Previous Page Next Page 
హౌస్ సర్జన్ పేజి 28


   
    ఇప్పుడు, యీ స్మశానంలో  సంచరిస్తూ ,చెట్టుక్రింద  కూర్చుని  పేరు తెలియని పువ్వుల్ని  చూస్తూ నిట్టూర్పులు  విడుస్తూ  కాలం  గడుపుతూంటే ప్రపంచంలో  నా అంతటి వంటరి  యింకెవరూ  లేరనిపిస్తుంది. నేను యితరులు నన్ను భరించలేనంతటి  వంటరిని. నేనెందుకో  పుట్టాను. ఈ అశాంతిలో  నుండి  పుట్టిన  ఏకాగ్రతలో  యితర  ఆకర్షణలకు  చోటులేదు. ఇతరులకు  ప్రవేశం  లేనంతటి  యిరుకు  హృదయం  నాది అనిపిస్తూ వుండేది.

    ఆదివారం పూట  సెలవు. అందుకని  శనివారం  ఉదయమే పని అయిపోయాక  బస్సులో  వెళ్ళిపోయి, ఆ రెండు రోజులూ  అక్కడే  గడిపి తిరిగి సోమవారం తెల్లవారు ఝామునే  బయల్దేరి  తాడిపర్తికి వచ్చేసేవాళ్ళం.

    ఒకసారి అలా వచ్చినపుడు  ఓ దుర్వార్త  తెలిసింది _ రంగయ్య గారి పుత్రుడు మరణించాడని. ఆయనకు పెళ్ళయిన  పన్నెండేళ్ళ  వరకూ  పిల్లలు పుట్టలేదు. ఒక్కడే  కలిగాడు. తర్వాత  బహుశా  ముందు  ముందు యింకా  కలగక పోవచ్చు  కూడా. ఆ కుర్రాడి పోలియో వాక్సిన్  కోసమే  ఒకసారి  మేమిద్దరం  రాత్రంతా  ఆయన కారులో  లారీ  ఆఫీసుల  చుట్టూ  తిరిగింది.

    పిల్లవాడు  ఎపెండిసైటిస్  వచ్చి  పోయాడని  తెలిసింది.

    ఆ సమయానికి  రంగయ్యగారు  ఊళ్ళోలేరట. పిల్లవాడు  విపరీతంగా  బాధపడటం  చూచి   ఆయన భార్య  కంగారుపడి, ఏం చెయ్యాలో  తోచక చివరకు హాస్పిటల్ కు  తీసుకువచ్చింది.

    అప్పటికప్పుడు  ఆపరేషన్  చెయ్యాలి. ఆ రోజు  ఎస్. వన్  యూనిట్ వారిది డ్యూటీ  సర్జరీ  చీఫ్ స్వయంగా  ఆపరేషన్ చేశారు. అయినా ఫలితం  దక్కలేదు. తర్వాత  ఒక గంట సేపటి  కన్నా  ఎక్కువ  బ్రతకలేదు పిల్లవాడు.

    అది రంగయ్యగారి  దురదృష్టం. అదే  థియేటర్ లో ఎంతోమంది  పసిగుడ్డులకు  ఆపరేషన్ చేసి  ఆయన ప్రాణదానం  చేశాడు. అదే తన వరకూ  వచ్చేసరికి  విధి  బెడిసి కొట్టింది.

    ఈ వార్త విన్నాక  రంగయ్యగారిని  చూడ్డానికి  వెళ్ళాను. ఆయన తన ఆఫీస్ రూమ్ కిటికీలోంచి  శూన్యంలోకి  చూస్తున్నట్లుగా  కూర్చుని వున్నాడు. ముఖం  ఒక ప్రక్కనుంచి  మాత్రం  కనిపిస్తోంది. అతి గంభీరంగా, నిర్మలంగా, పసిపిల్లవాడివలె  కనిపించాడు. ఆ సమయంలో ఆయన్ని  పలకరించడానికి  మనస్కరించలేదు. ఒక  నిమిషం  మౌనంగా  నిలబడి  వెనక్కి  తిరిగి వచ్చేశాను.

    అప్పుడే కాదు, ఆ తర్వాత  ఎప్పుడూ  కూడా  ఆయన ఎదుట ఆ ప్రసక్తి  తీసుకురావటానికి  ధైర్యం చాలలేదు.

    అలాగే  మరో శనివారం  వెళ్ళినప్పుడు  యింకో  దుర్వార్త తెలిసింది. ఆ సంగతి మృదుల చెప్పింది. ఆమెను కలుసుకునేందుకు  గైనిక్ వార్డుకు వెళ్ళినప్పుడు  "ఈ విషయం  విన్నావా ?" అంది, తడబడే కంఠంతో. ఆమె ముఖం  వాడిపోయి  వుంది.

    "ఏమిటి మృదులా ?"

    "కూర్చో, చెబుతాను."

    ఇద్దరం  ఎదురెదురుగా  కుర్చీలో  కూర్చున్నాం.

    నా ముఖంలోకి దీనంగా చూస్తూ  మృదుల  "సూపరింటెండెంట్ రాజుగార్ని  ట్రాప్ చేసి ఆయనమీద  లంచం తీసుకున్నాడన్నా  నేరం ఆరోపించారు" అంది.

    నా శరీరం  గగుర్పొడిచింది. "ఏం జరిగిందో  వివరంగా  చెప్పు" అన్నాను.

    "ఇవేళ  ఉదయం  రాజుగారింటికి  పేషెంటునని  చెప్పుకుంటూ  ఎవడో లుంగీవాడు వెళ్ళాడుట  ఆయన అప్పటికి  డ్రెస్ చేసుకుని హాస్పిటల్ కి బయల్దేర బోతున్నాడట  కడుపులో  నొప్పి  అని బాధపడిపోతూంటే, జాలతలిచి అక్కడే  పరీక్షచేసి  హాస్పిటల్ కి వెళ్ళి ఎడ్మిట్  అవమని చెప్పాడుట, కన్ సల్టేషన్  ఫీజుని  చెప్పి  డబ్బు  పెట్టివున్న  కవరు ఆయన చేతికి  పేషెంటు అందీయగానే  మామూలుగా, చూసుకోకుండానే  ఆ కవరు కోటు జేబులో  పెట్టుకుని  కారులో  హాస్పిటల్ కు వెళ్ళిపోయారట  అరగంటతిరక్కుండానే  ఆయన ఆఫీసు'గదికి  పోలీసు యిన్ స్పెక్టరు వచ్చారు. "మీరు లంచం తీసుకున్నారని  అభియోగం వుంది సోదా  చేయటానికి  వచ్చాం" అన్నాడుట, లంచమేమిటని  రాజుగారు తెల్లబోతూంటే  కడుపు నొప్పితో బాధపడే ఓ పేషెంటు దగ్గర  బెడ్ యిప్పిస్తానని  వంద రూపాయలు తీసుకున్నట్లు  సాక్ష్యముంది" అన్నాట్ట  యిన్ సెక్టర్. "వంద  రూపాయలు కాదు. పరీక్ష  చేసినందుకు  ఫీజు క్రింద పాతిక రూపాయలుయిచ్చాడు. కావలసివస్తే చూసుకోండి." అని రాజుగారు  కోటు జేబులోంచి  కవరుతీసి  అందిచ్చారట. తీరా చూస్తే అందులో  వందరూపాయల నోటుంది. ఆనోటు నంబరు యిన్ స్పెక్టరు దగ్గరున్న  నంబరుతో  టాలీ  అయింది. "మిమ్మల్ని  అరెస్టు చేయటానికి  వారెంటు వుంది. కలెక్టరుగాని, డి. యస్. పి. గాని, ఫోన్ ద్వారానైనా, జామీన్ యిస్తే  వెళ్ళిపోతాను" అన్నాట్ట  యినస్పెక్టరు, రాజుగారు విభ్రాంతినుండి  తేరుకుని  కలెక్టరుగారికి  ఫోన్  చేస్తే  ఆయన  జామీనిస్తానన్నాడుట ఇన్ స్పెక్టర్  వెళ్ళిపోయాడుట. అదీ జరిగింది" అన్నది మృదుల గుక్క  తిప్పుకోకుండా, ఆవేశపడుతూ.

    ఎందుకనో  ఏనాటికైనా  యిలా  జరుగుతుందని  నాకనిపిస్తూ వుండేది. ప్రపంచంలో గొప్పవాడుగాగాని, మంచివాడుగాగాని  వున్నవాడు కూడా విరోధుల్ని పెంచుకుంటూ  వుంటాడు. తన ఉన్నత మనస్తత్వం ద్వారా, సంఘంలో తనకున్న పలుకుబడి  ద్వారా, ఏ సభల్లో  చూసినా, ఏ సమావేశాల్లో  చూసినా  అగ్రస్థానం వహించడం  ద్వారా  రాజుగారు  విరోధుల్ని పెంచుకున్నాడు. అంతేగాక  హాస్పిటల్ లో కూడా  ఆయనంటే  చాలా మందికి గిట్టలేదు. అవినీతిగా ప్రవర్తించిన అనేకమందికి  ఆయన సింహ స్వప్నంగా  తయారైనాడు. అర్దరాత్రిపూట  హఠాత్తుగా  విజిట్  చేస్తూ వుండేవాడు.

    ఆయన బెడ్ యిస్తానని చెప్పి  లంచం  తీసుకున్నాడన్నమాట  నేను కలలో  కూడా నమ్మను. ఆయన్ని యీ విషవలయంలోకి  యిరికించాలని  చాటుగా  ఎప్పణ్నుంచో  ప్రయత్నాలు  జరుగుతూ  వుండి వుంటాయి. ఈనాడు ఏ.సి.ఐ.డి. డిపార్టుమెంటుకు  చెందిన  వ్యక్తో ఆయనింటికి రోగిగా  నటిస్తూ  వచ్చి, గుట్లుగా తనపని  చేసుకుపోయాడు. ఆయన అమాయకంగా  యీ  ఊబిలో  దిగబడిపోయాడు.     

    మృదులకూ, నాకూ కూడా  ఆయనంటే  ఎనలేని  గౌరవం. ఆయన దగ్గర పనిచేసేటప్పుడు  ఎన్నో తెలియని  విషయాలూ, సద్గుణాలూ  నేర్చుకునాం, ఈ వార్త  విన్నాక పాతాళానికి  కృంగిపోయినట్లయింది.

    నిత్యజీవితం  మనుగడలో  ఎన్నోసార్లు  మన ప్రభుత్వానికి  కళ్ళూ, చెవులూ  లేవని మనకు స్పురిస్తూ  వుంటుంది. ఎక్కడ దోషం వున్నదో  గుర్తించలేదు .పైగా  యిలాంటి వికృతమైన  తప్పటడుగులు. ఈ సత్యం మరీ  గట్టిగా  యిప్పుడు స్పురించింది.

    "మనిషీ! నీకు యీ గడ్డపైన  గౌరవం  లభించదు. నీలో  ఏవైనా దివ్యమైన శక్తులుంటే  అవన్నీ  చంపి పారేస్తుంది మట్టి. నీ ఉనికి ఎప్పుడే విధంగా  మారుతుందో  దురూహ్యం. సరియైన  న్యాయం  జరగదు నీకిక్కడ. ఊరికే పైకి  రావాలని  ఆశించకు" అని ఆక్రోశించాను.

    ఉన్నత చదువులకనిగానీ, ఉద్యోగ ధర్మం  మీదగాని, విదేశాలకు వెళ్ళి, తిరిగి మనదేశానికి  రానిచ్చగించని  వ్యక్తుల్ని  చూసి  నే నిదివరకు  యీసడించుకునేవాణ్ని, వారందర్నీ  ఈ క్షణంలో  క్షమించేశాను.

    "ఏమిటి ఆలోచిస్తున్నావు ?" అనడిగింది మృదుల.

    "ఊ, చెబుతాను" అన్నాను పరధ్యానంగా. మనసులో  ఒక ఆలోచన మెదిలి  లేచి  నిల్చుని, మృదులా ! రాజుగారింటికి  వెళ్ళి వద్దాం పద" అన్నాను.

    ఆమె కూడా  వెంటనే  లేచి నిల్చుని "పద  వెళ్దాం" అని కదిలింది.     ఇద్దరం కలిసి బయటకు  వచ్చాము. సూపరింటెండెంట్ గారిల్లు అక్కడికి అరమైలు  దూరం పైగా  వుంది. అయినా  నడవటానికే  నిశ్చయించుకుని  యిద్దరం  పరధ్యానంగా  నడుస్తున్నాం. మధ్య మధ్య ఉండి ఉండి మృదుల ఒకమాట  మాట్లాడుతోంది. నేనేదో  మెల్లిగా సమాధానం  చెపుతున్నాను.

    మేము వెళ్ళేసరికి  దయానందరాజుగారు  లోపలెక్కడో  వున్నారు. మా పిలుపు విని బయటకు వచ్చారు. అప్పటిదాకా  బద్ధకంగా  పడుకుని  లేచివచ్చినట్లుంది. ముఖం  కళావిహీనంగా  వుండి, వడిలిపోయివుంది.

    మమ్మల్ని  చూసి  బలవంతాన  చిరునవ్వు  తెచ్చుకునేందుకు  ప్రయత్నిస్తూ  "ఓ ! మీరా ? రండి" అని మమ్మల్ని  కుర్చీలో  కూర్చోమని, ఆయన కూడా  మా కెదురుగా  కూర్చున్నాడు.

    బహుశా అప్పటికి పరామర్శ  చేయటానికి  ఎంతమంది  వచ్చి వుంటారో ! నేను కొద్దిగా లజ్జితుడినైనాను.

    "ఇప్పుడే వార్డులో  పనిచేస్తున్నారు మీరిద్దరూ ?" అని అడిగారు.

    జవాబు చెప్పాము. లుంగీకట్టుకుని, పైన చొక్కా  వేసుకుని అతి నిరాడంబరంగా వున్నారు. ఏ వేషంలో వున్నా, ఎంత దిగుల్లో వున్నా ఆయన్లో  హుందాతనం  మాత్రం  చెరిగిపోలేదు.

    "ఎలా వుంది  మీ హౌస్ సర్జన్సీ ?"

    మళ్ళీ  యాంత్రికమైన  ప్రశ్న. యాంత్రికమైన జవాబులు.

    "మీ లైఫ్ లో కల్లా  యిదే  బెస్ట్ పీరియడ్. ఏమయినా  నేర్చుకున్నా. ఎంజాయ్ చేసినా యిదే సమయం. నేను చదువుకునే రోజుల్లో  క్లాసంతటిలోకీ అల్లరిగా తిరిగేవాణ్ని. స్పోర్ట్సులోకూడా  అన్నీ  ఫస్ట్ నేనే. ఇహ చదువు...."

    అంటూండగా  దుఃఖం  ఆపుకుందామని  ప్రయత్నిస్తూ, ఆగక బలవంతంగా బయటకు దూకే రోదన.

    ఆయన ముఖం  నల్లబడిపోయింది. మాట మధ్యలోనే  ఆపేసి మా యిద్దరివంకా  నిస్సహాయంగా  చూస్తూ కూర్చున్నారు.

    "నా మిసెస్...." అన్నారు పొడిగా. "ఎంత చెప్పినా  వినటం లేదు. ప్రొద్దుటినుంచీ  ఒకటే ఏడుపు, అన్నం లేదు, నీళ్ళులేవు. తను చచ్చిపోతానంటుంది. ఆమె నెలా  ఓదార్చాలో  తెలియడంలేదు."

    ఇన్నాళ్ళూ  ఆయన్ని  పెద్ద  ఫిజీషియన్ గా, నిశితమైన  కార్యదక్షునిగానే  చూశాను. ఇప్పుడు సామాన్య మానవుడిగా  చూస్తున్నాను.

    మృదులకు  కళ్ళల్లో నీళ్ళు  నిండుకొచ్చాయి. జరిగిందానికి  మేము చాలా...." గాద్గదికంగా  అని వాక్యం  పూర్తిచేయలేక  తల దించుకుంది.

    "ఏం చేస్తామమ్మా ?" అన్నాడాయన నిర్మలమైన  మందహాసంతో. "మీవంటి మంచి మనసు ఆదరాభిమానాలు  పొందగలగటమే  చివరికి  అదృష్టంగా  మిగిలింది. ప్రొద్దుటినుంచీ  ఎంతోమంది  విద్యార్ధులూ, హౌస్ సర్జన్లూ, యితర డాక్టర్లూ  వచ్చి సానుభూతి తెలిపి  వెళ్ళారు. కాని  దోషి మీద సానుభూతి  ఏమిటి ,అమాయకత్వం కాకపోతే."        


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS