Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 2 పేజి 28


    9. ధనాఢ్య ఇంద్రా ! నీవు నీ పరాక్రమ అశ్వముల వెనుక విస్తృత రథమున నన్ను ఎక్కించుము. వివిధ అన్నములలో మా కొఱకు విశిష్ట అన్నమును తెమ్ము మఘవా ! ఎంతటి ధనవంతుడయినను, ధనమున మమ్ము మించరాదు.

    10. ఇంద్రా ! నీవు నన్ను సుఖవంతుని చేయుము. నా జీవనమును వృద్ధిపరచుటలో ప్రసన్నుడవగుము. నిన్ను ప్రసన్నుని చేయుటకు ఇప్పుడు నేను వచించినది అందరు గ్రహించవలెను. దేవగణములు నన్ను రక్షించుగాక.

    11. ఇంద్రుడు శత్రువుల నుంచి రక్షించువాడు. కోర్కెలు తీర్చువాడు. ఆహ్వానయోగ్యుడు. శౌర్యశాలి. సర్వసమర్థుడు. బహులోకవందనీయుడు. అట్టి ఇంద్రుని ప్రత్యేక యజ్ఞమునకు ఆహ్వానించుచున్నాను. ధనవంతుడగు ఇంద్రుడు మాకు సమృద్ధిని ఇవ్వవలెను.

    12. ఇంద్రుడు రక్షకుడు. ధనశాలి. అతడు రక్షణలతో మాకు సుఖమును ఇవ్వవలెను. అతడే మా శత్రువులను వధించును. భయరహితులను చేయును. అతని ప్రసన్నత వలన మేము శౌర్యవంతులమగుదుము.

    13. యాగార్హ ఇంద్రుని అనుగ్రహము, వృద్ధి, మంగళ ప్రియత్వమునకు మేము పాత్రులము కావలెను. రక్షకుడు, ధనవంతుడగు ఇంద్రుడు విద్వేషల నుంచి మమ్ము దూరము తీసికొని వెళ్లవలెను.

    14. ఇంద్రా ! స్తోతల స్తుతి, ఉపాసన, విశాలధనము, అభిషుత సోమరసము పల్లమునకు పారు నీటివలె నీ వద్దకే చేరును. వజ్రధర ఇంద్రా ! నీవు నీరు, పాలు, సోమరసములు చక్కగా మిశ్రమము చేస్తావు.

    15. ఇంద్రుని స్తుతించుటకు ప్రసన్నుని చేయుటకు యజ్ఞము చేయుటకు ఎవడు సమర్థుడగును? ధనశాలి ఇంద్రుడు నిత్యము. అతని శక్తిని గ్రహించును. బాటసారి నడకలో అడుగులు ముందుకు, వెనుకకు వేసినట్లు ఇంద్రుడు బుద్ధిబలమున స్తోతలను ఒకప్పుడు ముందుకు మరొకప్పుడు వెనుకకు నడిపించును.

    (కేవలము ముందునడక సాధ్యపడదు. ముందుకు సాగునపుడు సహితము వెనకడగు తప్పనిసరి అగును. ఇది వ్యక్తికి, కుటుంబమునకు, సమాజమునకు సర్వమునకు వర్తించునది.)

    16. ప్రబల శత్రువును అణగద్రొక్కియు స్తోతల స్థానములను సదా పరివర్తనము చేసియు ఇంద్రుడు తన శక్తిని ప్రదర్శించును. గర్వపోతులను ద్వేషించువాడు పార్థివ, దివ్య ధనముల అధిపతి ఇంద్రుడు తన సేవకులను రక్షించుటకుగాను అప్పుడప్పుడు వారిని పిలుచును.

    17. ఇంద్రుడు తనను ఉపాసించని వ్యక్తులను విడుచును. తనను సేవించువారితో అనేక వత్సరములు ఉండును.

    18. ఇంద్రుడు సకల దేవతల ప్రతినిధి. ఇంద్రుడు మూడు విధముల "ఇయమగ్నిరయం విష్ణురయం రుద్రో ఇత్యెవ" రూపములు ధరించును. ఈ రూపములు ధరించిన ఇంద్రుడు వేరువేరుగా వ్యక్తుడవగును. అతడు తన మాయతో అనేక రూపములు ధరించి యజమానుల వద్దకు వచ్చును. ఇంద్రుని రథమునకు వేయి గుఱ్ఱములు ఉండును.

    (ఇంద్రుడు తన మాయతో అనేక రూపములు దాల్చగలవాడయినందున రథమునకు బహుసంఖ్యాక అశ్వములు)

    19. ఇంద్రుడు రథమున గుఱ్ఱములు పూన్చి ముల్లోకములందు అనేక స్థానముల విదితుడగును. ప్రతిదినము స్తోతలలోనికివెళ్లి వారిని శత్రువులనుండి రక్షించగలవాడు ఇంద్రుడు కాక మరెవ్వడగును?

    20. దేవతలారా ! మీరు తిరిగి తిరిగి గోవులు లేనట్టియు, దస్యులకు నిలయమైనట్టియు ప్రదేశమునకు వచ్చినారు !

    బృహస్పతీ ! గోవుల అను సంధానమున మమ్ము చేర్చుము.

    ఇంద్రా ! ఇట్టి దారితప్పిన ఉపాసకులకు దారి చూపుము.

    21. ఇంద్రుడు అంతరిక్ష గృహమునుండి సూర్యరూపమున వెడలును. దినమునందలి అపరార్థమును ప్రకాశితము చేయును. ఆవిధముగా ప్రతిదినము ఒకేరీతిగా రాత్రిని దూరము చేయును. "ఉదవజ్ర" దేశమున శంబర, వర్చోనామములుగల ధనార్థులయిన ఇద్దరు దస్యులను వర్షకారి ఇంద్రుడు సంహరించినాడు.

    22. ఇంద్రా ! 'ప్రస్తోతుడు' నీ స్తోతలమగు మాకు బంగారమునిండిన పదికోశములు, పది గుఱ్ఱములు దానము చేసినాడు. అతిథిగ్వుడు శంబరుని గెలిచి సాధించిన ధనమును మేము దివోదాసునిద్వారా పొందినాము.

    23. నేను దివోదాసునుండి పది అశ్వములు, పది స్వర్ణకోశములు, బట్టలు, కోరినంత అన్నము, "దశో హిరణ్యపిండాన్" పది హిరణ్య పిండములను అందుకున్నాము.

    24. ప్రస్తోకుని సోదరుడు అశ్వబ్ధుడు 'పాయు'నకు పది గుఱ్ఱములు, రథము అథర్వగోత్ర ఋషులకు వంద గోవులు దానము చేసినాడు.

    25. భరద్వాజ పుత్రుడు, అందరి మేలుకోరి ఈ ఐశ్వర్యమును గ్రహించినాడు. సృంజయపుత్రుడు ప్రస్తోకుడు. అతనిని పూజించినాడు.

    26. కలపతో నిర్మించిన రథమా ! నీ అవయవములన్నియు గట్టివి కావలెను. నీవు మాకు రక్షకుడవు. మిత్రుడవగుము. నిన్ను గోచర్మముతో కప్పినారు. మమ్ము దృఢగాత్రులను చేయుము. నీ మీద ఎక్కిన రథి రణరంగమున శత్రువులను అనాయాసముగా గెలుచుటకు సమర్థుడు కావలెను.

    27. ఈ రథము భూమి. స్వర్గముల సారముతో నిర్మించబడినది. వనస్పతుల గట్టి ధనముతో ఏర్పడినది. నీటి వేగమువంటి వేగము కలది. గోచర్మమున కప్పబడినది. వజ్రమువంటిది. ఋత్విక్కులారా ! హవ్యముతో రథపు యజ్ఞము చేయండి.

    28. దివ్యరథమా ! నీవు ఇంద్రుని వజ్రస్వరూపవు. మరుత్తుల అగ్రవర్తివి. మిత్రుని గర్భమవు. వరుణుని నాభివి. మా యజ్ఞమున ప్రసన్నవై హవ్యము గ్రహింపుము.

    29. హే యుద్ధ దుందుభీ ! నీ ధ్వనితో స్వర్గమర్త్యలోకములను పూరింపుము. స్థావర జంగమములు నీ ధ్వనిని గుర్తించవలెను. నీవు ఇంద్రుడు మఱియు ఇతర దేవతలతో వచ్చి మా శత్రువులను దూరము చేయుము.

    30. దుందుభీ ! మా శత్రువులను ఏడిపించుము. మాకు బలము నిమ్ము. నీ ధ్వని శత్రువులకు దుఃఖము కలిగించవలెను. మాకు అరిష్టముచేసి ఆనందించువారిని దూరము చేయుము. నీవు ఇంద్రుని ముష్టివి. అందువలన మాకు దృఢత్వము ఇమ్ము.

    31. ఇంద్రా ! ఓ ఇంద్రా ! మా గోవులన్నింటిని నిలువుము. మావద్దకు తెమ్ము. అందరివద్దకు చాటింపు చేరునట్లుగా దుందుభి భీషణరవము చేయుచున్నది. మా సేనలు అశ్వారూఢులయి ఒకచోట కూడినారు.

    ఇంద్రా ! మా రథారూఢసేనలు, ఇతర సేనలు యుద్ధమున విజయవంతములు కావలెను.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత నాలుగువ అష్టకము ఆరవ మండలమున ఏడవ అధ్యాయము సమాప్తము)


        ఓం వతామినన్తిమాయివో వధీరావ్రతాదేవానాం ప్రథమాద్రవాణి
        నరోదసే అద్రుహా వేద్యాభిర్నపర్వతావి యే తస్థివాంసః
       
               ఎనిమిదవ అధ్యాయము             నలుబది ఎనిమిదవ సూక్తము

  ఋషి - బృహస్పతి పుత్రుడు శంయుడు దేవత - వేరు వేరు, ఛందస్సు - వేరు వేరు

    1. స్తోతలారా ! మీరు విశేష యజ్ఞమున స్తోత్రములతో శక్తివంతుడగు అగ్నిని స్తుతించండి. అమరుడు, సర్వద్రష్ట, మిత్రునివలె అనుకూలుడగు అగ్నిని ప్రశంసింతుము.

    2. శక్తిపుత్రుడు, అగ్నిని మేము ప్రశంసింతుము. అతడు వస్తుతః మా విషయమున ప్రసన్నుడు. హవ్యము వహించు అగ్నికి మేము హవ్యము సమర్పింతుము. అగ్ని యుద్ధమున మమ్ము రక్షించవలెను. సమృద్ధి కలిగించవలెను. అతడు మా పుత్రులను రక్షించవలెను.

    3. అగ్నీ ! నీవు కోరిన ఫలములు ఇచ్చువాడవు. జరారహితుడవు. మహాదీప్తి విభాసితుడవు. దీప్తాగ్నీ ! అవిచ్చిన్న తేజమున దీప్తమానుడవై నీ దీప్తితో మమ్ము ప్రకాశింప చేయుము.

    4. అగ్నీ ! నీవు మహాదేవతల యజ్ఞములు చేయువాడవు. అందువలన మా యజ్ఞమునకు దేవతలను పిలువుము. మమ్ము రక్షించుటకుగాను నీ బుద్ధికాయము రెండింటితో దేవతలను మా ముందుకు తెమ్ము. నీవు మాకు హవ్యరూప అన్నము ఇమ్ము. నీవే మరల దానిని స్వీకరింపుము.

    5. అగ్నీ ! నీవు యజ్ఞమునకు గర్భమవు. నిన్ను సోమమున కలుపుటకు అభిషవశిల అరణి కాష్ఠము పుష్టివంతము కావలెను. ఋత్విక్కులు బలముగా మధించగా పృథ్వియొక్క అత్యున్నత స్థానమున ఆవిర్భవించినావు.

    6. అగ్ని తన దీప్తితో స్వర్గ, పృథ్వులను నింపుము. తన పొగతో ఆకాశమునకు ఎగురును. దీప్తిమంతము, అభీష్టవర్షియగు అగ్ని రాత్రి చీకటిని దూరము చేయును. అగ్నియే రాత్రులకు అధిపతి అగును.

    7. అగ్నీ ! నీవు దేవతలలో కనిష్ఠుడవు. ప్రదీప్తుడవు. నీవు మా సోదరుడు భరద్వాజుని ద్వారా సమిద్ధుడవు అయినావు. మాకు ధనమును ఇమ్ము. నిర్మల, ప్రబలదీప్తితో ప్రజ్వలుడవగుము.

    8. అగ్నీ ! నీవు మానవులందరకు గృహపతివి. నేను నిన్ను నూరు హేమంతముల వరకు ప్రజ్వలితుని చేయుదుము. నాకు వందల రక్షణలు కలుగచేయుము. పాపములనుండి రక్షింపుము. నీ స్తోతలకు నీవు అన్నము ఇస్తావు. వారిని కూడ రక్షింపుము.

    9. గృహదాతవగు విచిత్ర అగ్నీ ! నీవు సకల సంపదల ప్రేరకుడవు. మా వద్దకు రక్షణలతో కూడిన ధనమును పంపుము. త్వరగా మా సంతానములను ప్రతిష్ఠించుము.

    10. అగ్నీ ! సమవేతము మఱియు హింసారహిత రక్షణలతో మా పుత్ర పౌత్రులను పాలింపుము. మా విషయమున దేవతల్ క్రోధమున, మానవుల ద్వేషము తొలగింపుము.

    11. బంధువులారా ! స్తోత్రములతో మీరు పాలిచ్చు ఆవువద్దకు రండి. దానికి ఎటువంటి హాని కలుగనిరీతి దానిని విడిపించుడు.

    12. సహిష్ణువు, స్వాధీన తేజము కలది. మరుత్తుల అమరహేతువు. పాలరూపమగు అన్నము ఇచ్చునది. వేగవంతులగు మానవుల సుఖసాధనమున తత్పరురాలు, వర్షజలముతో పాటు సుఖవర్షము కలిగించు అంతరిక్ష మార్గమున విహరించు ధేనువు వద్దకు రారండి.

    13. మరుత్తులారా ! భరద్వాజుని కొఱకు చక్కని పాలిచ్చు ఆవు, అందరికి కోరినంత అన్నము ఈ రెంటిని ప్రదానము చేయండి.

    14. మరుత్తులారా ! మీరు ఇంద్రుని మహాకర్మల అనుష్ఠాతలు. వరుణునివంటి బుద్ధిమంతులు. ఆర్యమ వంటి స్తుతి పాత్రులు. విష్ణువు వంటి దానశీలురు. ధనము కొఱకు నేను నిన్ను స్తుతింతును.

    15. మరుద్గణములు వందల, వేలవిధముల ధనమును మాకు ఒకేమారు ఇవ్వవలెను. అందుకొరకు అప్రతిహత ప్రభావులు, పుష్టి కారకులగు మరుత్తుల బలమును స్తుతించుచు బిగ్గరగా చదువుదును. వారు మాకు గూఢ ధనమును ప్రకటించవలెను. సమస్త ధనములను సులభ సాధ్యము చేయవలెను.

    16. పూషా ! నీవు త్వరగా మావద్దకు రమ్ము. దీప్తిమంతా ! భీషణ ఆక్రమణచేయు శత్రువులను బాధింపుము. నేను నీ చెవి వద్ద నీ గుణగానము చేసెదను.

    17. పూషా ! కాకులకు ఆశ్రయభూతమగు వృక్షమును నష్టపరచకుము. నన్ను నిందించువారిని పూర్తిగా నష్టపరచుము. వేటగాడు పక్షులను పట్టుటకు వలపన్నినట్లు శత్రువులు నన్ను చిక్కించరాదు.

    18. దధిపూర్ణమగు రంధ్రములేని తిత్తివలె నీ స్నేహము అవిచ్చిన్నము కావలెను.

    19. పూషా ! నీవు మానవులను అతిక్రమించి నిలిచినావు. ధనమున దేవతలకు సముడవు. యుద్ధమున మా మీద అనుకూల దృష్టికలవాడవగుము. ప్రాచీన కాలమున మానవులను రక్షించినట్లు నేడు మమ్ము రక్షింపుము.

    20. మరుత్తులారా ! మీరు కంపనకారులు. స్తుతియోగ్యులు. మీ ప్రశస్తమగు వాణి దేవతలకు యజమానులకు కోరిన ధనము ఇచ్చును. అదే కరుణా భరితము మఱియు సూనృతవాణి మాకు మార్గదర్శకము కావలెను.

    21. మరుత్తుల సకల కార్యములు దీప్తిమంతుడగు సూర్యునివలె ఆకాశమంతటను వ్యాపించును. ఆ మరుద్గణములు దీప్త, శత్రువిజయ, పూజనీయ, శత్రునాశక బలము కలవారు. శత్రునాశకబలము అన్ని బలములను మించినది.

    ఒకేసారి స్వర్గము ఉత్పన్నమయినది. ఒకేసారి భూమి. మరుత్తులమాత పృశ్నిగోవుపాలు అప్పుడే పితుకుట జరిగింది. అప్పటికి ఇంకేమియు పుట్టలేదు.


                                          నలుబది తొమ్మిదవ సూక్తము

    ఋషి - భరద్వాజ ఋజిశ్వనుడు దేవత - వైశ్వదేవులు, ఛందస్సు - త్రిష్టుప్, చివరిది శక్వరి.

    1. మిత్రావరుణులు స్తోతల సుఖాభిలాషులు. నేను కొత్త స్తోత్రములతో వారిని స్తుతింతును. అతి బలవంతులగు మిత్రుడు, వరుణుడు, అగ్ని ఈ యజ్ఞమునకు రావలెను. మా స్తుతులు వినవలెను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS