Previous Page Next Page 
రాజ హంస పేజి 30

 

    "హలో!"
    "నేను" వినోద్ గొంతు.
    ఆమెకు చిరాకు పుట్టింది. "ఏమిటి?" అంది.
    "ఎంతకీ నిద్ర పట్టలేదు. నీకు చెయ్యాలనిపించి...."
    "ఏమిటో చెప్పండి."
    "ఈ సాయంత్రం నిన్ను చూసిన క్షణాన.....ఎంత అమూల్యమయిన సాహచర్యాన్ని పోగొట్టుకున్నానో అర్ధమయింది."
    "నాకిలాంటి సంభాషణ రుచించదు."
    "రాజహంసా! ప్లీజ్ విను."
    "వినను" అంటూ ఫోన్ పెట్టేసింది. అంతేకాదు అతను మళ్ళీ చేస్తాడేమోనన్న భయంతో రిసీవర్ ఆఫ్ చేసేసింది."
    

                                                             *    *    *

    మధ్యాహ్నం రెండు గంటల వేళ, అంతకు అరగంట ముందే భోజనం చేసి నిద్రలో మునిగి వుంది.
    బయట్నుంఛి ఎవరో కాలింగ్ బెల్ నొక్కుతున్నారు. అతి శ్రవ్యమయిన గంటలు హాయిగా మ్రోగుతుంటే రాజహంసకు మెలకువ వచ్చి కళ్ళు విప్పింది.
    ఓ నిమిషం విరామం తర్వాత కాలింగ్ బెల్ మళ్ళీ మ్రోగింది.
    రాజహంస లేచి డోర్ లాక్ త్రిప్పి తలుపు తెరిచింది"
    వినోద్!
    ఒక్క క్షణం స్తబ్ధత. చిరాగ్గా చూసి ఏదో అనబోయింది.
    "సారీ! డిస్టర్బ్ చేసినట్లున్నాను. అంటూనే ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా లోపలకు అడుగు పెట్టాడు. ఆమె తలుపు మీద నుంచి చెయ్యి తీసేసి ప్రక్కకి తొలగింది. స్ప్రింగ్ డోర్ కావడం వల్ల మెల్లగా మళ్ళీ మూసుకుంది.
    "రాత్రి ....ఫోన్ లో మాట్లాడుతుండగానే పెట్టేశారేం? మరీ అంత కటుత్వమా?"
    "నాకిలాంటి సంభాషణ రుచించదని చెప్పాను."
    "ఎందుకో అలా" అంటూ చొరవగా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు.
    ఆమె అసహనంగా నిలబడే వుంది.
    "రా రాజహంసా! ఇలా వచ్చి కూచో!
    "అక్కర్లేదు చెప్పండి."
    "నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను."
    "చెప్పండి"
    "ఆ రోజు....నువ్వు పెళ్ళికి అంగీకరించమని అడిగితే స్టేటస్, డబ్బు అని ప్రగల్భాలు పలికి ఆ సువర్ణవకశాన్ని పోగొట్టుకున్నాను. డబ్బు, తప్ప రంగు, రుచి వాసన లేని జంతువుతో కాపురం చెయ్యాల్సి వస్తోంది."
    "సాటి స్త్రీ ని గురించి అలా మాట్లాడకండి. నాకు అసహ్యం."
    "నా ఉద్దేశ్యం ఇంకో స్త్రీ ని అవమానించటం కాదు కాని ముందూ వెనుకా ఆలోచించకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే శారీరకంగా, మానసికంగా ఇటువంటి మనిషిని భరించటం ఎంత నరకమో అనుభవానికి వస్తే గాని తెలియదు."
    "ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు మీరు?"
    "నేనలాంటి నరకంలో వున్నానని"
    "దానికి నేనేం చెయ్యను?"
    "కొద్ది రోజులుగా నువ్వే గుర్తుస్తున్నావు. నీ గురించే అహర్నిశలూ ఆలోచిస్తున్నాను. నిన్ను విడిచి వుండలేనని తెలుసుకున్నాను. రాజహంసా నువ్వు నాకు కావాలి."
    "దిస్ ఈజ్ నాన్సెన్స్ . నేనో యింటి యిల్లాలిని. ఇలా మాట్లాడటానికి సిగ్గు వెయ్యటం లేదూ?"
    "నువ్వో యింటి యిల్లాలివంటే వొప్పుకుంటాను కాని దిలీప్ తో కలిసి వున్నంత మాత్రాన అతని భార్యవై పోలేదు అదో ముచ్చట."
    "నువ్వు అధికంగా మాట్లాడుతున్నావు. మా  యిద్దరి మధ్యా వున్న అనుబంధం నీలాంటి అల్పులకి తెలీదు."
    "నువ్వు కోరి వచ్చానని నువ్వు నన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు రాజహంసా. దిలీప్ కన్నా ఏ  అంశంలో తీసిపోను. అంటూ సోఫాలోంచి లేచి ఆమె దగ్గిరకు వచ్చాడు.
    "రాజహంసా నా మాటవిను. నువ్వు నాకు కావాలి. దిలీప్ నెలకు పదిహేను రోజులు టూర్ మీద ఉంటాడు. అతనెక్కడ ఎవరితో సరసాలు సాగిస్తున్నాడో నీకు తెలీదు కదా! ఈ రోజుల్లో అంత బుద్దిమంతు లేవరున్నారు? జీవితం సుఖపడటానికి గానీ, చుట్టూ గీతలు గీసుకుని మనల్ని మనం బంధించుకోటానికి కాదు. మనిద్దరికీ అవకాశమున్నప్పుడుల్లా మనం కలుసుకుంటూ వుందాం. నువ్వు సుఖపడు నన్ను సుఖపెట్టు. లేదంటావా? నువ్వు నీ మొగుడ్నోదిలి వచ్చేసినట్లే నేను నా పెళ్ళానొదిలి వచ్చేస్తాను, నువ్విక్కడ్నుఛి వొచ్చేసి నాతో పర్మినెంట్ గా వుందూగాని"
    సెక్స్ విషయమొచ్చేసరికి మగాడు ఉచ్చమూ, నీచమూ , సభ్యతా, అసభ్యతా, వావి వరసా, పద్దతి అవునా కదా , మంచీ చెడూ సాధ్యమూ అసాధ్యమూ ఆలోచించకుండా మృగంలా ప్రవర్తిస్తాడు . అంతేగాక ఆ స్త్రీ తాలుకూ పురుషుడి కన్నా తనో హీరో నని తనలో అధిక్యతలున్నాట్లూ అనుకుంటాడు.
    "మాట్లాడవేం?" అంటూ రెండు చేతులూ ఆమె భుజాల మీద వేసి దగ్గరకు లాక్కోబోయాడు.
    అతని మాటలు వింటూ ఆశ్చర్యంలో వున్నదల్లా షాక్ నుంచి కోలుకుని, వెనక్కి జరిగి చాచి ఓ చెంప దెబ్బ కొట్టింది.
    దవడ పగిలిపోయినట్లవగా తెల్లబోయి చూశాడు.
    "గెటవుట్ రాస్కెల్ మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే పోలీసు కంప్లయింటిచ్చి అరెస్టు చేయిస్తాను. ఇసే గెటవుట్.
    ఆమె చూపులు నిప్పులు క్రక్కుతున్నాయి.
    అవమానంగా కోపంగా ఆమె వంక చూసి దవడ సవరించుకుంటూ , విసురుగా బయటకెళ్ళి పోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS