Previous Page Next Page 
రాజ హంస పేజి 28

 

    రాజహంస చాలా మృదువుగానే కాని స్పష్టంగా తన నిర్ణయాన్ని తెలియజేసింది.
    పాండురంగ ముఖంలో మొదట్లో తొట్రుపాటు, కలవరం కన్పించింది . కాని కొద్దిసేపటిలోనే సంభాలించుకున్నాడు. తర్వాత చాలా హుందాగా మాట్లాడాడు.
    "మన మధ్య .....ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పర్వవసానం తప్పదని ముందే ఊహించాను రాజహంసా. నా గురించి వదిలేయ్ . కాని అమ్మని గురించి, అనీల్ గురించి బాధపడుతున్నాను."
    "నేను రాక్షసిని కాను. నాది పశుప్రవృత్తి కాదు. నా అభిరుచులకు తగ్గ జీవితం నాకు లభించలేదు కాబట్టి ఇక్కడ ఇమడలేక అది దొరికేచోటుకు వెళ్ళిపోతున్నాను. అనీల్ ను మీ దగ్గరే వుంచేయ్యాటం భావ్యంగా తోస్తోంది. ఎందుకంటె వాడు నా దగ్గరుంటే గతాన్ని తుడిచి వేసుకునే అవకాశం పోయి,అది నిర్ధాక్షిణ్యంగా వెన్నాడి ఎప్పటికప్పుడు నాకూ, వాడికీ ఇద్దరికీ సమస్యలు సృష్టిస్తూ వుంటుంది. ఒక్కడే వుంటే కొన్నాళ్ళకు నన్ను మరచిపోతాడు. నేను వున్నాను అన్న నిజం కంటే, లేను అన్న భావనే అనీల్ భవిష్యత్తుకు మంచిది."
    పాండురంగ కొంచెసేపు అలోచించి "నీ ఇష్టం రాజహంసా" అన్నాడు.
    "విడాకులు , ఆ ప్రొసీజర్...."
    "అవన్నీ వద్దులే రాజహంసా! లేనిపోనీ రభస. నీ జీవితానికి నేనే విధంగా అడ్డు రాను. నన్ను నమ్ము."
    ఒక్కసారి అతని ముఖంలోకి చూసింది. మనసులో ఆలోచనలు, కోర్తూలూ, వాయిదా వాయిదాకూ రావటం అల్లరి.
    "సరే" అంది.
    అతను లేవబోతున్నాడు.
    మళ్ళీ ఏదో ఆలోచన వచ్చి "నా సైడు నుంచి సరే! ఎటువంటి వొత్తిడి వుండదు. మీరు మళ్ళీ పెళ్ళి చేసుకోదలిచి ఆ వచ్చేవారు ఖచ్చితమైన ప్రొసీజర్ వుండాలంటే....."
    "అలాంటి అవసరం రాదు రాజహంసా! ఎందుకంటె ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మళ్ళీ పెళ్ళి చేసుకోను కాబట్టి" బయటకు వెళ్ళిపోయాడు.
    తలలో ఆ దృశ్యమంతా గిర్రున తిరిగింది.
    అనీల్!
    ఉహు, ఆ జీవితం సమసిపోయింది. ఆలోచనా తరంగాలను బయటకు రానివ్వకూడదు.
    మనసు రాయి చేసుకుని అణగ ద్రోక్కెసింది.
    దిలీప్ నిద్రలో కదిలాడు.
    "దిలీప్" అని పిల్చింది.
    కళ్ళు విప్పాడు. "రాజా! నిద్రపోవటం లేదా?"
    "కొంచెం సేపటి క్రితం మెలకువ వచ్చింది.
    అతడు ఆమె చుట్టూ వున్న చేతిని బిగించి దగ్గరకు లాక్కున్నాడు.
    కొంచెం సేపు ఊపిరి సలపలేదు.
    "దిలీప్! ఒకటి అడగనా?"
    "ఏమిటి?"
    "ఏమీ అనుకోవు కదా?"
    "నన్ను బాధపట్టే ప్రశ్నలు నువ్వు వెయ్యవని తెలుసు, చెప్పు."
    "ఇదివరకు .....అంటే మనిమిద్దరం కలిసి వుండటం ప్రారంభించక ముందు బిజినెస్ టూర్ మీద నెలకు  పదిహేను రోజులు హైదరాబాద్ లో కాకుండా బయట ఊళ్ళూ తిరుగుతూ ఉండేవాడివి. రెండు నెలలుగా అసలేక్కడికీ పోవటం లేదు."
    అతను మెదలకుండా ఉండిపోయాడు.
    "చెప్పనా?"
    "నీ కోసమే!"
    "నా కోసమా?"
    "అవును, నా కంపెనీ లేకపోతే నువ్వు నొచ్చుకుంటవనీ వంటరితనం ఫీలవుతావని నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక."
    "ఎలా మేనేజ్ చేస్తున్నావు?"
    'అసిస్టెంట్స్ ని పంపించి."
    "నువ్వు వెళ్ళినంత భారీగా పనులు అవుతాయా?"
    'అవ్వవు."
    "దాని వల్ల నష్టముంటుందా?"
    అతను మాట్లాడలేదు.
    "చెప్పు దిలీప్."
    "వుంటుంది"
    "ఎంత?"
    "చాలా"
    "ఇవన్నీ నువ్వు లేకపోతే నేను కష్ట పెట్టుకుంటానని భరిస్తున్నావు కదూ. దిలీప్! నేను నిన్నెంతయినా ప్రేమిస్తూ వుండవచ్చు , నిన్ను విడిచి మధ్య మధ్య కొన్నిరోజులు గడపటం దుర్భారంగానే వుండవచ్చు. కాని ఇది చివరిదాకా వుండేదే. నా కోసమని నన్ను సంతోష పెట్టడం కోసమని బిజినెస్ టూర్లు అపు చేసుకుంటూ బాధ్యతల్ని విస్మరించటం వద్దండీ. నేనెలాగో ఒకలా ఎడ్జస్ట్ అవుతాను. మనిషిని ఎదుగుతాను, నాకు కాలక్షేపం కావాలనుకుంటే నాకు కొన్ని వ్యాపకాలు సృష్టించుకుంటాను, అంతేకాని బంగారం వంటి బిజినెస్ నాకోసం పాడుచేసుకోవద్దు.'
    "రాజా!' అన్నాడు అర్ద్రతగా. "నీలాంటి స్త్రీ సాంగత్యం లభించటం కన్నా పురుషుడికి ఇంకేం వరం కావాలి?"


    
                                                            16

    ఓ ఏడాది గడిచిపోయింది.
    రాజహంసకు తెలియకుండానే రోజులు తిరిగిపోతున్నాయి.
    దిలీప్ వూళ్ళో వున్నప్పుడయినా సరే .....లేనప్పుడు ఆ వంటరితనాన్ని భరించటం అలవాటు చేసుకుంది. మొదట్లో కష్టమనిపించింది. కానీ తన బాధను బయట కెప్పుడూ వ్యక్తం చెయ్యలేదు. పుస్తకాలు చదవటం, టి.వి. చూస్తూ కూర్చోవటం .....అతని వల్ల కొంతమంది ఫ్యామిలి ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. సాయంత్రాలు కారు డ్రయివ్ చేసుకుంటూ ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళేది. ఆమె స్నేహితుల్ని కూడా చాలా జాగ్రత్తగా సెలక్ట్ చేసుకునేది. ఇచ్చకాల కబుర్లు చెప్పేవాళ్ళు, సొంత వ్యవహారాల్లో తల దూర్చటానికి ప్రయత్నించేవాళ్ళు - వీళ్ళకు దూరంగా వుండేది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS