Previous Page Next Page 
రాజ హంస పేజి 31

 

    ఒక్క నిమిషం కూడా గడిచి వుండదు, ఆమె పరధ్యానంగా వుండబట్టి లోపల కొచ్చేవరకూ గమనించలేదు.
    దిలీప్.
    ఆశ్చర్యపోతుంది. ముందుగా ఫోనన్నా చెయ్యకుండా....
    చేతిలో వున్న చిన్న సూట్ కేస్ ని నేలమీద గిరాటేసి "హాయ్ రాజా" అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని ముందు చెంపమీదా, తర్వాత పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు.
    షాక్ నుంచి మెల్లగా కోలుకుంది. "ఇదేమిటి? వస్తూన్నావని ఫోన్ చెయ్యకుండా...."
    "కుదరలేదు రాజా. లాస్ట్ మినిట్ వరకూ బయల్దేరతాననుకోలేదు. అనుకున్నాక ఫోన్ చేసే టైం లేదు."
    అతను వినోద్ తమ యింట్లోంచి బయటకు రావటం చూడలేదా? అసలా సంగతేమీ పట్టించుకోనట్లు చాలా ఫ్రీగా ఎప్పటిలా మాములుగా వున్నాడు.
    "రాజా ఆకలిగా వుంది."
    "ఫైవ్ మినిట్స్. వేడిగా అన్నం వండేస్తాను. ఈ లోపల స్నానం చేసిరండి.
    పదిహేను నిమిషాల తర్వాత అతను స్నానం చేసి ఫ్రీగా తయారై పైజమా లాల్చీ వేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు.
    అతనన్నం తింటున్నప్పుడూ మూడ్ పాడుచేయ్యకూడదని ఆ సంగతి ప్రస్తావించలేదు. తర్వాత యిహ నిగ్రహించుకోలేక పోయింది.
    "ఇందాక ....మీరు లోపలకి వస్తున్నప్పుడు మనింటి లోంచి ఎవరయినా బయటకు వస్తూ కనిపించారా?"
    "ఎవరో ఒకతను గేటు తీసుకుని బయట కొస్తున్నాడు. ఇంచుమించు నా వయసే వుంటుంది."
    "ఎవరిని అడగరేం?"
    అడిగితే జరిగిందంతా చెప్పేయ్యటానికి ఆమె అంతరంగం తహతహ పడుతోంది.
    "అందులో ఏముంది అడగటానికి ఒక యిల్లూ అందులో మనుషులూ వున్నాక ఏదో పనిమీద ఎవరో ఒకరు వస్తూ వుంటారు . ప్రతి చిన్న విషయమూ పట్టించుకుని టైం వెస్ట్ చేసుకోవలసిన అవసరం లేదు. ప్రాధాన్యత వుండి వుంటే నువ్వే చెబుతావు."
    "ఓ! దిలీప్! నువ్వెంత వున్నతుడివి!"
    ఆమె కళ్ళలో కనిపించి కనిపించనట్లు నీళ్ళు తిరిగాయి.
    

                                                              17

    మరో మూడేళ్ళు గడిచిపోయాయి.
    రాజహంస దిలీపుల జీవితం యధావిధిగా చాలా హాయిగా సాగిపోతోంది.
    ఆమె కాశ్చర్యంగా వుండేది. ఎందుకు నెల తప్పటం లేదా అని. లోలోపల కొంచెం కోరిక కూడా వుండేది అలా జరగాలని. కాని ఎప్పుడూ బయట పడలేదు. అతన్తో ఎప్పుడూ చర్చించలేదు.
    ఓ మధ్యాహ్నం .....వేసవికాలం కావడం వల్ల బయట ఎండ చాలా ఎక్కువగా వుంది. ఇంట్లో ఏ.సి వుండటం వల్ల, ఆ చల్లదనాన్ని అనుభవిస్తూ రాజహంస హాయిగా నిద్రపోతోంది.
    బహుశా మూడు, మూడున్నరయి వుంటుందేమో కాలింగ్ బెల్ మ్రోగితే మెలకువ వచ్చింది.
    మెలకువ వచ్చింది. ఎవరయి వుంటారు. అనుకుంటూ లేచి వెళ్ళి తలుపు తీసింది.
    ఒక్కసారిగా ........వంట్లో వెచ్చని ఆవిరి ప్రవహించి నట్లయింది.
    "పాండురంగ"
    షేవ్ చేసుకుని ఏడెనిమిది రోజులయినట్లుగా , గడ్డం పెరిగి వుంది. బట్టలు కూడా బాగా నలిగి వున్నాయి. ఎండలో రావటం వల్ల మొహమూ, మిగతా శరీరమూ చెమటలు గ్రక్కుతున్నాయి.
    ఎలా పలకరించాలో, ఏం చెయ్యాలో తెలీక మ్రాన్పడిపోయి నిలబడిపోయింది.
    "రాజహంసా లోపలికి రావచ్చా?" ఒకటి రెండు క్షణాలాగి అతనే తడబడుతూ అడిగాడు.
    ఆమె ఏమీ జవాబు చెప్పకుండా లోపలికి నడిచింది. అతననుసరించాడు.
    ఆమె విధిలేక 'కూచోండి" అనే దాకా నిలబడే వున్నాడు.
    తర్వాత " ఏమీ అనుకోకపోతే మంచినీళ్ళు ఇస్తావా?" అనడిగాడు.
    ఆమె లోపలికి వెళ్ళి ఫ్రిజ్ లోంచి బాటిల్ తీసి, ఓ గాజు గ్లాసు తో సహా తిరిగి వచ్చేసరికి అతను కర్చీఫ్ తో మొహం మీద చెమటలు తుడుచుకుంటూన్నాడు.
    బల్ల మీద పెట్టింది.
    బాటిల్ లోంచి వొంపుకుంటూ గబగబ మూడు గ్లాసులు త్రాగేసాడు. లోపల చల్లగా వుండటం వల్ల క్రమంగా సేద తేరుతున్నాడు.
    "మీరిలా రావటం...."
    "పద్దతి కాదని తెలుసు, కాని అనివార్య పరిస్టితుల వల్ల రావల్సి వచ్చింది."
    "ఏమిటా అనివార్య పరిస్థితులు?"
    "అనిల్ కు మెనింజైటీసొచ్చి సీరియస్ గా వుంది. హాస్పిటల్లో వున్నాడు."
    రాజహంసకు విధ్యుత్పాధం తగిలినట్లయింది. ఒక్క నిమిషం మెదడు మొద్దుబారి నట్లయి పని చెయ్యలేదు. నరాల స్వాధీనంలోకి తెచ్చుకుంటూ క్రమంగా చైతన్య స్థితిలోకి వస్తోంది.
    కళ్ళముందు రంగు రంగుల వలయాలు కదుల్తున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS