ఆమె దిలీప్ లో కొన్ని విశేషాలు గమనించింది. అతనెంత సోఫిస్టి కేటేడ్ సొసైటీలో జీవిస్తున్న అతని ఫ్రెండ్స్ అందరూ డ్రింక్ త్రాగే అలవాటున్న వారే అయినా, తను మాత్రం డ్రింక్ చేయడు స్వయంగా ఎన్నోడ్రింక్ పార్టీ లిచ్చాడు. కాని తను మాత్రం ముట్టుకోడు.
అంతేకాదు అతనికి సిగరెట్ కూడా అలవాటు లేదు.
అతనికి తనని సమర్పించుకున్న మొదటి క్షణంలోనే అతన్ని గాడంగా ప్రేమించింది. ఆ ప్రేమ ఇంకా ఇంకా పెరుగుతూ అతను లేని సమయాల్లో కూడా అతని ఊహలతోనే కాలం గడిపెయ్యడాన్ని అలవాటు చేసుకుంది.
* * *
దిలీప్ ఊళ్ళో లేడు. ఓ సాయంత్రం షాపింగ్ కని బజారు కెళ్ళి పార్కింగ్ ప్లేస్ లో కారు పార్క్ చేసి, షాపులు వున్న వైపు నడుస్తోంది.
"హలో" అని వినిపించింది ఓ ప్రక్క నుంచి.
తల త్రిప్పి చూసింది.
ముప్పయి ముప్పయిరెండేళ్ళ వయసులో వున్న ఓ యువకుడు నిలబడి ఉన్నాడు.
బాగా తెలిసిన ముఖం , ఎవరా అని ఆలోచిస్తుంది.
"రాజహంసా! బావున్నావా?"
జ్ఞాపకమొచ్చింది . వినోద్!
మర్యాదగా చిరునవ్వు నవ్వి "హలో వినోద్" అంది.
"ఈ ఊళ్ళో ఉన్నానని విన్నాను. ఊర్వశి చెప్పింది."
ఆ రకమయిన సంభాషణ అతని నోట రావటమిష్టం లేదన్నట్లు ముఖం చిట్లించింది.
మాట మార్చటానికి ప్రయత్నిస్తూ "ఈ ఊరు పని మీదొచ్చారా?" అంది.
"అవును, షాపింగ్ వచ్చావా?"
ఎప్పుడో అతని దగ్గర పని చేసింది. అప్పుడున్న పరిస్థితిలో ఇద్దరి మధ్యా ఒకటి రెండు సంఘటనలు జరిగాయి. అంతే! ఆ తర్వాత అతను జీవితం నుంచి చేరిగిపోయాడు. ఇప్పుడు ఈ వాతావరణంలోకి అతను మళ్ళీ జోరబడటం నువ్వు నువ్వు అని సంభోదించటం ఆమెకు నచ్చలేదు. అయినా ఏమీ అనలేకపోతోంది.
తల ఆడించి ఊరుకుంది.
"పద నేనూ వస్తాను."
ఆమె జవాబు కోసమేదురు చూడకుండా ప్రక్కనే నడవసాగాడు.
ఆమె షాపింగ్ చేస్తున్నంత సేపూ అతనేదో మాట్లాడుతూనే వున్నాడు.
రాజహంసకు విసుగ్గా, తలనొప్పిగా వుంది. అయినా భరిస్తోంది.
షాపింగ్ పూర్తయింది. ఇద్దరూ బయటికొచ్చారు.
"మీ రేటు వైపు వెడతారు?" అనడిగాడు.
చెప్పటానికి కిష్టం లేకపోయినా విధి లేక చెప్పింది.
'అరె! ఆ దగ్గరలోనే నాకూ పని వుంది. పదండి మీతో బాటు వస్తాను.' అని ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా అనుసరించాడు.
రాజహంసకు ఏం చేయాలో తోచటం లేదు. ఎలా తప్పించుకోవాలో తెలుయటం లేదు. అతను చొరవగా కారు ఎక్కి ముందు సీట్లో తన ప్రక్కన కూర్చుంటుంటే ఏమీ మాట్లాడలేకపోయింది.
ఈ భరించటమనేది జీవితంలో ఒక భాగం. ఇంచుమించు ప్రతిరోజూ వృత్తిరిత్యా గాని, వ్యాపారరీత్యా గాని ఇవేమీ కాకపోయినా సభ్యతరీత్యా గానీ ఇష్టమున్నా వాళ్ళతో బాటు ఇష్టం లేని వాళ్ళని నానా రకాల ఎలర్జీలను భరిస్తూ వుండాలి తప్పదు."
"నీకు గుర్తుందా?" అన్నాడు.
"ఏమిటది?" అన్నది అప్రయత్నంగా.
"కొన్ని సంవత్సరాల క్రితం ....ఒక సాయంత్రం అదే.....నీవు మా ఆఫీసులో పనిచేస్తున్న రోజుల్లో, నువ్వు నా ప్రక్కన కూర్చుండగా, నేను కారు డ్రైవ్ చేస్తూ అలా...కొంతదూరం తీసుకెళ్ళాను. ఇప్పుడు నువ్వు డ్రైవ్ చేస్తుంటే నేను ప్రక్కన కూర్చున్నాను."
'అందులో చిత్రమేముంది? జీవితమన్నాక ఎడారిలా నిర్మానుష్యంగా వుండదు. యధాలాపంగానో, యద్రుచ్చికంగానో ఎవరో ఒకరు తారసపడుతూ వుంటారు. ఏదో ఓ సంఘటన జరుగుతూ వుంటుంది. దానికంత ప్రాముక్యత నివాల్సిన అవసరం లేదు."
ఇరవై నిమిషాల తర్వాత రాజహంస ఇల్లు వచ్చెసరికి కారేపెసింది.
అతను కారు దిగక తప్పలేదు.
"ఇక్కడికి దగ్గరలోనే నాక్కావాల్సిన ఇల్లుంది అన్నాడు.
"సరే అయితే" అని గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళబోతోంది.
"ఇంటిదాకా వచ్చాక లోపలకు రమ్మనకుండా వెళ్ళిపోతున్నారేమిటి?"
'సారీ! నా హజ్బెండ్ వూళ్ళో లేడు" అని అక్కడ నిలబడకుండా వెళ్ళిపోయింది.
* * *
రాత్రి పదకొండు గంటలకు ఆమె అంతవరకూ ఓ నవల చదివి మెల్లమెల్లగా నిద్రలోకి జారుతుంటే ఫోన్ మ్రోగింది.
"దిలీప్ ఏమో" అనుకుంటూ చేయి జాపి ఫోన్ అందుకుంది.
