడుకుందామని తిరిగివస్తూ మధ్యలోనే పడిపోయాను."
తానూ అబద్దం చెబుతున్నందుకూ పశ్చాత్తాపపడుతూనే ఆత్మను చంపుకుంటూనే చెప్పింది.
"దిలీప్! ఇప్పుడు టైమెంతయింది?"
"ఆరు దాటింది."
'అయ్యో! నేను రెండు గంటలకు పైగా స్పృహ తప్పి వున్నానా?"
"రాజా! జరిగినదాన్ని తలుచుకుని టెన్షన్ పెంచుకోకు. నీకే ప్రమాదమూ జరగలేదు. అదే నాకు సంతోషం."
వంగి ఆమె నుదుట మీద ముద్దు పెట్టుకుని ముంగురుల్ని సవరిస్తున్నాడు.
