అంబిక అనురాగంతో అతని తలను దగ్గరకు లాక్కుని హృదయానికి హత్తుకుంది.
ఇద్దరు క్షణంసేపు ప్రపంచాన్నే మర్చిపోయారు. పుట్టబోయే పసిపాప గురించి అందమైన బంగారు కలలుకంటూ మురిసిపోయారు.
ఇద్దరి మనసులూ అనిర్వచనీయమైన ఆనంద తరంగాలతో నిండిపోయాయి.
* * *
ఆ రోజు ఉదయం అంబిక హాస్పిటల్ కి వెళ్ళలేదు.
జయరామ్ కూడా యింటి దగ్గరే ఉండిపోయాడు. సుభద్రమ్మ గణేష్ రావు గారు పిక్ నిక్ కి రాలేం అనేశారు.
ఇంద్రసేన తల్లిదండ్రులని ఎక్కువ బలవంతం చెయ్యలేదు.
ఆ రోజు పదిగంటలకు జయరామ్, అంబిక, ఇంద్రసేన భీమిలీ వెళ్ళాలని అనుకున్నారు.
ఇంద్రసేన కెమేరాలో ఫిల్ములు వేసుకుని హ్యాండ్ బ్యాగ్ లో టీయిలెట్ సామాన్లు వేసుకుని అన్నీ హడావుడి పడసాగింది.
అక్కడికి తమతో ఏం తీసుకెళ్ళాలో వంటవాడికి ఇంద్రసేన పురమాయించేసింది.
అయినా సుభద్రమ్మగారు మాత్రం అన్నీ స్వయంగా చూస్తూ అన్నీ బాస్కెట్ లో పెట్టింది.
గణేష్ రావు గారు ఎక్కడికో వెళ్ళడానికి బయలుదేరుతున్నారు.
ఆరోజు పోస్ట్ త్వరగా వచ్చేసింది.
ఇంద్రసేనకి ఒక ఉత్తరం, శుభలేఖ వచ్చాయి.
ఉత్తరం చదువుకున్న ఇందూ ఎగిరి గంతులేసినంత పనిచేసింది.
ఆమె స్నేహితురాలి పెళ్ళి రాజమండ్రిలో.
పెళ్ళికి తప్పక రమ్మని మరీ మరీ వ్రాసింది. ఆ ఉత్తరంతో శుభలేఖ పంపిస్తూ.
తండ్రికీ చెప్పింది నేను నా ఫ్రెండ్ పెళ్ళికి రాజమండ్రి వెళతాను అంటూ---
"నువ్వా ఒక్కదానివి వెళతావా!" అయిష్టంగా చూశారు ఆయన.
"భయం ఏమిటి!" అంది తండ్రితో.
"నాకు నిన్ను పెళ్ళికి పంపించటం ఇష్టంలేదు" అన్నారాయన ఖచ్ఛితంగా చెప్పేస్తూ.
గణేష్ రావు గార్కి ఈ మధ్య ఏదో తెలియని భయం పట్టుకుంటుంది.
కృష్ణమౌళి పేరు తలుచుకుంటుంటే నిద్రలోకూడా ఉలిక్కి పడుతున్నారు.
కూతుర్ని ఒక్కర్తెనూ బయటకు పంపించడానికి ఆయన ఇష్ట పడడంలేదు.
పైకిమాత్రం ఆయన మనసులో భయాన్ని ఎవ్వరికి తెలియనివ్వటం లేదు.
"ఏం ఎందుకని?" అడిగింది ఏడుపు ముఖంతో. అదే సమయంలో సుభద్రమ్మ అక్కడికి వస్తూ అంది. "యాపిల్స్ పెట్టడానికి ఆ బాస్కెట్ సరిపోలేదు. వేరే బ్యాగ్ లో పెట్టమంటావా!" ఇంద్రసేన కోపంతో తల్లికి సమాధానం ఇవ్వలేదు.
కూతురు అలా ఉండటం చూసి ఆవిడ అనుమానంగా భర్తవేపు చూసింది.
"ఏం ఇందూ అలా వుంది! దాన్ని ఏమైనా అన్నారా" అడిగింది.
"నేను ఏమీ అనలేదు" అన్నారు ఆయన పొడిపొడిగా.
"మరి ఎందుకు అలా వుంది" అడిగింది ఆవిడ అర్ధంకానట్లు చూస్తూ.
ఇంద్రసేన మూతిముడుచుకు కూర్చుంది. తండ్రివేపు, తల్లివేపు చూడకుండా.
"స్నేహితురాలి పెళ్ళట. రాజమండ్రి ఒక్కర్తే వెళుతుందట వద్దు అన్నానని దానికి కోపం వచ్చింది" అన్నారు.
అవునా! అన్నట్టు కూతురివైపు చూసింది.
"వెళ్తే ఏం! డాడీ ఎప్పుడూ ఇంతే. అసలు మీరు నన్ను ఎక్కడికి పంపించారు!" అంది ఏడ్పు గొంతుకతో. ఆవిడకు కూతుర్ని ఒక్కర్తెను పంపించటం ఇష్టంలేదు.
ఇంద్రసేనకు ఎవరూ ఏం చెప్పలేరు.
చెప్పినా వినదు ఎవ్వరి మాటా.
అంతలో అంబిక అక్కడికి వస్తూ ఏమిటి అని అత్తగార్ని అడిగింది.
ఆవిడ చెప్పింది ఇంద్రసేన కోపానికి కారణం ఏమిటో. ఇంద్రసేన రాజమండ్రి పెళ్ళికి వెళతానని పట్టుపట్టటం.
ఒక్కక్షణం అంబిక మస్తిష్కంలో ఒక్క మెరుపు మెరిసనట్లు అయింది.
ఆమెకు మనసులో సంతోషం పొంగింది.
ఇది తను ఊహించని మంచి అవకాశం అనుకుంది మనసులో.
పైకంది. "ఇంకా నాలుగు రోజులు టైము వుంది ఇప్పుడు నుండి ఎందుకా విషయం" అంటూ అత్తగార్కీ, మావగార్కీ ఆడపడుచు చూడకుండా కళ్ళతో సైగ చేసింది. ఇప్పుడు ఏమనకండి అన్నట్టుగా--
గణేశ్ రావు గారు సుభద్రమ్మ వెంటనే అర్ధం చేసుకునీ మాట్లాడకుండా మౌనం వహించారు.
ఆడపడుచు దగ్గరగా వెళ్ళి
"ఈ రోజు మనం భీమిలి వెళుతున్నాం కదా వచ్చిన తరువాత మాట్లాడుకుందాం. అత్తగార్ని మావగార్ని నేను ఒప్పిస్తాగా పద మనకి టైమవుతుంది" అంది మెల్లగా కంఠస్వరం తగ్గిస్తూ రహస్యంగా.
ఆ మాటలు గణేశ్ రావు గార్కి సుభద్రమ్మకు మెల్లగా వినిపించినా మనసులో నవ్వుకున్నారు.
కోడలు చాలా తెలివయినది.
యింట్లో ఏ గొడవా రానివ్వదు. వెంటనే సర్ది చెప్పించేస్తుంది అనుకున్నారు.
ఇంద్రసేన వదిన మాటలు వినగానే సరదా పడిపోయింది.
ఒక్క ఉరుకులో మేడమీదకు వెళ్ళిపోయింది కోపం మరిచిపోయి.
జయరామ్ ఫ్రెండ్ కి భీమిలిలో తోటలు ఉన్నాయి. తోటలో చిన్న బంగళా కూడా కట్టించుకున్నారు. వాళ్ళు ఎప్పుడైనా వెళితే అక్కడ ఉండి వస్తారు. ఎప్పుడూ వాళ్ళు ఉండరు.
జయరామ్ ఫోన్ చేసి తను వస్తున్నట్టు ఆ బంగళా ఒకరోజు తమకి ఇమ్మని చెప్తే.
అతను సరే వెళ్ళమని చెప్పటంతో ముగ్గురూ కారులో అక్కడికి బయలుదేరి వెళ్ళారు. ఆ రోజు ఉండి మర్నాడు ఉదయం వద్దామని అనుకున్నారు.
అంబిక తన హాస్పిటల్ లో ఆ రోజు అంతా ఉండమని ఆమె ఫ్రెండ్ కి అప్పచెప్పింది.
* * *
అక్కడ బంగళా ముందు కారు ఆపి వాచ్ మన్ ని పిల్చి అడిగాడు.
