సుభద్రమ్మ పెద్దావిడ మూలాన ఇట్టే గ్రహించుకుంది కోడలు నీర్సంగా ఉండటం సిగ్గుపడటం చూసి.
"ఏమిటమ్మా అలా ఉన్నావు నాకు చెప్పు ఏమిటో!" అంటూ అడిగింది.
"ఏం... ఏం లేదండీ కాస్త నీర్సంగా ఉంటేనూ" అంటూ మాట తప్పించడానికి చూసింది సిగ్గుతో చెప్పలేక. సుభద్రమ్మకి తను అనుకున్నది నిజమే అని రూఢిగా తెలిసిపోయింది. అంబిక సిగ్గుపడటం చూసి,
మళ్ళీ మళ్ళీ అడిగింది.
అంబిక సిగ్గుపడుతూ తల ఊపింది అవునంటూ. "ఇంత మంచిమాట మాకు చెప్పకుండా గుట్టుగా దాచుకున్నావా!" అంటూ సుభద్రమ్మ సంబర పడిపోయింది.
ఆవిడ వెళ్ళి భర్తకి, కొడుక్కి, కూతురికి అందరికి చెప్పేసింది.
గణేష్ రావు గారు నిజంగా చాలా సరదా పడిపోయారు. త్వరలో తాతయ్యను కాబోతున్నాను అని తెగ గర్వపడిపోయారు.
జయరామ్ అతని సంతోషాన్ని పైకి ప్రకటించలేక పోయాడు.
మనసులో సంతోషాన్ని మనసులోనే నొక్కిపట్టి ఉంచాడు. భార్య దగ్గరకు వెళ్ళి ఆమెను దగ్గరగా తీసుకుని ఆమె నోటినుండి ఆ మాటలు తను స్వయంగా వినాలని అతని మనసు తహతహలాడి పోతుంది.
జయరామ్ చిరునవ్వుతో అలాగే కూర్చున్నాడు అక్కడే.
ఇంద్రసేన తల్లి మాటలు వింటూనే చాలా సరదా అయిపోయింది.
తను త్వరలో అత్తయ్య కాబోతుంది.
ఒక చిన్నారి బుల్లిబాబు ఆ యింట్లో అవతరించ బోతున్నాడు.
"అన్నయ్యా నువ్వు మాకు అందరికీ పార్టీ ఇవ్వాలి" అంది అతను నవ్వాడు.
"అన్నయ్యను అడుగుతావేమిటే వదిన్ని అడుగు" అంది ఆవిడ నవ్వుతూ.
"వదిన్ని అడుగుతాను, ముందు అన్నయ్యను పార్టీ ఇమ్మంటాను. ఆ తరువాత వదిన్ని పిక్నిక్ కి తీసుకెళ్ళమంటాను. అక్కడ రోజు అంతా సరదాగా గడిపేయవచ్చు" అంటూ ఉత్సాహంతో చెప్పింది. ఇప్పుడే వెళ్ళి అడిగివస్తాను అంటూ ఛెంగున లేడిపిల్లలా గెంతుతూ మేడమీదకు పరుగుతీసింది.
ఇంద్రసేన మాట్లాడితేనే గాని తనకి భార్యతో మాట్లాడే అవకాశం దొరకదు అని ఊరుకున్నాడు ఆమె వచ్చాక మేడమీదకు వెళదామని.
కూతురు సరదాచూసి భార్యాభర్తలు ఇద్దరూ నవ్వుకున్నారు.
"చూడు సుభద్రా అమ్మాయి ఎంత సరదా పడిపోతుందో" అన్నారు ఆయన.
"సరదా కాదటండీ ఇన్నాళ్ళకి మన యింట్లో చంటిబిడ్డ పుట్టబోతుంది అంటే" అంది ఆవిడ సంతోషంగా. ఆ రోజు అందరికి సంతోషంగా, పండగగా ఉంది.
* * *
ఫోన్ రింగ్ అయితే అంబిక రిసీవర్ ఎత్తి "హల్లో" అంది.
రాత్రులు ఫోన్ ఆమె గదిలో పెట్టుకుంటుంది, ఏం అవసరం వస్తుందో అని.
రాత్రులు ఎక్కడికి అయినా వెళ్ళవలసి ఉంటే జయరాం కూడా ఉండి భార్యను తీసుకు వెళతాడు, ఏ పేషెంట్ ని అయినా చూడవలసి ఉంటే.
"నేను" అవతలి కంఠస్వరం మెల్లగా అంది.
"మీరా!" అంబిక మెల్లగా అంటూ చుట్టూ చూసింది భయంగా.
"ఆ ఏమిటి విశేషాలు!" కృష్ణమౌళి ఫోన్ లో అడిగాడు.
"ఏం లేవు ఇంతవరకు, సరే తరువాత" నవ్వింది అంబిక.
"నీకు నేను చెప్పాలా!" నవ్వాడు.
"అక్కర్లేదు అనుకోండి కాని మీరు కూడా చెప్తే ఆ తరువాత ప్లాన్ నేను ఆలోచిస్తాను" అంది.
అతను చాలాసేపు వివరంగా ఫోన్ లో చెప్పాడు.
అంబిక ఆ మాటలు శ్రద్ధగా విని నవ్వుకుంది.
"అలాగే మీరు చెప్పినట్టే ఎక్కడికి అయినా తీసుకువస్తాను" అంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది.
ఆమె అలా రిసీవర్ పెట్టగానే ఇంద్రసేన ఆ గదిలోకి రయ్యిన దూసుకువచ్చింది.
"వదినా నేవిన్నది నిజమేనా!" అంటూ చిన్న పిల్లలా అంబిక మెడ చుట్టూ చేతులు వేసి ఊగసాగింది.
అంబిక నవ్వింది.
"వదినా అన్నయ్య పార్టీ ఇస్తున్నాడు. నువ్వు పిక్నిక్ కి తీసుకెళ్ళాలి" అంది.
"పిక్నిక్ కే!" అంటూ ఆలోచనలో పడింది. కృష్ణమౌళి ఆమెను ఎక్కడికి అయినా తీసుకురమ్మన్నాడు. పిక్నిక్ కి వెళ్దామంటుంది.
ఇంద్రసేనని అక్కడికి తీసుకెళ్తే!
ఈ విషయం కృష్ణమౌళికి ఫోన్ చేసి చెప్పేస్తే!
అంబిక చాలా జాగ్రత్తగా ఆలోచించింది.
"వదినా ఏమిటి మాట్లాడవు!" అంది గర్వంగా.
"ఏం మాట్లాడను!" నవ్వింది.
"అబ్బా! పాపం తప్పించుకుందామని" అంది.
"మీ అన్నయ్యను అడుగు వెళ్దామంటే సరే మధ్య నా ఇష్టం ఏముంది! మీ అన్నా చెళ్ళెళ్ళ ఇష్టం"
"అబ్బా పాపం ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు. అన్నయ్య నీ మాట వింటాడా, నువ్వు అన్నయ్య మాట వింటావా!" అడిగింది కొంటెగా.
"మీ అన్నయ్య మాట నేను వింటాను" అమాయకంగా చెప్పింది అంబిక.
"ఆహా ఎంత చక్కగా చెప్తున్నావమ్మా" అంటూ ఇంద్రసేన నవ్వేసింది.
అంబిక కూడా నవ్వేసింది.
"సరే నేను అన్నయ్యకు చెప్పేస్తాను. ఈ రోజు అన్నయ్య పార్టీ ఇస్తాడు. రేపు నువ్వు పిక్నిక్కి తీసుకెళతావు సరేనా"
సరే అన్నట్టు తల ఊపి నవ్వింది అంబిక.
ఇంద్రసేన వెళ్ళిపోగానే అంబక గబగబ నెంబర్ డయిల్ చేసి కృష్ణమౌళికి రెండే రెండు మాటలు రహస్యంగా చెప్పేసి "మర్చిపోవద్దు" జాగ్రత్త.
"నేను చెప్పినట్టే చెయ్యండి."
