Previous Page Next Page 
మారణహోమం పేజి 30


    
    మధ్యలో కూలిపోయిన ఒక వంతెన బొమ్మ అది. దూరంనుంచి చూస్తే విరిగిపోయిన వంతెనలా కనబడుతోంది.    
    ముక్కుకు ఆనేంత దగ్గరగా పెట్టి చూస్తే మాత్రం అది శుభ్రంగా అతుక్కుని ఉన్నట్లే భ్రమ కలిగిస్తుంది.    
    భ్రాంతిలో ఉన్నవాళ్ళని ఈడ్చి చెంపమీద కొట్టి స్పృహలోకి తెచ్చేటట్లు ఉంది ఆ బొమ్మ.    
    చాలాసేపు కనురెప్ప వెయ్యకుండా దాన్ని చూసి కింద పెట్టేసింది అమూల్య.    
    "ఇప్పటికన్నా నిజం గ్రహించావా?" అన్నాడు నిఖిల్.    
    నెమ్మదిగా అంది. "జిమ్మిక్స్ తో జనాన్ని ఫూల్ చెయ్యడం ఈజీ! మీరు ఇందాక చెప్పారే నందిని పందీ, పందిని నందీ చెయ్యవచ్చని! ఈ జిమ్మిక్సుతో అలా చెయ్యడం చాలా సులభం!"    
    "నువ్వు చాలా గట్టిదానివి! అవునా! అయితే నాతో రా! చూపిస్తాను"    
    ఇద్దరూ లిఫ్ట్ ఎక్కి మూడో అంతస్తు చేరుకున్నారు. ఒక రూము తలుపు తెరిచాడు నిఖిల్. లోపలికి వెళ్ళకుండా బయటనే నిలబడిపోయింది అమూల్య.    
    "కొరుక్కు తినెయ్యనులే! రా!"    
    సంకోచంగా లోపలికి నడిచింది.    
    "అది చూడు!"    
    చూసింది. కిటికీకి దగ్గరగా ఒక గన్ స్టాండ్ మీద పెట్టి ఉంది. చాలా పవర్ ఫుల్ టెలిస్కోప్ ఒకటి అమర్చి వుంది దానికి.    
    "ఒక కన్నుమూసి రెండో కంటితో చూడు!"    
    అలాగే చేసింది అమూల్య. టెలిస్కోప్ లో నుంచి ఎదుటి బ్లాకులో ఉన్న ఒక గది కనబడుతోంది. టెలిస్కోప్ లో నుంచి గురి చూడడానికి వీలుగా దానికి రెండు సన్నటి తీగెలు ప్లస్ ఆకారంలో బిగించివున్నాయి. ఆ రెండు తీగెలూ కలుస్తున్న బిందువుకి ఎదురుగా కనబడుతోంది ఒక నున్నటి బట్టతల. దానికింద హిప్పోపోటామస్ లాంటి మొహం. అతని పెదిమలు కదులుతూ నిశ్శబ్దంగా ఏదో చెబుతున్నాయి. మాటిమాటికీ ఒక గాజుగ్లాసు అతని పెదిమలని తాకుతోంది.    
    వెనక్కి తిరిగి ప్రశ్నార్ధకంగా చూసింది అమూల్య.    
    "అతను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో నువ్వు ఊహించలేవు! అవునా? విను!" అంటూ ఒక బటన్ నొక్కాడు అతను.    
    ఆ ఎదుటిగదిలో రహస్యంగా అమర్చబడిన అతి సూక్ష్మమైన మైక్రోఫోనులో నుంచి మాటలు పెద్దగా వినబడడం మొదలెట్టాయి.    
    "రేపు ఎలక్షన్ లో బూత్ కేప్చరింగ్ చెయ్యాలి మనం. తుపాకులతో పోలింగ్ ఆఫీసర్లను బెదిరించి బూత్ లను ఆక్రమించుకుని బాలెట్ పేపర్ల మీద మన ముద్దర్లు గుద్దెయ్యాలి. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. గూడెం వాళ్ళెవరూ ఓట్లెయ్యకుండా చూడండి! వాళ్ళంతా ఎగస్పార్టీ వాళ్ళు! తిరగబడితే తరిగిపారెయ్యండి. ఇంకా తగ్గకపోతే నాయాల్ది తగలబెట్టెయ్యండి మొత్తం గూడేన్ని!"    
    ఇంకా ఎలక్షన్ వ్యూహం గురించి ఏదేదో చెబుతూనే ఉన్నాడతను.    
    స్విచ్ ఆఫ్ చేసేసాడు నిఖిల్.    
    "ఘోరమైన అన్యాయం జరపడానికి నీ కళ్ళముందే నాందీ ప్రస్తావన జరిగిపోతోంది. ఆపవలసిన వాళ్ళు ఆపగలరో లేదో నీకు తెలియదు! ఈ అన్యాయాన్ని సమర్ధవంతంగా ఆపగల శక్తి నీకే ఉంటే ఏం చేస్తావ్ అమూల్య!"    
    "షూట్ చేసి పారేస్తాను!" అంది అమూల్య కోపంతో వణుకుతూ.    
    "మరి చూస్తావేం! చెయ్యి!"    
    గురిచూస్తూ ట్రిగ్గర్ నొక్కబోయింది అమూల్య. ఉన్నట్లుండి బలంగా ఆమె భుజాన్ని పట్టుకుని పక్కకు లాగేశాడు నిఖిల్.    
    "హత్యలు చెయ్యడానికి మేం ఉన్నాం. ఒక హత్య చేసినా వంద హత్యలు చేసినా పనిష్ మెంట్ ఒకటే మాకు. నువ్వు కూడా హంతకురాలిగా మారనక్కర్లేదు. పక్కకి జరుగు!"    
    జరిగింది అమూల్య.    
    టెలిస్కోపిక్ వ్యూఫైండర్ లో నుంచి క్రూరమృగాన్ని గురి చూసినట్లు కొద్దిక్షణాలు గురిచూసి తర్వాత నెమ్మదిగా ట్రిగ్గర్ వెనక్కి లాగాడు నిఖిల్.    
    సైలెన్సర్ అమర్చబడిన ఆ గన్ లోనుంచి బుల్లెట్ సన్నటి శబ్దంతో వెలువడి అత్యంత వేగంతో ఎదుటి గదిని సమీపించి ఆ మనిషి కణతలను తాకింది.    
    మరుక్షణంలో నోరు తెరిచాడు అతను. నోటివెంబడి రక్తం స్ప్రే చేస్తున్నట్లు బయటికి వచ్చింది. కిటికీమీదకు ఒరిగిపోయి జారుతూ కింద పడిపోయాడు. అదంతా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది అమూల్య.    
    "తెలివితేటలు అంతగా లేకుండా రాబొట్ లాగా నేను చెప్పినట్లు చేసే మనుషుల కంటే నీలాంటి తెలివైన అమ్మాయి నాకు అండగా ఉండడం ఎంతో మంచిది అమూల్య! అందుకే నిన్ను మార్చడానికి ఇంత శ్రమ పడింది నేను" అన్నాడు నిఖిల్.    
    "ఇకనుంచి నేను మీ పక్షం!" అంది అమూల్య సిన్సియర్ గా.    
    "థాంక్స్ ఎలాట్! దానికి బదులుగా నేనూ నీకొక మంచివార్త చెబుతాను!"    
    "ఏమిటది!" అన్నట్లు చూసింది అమూల్య.    
    "నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పడం ఉత్త బెదిరింపు. హంబక్! నాకు అలాంటి ఆలోచనే లేదు అసలు! నిన్ను నా దగ్గర కొంత కాలం పాటు ఉంచాలని, ఉంచి నా సిద్దాంతంలోకి మార్చుకోవాలని మొదట్లోనే అనుకున్నాను. కానీ నేను నిజం చెప్పేక నువ్వు ఇక్కడ రిలాక్స్ డ్ గా ఉంటే ఆ సంగతి తరుణ్ కి తెలిసిపోయి అనుమానం రావచ్చు అతనికి. అందుకని నిన్ను టెన్షన్ లో ఉంచడంకోసం ఈ చిన్న నాటకం!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS