ఆ రాత్రి గణేశ్ రావు గారికి నిద్ర పట్టలేదు. ఎంత వద్దనుకున్నా కృష్ణమౌళి గుర్తుకు రాసాగాడు. అతని మాటలే చెవుల్లో మారుమ్రోగసాగాయి.
ఆయన కోపంతో కుతకుతలాడిపోయారు.
తన కళ్ళముందు పుట్టి పెరిగిన కుర్రవెధవ తనని వెక్కిరిస్తూ శపధం చేస్తాడా!
దిక్కులేక తన యింటిలో పడివున్నాడు అన్ని రోజులు. అయినా విశ్వాసం లేకుండా కారుకూతలు కూస్తాడా!
తన అంతస్తు ఎక్కడ!
వాడి అంతస్తు ఎక్కడ!
తన కూతుర్ని పెళ్ళి చేసుకుందామన్న ఆశ చావకుండా విజృంభిస్తున్నాడా!
వాడి పని చెప్పాలి.
వాడి ప్రాణాలు తియ్యాలి కసిగా అనుకున్నారాయన.
"ఆ శ్యామల్ని మన యింటిలో పెట్టుకోవడం ముప్పు తెచ్చిపెట్టింది. ఆ కృష్ణగాడు పగబట్టిన నాగులా తయారయ్యాడు" ఆ మాటలు మనసులో అనుకుంటూ పైకే అనేశారు.
రాత్రి పడుకోబోయే ముందు మెడలో గొలుసు తీసి బీరువాలో పెడుతూ సుభద్రమ్మ ఆ మాటలు వింటూనే తలతిప్పి ఆయనవేపు చూసింది.
"ఇప్పుడెందుకండీ ఆ మాటలన్నీ. చనిపోయిన శ్యామల్ని అనుకోవటం దేనికి!" అంది ఆవిడ నిష్టూరంగా.
"ఎందుకా దాని కడుపున పుట్టిన కొడుకు అటువంటివాడు గనుక" అన్నారాయన కోపంగా.
"దీనిలో ఆ అబ్బాయి తప్పేముంది! మనమందరం కలిసి వాళ్ళు ఉన్నప్పుడే అనుకున్నాము. ఇప్పుడు మన మనసులు మార్చుకున్నంత సులభంగా వాళ్ళ మనసులు మారవు. పసి మనసుల్లో పడిన ముద్ర మనం చెరిపేయాలన్నా చెరిపేయలేము అది ఎవరికీ సాధ్యం కాదు"
గణేశ్ రావు గారు భార్యవేపు కోపంగా చూశారు. "నువ్వు వాళ్ళని వెనకేసుకొస్తున్నావా! వాడు నీ కూతురి సంబంధం చెడగొట్టాడు అది నీకు బాగుందా!" అడిగారు.
"కృష్ణమౌళి ఆ సంబంధం చెడగొట్టాడని మీకు ఆ అబ్బాయివచ్చి చెప్పాడా! ఆ అబ్బాయి వస్తాడని అంబిక చెబుతుందిగా" అంది ఆవిడ కాస్త గట్టిగా.
"చెబితే! వచ్చేస్తాడని నువ్వు నమ్మావా?"
"నమ్మాను. నమ్మకేం చేస్తాను. వస్తే వస్తాడు, పోతే పోతాడు. ఎవరు వ్రాసిపెట్టి ఉన్నారో! మనం ఆ రాతల్ని తప్పించగలమా!"
"అంటే నీ ఉద్దేశం!" ఆయన మండిపడ్డారు.
ఆవిడ మాట్లాడలేదు, ఒక్కోసారి ఆయన మాట్లాడే మాటలు వింటుంటే అసహ్యం వేస్తుంది ఆవిడకు.
తండ్రికి తగ్గట్టే పుట్టారు ఆ పిల్లలుకూడా అనుకుంటుంది మనసు విరిగిపోయి.
ఇలాంటివాళ్ళకి ఎంతచెప్పినా ఇక అంతే.
మూర్ఖపు మనుష్యులు.
"వాడు ఈ ఇంటికి అల్లుడు కావాలని కోరుకుంటున్నావా!"
"నేను కోరుకోవడంలో తప్పులేదు. అయినా మనమనుకుంటున్నట్లు జరిగితే ఇక భగవంతుని గొప్పతనం ఏముంది!"
"ఏ కన్నతల్లయినా కూతురికి గొప్ప సంబంధం రావాలని, కూతురు సుఖసంతోషాలతో చల్లగా కాపురం చేసుకోవాలని కోరుకుంటుంది. నువ్వు ఏమో చిన్నప్పుడు ఎప్పుడో బుద్ధి తక్కువై ఇచ్చినమాట ప్రకారం ఆ బికారి వెధవికి ఇచ్చి కట్టబెట్టాలని చూస్తున్నావు. నువ్వూ ఒక తల్లివేనా?" ఆయన కోపంతో రెచ్చిపోయారు.
"ఏమిటండీ ఆ మాటలు! ఇప్పుడు నే నేమన్నాను మీ ఇష్టప్రకారం పిల్లల ఇష్టప్రకారమే కానివ్వమంటున్నాను. నేను ఏ విషయంలో నయినా అడ్డుచెబుతున్నానా! నన్నంటారేమిటి?"
ఆయన మాట్లాడలేదు.
"అయినా ఇప్పుడు కృష్ణమౌళి బికారి ఎందుకయ్యాడు! లక్షలకు లక్షలు ఆ అబ్బాయి సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మనకంటే ఎక్కువగానే ఉన్నాడు. మీకు ఇష్టంలేకపోతే ఊరుకోండి ఆ అబ్బాయికి మీ కూతుర్ని ఇచ్చి పెళ్ళిచెయ్యడం ఇష్టంలేకపోతే మానేయండి. అంతేగాని ఎందుకు ఈ అర్ధంలేని ఆవేశాలు" అంది ఆవిడ కాస్త గట్టిగా. గణేశ్ రావు గారికి ఎప్పుడయినా కోపంవస్తే భార్యమీద రెండు కేకలు వేస్తారు అంతే!
అంతకు మించి ఏమీ అనరు.
ఆయన ఇక ఏం అనలేదు.
సుభద్రమ్మకూడా మరిక ఏం అనలేదు.
మాటలు పెంచేకొద్ది పెరుగుతాయేమో గాని ఆ మాటలు అంతటితో ఆగవు.
అందుకే ఆవిడ మవునం వహించింది.
* * *
ఆరోజు అంబిక రోజూలా ఉదయమే లేచి తయారయి హాస్పిటల్ కి వెళ్ళలేక పోయింది.
ఆమెకు ఒంటిలో చాలా నీరసంగా ఎలాగో ఉంది. మరికాస్సేపు పడుకుని అప్పుడు లేద్దామని అలా పడుకుంది.
సుభద్రమ్మ లేచి స్నానంచేసి పూజచేసుకుని బయటకు వచ్చినా కోడలు ఇంకా లేవకపోవటం ఆవిడకు ఆశ్చర్యమయింది.
ఏమిటి అమ్మాయి ఇంకా లేవలేదు, ఒంట్లో బాగోలేదా! అని కోడలి గదిలోకి వెళ్ళింది.
జయరామ్ అప్పటికే లేచి స్నానం చేసి బట్టలు మార్చుకుని క్రిందకు వచ్చేశాడు.
"అమ్మాయి అంబికా!" ఆవిడ మెల్లగా పిలుస్తూ మంచం దగ్గరగా వెళ్ళింది.
అంబిక పలకలేదు. కళ్ళు మూసుకు పడుకుని వుంది.
"అమ్మాయి" అంటూ భుజం తట్టి లేపింది.
అత్తగారి పిలుపుకి ఆమె ఉలిక్కిపడి లేచింది.
ఎదురుగా అత్తగారు నవ్వుతూ నిలబడి ఉంది.
అంబిక సిగ్గుపడ్డట్టు అయింది.
ఇంతవరకూ లేవకుండా పడుకున్నందుకు చటుక్కున లేవబోయింది. కాని నీర్సంగా అనిపించి త్వరగా లేవలేకపోయింది.
"ఏమ్మా అలా ఉన్నావు! ఒంట్లో బాగోలేదా!" అడిగింది ప్రేమగా.
"అబ్బే బాగానే ఉందండి" అంటూ నసిగింది. ఆ నసగటంలో సిగ్గుపడటం ఆవిడ కంటపడింది.
