"మీరు దోషా ? ఎన్నటికీ కాదు" అంది ఆవేశంగా మృదుల తల త్రిప్పుతూ.
"మరి దోషి కాకపోతే యింత తతంగం ఎందుకు జరుగుతుంది మిస్ మృదులా !"
"అది వారి అవివేకం, కళ్ళు మూసుకుపోయాయి వాళ్ళకి."
రాజుగారు కొద్ది క్షణాలు ఎటో చూస్తూ మౌనంగా ఊరుకున్నారు. తర్వాత తల పంకిస్తూ మెల్లగా "యింత దూరం వచ్చాక ఏ పరిణామమైనా జరుగవచ్చు. కాని సస్పెన్ షన్ ఆర్డరువేసి, ఆ అవమానం కూడా నెత్తిన రుద్దకుండా వుంటే....చాలు" అన్నారు.
ఆ మాటలు అంటూన్నప్పుడు ఆయన ముఖంలో కనిపించిన భావాలు జీవితంలో మరిచిపోలేదు. ఒక రాజకీయవేత్త, జీవితదశల్లో, పంచరంగుల దృశ్యంలో పరాకాష్ఠ ననుభవించి, పరిస్థితులు అనుకూలించక పదవులు కోల్పోయి, తిరిగి సామాన్య పౌరునిగా మిగిలిపోతే, అది సహజంగానే కనిపిస్తుందిగానీ, ఒక ఆఫీసరు రివర్డు అయినా, సస్పెండ్ అయినా చాలా అస్వాభావికంగా గోచరిస్తుంది.
రాజుగారు యింక ఓ అయిదారేళ్ళలో రిటైరవుతారు. ఈ దశలో హితవుకాని ఓ మలుపు. మళ్ళీ కొత్త సమస్యలు. కొత్త పరిమాణాలు, కొత్త జీవితం ,కొత్త బాట నిర్ణయించుకోవాలి.
తర్వాత అక్కడ ఓ అరగంట కూర్చున్నాం. వారి అమ్మాయి కాఫీ తెచ్చియిచ్చింది ముగ్గురికీ. ఈ సున్నితమైన పరిస్థితిలో ఆతిథ్యం స్వీకరించటం ఎబ్బెట్టుగా తోచింది మాకు. అయినా బలవంతం చేయటం వల్ల తీసుకోక తప్పలేదు.
ఎన్నో కబుర్లు చెప్పారు రాజుగారు. తన బాల్యం, చదువు, ఆటలు కుటుంబ పరిస్థితులు, కష్టాలు, ఉద్యోగం, పిల్లలు, సమాజం....అన్నీ వివరించారు.
"ఎవరూ నమ్మరు. ఒక్క పైసా కూడా నిల్వ చేయలేదు. ఇన్నేళ్లు ఉద్యోగం చేసికూడ యిల్లుకూడా కొనుక్కోలేకపోయాను." ఆయన మాటల్లో విచారం ధ్వనించింది.
ఇహ అట్టేసేపు ఆయన టైము తీసుకుపోవటం మంచిదికాదని, ఇద్దరం లేచి సెలవు తీసుకుని, నెమ్మదిగా బయల్దేరాం.
భారంగా అడుగులు వేస్తున్నాం. "నన్ను మా యింటిదగ్గర దించి వెళ్ళవూ ? చీకట్లో నాకు వంటరిగా వెళ్ళటానికి భయంగా వుంటుంది" అంది మృదుల ప్రాధేయపడుతూన్నట్లు.
"అలాగే, పద, కాని రిక్షాలో పోకూడదూ ? ఏమీలేదు. ఇంతదూరం నడిస్తే సున్నితమైన నీ పాదాలు కందిపోతాయని."
"ఆహా ! వార్డులో గంటలకు గంటలు నిల్చుంటే కందిపోని పాదాలు, కాస్తదూరం నడిస్తే అరిగిపోవులే."
నేను నవ్వి, ఆమె ప్రక్కనే నడవసాగాను.
"కాస్త మెల్లగా అడుగులు వెయ్యి. ఇల్లు త్వరగా వచ్చేయటం నాకు బాగుండదు" అంది మృదుల.
కొన్ని చెరగని యిష్టాలుంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ, ఎలాంటి అనుభూతుల్లోనూ అవి అలాగే నిలబడి వుంటాయి.
మరో పదిహేను నిమిషాలు గడిచేసరికి మృదుల విశాలమైన భవంతి ముందుకు యిద్దరం చేరుకున్నాం.
చీకట్లో గేటుకు ఆనుకుని నిలబడింది మృదుల. లోపల గోడకు కట్టేసిన ఆల్సేషియన్ ఆమె ఉనికిని గమనించి గావును అరుస్తోంది. మేడమీది విశాలమైన గదుల్లో దీపాలన్నీ వెలుగుతున్నాయి.
"లోపలకు రాకూడదూ ?" అంది. యధాలాపంగా వున్నట్లు కనిపిస్తున్నా, ఆమె మాటల్లో ఎంత బరువుందో నాకు తెలుసు.
"ఈసారి వస్తాను ఇప్పటికే చాలా ఆలస్యమై పోయింది."
"ఆలస్యమైపోయిందా ? దేనికి ?" మృదుల నవ్వింది.
మళ్ళీ తనే అంది వెంటనే _"ఈ 'యీ సారికి' కి హద్దులు లేవు. ఏం ?"
"ఏం కాదు. ఈ భూమ్మీద నాకు అత్యంత ఆహ్లాదం కలిగించే ప్రదేశం నీ చుట్టూవున్న నూరుగజాలు. సెలవు" అని అక్కణ్నుంచి కదిలి ముందుకు సాగిపోయాను.
బహుశా మృదుల నిశ్చేష్టురాలై, కళ్ళప్పగించి చూస్తూ నిలబడి వుంటుంది. నేను కనుమరుగైపోయేవరకూ.
* * *
అలాగే సాఫీగా అయిపోయింది. తాడిపర్తిలో వున్న ఒక నెలానూ, ఒకసారి జగన్నాధం అన్న ప్రకాశరావు అనే అతను, ఆ ఊరొచ్చి, సరదాగా తమ్ముడితోపాటు తాడిపర్తి వచ్చాడు. ఆయన కూడా డాక్టరు. ప్రయివేటు ప్రాక్టీసు చేస్తున్నారు.
ఓ రోజు మధ్యాహ్నం భోజనాలయాక అంతా పేకాడుకుంటుంటే ప్రకాశంగారు మంచంమీద పడుకుని పుస్తకం చదువుకుంటూన్న నా దగ్గరకు వచ్చాడు. ఆయన ముప్పయి అయిదేళ్ళు పైబడిన మనిషి. అక్కడక్కడ జుట్టుకూడా నెరుస్తూంది.
"మీరు ఒక్కరూ వంటరిగా వున్నారేం ? మీకు పేకాట రాదా ?" అన్నాడు లోపలికి వస్తూ.
నేను చప్పునలేచి కూర్చుంటూ "రండి. కూర్చోండి" అని అతను కూడా ఆసీనుడయ్యాక "రావటానికేముందండీ ? నేను అన్నీ చేయగలను. పేకాట ఆడగలను. సిగిరెట్టు కాల్చగలను. త్రాగగలను. ఒక స్త్రీతో గడుపగలను. కాని వీటిలో ఏ ఒక్కటీ చేయలేదింతవరకూ" అన్నాను.
నా మాటలు విని అతను గట్టిగా నవ్వసాగాడు, "వెరీనైస్ వెరీనైస్" అంటూ.
తర్వాత కాసేపు నా ఊరు, కుటుంబం మొదలైన వివరాలన్నీ తెలుసుకున్నాక "హౌస్ సర్జన్సీ అయిపోయాక ఏం చేస్తారు?" అని అడిగారు.
"చదువుతానండీ. నాకు విసుగు పుట్టేంత వరకూ చదువుతాను. నాకు యిప్పుడప్పుడే ఆపాలని లేదు."
"తర్వాత? ఆ చదువుకూడా పూర్తి అయాక ఏం చేస్తారు ?"
"ఎంతవరకూ ఫలిస్తుందో, ఎంతవరకూ కృతకృత్యుణ్నవుతానో చెప్పలేనుగాని, ఎన్నో బంగారు కలలున్నాయి. మాది పల్లెటూరు. అక్కడ సరి అయిన వైద్య సౌకర్యం లేదు. చుట్టుపక్కల పదిగ్రామాలకు ఆసుపత్రి లేదు, ఏమాత్రం అవసరం వచ్చినా ముప్పయిమైళ్ళ దూరంలో వున్న బస్తీకి పరిగెత్తుకు పోవాలి .లేకపోతే అక్కడ వుండే మిడిమిడిజ్ఞానం వైద్యులతోనే సరిపెట్టుకోవాలి. అందుకని మా ఊళ్ళో ఒక పెద్ద నర్సింగ్ హోమ్ నిర్మించి, అక్కడ రకరకాల సదుపాయాలు ఏర్పాటుచేసి, ఆ రోగులతోనే, ఆ రోగుల మధ్యనే, వాళ్ళకి సేవచేస్తూ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ జీవితం వెళ్ళబుచ్చాలని వుంది."
"మీ ఆశయాలు బ్రహ్మాండంగా వున్నాయి ఇంతకీ ప్రయివేటు ప్రాక్టీసు పెడతానంటారు నేను పదేళ్ళబట్టి ప్రయివేటు ప్రాక్టీస్ చేస్తున్నాను. అందులోవున్న సాధక బాధకాలు చెబుతానుండండి" అంటూ యిహ ఆయన చెప్పుకొచ్చాడు.
ఇదివరకయితే ఎల్. ఎమ్. పి. డాక్టర్లయినా ప్రజలందరూ వారిదగ్గరకు పరిగెత్తుకుపోయేవారట. వాళ్ళు మందులిచ్చినా, కత్తిపుచ్చుకున్నా యిదేమిటని అడిగేవారు కాదుట. అది డాక్టర్ల స్వర్ణయుగమట! ఇప్పుడు రోజులు మారిపోయాయి ప్రజలు తెలివిమీరిపోయారు. డిగ్రీని చూసిగాని ఎవరి దగ్గరకూ పోవటంలేదు. అందులో కాస్ట్ ఫీలింగులు. ఇహ పేషెంట్లు వచ్చిన దగ్గర నుంచి రకరకాల ప్రశ్నలతో డాక్టర్ల ఓర్పును పరీక్షిస్తారు. చెప్పిందే చెబుతారు. అడిగిందే అడుగుతారు. కొంతమందికి ఇన్ జక్షన్ కావాలి. తలనొప్పి వచ్చినా ఇంజక్షన్ చెయ్యాల్సిందే అంటారు. అదే గవర్నమెంటు హాస్పిటలయితే అక్కడ డాక్టరు "నీకు తెలుసా ? నాకు తెలుసా ?" అని దబాయిస్తాడు. ప్రయివేటు ప్రాక్టీషనర్ అలాకాదు ఇంజక్షన్ చెయ్యాలని పేషెంటు అడిగితే, అవసరమున్నా లేకపోయినా ఏదో ఒకటి __ఏ బి. కంప్లెక్సో, బి. ట్వెల్వో చెయ్యాలి. లేకపోతే యీ డాక్టరు చేతకాని వాడిని యింకోడిదగ్గరకు పరిగెత్తుకుపోతారు. అర్దరాత్రిపూట వచ్చి లేపినా లేవాలి .పగలంతా చచ్చి చెడి పనిచేసి అలిసిపోయి లేవకపోతే ఆ డాక్టరు హృదయంలేని వాడనీ, పాషాణుడనీ పేరు పెడతారు. అతనూ మనిషేననీ, అతనికి మూడ్స్ ఉంటాయనీ, అతనికీ విశ్రాంతి అవసరమనీ వాళ్ళు గుర్తించరు. వాళ్ళు పథ్యం భోజనం చెప్పాలి. ఆవకాయ తినకూడదు, వంకాయకూర తినకూడదు అని వాళ్ళకిట్లా ఎన్ని నిషిద్దాలు చెబుతే అతనంత మంచి డాక్టరు. "ఫర్వాలేదు పోవయ్యా, నీకేజబ్బూ లేదు. అన్నీ వేసుకుతిను" అని అంటే ఆ డాక్టరు కేమీ తెలియదనుకుంటారు. డాక్టరు ఎంతసేపూ నవ్వుతూ మాట్లాడాలి. పేషెంట్లు ఎంత సోది చెబుతున్న ఓపిగ్గా వినాలి. లేకపోతే డాక్టరుగారు చిరాకుమనిషని పేరు పడుతుంది. ఎవరినీ డబ్బు గట్టిగా అడక్కూడదు .అడిగితే కోపం వస్తుంది. అడక్కపోతే యివ్వరు. అడిగితే కోపం. పైగా జబ్బుతగ్గిపోగానే మళ్ళీ పత్తావుండరు. మళ్ళీ ఏదయినా జబ్బు చేస్తేనే పునర్దర్శనం. కొంతమంది ఉంటారు.డాక్టర్ వారం రోజులు ఇన్ జక్షన్ చేయించుకోవాలని చెబుతే రెండు రోజులు చేయించుకుని కాస్త నిమ్మదించి ,డాక్టరు డబ్బు లాగటానికని అనవసరంగా ఎక్కువ ఇంజక్షన్ చేస్తానన్నాడని అనుకుని రావటం మానేస్తారు.
ఇహ కొంతమంది వుంటారు. వీళ్ళు డాక్టర్లతో బలవంతంగా పరిచయం పెంచుకుని పనివున్నా లేకపోయినా తరచు వచ్చి బాతాఖానీ చేస్తూ, ఆ పనీ యీ పనీ చేసి పెడుతూ మొహమాటంలో పెట్టేసి, ఉచితంగా వైద్యం చేయించుకుంటూ వుంటారు. అతనికీ ,అతని భార్యకూ, పిల్లలకూ, చుట్టపక్కాలకూ అందరికి ఫ్రీ వీళ్ళ బాధపడలేక డాక్టర్ వాళ్ళకు సమస్తం ప్రిస్రిప్షన్ రాసిచ్చేసి, తన చేతిది పడకుండా చూసుకుని, జాగ్రత్తపడుతూంటాడు కొందరు గడుసు డాక్టర్లు తమ డిస్పెన్సరీకి కావలసిన ఖరీదైన మందులు వాళ్ళకి రాసిచ్చి తెప్పించుకుని ,అవి తాము వుంచుకుని, తమ దగ్గర వుండే మందులు వాళ్ళకి సరఫరా చేస్తూ వుంటారు. డాక్టరు రాసిచ్చింది తీసుకురావటమైతే చేశారుగాని, ఏమిస్తున్నాడో, ఏమి చేస్తున్నాడో పేషెంటుకు తెలియదు కదా. అసలు నర్సింగుహోమ్ లో చాలావరకూ యింతే జరుగుతూ వుంటుందిట. పదిమందికి పనికివచ్చే మందులు ఒకడికి రాసిపారెయ్యటం, అది ఒక ఒకడికి వాడినంతవాడి మిగతావాళ్ళకు కూడా సర్దటం. లేకపోతే సౌమ్యంగా యింత యిమ్మని అడిగితే పేషెంటు గుండెలు బాదుకుంటాడు గదా.
