నెమ్మదిగా కళ్ళెత్తి అతనివైపు చూసింది అమూల్య. అతను ఈ సంగతి చెప్పి తనకు రిలీఫ్ కలిగించాలనుకుంటున్నాడు. కానీ తనకు నిజంగా రిలీఫ్ కలుగుతోందా? తనకు కలుగుతున్న ఈ ఫీలింగ్ ని రిలీఫ్ అనాలా? డిసప్పాయింట్ మెంట్ అనాలా?
నిఖిల్ తనని పెళ్ళి చేసుకోబోవడం లేదని తెలిస్తే బ్రహ్మానందభరితురాలు అయిఉండాలి తను. కానీ ఇదేమిటి? అంటే తన మనసేమిటో తనకే తెలియదా? తనకు తెలియకుండానే తను అతని సిద్దాంతాలవైపే కాక, అతనివైపు కూడా ఆకర్షించబదిందా?
చాలా చిత్రంగా వుంది ఇది!
తర్వాత యధాలాపంగా అన్నట్లు అంది అమూల్య.
"మీరు నన్ను పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన మార్చుకోడానికి కారణం రాధనా?"
సూటిగా ఆమెవైపు చూశాడు నిఖిల్. ఎంత చదివినా ఎంత నేర్చినా ఆడమనసు!
"కాదు" అన్నాడు పైకి.
నమ్మనట్లు చూసి మొహం పక్కకి తిప్పుకుంది అమూల్య.
"రేపు నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు!" అన్నాడు నిఖిల్.
"నేనా! నేను వెళ్ళను. ఇక్కడే ఉండిపోతాను ఎప్పటికీ!" స్థిరంగా ఉంది ఆమె గొంతు.
"కాదు అమూల్య! నేను చేస్తున్నది మంచిదని, నా పద్దతులవల్ల నలుగురికి మేలు జరుగుతుందని నమ్ముతుంటే నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి. తప్పదు!"
"ఎక్కడికి?"
ఒక్కొక్క అక్షరం ఒత్తొత్తి పలుకుతూ అన్నాడు అతను - "నిన్ను బ్రహ్మాస్త్రంలాగా నామీద ప్రయోగించాడు తరుణ్! అదే బ్రహ్మాస్త్రాన్ని నేను తిప్పి అతనిమీదకు పంపిస్తాను. నువ్వు వెనక్కి వెళ్ళిపో! నాకు సంబంధించిన రహస్యాలు కొన్ని నీకు చెప్పేస్తాను. చిన్న చిన్న రహస్యాలు బయటపడినా నాకు ప్రమ్నాదం లేనివి. అవి తరుణ్ కి చెప్పు. కొద్దో గొప్పో పని సాధించుకు వచ్చావని అతను సంతోషిస్తాడు. అతని దగ్గర వుండిపోయి అతన్ని ఆకర్షించి అతని రహస్యాలు నాకు అందజెయ్యి! వాటిని నేను అటంబాంబుల్లా ఉపయోగించి చెడుని భస్మీపటలం చేస్తాను. సరేనా?"
"ఆకర్షించడం అంటే?" అంది అనుమానంగా.
"దానికి నువ్వు ఏ అర్ధం అన్నా చెప్పుకో!"
"నేను అలాంటిదాన్ని కాను!"
"మనం ఈ మిడిల్ క్లాస్ మొరాలిటీకి, ఈ కుళ్ళిపోయిన సంఘం పెట్టిన సోకాల్డ్ నీతినియమాలకీ తల వంచనక్కర్లేదు అమూల్య!"
కొంచెంసేపు మౌనంగా ఉండిపోయి తర్వాత అంది అమూల్య.
"సపోజ్! ఇదే పనిమీద రాధను పంపగలరా మీరు?"
"రాధ! రాధా! రాధకి అంత ఇంపార్టెన్స్ ఎందుకిస్తున్నావ్ నువ్వు? నీలాగా తెలిసి తెలిసి సింహంనోట్లో తల పెట్టేటంత తెగువలేదు ఆ అమ్మాయికి"
విని తలపంకించి ఊరుకుంది అమూల్య.
"రేపే వెళుతున్నావు నువ్వు!"
తను రేపటినుండి డబుల్ ఏజంట్ అవబోతోందన్న మాట! ఆమెకు వెన్నెముక కిందనుండి చలి మొదలయినట్లయింది.
కింద పోలీసు వ్యాన్ల సైరన్లు వినబడ్డాయి. ఎదుటి బ్లాక్ ముందు జనం మూగడం మొదలెట్టారు.
"సరే!" అంది అమూల్య బరువుగా.
* * *
బద్దకంగా మెలికలు తిరిగి పడుకున్న కొండచిలువలా ఉంది కొండల మధ్య ఉన్న ఆ నల్లటి రోడ్డు. బైసికిల్స్ లో అతిఖరీదయిన ఫ్యూజో బైసికిల్ మీద వేగంగా వెళ్తున్నాడు తరుణ్. అతని కళ్ళు ఏ చిన్న డిటెయిల్ నీ వదలకుండా పరిసరాలని తీక్షణంగా పరికిస్తున్నాయి. ఎత్తుపల్లాలని చులాగ్గా అధిగమిస్తూ వెళ్ళిపోతున్న ఆ సైకిలు తూనీగ రెక్కలాగా అతి తేలిగ్గా ఉంది. కార్బన్ ఫైబర్ తో చేసి ఉంది దాని బాడీ. దాని ఖరీదు దాదాపు ఇరవై ఏడువేల రూపాయలు ఉంటుంది. సైకిలు అంటే బీదవాడి వాహనం, సైకిలు తొక్కడం అంటే చిన్నతనం అని ఇండియాలో చాలామందికి దురభిప్రాయం ఉందిగానీ వెస్టర్న్ కంట్రీస్ లో అలా అనుకోరు. అక్కడ సైక్లింగ్ ఒక హాబీ. పదహారు గేర్లు ఉండే సోఫిస్టికేటెడ్ సైకిల్స్ కూడా ఉంటాయి. సైకిళ్ళమీద వెళ్ళే వాళ్ళకోసం ప్రత్యేకమైన రోడ్లు కూడా ఉంటాయి. సైక్లింగ్ హాబీగా గలవాళ్ళకోసం క్లబ్బులూ, 'బైసికిల్' లాంటి మేగజైన్ లూ కూడా ఉంటాయి.
తరుణ్ ని ఆ సమయంలో చూసిన వాళ్ళెవరూ అతను ఫలానా అని గుర్తుపట్టలేరు..... జుట్టుకి తెల్లరంగు వేసుకుని ఉన్నాడతను. చందమామల్లా గుండ్రంగా, చిన్నవిగా వున్న వైరు ఫ్రేము కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. అతని చుబుకం మీద మేకగడ్డంలాంటి గోటీ వుంది. ఖాకీరంగు షార్ట్సూ, సఫారీకోటు వేసుకుని వున్నాడతను. సైకిల్ కారియర్ మీద పెద్ద కేన్వాస్ బ్యాగ్ వుంది. దాన్లో ఆర్కియాలజిస్టులు ఉపయోగించే పనిముట్లు వున్నాయి. ప్రొఫెసర్ తాజుద్దీన్ అనే పేరుమీద, ఫాల్స్ డాక్యుమెంట్లు ఉన్నాయి.
కొద్దిరోజుల క్రితం కురిసిన తొలకరి చినుకులకు అక్కడంతా బాగా గడ్డి పెరిగినట్లు ఉంది. అక్కడ ఆగాడు తరుణ్. బ్యాగ్ లోనుంచి పనిముట్లు బయటికి తీశాడు. గునపంలాంటి పదునైన పనిముట్ల దగ్గరనుంచి సన్నటి నాజూకైన బ్రష్షులదాకా చాలా ఇన్ స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఆ బ్యాగ్ లో. చాలాసేపు ఆ ప్రదేశాన్నంతా పరిశీలనగా చూసి ఒక ప్రదేశాన్ని మార్క్ చేశాడు తరుణ్. తవ్వడం మొదలెట్టాడు.
క్రమంగా ఎండ ఎక్కువవుతోంది.
అతనిమీద పొడుగ్గా పడింది ఒక నీడ. నుదుటిమీదనుంచి కళ్ళలోకి కారుతున్న స్వేదాన్ని తుడుచుకుంటూ తిరిగిచూశాడు తరుణ్, అలియాస్ తాజుద్దీన్.
అతని వెనకాతల ఒక గిరిజన యువతి నిలబడి వుంది. బాగా పొడుగ్గా దృఢంగా ఉంది ఆ అమ్మాయి. నలుపూ ఎరుపూ రంగుచారల వస్త్రం ఒకటి నడుముకి చుట్టుకుని ఉంది. రంగురంగుల పూసల దండలు ఆమె ఛాతీని కవర్ చేస్తున్నాయి. వేరే ఆచ్చాదన ఏమీలేదు. కృత్రిమం అంటే తెలియని సిసలైన ప్రకృతిబిడ్డలా ఉంది తను. కుతూహలంతో ఆ అమ్మాయి కళ్ళు విప్పారి ఉన్నాయి.
