Previous Page Next Page 
మారణహోమం పేజి 32


    
    తవ్వడం ఆపి గునపాన్ని పక్కన పెట్టాడు తరుణ్.    
    "నీ పేరేమిటమ్మా?"    
    "మోషిమోషి" మామిడిచిగురు మెక్కిన కోయిల కంఠంలా మధురంగా ఉంది ఆ అమ్మాయి గొంతు.    
    "నీ పేరేంది దొరా?"    
    "తాజుద్దీన్!"    
    చిరునవ్వు నవ్వి అతను త్రవ్వుతూ ఆపేసిన గుంటవైపు చూసింది. "ఏమిటి చేస్తున్నావ్ దొరా?"    
    "అబ్బో! అది చాలా పెద్ద ప్రశ్న! నీకు అర్ధమయ్యేటట్లు చెప్పడం కష్టం మోషీమోషీ!"
    "చెప్పుదొరా!" అంది మోషి కుతూహలంగా.    
    ఒకసారి వళ్ళువిరుచుకున్నాడు తరుణ్ ఉరఫ్ తాజుద్దీన్. కాన్వాస్ బ్యాగ్ లో నుంచి కుకుంబర్ శాండ్ విచెస్ తీసి ఒకటి ఆమెకిచ్చి, ఒకటి తను తింటూ చెప్పడం మొదలెట్టాడు.    
    "మనం కోతులనుంచి పుట్టాం నీకు తెలుసా?"    
    శాండ్ విచ్ తినడం ఆపి విరగబడి నవ్వింది మోషిమోషి. "చాలు తియ్యిదొరా! నేను మా నాయనకీ అమ్మకీ పుట్టినా! వాళ్ళిద్దరూ కోతులుకారు! నువ్వు కోతికి పుట్టినావా దొరా?"    
    "వెల్!" అని భుజాలు ఎగరేసి, దాన్నే మరోవిధంగా ఎలా చెప్పాలా అని ఆలోచించాడు తరుణ్. కొన్ని జాతుల కోతులు చెట్లమీద నుంచి దిగి నిటారుగా నిలబడి నడవడం నేర్చుకున్నాయి."    
    "నేను నమ్మ!"    
    "నిజంగా మోషీ!"    
    "ఎప్పుడు దొరా?"    
    "కొన్ని లక్షల సంవత్సరాల క్రితం!"    
    అతను చెబుతున్నది అబద్దం అని తనకు తెలిసిపోయినట్లు నవ్వు మొహం పెట్టింది మోషీ.    
    "అన్ని లక్షల సంవత్సరాల ముందు నువ్వు పుట్టినావా దొరా? లేకుంటే నీకెట్లా తెలుసు!" అంది గడుసుగా.    
    "రామోపిథికస్ అనే జాతి తోకలేని కోతి...." అని మొదలెట్టబోయి నిస్పృహగా మళ్ళీ భుజాలు ఎగరేశాడు తరుణ్. "ఆల్ రైట్ మీ ముత్తాతకి ముత్తాతని ఇక్కడ పూడ్చిపెట్టారుట! దానికోసం వెదుకుతున్నాను" అన్నాడు 'ఆదిమానవుల అవశేషాల కోసం' అని చెబితే ఆ అమ్మాయికి అర్ధంకాదని అతనికి అర్ధం అయింది.    
    "మా ముత్తాతకి ముత్తాతనా? ఇక్కడ ఉంటాడా?" అంది మోషీ ఆపుకోలేనంత ఉత్సాహంతో.    
    "అవును!"    
    అప్పుడు వినబడింది అతి దూరం నుంచి ఒక విజిలు.    
    వెంటనే మాట్లాడ్డం ఆపేసి చెవులు రిక్కించి విన్నది మోషిమోషి నెమ్మదిగా, క్రమబద్దమైన హెచ్చుతగ్గులతో వినబడుతోంది ఆ విజిలు.
    విజిలు ఆగిపోగానే చేతులని నోటి దగ్గరికి చేర్చి తనుకూడా విజిలు వెయ్యడం మొదలెట్టింది మోషిమోషి ఏదో భాష మాట్లాడుతున్నట్లే ఉంది ఆ విజిలేసే పద్దతి. ఎంత చిన్న శబ్దాన్ని అయినా సుస్పష్టంగా ప్రతిధ్వనిస్తున్నాయి ఆ కొండలు.    
    మళ్ళీ దూరంనుంచి సమాధానంగా విజిలు వినబడింది.    
    మెసేజ్ ఎండ్ చేస్తున్నట్లు రెండుసార్లు చిన్నగా విజిలేసి ఆశ్చర్యంగా చూస్తున్న తరుణ్ వైపు తిరిగింది మోషిమోషి.    
    "ఈ కొండా కోనల్లో ఆహారం సేకరించడం కోసం ఒకళ్ళకి ఒకళ్ళం దూరదూరంగా తిరుగుతుంటాం దొరా! అందుకని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోడానికి ఈలభాష ఉంది మా తెగలో!"    
    ఆంత్రోపాలజీతో బాగా పరిచయం ఉంది తరుణ్ కి. కేనరీ ద్వీపాల్లోని గొమేరాలోని ప్రజలు అనాదిగా విజిలు భాష మాట్లాడ్డం అతనికి తెలుసు. 'గాంచెస్' అనే అనాది తెగ నుంచి అనుశృతంగా వస్తోంది ఆ విజిలుభాష. ఇప్పటికీ అక్కడున్న ఆదునికులలో చాలామంది అ అవిజిలు భాషను అర్ధం చేసుకొనగలరు. వేళ్ళు, పెదిమలూ ఉపయోగించి 'మాట్లాడే' ఆ భాష వాళ్ళకు నిత్యజీవితంలో చాలా ప్రయోజనకారిగా ఉంటోంది.    
    జిప్సీలలాంటి సంచారతెగలు ప్రపంచంలో ఒకచోటినుంచి మరొక చోటికి నిరంతరం వలసపోతుండేవి. ఒకప్పుడు పాశ్చాత్యదేశాల్లో ఉండే జిప్సీ తెగలు మాట్లాడే రోమానీ భాషకు భారతీయ భాషలతో కొంత సంబంధం ఉందని కూడా కొందరు అంటారు.    
    అలా ఎప్పుడో, ఏనాడో దేశదిమ్మరులుగా తిరుగుతూ వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన జాతేనా మోషిమోషి వాళ్ళది?
    మోషి మోషి విజిలేయ్యడం మానేసిన తర్వాత కూడా దూరంగా ఇంకా విజిలు వినబడుతూనే ఉంది. దానికి సమాధానంగా మరింత దూరం నుంచి మరో విజిలు.
    కాసేపు విని, తర్వాత మళ్ళీ తవ్వడం మొదలెట్టాడు తరుణ్. మరి కొంచెం లోతుకి తవ్వాక తెల్లటి ఎముకలు కనబడ్డాయి. పలుగు ప్రక్కన పెట్టేసి బ్రష్షులు తీసుకుని ఆ ఎముకల మీద మట్టిని క్లీన్ చేశాడు. ఒక ఆస్థి పంజరం బయటపడింది. చావుకేక వేస్తున్నట్లు దాని నోరు ఇంకా తెరచుకునే వుంది. కాసేపు ఆ ఆస్థిపంజరం వైపు పరీక్షగా చూసి నిట్టూర్చాడు.
    "ఈయనేనా మా ముత్తాతకి ముత్తాత?" అంది మోషి మోషి ఉత్సుకతతో.
    "అవును!" అని తల పంకించాడు తరుణ్. కానీ నిజం అది కాదని అతనికి తెలుసు. ఆ స్కేలిటన్ ఏజంట్ డేనియల్స్ ది. డేనియల్స్ తన కొలీగ్. అతన్ని నిఖిల్ ముఠా చంపిందని ఇక్కడ పాతిపెట్టిందని వర్తమానం వచ్చింది తనకు. వెదుక్కుంటూ వచ్చాడు. విన్నదీ, కన్నదీ ఒకటే అయింది. దేశం కోసం ప్రాణాలు వదిలేసిన డేనియల్స్, నిశ్చలంగా, ఎముకల గూడులా పడుకుని వున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS