Previous Page Next Page 
మారణహోమం పేజి 28


    
    కారు నేరుగా వెళ్ళి ఇదివరకు కలైమణి హత్య జరిగిన హోటల్ ముందు ఆగింది. ఆ హోటల్ ఈ ముఠాకి "అడ్డా" లాంటిదని తర్వాత జరిగిన సంఘటనలవల్ల అర్ధమయింది అమూల్యకి.    
    ఒకసారి వచ్చిన పీడకలే మళ్ళీ వస్తున్నంత దిగులుగా ఉంది తనకి.    
    తను ఇప్పుడింకేమీ చెయ్యడానికిలేదా?"    
    మళ్ళీ అచ్చం ఇదివరకు జరిగినట్లుగానే జరుగుతోంది అంతా! ఈసారి కూడా ఆటను లంచ్ ఆర్డర్ చేశాడు తననేమీ అడక్కుండానే! ఈ లంచ్ తర్వాత ఇంకెక్కడికి తీసుకెళతాడు?    
    జ్వరంతో వళ్ళు వెచ్చబడినట్లు ఉంది అమూల్యకి.    
    లేకపోతే, ఇక్కడ మళ్ళీ ఇంకో హత్య జరగబోతోందా ఇప్పుడు? తను ఆ హత్యను కళ్ళారాచూసి మళ్ళీ దోషులని రక్షించాలా?    
    దిగులుగా, భయంగా, వెగటుగా అయిపొయింది మనసు.    
    "చెప్పు!" అన్నాడు నిఖిల్.    
    పెదిమలు తడి చేసుకుంది అమూల్య.    
    "ఏం చెప్పాలి?"    
    "నాతో పెళ్ళి నీకు ఇష్టమేనా?"    
    "పాముతో కాటు వేయించుకోవడం, పిచ్చికుక్కతో కరిపించుకోవడం, దున్నపోతుతో కలిసి బురదలో దొర్లడం ఎవరికన్నా ఇష్టంగా ఉంటుందా?"    
    కోపంతో నిఖిల్ ముక్కుపుటాలు పెద్దవయ్యాయి.    
    "నన్ను గురించి నువ్వు తెలుసుకున్నది ఇంతేనన్నమాట!"    
    "ఇంతేకాదు! అంతా తెలుసుకున్నా ననుకుంటున్నాను."    
    "ఇటు చూడు!" అన్నాడు నిఖిల్.    
    మెనూకార్డు తీసి దానిమీద ఉన్న బొమ్మ చూపిస్తూ.    
    "ఈలోగో చాలా చిత్రంగా ఉంటుంది. చూసి ఇదేమిటో చెప్పు!"    
    చూసింది అమూల్య.    
    "ఫ్లవర్ వేజ్!"    
    "కాదు ఇద్దరు అమ్మాయిల బొమ్మ అది అంటాను నేను."    
    మళ్ళీ పరీక్షగా చూసింది అమూల్య. నిజమే! ఈసారి ఫ్లవర్ వేజ్ కనబడడంలేదు. ఇద్దరు అమ్మాయిలు కనబడుతున్నారు బొమ్మలో!    
    "దాన్నే ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు అమూల్యా! మన దృక్కోణాన్ని బట్టే రూపాలు కనబడతాయి. బొమ్మలోని నలుపుని మాత్రమే చూసి ఫ్లవర్ వాజ్ అనుకున్నావు నువ్వు. తెలుపుని మాత్రమే చూసి ఇద్దరు అమ్మాయిలు అని అంటున్నాను నేను. అలాగే నాలో నలుపునే చూసి నేను చెడ్డవాడిని అనుకుంటోంది ఈ లోకం! నువ్వు తెలివైనదానివి! నాలో ఉన్న తెలుపుని కూడా చూడు అమూల్యా! నువ్వెరుగని కొత్తమనిషి కనబడతాడు."    
    ఏమీ చెప్పలేనట్లు మౌనంగా ఉండిపోయింది అమూల్య.    
    "ఇన్నాళ్ళు మాతో ఉండి ఇంకా ఏం చూశావ్?" అన్నాడు నిఖిల్.    
    "హత్యలు - చిత్రహింసలు - నరకయాతన"    
    "హత్య! ఎవర్ని హత్య చేశాను నేను?"    
    "కలైమణిని!"    
    "కలైమణి ఎవరు? ఒక దగాకోరు. దొంగ రైల్వేటిక్కెట్లు అచ్చుకొట్టి అమ్మిన అచ్చోసిన ఆంబోతు. ఫోర్జరీ చేసిన పాస్ పోర్ట్ లు అమ్మిన కట్ త్రోట్! సమాజానికి పట్టిన చీడ పురుగు లాంటివాడు కలైమణి. ఆ చీడపురుగును మరింత పెద్దది కాకముందే చంపడం తప్పా?"    
    అమూల్య మాట్లడలేదు.    
    "అవును! చిత్రహింస పెట్టి చంపాను. కానీ ఎవర్ని? రాధ అనే అమాయకురాలైన అమ్మాయిని ఎత్తుకువచ్చిన రౌడీ రమేష్ ని. అది తప్పా?"
    ఆమ్లెట్ మీద కొంచెం సాల్ట్ పెప్పరూ జల్లుకుని మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు నిఖిల్.    
    "నేను చిత్రవధ చేసి చంపిన ఆ మిగతా ఇద్దరూ మనుషులూ ఎవరో తెలుసుకోవాలని ఉందా నీకు?"    
    అమూల్య సమాధానం చెప్పకముందే ఒక ఫోల్డరు తీశాడు నిఖిల్. నీటుగా టైపు చేసిన నోట్స్ తాలూకు జిరాక్స్  కాపీలు ఉన్నాయి అందులో.    
    "చదువు!"    
    చదవడం మొదలెట్టింది అమూల్య.    
    "కాన్షిడెన్షియల్ - టాప్ సీక్రెట్" అని మార్క్ చేసివుంది మొదటి పేజీలో.    
    లోపల ఇద్దరు వ్యక్తుల తాలూకు వివరాలు రాసివున్నాయి.    
    (1) బాలాజీ సహాయ్: వయసు యాబై తొమ్మిది. చదువు నాలుగో క్లాసు. కోఆపరేటివ్ రంగంలో ప్రముఖస్థానం. చాలా సుగర్ మిల్స్ తో దగ్గరి సంబంధాలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS