Previous Page Next Page 
మారణహోమం పేజి 29

   
    గతజీవితం: చాలా దోపిడీలూ, గృహదహనాలు, మానభంగాలూ చేయించాడు. గ్రామ పూజారి భార్యను ఎత్తుకెళ్ళిపోయి బలాత్కారం చేసినప్పుడు ఆ చుట్టుప్రక్కల గ్రామాలన్నిటిలో ఉద్రిక్తత పెరిగి 144వ సెక్షన్ పెట్టవలసి వచ్చింది. తర్వాత జరిగిన ఫైరింగ్ లో ఎనిమిది మంది మరణించారు. కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళిందిగానీ తగిన సాక్ష్యాలులేక కొట్టేశారు. అందరినీ భయపెట్టి అదుపాజ్ఞలలో ఉంచుకోవడం అతని టెక్నిక్కు. ఆ విధంగానే అతను పైకి వచ్చాడు. ప్రమాదకరమైన వ్యక్తి. కనిపెట్టి ఉండవలసిన వాడు."    
    (2) విశ్వరూప్ మిత్రా: వయసు నలభై ఏడు, చదువు బనారస్ మెట్రిక్ (అది దొంగ సర్టిఫికెట్ అని తర్వాత తేలింది) ధన్ బాద్ బొగ్గుగనుల మాఫియాలో ముఖ్యుడు. కిరాతకత్వానికి  మారుపేరు అతను. తనకి ఎదురు తిరిగిన ఒక కూలీ భార్యని - ఆమె తొమ్మిది నెలల గర్భవతి - పొద్దుటినుంచి రాత్రిదాకా కూర్చోనివ్వకుండా నిలబెట్టిన నిర్దయుడు అతను. ఆ తర్వాత ఆ అమ్మాయి వాతం కమ్మి చనిపోయింది.    
    పశుబలాన్ని పవర్ గా, పవర్ ని పదవిగా, పదవిని డబ్బుగా, మళ్ళీ డబ్బుని పవర్ గా మార్చుకోగలుగుతున్న కొంతమంది యాంటీసోషల్ ఎలిమెంట్స్ లో ఇతనొకడు.    
    ఇతను చేసిన హత్యల సమాఖ్య మతి భ్రమింపజేస్తుంది. కనీసం మూడువేల ఆరు వందల ఇరవై మంది ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ విశ్వరూప్ మిత్రావల్ల చంపబడి ఉంటారని నిశ్చయంగా చెప్పవచ్చు.    
    ఆ రెండు కేస్ షీట్లకీ చాలా ఎస్ కోజర్లు ఉన్నాయి. వాటిలో తారీఖులు, ప్రదేశాలు, ఖూనీలు, నమ్మకద్రోహాలూ వివరంగా రాసివున్నాయి. చిత్రగుప్తుడి చిఠాల లాగా ఉన్నాయి ఆ ఎన్ క్లోజర్లు.    
    ఫోల్డరు మూసేసి టేబుల్ మీద పెట్టి నిఖిల్ వైపు చూసింది అమూల్య.    
    "నెంబరు వన్ రోగ్స్ వీళ్ళిద్దరూ. వీళ్ళకి ఏం శిక్ష పడివుంటుందో ఊహించు."    
    "ఊఁ" అంది అమూల్య ముక్తసరిగా.    
    "కాదు ఊరికే వదిలేశారు వాళ్ళిద్దరినీ. ఊరిమీద దోచుకు తింటూనే ఉన్నారు వాళ్ళిద్దరూ! ఇంకా నిర్భయంగా నిస్సంకోచంగా!"    
    "ఇంపాజిబుల్!" అంది అమూల్య.    
    "ఇటీజ్ పాసిబుల్! ఎనీ థింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ రాటెన్ ఎస్టాబ్లిష్ మెంట్! ఈ వ్యవస్థలో నందిని పంది చెయ్యవచ్చు. పందిని నంది చెయ్యవచ్చు!"    
    ఈ వెధవలిద్దరిమీదా మీ తరుణ్ కన్ను కూడా పడింది. హి ఈజ్ ఏ గుడ్ గై ఆల్ రైట్! చాలా మంచివాడే తరుణ్! నిజాయితీపరుడే! నీతికోసం, డ్యూటీకోసం ప్రాణాలు పెట్టేవాడే! ప్రాణాలకు తెగించి ఈ సమాచారం అంతా సేకరించాడు, ఇద్దరిమీదా బైండు బుక్కులంత డోసియర్స్ తయారుచేశాడు.    
    అయితే ఏం లాభం! మంచి జరగబోతూ ఉంటే మధ్యలో అడ్డుపడే రాహువులు రాజకీయవేత్తల్లో చాలామంది ఉన్నారు. తరుణ్ తయారుచేసిన ఫైళ్ళు చేరవలసిన చోటికి చేరవు - ఎప్పుడూ! మధ్యలో ఎవరి డ్రాయర్లలోనే పడి మూలుగుతుంటాయి. ఆ ఛోటా నాయకులు ఆ ఫైళ్ళల్లో ఉన్న అన్ని వివరాలు అప్పుడు బయటపెట్టరు, వాళ్ళకి ఈ మాఫియా మనుషులతో పరస్పర సహకార సంబంధాలు ఉంటాయి.    
    వాళ్ళు ఆ ఫైళ్ళను ఎప్పుడు దుమ్ముదులిపి బయటకు తీస్తారో తెలుసునా! ఈ సహాయ్ లూ, మిత్రలూ మరింత బలపడిపోయి, తమకే ఎసరు పెడతారని భయం కలిగినప్పుడూ, వాళ్ళవల్ల తమ పదవికి చేటు వస్తుందని అనుమానం వచ్చినప్పుడూ, తమకు వ్యక్తిగతంగా వాళ్ళవల్ల ప్రమాదం వస్తుందని బెదిరిపోయినప్పుడూ మాత్రమే ఆ ఫైళ్ళని బయటికి తీస్తారు.    
    కానీ ఎప్పుడూ ఎప్పుడూ ఎప్పుడూ కూడా ఆ ఫైళ్ళని, నేరాలని, ఆ ఘోరాలని ప్రజలకోసం బయటపెట్టరు! పెట్టరు! పెట్టరు!"
    కోపంతో వణికిపోతూ బలంగా అరచేత్తో బల్లమీద గుద్దాడు నిఖిల్.    
    "తరుణ్ లాంటి నిజాయితీపరుడు కలెక్ట్ చేసిన సమాచారం అంతా కొంతమంది స్వార్ధపరుల చేతుల్లోపడి కొన్నిసార్లు నామరూపాల్లేకుండా నాశనమైపోతోంది. కొన్నిసార్లు నామ్ కే వాస్తే అన్నట్లు అతి కొద్దిగా మాత్రమే బయటపెట్టబడుతోంది!    
    కానీ ఆ సమాచారాన్ని ప్రజలకోసం కేవలం ప్రజల మంచిని దృష్టిలో పెట్టుకుని సరైన పద్దతిలో ఉపయోగిస్తోంది నేను! నేను మాత్రమే! నేనొక్కడ్ని మాత్రమే అమూల్యా!"    
    అవును! ప్రజల నోట్లో, ప్రభుత్వం కళ్ళల్లో దుమ్ముకొట్టి తిరుగుతున్న ఈ దుర్మార్గుల్ని చిత్రహింస పెట్టి చంపింది నేనే! నా కోసం కాదు! నీకోసం! నీలాంటి వాళ్ళందరికోసం! మీ కోసం అమూల్యా!"    
    ఏం మాట్లాడాలో తోచక మౌనంగా ఉండిపోయింది అమూల్య.    
    ఒక రోజంతా నిండు చూలాలిని నిలబెట్టి ఉంచిన నరరూప రాక్షసుడిని, పూజారి భార్యతో పాపం చెయ్యబోయి ఎనిమిది మంది మరణానికి కారణమైన పాషాణ హృదయుడిని చంపడం తప్పా!    
    లేకపోతే వాళ్ళు జనాన్ని చంపుకు తింటుంటే చూస్తూ ఊరికే ఉండడం ఒప్పా!
    మొదటిసారిగాసందిగ్ధంలో పడింది అమూల్య.    
    కానీ ఎంత సరిపెట్టుకుందామన్నా, ఒక పద్దతిలో క్రమశిక్షణలో పెరిగిన అమూల్యకి నిఖిల్ చేస్తున్నదీ చెబుతున్నదీ పూర్తిగా నచ్చలేదు.    
    అందుకని సందేహంగానే అంది.
    "మీరు చెబుతోంది నిజమే కావచ్చు. కానీ ఎదుటివాళ్ళు చేసిన తప్పే మనం చెయ్యడం కరెక్ట్ అవుతుందా? రెండు తప్పులు కలిస్తే ఒక ఒప్పు అవుతుందా మిస్టర్ నిఖిల్? ఇప్పుడున్న వ్యవస్థలో కొన్ని లోపాలు ఉండవచ్చు. దాన్ని సరిచేసే ప్రయత్నం చెయ్యకుండా మొత్తం వ్యవస్థనే కూల్చివేయాలని చూడడం మూఢత్వం అవదా?"    
    నిరసనగా నవ్వాడు నిఖిల్.    
    "మీ వ్యవస్థలో వట్టి లోపాలు ఉండడంగాదు, కూలిపోతున్న వ్యవస్థ అది!"    
    "నేను అలా అనుకోవడంలేదు!"    
    "ఎందుకంటే నువ్వు అందులోనే ఉంటున్నావు కనక! దగ్గరనుంచి చూస్తే కనబడని లోపాలు దూరంగా వెళ్ళి చూస్తేనే కనబడతాయి అమూల్యా! కూలిపోతున్న ఈ వ్యవస్థ తాలూకు చివరి అంచుమీద నిలబడి ఉన్నారు మీరు, మీ అవస్థ మీకు తెలియడంలేదు. దూరంగా ఉండి చూస్తున్న మాకు తెలుస్తోంది.    
    "ఇది చూడు!" అంటూ మరో బొమ్మ చూపించాడు నిఖిల్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS