"ఏం అలాగేనా!" అంటూ చెప్పి రిసీవర్ పెట్టేసి గప్ చిప్ గా కూర్చుంది.
అంబిక చాలా సంతోషంగా ఉంది. ఒకటి కృష్ణమౌళి తనకు అప్పగించిన పని పూర్తి అయిపోతుంది.
ఇక వాళ్ళ పెళ్ళి జరిగిపోతుంది.
గణేశ్ రావు గారికి బుద్ధి చెప్పినట్లు అవుతుంది, అనుకుంది.
రెండవ కారణం తను తల్లి కాబోతుంది.
అపురూపమైన విషయం.
ఆయనతో మాట్లాడాలి అంటే ఎన్నడూ లేనిది ఈ రోజు చాలా సిగ్గు అనిపిస్తుంది.
అంతలో గుమ్మంవద్ద బూట్లు చప్పుడు అయింది.
జయరామ్ వస్తున్నాడు అని గ్రహించుకుంది.
55
జయరామ్ గదిలో అడుగుపెట్టాడు.
అంబిక మంచం మీద కూర్చుని అలాగే చూసింది అతనివైపు. ఒక్కక్షణం ఇద్దరి చూపులు ఒకటిగా అల్లుకుపోయాయి.
ఇద్దరి గుండెల్లో సంతోషం పొంగిపొర్లుతుంది. ఆ ఇద్దరికి ఆ క్షణంలో మాటలు కరువైపోయాయి. ఆమె జయరాంను ఇష్టపడి పెళ్ళి చేసుకోలేదు. కృష్ణమౌళి బలవంతం మీద పంతంపట్టి అతన్ని పెళ్ళి చేసుకుని అతనికి భార్య అయి ఆ యింటికి వచ్చింది. ఆ రోజులు ఆమెకు అంత సంతోషాన్ని కలిగించలేదు. కాని ఈ రోజు... ఈ రోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
జీవితం అంటే చాలా తియ్యనిది అని వివాహబంధం అంటే మరీ తియ్యనిది అని స్త్రీకి మాతృత్వం మహా గొప్ప వరం అని బుల్లిపాపకు తల్లికావటం నిజంగా ఎంతో అదృష్టం అని ఆ రోజే ఆమెకు అర్ధం అయింది. తను వృత్తిరీత్యా ఎందరో పసిపాపలను తల్లి వడిలో పడుకోబెట్టింది.
కాని... ఒక బిడ్డకు తల్లి కావడంలో ఉన్న తియ్యదనం ఆనందం ఆమెకు అప్పుడు తెలియలేదు. తను డాక్టర్ గా ఒక స్త్రీ అన్న భావం మర్చి వృత్తిలో నిండా మునిగిపోయింది.
ఆమె కళ్ళల్లో కాంతి తళుక్కుమంది.
భర్తవేపు సంతోషంగా అలాగే చూసింది.
జయరాం మనసు అలాగే ఉంది.
తను చాలా మొండివాడుగా ఉండేవాడు.
కఠిన గుండె కసాయివాడు.
నరరూప రాక్షసుడు అని అనుకునే వారు అందరూ.
అంబిక తన జీవితంలోకి ప్రవేశించి పూర్తగా మార్చేసింది.
ఒక్కసారి వెనుతిరిగి చూచుకుంటే తను నడిచి వచ్చిన త్రోవని చూచి తనే సిగ్గుపడ్డట్టుగా అయ్యాడు.
అంబిక తన జీవితంలోకి ప్రవేశించాక రోజులు హాయిగా, ఆనందంగా గడిచిపోసాగాయి.
తను తండ్రి కాబోతున్నాడు.
ఆ మాట వీనులవిందుగా చెవిలో అమృతం పోసినట్టుగా అనిపిస్తుంది.
పిల్లలు ఉండాలి అన్న ఆలోచనే తనకి ఎప్పుడూ ఉండేదికాదు.
కాని ఇప్పుడు ఆ మాట వినగానే గుండెల్లో సంతోషం పొంగి పొర్లిపోతుంది.
ఇంత అదృష్టాన్ని కలగ చేసిన దేవత అంబిక. అతను భార్యవైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఎన్నడూ లేనిది అతని చూపులతో తన చూపులు కలపాలి అంటే సిగ్గు అనిపించసాగింది.
కనురెప్పలు క్రిందకు వాల్చేసింది.
చూపులు నేలకు అంటుకుపోయాయి.
జయరాం ఒక్కో అడుగు మెల్లగావేస్తు ఆమెకు దగ్గరగా వచ్చి మంచంమీద కూర్చున్నాడు.
"అంబికా!" మృదువుగా పిలిచాడు.
ఆమె తలఎత్తి చూడ్లేదు. ఎన్నడూ లేనిది అతని ముఖంలోకి చూడాలి అంటే సిగ్గు ముంచుకు వస్తుంది. "అంబికా!" అంటూ ఆమె భుజాలచుట్టూ చెయ్యివేసి తనవైపుగా తిప్పుకున్నాడు.
కనురెప్పలెత్తి అతనివేపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ కనురెప్పలు క్రిందకు వాల్చేసింది.
"ఇంత మంచిమాట నాకు ఎందుకని చెప్పలేదు" అన్నాడు మెల్లగా.
ఆమె మాట్లాడలేదు. ఏదో తెలియని ఆనందంతో ఉక్కిరిబిక్కిరయి పోతుంది.
"అంబికా నేను తండ్రిని కాబోతున్నాను అన్నమాట వినగానే నేను ఎంత పొంగిపోయానో తెలుసా! నన్ను.... నన్ను... నువ్వు ఎంతగా మార్చేశావు!" అన్నాడు. అతని కంఠస్వరం గమ్మత్తుగా పలికింది.
తలయెత్తి అతనివేపు చూసింది.
"నిజం అంబికా! నువ్వు నా జీవితంలో ప్రవేశించి నన్ను చిత్రంగా మార్చేశావు. ప్రేమానురాగం వీటికి అర్ధాన్ని తెలిపేవు, జీవితమంటే ఏమిటో తెలియజేశావు. నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దేవు. నా అంత అదృష్టవంతుడు లేడని పొంగిపోయి గర్వపడేలా చేశావు" అంటూ ఆగి ఆమె కళ్ళల్లోకి చూశాడు.
ఆమె విశాలనేత్రాలు మధుర మనోహరభావాలతో మిలమిల మెరిశాయి.
అతని పెదవులమీద చిరునవ్వులు చిందులు వేశాయి. అతని కళ్ళల్లో వింతకాంతులు మెరుగులు దిద్దుకున్నాయి.
"అంబికా నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది" అడిగాడు.
"మాటలకు అందని భావాలు ఏవో నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తు నన్ను మాట్లాడనివ్వడం లేదండి" అంది.
ఆమె ముఖంమీద సిగ్గుదొంతరలు వ్యాపించాయి.
ఆమె కళ్ళల్లో అంతకుముందున్న కాంతులు ద్విగుణీకృతమయినాయి.
ముంచుకు వచ్చిన సిగ్గుతో ముఖం రాగరంజితం అయింది.
ఆమెను దగ్గరకు తీసుకుని గుండెలకు అదుముకున్నాడు.
"అంబికా! నీ దగ్గర నేను పదేళ్ళ పసివాడి నయిపోతున్నాను. ఆ మంత్రం నీ కళ్ళలో ఉందేమోనని నేను అనుకుంటున్నాను" అతని తల ఆమె మెడ ఒంపులో క్షణంసేపు అటూ ఇటూ కదిలింది.
