Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 2 పేజి 29


    2. అగ్ని ఒక్కొక్క వ్యక్తి యజ్ఞమున అర్చనీయుడు. పనులు చేసియు అహంకరించనివాడు. స్వర్గ, పృథ్వి కన్యలకు స్వామి స్తోతల పుత్రవంతుడగు శక్తిపుత్రుడు, యజ్ఞమున ప్రదీప్త కేతురూపుడు. అట్టి అగ్నిని యజించుటకుగాను యజమానులను ప్రోత్సహింతును.

    3. సూర్యుడు దీప్తిమంతుడు. అతనికి విభిన్నరూపలగు ఇద్దరు కన్యలు రాత్రింబవళ్లు ఉన్నారు. వాటిలో ఒకటి నక్షత్రయుక్తము. రెండవది సూర్య సముజ్వులితము. అవి పరస్పర విరోధనులు. భిన్నరూప సంచారిణులు. పవిత్రతా విధాయకలు. మా స్తుతిభాజనలు. ఆ రాత్రింబవళ్లు మా స్తుతులు వినవలెను. ప్రసన్నలు కావలెను.

    4. వాయువు మహాధనసంపన్నుడు. అఖిల లోకనందనీయుడు. రథపూరకుడు. సమ్యక్ యజ్ఞపాత్రుడు. సముజ్జ్వుల రథారూఢుడు. జోడించిన అశ్వముల అధిపతి. దూరదర్శి. మా స్తుతులు మరుత్తులను చేరవలెను. మరుత్తులారా ! మీరు మేధావులు స్తోతలను ధనమున సమృద్దులను చేయండి.

    5. అశ్వినులు రథము సేచనము చేయును. అశ్వయుక్తమగును. ఆ సముజ్జ్వల రథము తన దీప్తితో నన్ను ఆచ్ఛాదితుని చేయవలెను. నేతలగు అశ్వినులారా ! రథము ఎక్కండి. మీ స్తోతల మనోరథము పూరించుటకు వారి ఇండ్లకు వెళ్లండి

    6. వర్షించు పర్జన్య వాయువులారా ! అంతరిక్షమున మీకు అందిన జలమును పంపించండి. జ్ఞానసంపన్నులు, స్తోత్రములు వినువారలు, జగత్ స్తాపకులగు మరుత్తులారా ! ఎవరి స్తోత్రములతో మీరు ప్రసన్నులగుదురో, అట్టివాని సకల ప్రాణులను సమృద్ధము చేయండి.

    7. సరస్వతి పవిత్రతాకారిణి. మనోహర విచిత్రగమన. వీరపత్ని. ఆమె మా యాగాది కర్మలను నిర్వహించవలెను. ఆమె దేవత పత్నుల సహితమయి ప్రసన్నకావలెను. స్తోతలకు కన్నములు లేని శీతాతపములకు దుర్ధర్షమగు గృహమును ప్రసాదించవలెను.

    8. పూష మార్గములకు అధిపతి. పూజనీయుడు. స్తోతలు వాంఛిత ఫలములకొఱకు స్తోత్ర సహితులయి అతనిని చేరండి. అతడు మనకు బంగారు కొమ్ముల ఆవులు ఇవ్వవలెను. సర్వకార్యములు పూర్తి చేయవలెను.

    9. దేవతలను పిలుచువాడును, వెలుగులుగల అగ్ని త్వష్టను యజించవలెను. త్వష్ట అందరకు ఆదివిభాజకుడు. ప్రసిద్ధ అన్నదాత. శోభనపాణి. దానశీలుడు. గృహస్థుల యజనీయుడు. అనాయాస ఆహ్వాన యోగ్యుడు.

    10. స్తోతలారా ! పగలు ఈ స్తోత్రములన్నింటితో భువనపాలక రుద్రుని వర్థిల్ల చేయుడు. రాత్రి రుద్రుని సంవర్ధితుని చేయండి.

    11. నిత్యతరుణులు, జ్ఞానసంపన్నులు, పూజనీయులగు మరుద్గణములారా ! యజమాని మిమ్ము స్తుతించు చోటునకు రారండి. నేతలారా ! మీరు ఇట్లే సమృద్దులయి, నడకలు నేర్చిన కరిణములవలె వ్యాప్తులై, వర్షము కలిగించి విశాల వృక్షారణ్యములను తృప్తులను చేయండి.

    12. పశుపాలకుడు గోయూధములను శీఘ్రముగ నడిపించినట్లే పరాక్రాంతులు, బలవంతులు, వేగగాములగు మరుత్తులవద్దకు శీఘ్రముగ స్తోత్రములు చేరవలెను. అంతరిక్షము నక్షత్రమండలముతో నిండి ఉన్నట్లు మేధావి స్తోతల సుశ్రావ్య స్తోత్రములతో మరుద్గణముల శరీరములు నిండవలెను.

    13. విష్ణువు ఉపద్రుత మనువుకొఱకు త్రిపాద పరాక్రమముతో పార్థివలోకపు కొలతలు వేసినాడు. అతడు మాకు తాను ఇచ్చిన గృహమున నివసించవలెను. మాకు ధన, దేహ, పుత్రుల అనుభవము కలిగించవలెను.

    14. మా మంత్రములతో స్తూయమానులగు అహిర్భుద్న, పర్వత, సవితలు మాకు జలసహిత అన్నము ప్రసాదించవలెను. దానశీల విశ్వదేవగణములు ఓషధులతో మాకు అదే అన్నమును ప్రసాదించవలెను. సుబుద్ధి భగుడు మమ్ము ధనములకు ప్రోత్సహించవలెను.

    15. విశ్వదేవగణములారా ! మీరు మాకు రథయుక్తము, అసంఖ్యాక పరిచార సహితము, అనేక పుత్రులతో కూడిన యజ్ఞ, సాధన గృహమును ప్రసాదించండి. అందుకే మేము స్పర్థించి శత్రువులను, దేవశూన్య సైన్యములను పరాజితులను చేయగలము. దేవభక్తులకు ఆశ్రయము కలిగించగలము.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత నాలుగవ అష్టకము ఆరవ మండలమున నాలుగవ అనువాకము సమాప్తము)

   
               అయిదవ అనువాకము                 ఏబదవ సూక్తము

        ఋషి - ఋజశ్వనుడు, దేవత - బహుదేవతాకం, ఛందస్సు - త్రిష్టుప్.

    1. దేవతలారా ! సుఖమునకుగాను స్తోత్రసహితుడనై అదితి, వరుణ, మిత్ర, అగ్ని, శత్రుహంత సేవ్య ఆర్యమ, సవిత, భగ; మున్నగు సమస్త రక్షక దేవతలను ఆహ్వానించుచున్నాను.

    2. దీప్తి సంపన్న సూర్యా ! దక్ష సంభూతులయి, శోభన, దీప్తివంతులగు దేవతలను మాకు అనుకూలురను చేయండి. ద్విజన్మ-స్వర్గ, భూములకు ఉత్పన్నులయిన దేవగణములు యజ్ఞప్రియులు, సత్యవాదులు, ధనసంపన్నులు, యాగార్హులు, అగ్ని జహ్వులు అగుదురు. (దక్ష శబ్దము తండ్రియని శాయణుడు)

    3. స్వర్గ పృథ్వులారా ! మాకు అధిక బలము ఇవ్వండి. మా స్వతంత్రతకొఱకు విశాల గృహము ఇవ్వండి. మావద్ద అతుల ఐశ్వర్యము ఉండు ఉపాయము చేయండి. దయాళువులగు దేవద్వయమా! మా ఇంటి నుండి పాపమును తొలగించండి.

    4. గృహదాతలు, అజేయులు, రుద్రపుత్రులను ఆహ్వానించుచున్నాము. వారు మా వద్దకు రావలెను. మాకు మహాక్షుద్ర క్లేశములందు వారు మాకు సాయపడవలెను. అందుకు మేము మరుత్తులను పిలుచుచున్నాము.

    5. మరుత్తులతో దీప్తమాన స్వర్గము భూమి లగ్నమై ఉన్నది. స్తోతలను సమృద్దులను చేయు పూష ధనముతో మరుత్తులను సేవించును. అట్టి మరుత్తులారా ! మా ఆహ్వానములు విని మీరు విచ్చేయునపుడు విభిన్న మార్గములందున్న ప్రాణులు కంపించును.

    6. స్తోతలారా ! అభినవ స్తుతులతో స్తుతిపాత్రుడు, వీరుడగు ఇంద్రుని స్తుతించండి. ఇంద్రుడు మన పిలుపులు వినవలెను. మనకు బోలెడు అన్నము ఇవ్వవలెను.

    7. జలరాశీ ! నీవుమానవ హితైషివి. మాపుత్ర, పౌత్రులకు అనిష్టనివారకము. రక్షకమగు అన్నమునిమ్ము. సమస్త ఉపద్రవములను శాంతింపచేసి దూరము చేయుము. నీవు తల్లులవంటి శ్రేష్ఠ చికిత్సకుడవు. నీవు స్థావర జంగమ రూప జగత్ స్రష్టవు.

    ("భిషజో మాతృతమా" నీరు తల్లులవంటి వైద్యుడు అన్నాడు. మరొకచోట "ఆపత్సుసర్వేభేషజీః" నీటిలో అన్ని ఔషధములు ఉన్నవి అన్నాడు. ఔషధముగా నీటి ప్రాముఖ్యతను ఆనాడు గుర్తించుట జరిగినది.)

    8. ఉష - ముఖమువంటి యజమానికి కోఱిన ధనమును వెల్లడించును. ఆమె - రక్షకుడు, హిరణ్యపాణి, పూజనీయుడగు సవితతో మావద్దకు రావలెను.

    9. శక్తిపుత్ర అగ్నీ ! మా యజ్ఞమునకు నేడు దేవతలను తీసికొనిరమ్ము. నేను సదా నీ ఉదారత అనుభవించవలెను. నీ రక్షణల వలన నేను శోభన పుత్ర, పౌత్రాదియుక్తుడను కావలెను.

    10. ప్రాజ్ఞులగు అశ్వినీ కుమారులారా ! నేను మీ పరిచర్యలు చేయువాడను. మీరు అంధకారమునుండి అత్రిని విడిపించినారు. అట్లే మమ్ము విడిపించుడు. నేతృద్వయమా! మీరు మమ్ము యుద్ధ దుఃఖమునుండి రక్షించండి. "దురితాదభీకే" 
    11. దేవతలారా ! మీరు మాకు దీప్తియుక్తము. బలకారి, పుత్రాదిసంపన్న, సుప్రసిద్ధ ధనము ప్రదానము చేయుడు. స్వర్గీయ-సూర్యసంబంధ, పార్థివ భూసంబంధ, గోజాత గోసంబంధ, జలజాత జలసంబంధులారా ! మా మనోరథములు పూరించుడు. మమ్ము సుఖవంతులను చేయండి.

    12. రుద్రుడు, సరస్వతి, విష్ణువు, వాయువు, ఋభుక్షి, వాజ, విధాత సమానముగా ప్రసన్నులు కావలెను. పర్జన్యుడు, వాయువు మా అన్నమును పెంపొందించవలెను.

    13. ప్రసిద్ధ దేవత సవిత, భగుడు, జలరాశి పుత్రుడు, దానశీల అగ్ని, మమ్ము రక్షించవలెను. దేవపురుషులు, దేవతా స్త్రీలతో సమానప్రసన్నుడగు త్వష్ట దేవతలలో సమాన ప్రసన్నమగు స్వర్గము, సముద్రముతో సమాన ప్రసన్నమగు భూమి మమ్ము రక్షించవలెను.

    14. అహిర్భుద్న, అజ, ఏకపాద, పృథ్వి, సముద్రము మా స్తోత్రము వినవలెను. యజ్ఞసమృద్ధికర్తలు, మాచేత ఆహూతులు-స్తుతులు, మంత్ర ప్రతిపాద్యమానులు, ఋషుల ద్వారా యజమానులగు దేవగణములు మమ్ము రక్షించవలెను.

    (అజో జన్మరహితః, అసహాయపివ గచ్ఛతీత్యేకపాత అనిశాయణుడు. అజుడు జన్మరహితుడు. ఇతరుల సాయములేక నడుచువాడు ఏకపాదుడు)

    15. భరద్వాజ గోత్రజులు, నా పుత్రులు ఈవిధముగనే పూజసాధక స్తోత్రములతో దేవతలను స్తుతింతురు. యజ్ఞార్హ దేవతలారా ! మీరు హవ్యహుతులు, గృహదాతలు, అజేయులు. మీరు దేవపత్నుల సహితముగ పూజింపబడుదురు.


                                          ఏబది ఒకటవ సూక్తము

    ఋషి - ఋజిశ్వనుడు, దేవత - వైశ్వదేవులు ఛందస్సు 13-15 ఉష్ణిక్, 16 అనుష్టుప్, మిగిలినవి త్రిష్టుప్.

    1. సూర్యుని యొక్క ప్రసిద్ధము, ప్రకాశకము, విస్తృతము మఱియు మిత్రావరుణలకు ప్రియము, అప్రతిహతము, నిర్మలము, మనోహరమగు దీప్తి ప్రకాశితమై అంతరిక్షమును భూషణమువలె అలంకరించుచున్నది.

    2. సూర్యుడు జ్ఞాతవ్య త్రిభువనములు తెలిసినవాడు. జ్ఞానశీలుడు. తెలియరాని దేవతల జన్మలు తెలిసినవాడు. మానవుల సదసత్ కర్మల పరిదర్శనము చేయువాడు. ఆ సూర్యుడు స్వామియై మానవుల అనుకూల మనోరథములను తీర్చును.

    3. నేను, యజ్ఞరక్షకులు, శోభన జన్ములగు అదితి, మిత్ర, వరుణ, ఆర్యమ, భగుని, స్తుతింతును. ఎవరి కార్యములు అప్రతిహతములో ఎవరు ధనశాలురో, ఎవరు జగములను పావనము చేయువారో అట్టివారి యశస్సును నేను కీర్తింతును.

    "అబ్ధిధీ తీవచ్ఛావో చేసధన్యః పావకాన్" స్తుష.

    4. అదితి పుత్రులు హింసకులను విసరివేయువారు. సాధురక్షకులు. శక్తిమంతులగు అధీశ్వరులు. శోభనగృహదాతలు. నిత్యతరుణులు. ఎంతో ధనమున్నవారు. స్వర్గ నేతలు. అట్టి అదితి పుత్రులారా ! నేను అదితిని శరణు వేడుచున్నాను. ఆమె నా పరిచర్యలు కోరుచున్నది.

    5. పితా స్వర్గమా ! మాతాపృథ్వి ! భ్రాతా అగ్నీ ! వసువులారా ! మీరు మమ్ము సుఖవంతులను చేయండి. అదితి పుత్రులారా ! అదితీ ! మీరందరు కలిసి మాకు అధిక సుఖములను అందించండి.

    6. యాగయోగ్య దేవతలారా ! మీరు మమ్ము వృక మఱియు వృకీల చేత పడనీయకండి. మీరు మా దేహము, బలము, వాక్యమును నిర్వహించండి. (వృక వృకీ ఆడ మగ తోడేళ్లు లేక దస్యులు)
   
    7. దేవతలారా ! మేము మీ వారలము. మేము ఇతరుల పాపబాధలు అనుభవించరాదు. వసువులారా ! మీరు నిషేధించిన వారిని మేము పూజించరాదు. విశ్వదేవతలారా ! మీరు లోకములకు అధిపతులు. అందువలన శత్రువు తన దేహమునకు తానే నష్టము కలిగించుకొను ఉపాయము చేయండి.

    8. నమస్కారము అన్నింటిని మించినది. అందువలన నేను నమస్కరింతును. నమస్కారమే స్వర్గ, భూములను ధరించును. అందువలన నేను దేవతలకు నమస్కరింతును. దేవతలు నమస్కారమునకు వశీభూతులు. అందువలన నమస్కారముతో పాపములకు ప్రాయశ్చిత్తము చేసికొందును.

    9. యజ్ఞపాలకులగు దేవతలారా ! మీరు యజ్ఞ నేతలు. విశుద్ధ బలసంపన్నులు. దేవయజన గృహ నివాసులు. అజేయులు. బహుదర్శకులు. అధినాయకులు. మహామహులు. నేను మీవద్ద నమస్కార సహితుడనయి ప్రణమిల్లుచున్నాను.

    10. మిత్రావరుణులు అగ్నిదీప్తి సంపన్నులు. వారు మా సకల పాపములను నాశనము చేయవలెను. వారు శోభన బలవంతులు, సత్యకర్ములు, స్తోత్ర నిరతుల విషయమున పక్షపాతులు.

    11. ఇంద్ర, పృథివి, పూష, భగ, అదితి, పంచజనులు మా నివాస భూమిని పెంపొందించుడు. వారు మాకు సుఖదాతలు, అన్నదాతలు, సత్పథ ప్రదర్శకులు, రక్షించువారు, ఆశ్రయదాతలు.

    (పంచజనులు 1. దేవతలు  2. మానవులు  3. గంధర్వులు  4. అప్సరసలు  5. పితరులు)

    12. దేవతలారా ! భరద్వాజ గోత్రజుడగు ఈ స్తోత మీ అనుగ్రహము కోరుచున్నాడు. అతనికి వెంటనే ఒక స్వర్గమువంటి నివాసము దీప్తిమంతమగు గృహమును ఏర్పరచండి. హవ్యదాతగు ఋషి-అన్య యజమానులతో కలిసి ధనార్థియై దేవతలను స్తుతించును.

    13. అగ్నీ ! నీవు కుటిలుడు, పాపి, దుష్టుడు, శత్రువును దూరము చేయుము. సాధుజన రక్షకా ! మాకు సుఖములను ప్రసాదించుము.

    14. సోమమా ! అభిషవ పోషకులమగు మేము నీ మిత్రుత్వము కోరుచున్నాము. నీవు తిండిబోతు పణిని సంహరించుము. అతడు నిజమైన దస్యుడు.

    15. ఇంద్రాది దేవతలారా ! మీరు దానశీలురు దీప్తిశాలురు. మార్గములందు మమ్ము రక్షించండి. సుఖదాతలు కండి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS