మీ గురించి కబురు చేశారు. రండి అంటూ చెప్పాడు. జయరామ్ కారుగేట్ లోపల పెట్టాడు.
కారు దిగి ముగ్గురూ బంగళలోకి వెళ్ళారు. బంగళా చిన్నది అయినా నీటుగా, అందంగా ఉంది.
మొత్తం నాలుగు గదులు రెండు గదులకి ఎటాచ్డ్ బాత్ రూమ్స్ ఉన్నాయి.
హాలు, కిచెన్ ఉన్నాయి.
అయితే అటువైపు ఉన్న రెండు గదులు మూసి ఉన్నాయి.
జయరాం అడిగితే దొరగార్కి ఏదో పని ఉందట వస్తే ఈ రాత్రికి వస్తాం అని రెండు గదులు అలా ఉంచమని అన్నారు అని చెప్పాడు.
ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు అక్కడికి వస్తారని చెప్పటంతో జయరాం అన్నాడు భార్యతో చెల్లెలితో. మనకీ ఈ రెండు గదులు చాలుకదా అని. అంబిక అంది. "ఆ ఒక్క గది అయినా సరిపోతుంది మనం ఎన్ని రోజులు ఉంటాం" అంటూ తేల్చేసింది. వాళ్ళని రానివ్వండి ఇప్పుడు మనకి ఏమిటి ఇబ్బంది అన్నట్టున్నాయి ఆ మాటల్లో అర్ధం. "ఏమిటి అతను ఇప్పుడు వస్తాడా! జిడ్డుముఖం వేసుకుని మనకు ఎదురుగా కూర్చుంటే మనకి ఏమిటి సరదాగా ఉంటుంది! ఛఛ" అంది ఇంద్రసేన చిరాకుపడుతూ నుదురు చిట్లించి.
ఆమె మాటలకి భార్యాభర్తలు ఇద్దరూ నవ్వుకున్నారు.
"మరి ఎలా వాళ్ళతోట, వాల్ళ బంగళా మనకి పూర్తిగా ఇచ్చేస్తారా! వాళ్ళకి ఏదో పని ఉంటుంది" అన్నాడు జయరాం.
"ఆ పని.... మనం వచ్చినప్పుడే వాళ్ళకి ఏదో వస్తుందా" అంది కోపంగా ఇందూ.
చెల్లెలికి ఇక ఏం సమాధానం ఇవ్వలేదు.
* * *
ముగ్గురూ కూల్ డ్రింక్స్ త్రాగి కారులో ఊరు చూడ్డానికి వెళ్ళారు.
జయరాం వేరే కెమేరా తీసుకువచ్చాడు. ఇంద్రసేన కూడా కెమెరా తీసుకువచ్చింది.
ఇందు అంబిక బీచ్ ఒడ్డున నడుస్తుంటే ఇద్దరిని కలిపి ఒక ఫోటో తీశాడు.
ఇద్దరూ కెరటాలు వస్తుంటే నీళ్ళలో కాళ్ళుపెట్టి నిలబడినప్పుడు ఒక ఫోటో తీశాడు.
ఇద్దరికీ విడివిడిగా కొన్ని తీశాడు.
ఇంద్రసేన అన్న, వదినలని కలిపి చాలా ఫోటోలు తీసింది.
ఆమె ఎలా నిలబడమంటే అలా నిలబడ్డారు భార్యాభర్తలు ఇద్దరూ.
అంబిక ఆడపడుచుతో పాటు పరిగెడుతుంటే జయరాం మనసు ఒప్పలేదు.
చెల్లెలు చూడకుండా అలా పరుగెట్టవద్దు అన్నట్లు కళ్ళతో సైగ చేసేవాడు భార్యకు.
అంబిక భర్త అపురూపానికి తనలో తాను నవ్వుకునేది.
నేను చెప్పినట్లు నువ్వు అసలు వినటంలేదు అన్నట్టు చురచుర చూడసాగేడు జయరాం.
ఏం వినాలి! నెమ్మదిగా నడవమంటున్నారు నడుస్తున్నాను. మీ మాట వినటం లేదా! అన్నట్టు అంబిక భర్తవేపు చూసేది.
నీకోసం కాదు నీ కడుపులో ఉండే బిడ్డ కోసం చెప్తున్నాను అన్నట్టు చూసేవాడు.
తెలుసు మహాప్రభు మీకు మీ బిడ్డమీదే ప్రేమ ఎక్కువ. కందకుండా మీ బిడ్డను మీ చేతులలో పెట్టేస్తాను. నాకు కాస్త టైము ఇవ్వండి అన్నట్టు టక్కున నవ్వేది అంబిక.
అతను కోపం మర్చి నవ్వేసేవాడు.
ఇంద్రసేన అక్కడే ఉన్నా వాళ్ళ కళ్ళ బాషలు అర్ధం చేసుకోలేక పోయింది.
భార్యాభర్తల కళ్ళ భాషలు.
ప్రేమికుల కళ్ళ భాషలు ఎవ్వరికీ అర్ధం కావు. కళ్ళతో ఎన్నో ఎన్నో కబుర్లు చెప్పేసుకోవచ్చు.
ఇరువురి హృదయాలు మనసారా హాయిగా మాట్లాడుకుంటున్నాయి.
ఆ మాటల్లో తియ్యదనం ఆ హాయి ఎవ్వరికి తెలియవు.
ముగ్గురు తిరిగి కారులో బంగళాకి వచ్చారు. అంబిక భోజనాలు టైము అయింది అని అన్నా చెల్లెల్ని అక్కడ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చోమని బాస్కెట్ తీసి ఫలావ్, కూర, స్వీట్స్ అన్నీ వడ్డించింది.
ఆమెను కూర్చోమని అంటే అంబిక కూడా వాళ్ళతో కలిసి కూర్చుని భోజనం చేసింది.
ముగ్గురూ భోజనాలు చేసి కాస్సేపు హాలులో కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు.
ఇంద్రసేన ఏవో కబుర్లు చెప్పి వదిన, అన్నగార్ని నవ్వించసాగింది.
అంబిక నవ్వి అలసిపోయినట్లు ముఖం పెట్టింది ఇక నవ్వలేను బాబూ అన్నట్లు.
జయరాంకు కూడా చెల్లెల్ని భార్యను ఏవో కబుర్లు చెప్పి నవ్వించసాగాడు.
ఇంద్రసేన నవ్వుతూ అంది.
"బాబూ ఈ రోజు ఇంతగా నవ్వుతున్నాను. బాగా నవ్వితే ఏడ్వటం జరుగుతుంది. అందుకే నాకు భయం వేస్తుంది"
ముగ్గురూ కాస్సేపు పడుకున్నారు.
మూడుగంటలకు లేచి స్నానాలు చేసి ముస్తాబయ్యారు.
ఇంద్రసేనకి కాలు బెణికినట్టయింది.
అబ్బా అనుకుని అలా కూర్చుంది.
"అలా తిరిగివద్దాం పద" అంబిక అంది.
"ఉహు నేను రాలేను, నా కాలు బెణికింది" అంది ఇంద్రసేన.
"అదేమిటి ఎలా బెణికింది! ఏది చూడనీ" అంటూ కాలు చూసింది అంబిక కంగారు పడుతూ.
ఇంద్రసేన నవ్వింది "ఈ మాత్రానికే కంగారు దేనికి వదినా అదే పోతుంది" అంది.
"ఏమో బాబు నాకు భయం నువ్వంటే మీ అన్నగారికి, మీ అమ్మ, నాన్నగార్కి అందరికీ గారాబం అపురూపం."
"నీకు కాదా" నవ్వింది ఇందు.
అంబిక కూడా నవ్వుతూ "నువ్వు రావా! వెళితే ఈ రోజు రాత్రికి వెళ్ళిపోదామనుకుంటున్నాం కదా" అంది.
"వెళ్ళిపోతే వెళ్ళిపోదాంలే" అంది.
జయరాంతో చెప్పింది. ఆమెను ఒక్కర్తెను వదిలివెళ్ళటం ఇష్టం లేదని అతను సరేనని భార్యతో బయలుదేరాడు.
ఇంద్రసేన వదినతో అంది "వదినా ఏమైనా పుస్తకాలు తెచ్చేవా!"
