ఇలా కర్ణపేయంగా వివరించాడాయన.
అన్నీ విని ఊకొట్టి ఊరుకున్నాను. నా ఓర్పుగురించి నాకు నమ్మకం వుంది. నా నిజాయితీ గురించి నాకు విశ్వాసం వుంది.
భవిష్యత్తుమీద నాకు ఆశేగాని, బెంగలేదు .చెదరని ఆత్మవిశ్వాసం నాలో భద్రపరచబడి వున్నదంటే యితరుల అహంభావిననుకుంటారుగాని ,ఉన్నమాట నిజం.
ఆ తర్వాత వారంరోజులు తిరక్కముందే దుర్వార్త తెలిసింది. దయానందరాజుగారికి సస్పెన్షను ఆర్డర్లు వచ్చాయిట. వెంటనే ఆయన రిజైన్ చేసి ఊరినుంచి కుటుంబంతో సహా వెళ్ళిపోయాడట. ఏదైనా దూరప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రయివేటు ప్రాక్టీస్ పెట్టుకుందామనే ఆలోచనలో వున్నట్లు తెలిసింది.
* * *
పబ్లిక్ హెల్త్ పోస్టింగ్ అయిపోగానే ఓ బెడద తీరిపోయినట్లనిపించింది. తర్వాత పిడియాట్రిక్స్ లో వేశారు. అంటే జనరల్ పోస్టింగ్స్ అయిపోయి స్పెషల్ పోస్టింగ్స్ లోకి వచ్చాను.
మొదటి పదిరోజులూ ఓ.పి. తర్వాత వార్డు. ఓ.పి. లో ఎంత గోలగా వుండేదని ! పిల్లల్ని ఎత్తుకుని రావాలని తల్లులు వరుసలో నిలబడటం, ఆ వరుస తప్పించుకుని ముందుకు రావాలని ఎవరిమట్టుకు వారు ఆత్రంగా తోసుకోవటం, దెబ్బలాటలు ,కీచులాటలు, అరుపులు, కేకలు ,పిల్లల ఏడుపులు _ అక్కడి పరిస్థితిచూస్తే ఓ చేపల మార్కెట్ లాగానో, సంతలాగానో వుంటుంది తప్ప హాస్పిటల్ వాతావరణం కనిపించదు.
ఇహ యింజక్షన్ ల దగ్గర ఆ భీభత్సం వర్ణించటానికి వీలులేదు. బ్రతిమాలటం, దెబ్బలాడటం, నాకు ముందంటే నాకు ముందని తోసుకురావటం ,ఒక్కోసారి భయమేసేది.
ఆ పది రోజుల ఓ.పి. ఎన్నో రోజులు చేసిన ప్రయాసను కలిగించింది.
వార్డులో నేనూ, నారాయణ అనే యింకో అతనూ, రాజేశ్వరి అనే లేడీ హౌస్ సర్జన్ పనిచేసేవాళ్ళం.
ఆడవాళ్ళు సహజంగా కఠినంగా వుంటారని నాలో ఏర్పడిన అభిప్రాయం ఆమెను చూస్తే తిరిగి తిరిగి స్పురిస్తూ వుండేది. ఆమె ఒక్కనాడూ ఏ పేషెంటుతోనైనా, దయగాగానీ, ఆదరంగాగాని మాట్లాడగా చూడలేదు. ఎప్పుడూ విసుగుగానో ,వెటకారంగానో వాళ్ళతో మాట్లాడుతూండేది. వాళ్ళడిగిన దానికి విదిలించుకుని, జవాబు చెప్పకుండా వెళ్ళిపోవటమేగాని, ఆగి వివరంగా సమాధానమివ్వటం ఒకనాడూ నా కంటపడలేదు.
ఒకసారి ఓ స్త్రీ పిల్లనెత్తుకుని రాజేశ్వరికి కొంచెం దగ్గరగా వచ్చి ఏదో చెబుతున్నది.
"కాస్త దూరంగా వుండి చెప్పుతల్లీ, లేకపోతే నీ రోగాలు నాకు కూడా అంటుకుంటాయి" అని విసుక్కుంది.
ఆ స్త్రీ గాయపడి "నాకేం రోగాలు లేవమ్మగారూ!" అన్నది ఎర్రబడిన ముఖంతో.
"లేవూ? లేకపోతే ఆసుపత్రి కెందుకొచ్చావ్ ?"
అలా మాట్లాడేది.
ఓ.పి. లో అయితే ఎలానూ తప్పదు. వార్డులో కూడా టెన్ సి.సి.సిరంజి నిండా మందు తీసుకుని వరుసగా అందరికీ పొడుచుకుంటూ పోయేది.
"అలా అందరికీ ఒకే సూదితో చేస్తే ఒకరి జబ్బు ఒకరికి రాదా, అమ్మగారూ!" అని ఒక స్త్రీ అడిగితే.
"అధికం మాట్లాడకు. నువ్వేమైనా చదువుకున్నావా పెట్టావా ? ఈ సంగతులు నాకు తెలుసా ,నీకు తెలుసా ?" అని గద్దించేది.
పగటిపూట చీఫ్ రౌండ్సూ అవీ అయిపోయేసరికి రెండు గంటలు దాటిపోయేది. అందుకని సాయంత్రంవేళ అందరం విధిగా వచ్చి యింజక్షన్లు చేయవల్సి వచ్చేది. ఒక్కొక్కసారి "మా యిల్లు చాలా దూరం.రిక్షాకు డబ్బులు ఖర్చుపెట్టి దేముడా అని రావాలి. మీరు క్వార్టర్సులోనే వుంటున్నారు కదూ డాక్టర్ ! ఇవాల్టికి మీ రిచ్చేయకూడదూ డాక్టర్ ?" అని తియ్యగా మాట్లాడి తప్పించుకొనేది.
వచ్చినప్పుడైనా తనకు కేటాయించబడిన పేషెంట్లందరికీ యింజక్షన్లు చేసేదికాదు బద్ధకంవల్లనో, మరచిపోయో కొందరికి యివ్వకుండా వెళ్ళిపోయి, మరునాడు ఉదయం వచ్చినప్పుడు ఆ మరచిపోయిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి "యిదిగో ! నిన్న సూదిమందు యివ్వలేదని పెద్ద డాక్టరు గారితో చెబుతారేమో, జాగ్రత్త. చెప్పారంటే మీరు నాలిక పీక్కుని ఎంత గింజుకున్నా మీకు యింజక్షన్ చేసేదిలేదు" అని బెదిరించేది.
ఆ యిచ్చిన కాసేపూ ఒకటే వ్యాఖ్యానాలు. అందరికీ బాగున్న వస్తువులు ఆమె కళ్ళకు చెడిపోయినట్లుగా కనిపించేవి. "ఈ సిరంజి పగిలిపోయి వుంది. ఈ సూది బ్లాక్ అయింది. ఈ స్ట్రెప్టోమైసిన్ ఎంతసేపటికి డిసాల్వ్ అవదేమిటి?" అని ఏదో ఒకటి వ్యాఖ్యా విసిరేస్తూనే వుండేది.
ఇంగ్లీషులో, తెలుగులో నవల ఒకటి ఎప్పుడూ చేతిలో పట్టుకుని తిరుగుతూండేది ,ఎప్పుడూ చేతిలో వుంచుకుని, మిగతా వాళ్ళతో బాతాఖానీ చేయటమేగానీ, చదవగా ఎప్పుడూ చూడలేదు. పైగా "నా కొచ్చే నూట యాభయి రూపాయల్లో నలభయి రూపాయలు పెట్టి ప్రతినెలా పుస్తకాలు కొంటాను. పుస్తకాలు కొనందే వుండలేను. పుస్తకాలు నా ప్రాణం" అని అంటూ వుండేది.
ఆమె చాలా మందిని "మీ దగ్గర ఏమయినా పుస్తకాలున్నాయా ? ఉంటే నాకు తెచ్చి యివ్వకూడదూ ?" అని అడుగుతూండగా విన్నాను.
"డాక్టర్ ! మీరెప్పుడూ పుస్తకాలు చదివినట్లు కనబడరే ! మీకేమీ బుక్స్ అంటే యింటరెస్ట్ లేదా ?" అని అడిగింది నన్నోసారి.
నేను నవ్వి "అట్టే యింటరెస్ట్ లేదు" అన్నాను.
ఇహ నారాయణ ఎప్పుడూ పరాకుగా, చిరాకుగా వుండేవాడు. ఎంత చిన్న విషయమైనా సరే అతను ఒక నిముషం ఆలోచించిగానీ, బయటకు చెప్పలేడు. మహా మతిమరుపు మనిషి. ఎప్పుడూ ఆలోచిస్తున్నట్టు, బద్ధకంగా కనిపించేవాడు. ఎవరైనా ఏదన్నా అడిగితే 'ఊ' అని కాసేపు తడుముకుని జవాబిచ్చేవాడు.
మొదటి రెండు రోజులూ అక్కడి పని చూసి, బెదిరిపోయి "బాబోయ్ ! నేనిక్కడ పని చెయ్యలేను. మరే వార్డుకైనా మార్పించుకుంటాను" అని ఎవరితోనో అన్నాడట. ఆ వార్త ఎలా చేరిందోగాని పిడ్రియాట్రిక్ చీఫ్ వరకూ వెళ్ళింది. ఆయన అతన్ని పిలిచి "ఈ వార్లంటే నీకు యిష్టం లేదన్నావుట .ముందే నువ్వు చెప్పినట్లయితే యింకో హౌస్ సర్జన్ యిక్కడికి వచ్చే ఏర్పాటు నేను చేసుకుంటాను. నాకు బాగా పనిచేసే వాళ్ళు కావాలిగాని, విసుగు మనుషులక్కర్లేదు" అని చెప్పేశాడు.
అతను బాధపడి "లేదుసార్! నేనిక్కడే పనిచేస్తాను" అన్నాడుట.
తర్వాత నాతో "చీఫ్ అలా అన్నాక ఇంక వెళ్ళిపోతే బాగుండదు. ఇంకెంత? ఇరవైరోజులు. మీరు కాస్త సాయం పట్టారంటే నెట్టివేస్తాను" అన్నాడు నాతో. అతని హృదయం కల్లాకపటం లేనిది. తన సోమరితనంమీద తనే చమత్కారాలు విసురుకుంటూ వుండేవాడు. చీటికీ మాటికీ "నేనసలే విసుగు మనిషిని" అంటూండేవాడు.
నేను కూడా ఎప్పుడన్నా ప్రసక్తి వచ్చినప్పుడు "మీ రసలే విసుగు మనుషులు" అనేవాణ్ని సరదాగా.
మొత్తానికి యిద్దరు బద్ధకస్థుల మధ్య పడి, నలిగి అల్లాడిపోయాను. పని, పని _ ఎప్పుడూ చూసినా పని.
ఇక్కడి రోగులు పిల్లలు. రోజుల పిల్లలు, నెలల పిల్లలు ,కొద్దిగా ఎదిగిన పిల్లలు.
వాళ్ళ రోగాలు మెనింజైటిస్ లు, లివర్ జబ్బులు, జ్వరాలు, నిమోనియాలు, డయోరియాలు, చంటిబిడ్డ గుణాలు, తిండి చాలక పోవటవల్ల వచ్చే క్వాథీయార్కర్ జబ్బులు, రికెట్సు....ఎన్నో.
చంటిపిల్లలు ఈగల్లా చనిపోతూండేవాళ్ళు.
ఇవేళ నవ్వుతూ కనిపించిన పాప రేపు ఉయ్యాలలో కనిపించేది కాదు. డయేరియా, అశుభ్రతతో, దురలవాటులతో పొర్లాడే ప్రజల అనాగరికతకు చిహ్నం డయేరియా,
రోజుకు అయిదారుగురికన్నా సెలైన్ ఎక్కించేవాణ్ని. పిల్లలకు వెయిన్ దొరకటం చాలా కష్టం .కాలి దగ్గర చర్మం కొద్దిగా కోసి ,రక్తనాళాన్ని పట్టుకుని, అది కాస్త కత్తిరించి, అందులో పాలిథిన్ ట్యూబ్ పోనిచ్చి దానిద్వారా సెలైన్ ఎక్కించాలి. ఓపెన్ మెథడ్ ! మెడికల్ వార్డులో పనిచేసినప్పుడు అలవాటుంది కాబట్టి, సునాయాసంగా చేయగలిగే వాణ్ని.
ఓసారి రెండేళ్ళ పిల్లవాడికి లివర్ బయాప్స్ చేశాను. ఒక రకమైన పనిముట్టు ద్వారా లివర్ లోంచి చిన్నముక్క తీసి పరీక్షగా పంపించాను.
ఆ మధ్యాహ్నం వార్డుకు, పని చూసుకుందామని వచ్చేసరికి ఆ పిల్లవాడు, యించుమించు కోమాలో వున్నాడు. లివర్ బయాప్స్ చేయటంవల్ల లివర్ ఒక్కోసారి దెబ్బతిని కోమా వస్తుందని తెలుసుగానీ, అది నాకే ఎదురవుతుందనుకోలేదు. పిల్లాడి పరిస్థితి ప్రమాదంగానే కనిపించింది. వార్డులో ఎవరూలేరు. కార్డినోస్ యిద్దామని వెదికితే ఎక్కడా కనబడలేదు. కుర్రవాడు కళ్ళుతేలేసి మత్తుగా పడివున్నాడు. తల్లి నా చేతులు పట్టుకుని ఒకటే ఏడుస్తోంది .తండ్రి కిటికీలోంచి చూస్తూ బయట కాలుగాలిన పిల్లిలా తిరుగుతూన్నవాడల్లా లోపలకువచ్చి నావంక దీనంగా చూస్తూ నిలబడ్డాడు. నాకు చాలా భయం పుట్టింది. ఈ కుర్రాడి కేదైనా అయితే దానికి బాధ్యత నాదే అనిపించింది. ఓ కాయితం మీద డెకడ్రాస్ యింజక్షన్ రాసిచ్చి బజారు వెళ్ళి త్వరగా పట్రమ్మన్నను. ఈ లోపుగా సిస్టర్ సహాయంతో కడుపులోకి రబ్బరు గొట్టం ద్వారా గ్లూకోజ్ ఎక్కే ఏర్పాటుచేశాను.
ఓ అరగంట కుర్రాడి తండ్రి మందు తీసుకువచ్చాడు. వెంటనే మొదటి డోసు యిచ్చేశాను. తర్వాత ప్రతి మూడు గంటలకూ ఒకసారి చొప్పున యిచ్చాను. సాయంత్ర మయేసరికి పిల్లవాడి పరిస్థితి కొంచెం బాగుంది. అంతవరకూ డ్యూటీ డాక్టరుకు కబురు చేయకుండా ఒక్కణ్నే తిప్పలుపడుతున్నాను. సాయంత్రం పిడియాట్రిక్ అసిస్టెంట్ వచ్చినప్పుడు కేసు చూపించాను పరీక్ష చేశాక "బ్రతకటానికి అవకాశముంది. జాగ్రత్తగా చూస్తూ వుండండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి వార్డులోనే గడిపాను. ఆ రాత్రే కాదు ఏదయినా సీరియస్ కేసు వున్నప్పుడు రాత్రులు వార్డులోనే గడుపుతూండేవాణ్ని. ఎందుకంటే డ్యూటీ హౌస్ సర్జన్ అన్ని వార్డుల మెమోలు అందుకుంటూ ఎక్కడెక్కడో తిరుగుతూంటాడు. అతనికి మెమో అంది వచ్చి, తిరిగి డి.ఏ.పి.కి మెమో రాసి, ఆయనా వచ్చి చూసేసరికి రెండుగంటల టైము పడుతుంది. ఇదంతా జరిగేసరికి ముహూర్తం మించిపోవచ్చు.
