Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 2 పేజి 30


    16. శత్రు పరిహారములు, ధనలాభము కలుగు సరళ, పవిత్ర మార్గమున మేము ప్రవేశించినాము.           

                                            ఏబది రెండవ సూక్తము

                   ఋషి - ఋజశ్వనుడు, దేవత - విశ్వదేవులు ఛందస్సు
                   1-6, 13, 15-17 త్రిష్టుప్, 7-12 గాయత్రి, 14 జగతి.

    1. నేను ఈ యజ్ఞము దేవతలకు ఉపయుక్తమని భావింతును. ఇది నేను చేసిన యజ్ఞము లేక ఇతరులు చేసిన యజ్ఞముతో సరితూగ గలదోలేదో చెప్పవలెను. కావున మహాపర్వతములన్నియు వానిని అతియాజ ఋషిని బాధించవలెను. అతియాజుని ఋత్విక్కులు సహితము దీనులు కావలెను.

    (అతియాజుడను ఒక ఋషి తాను మహిమలు కలవాడనని చెప్పి ఋజుశ్వడను రాజుతో యజ్ఞము చేయించినాడు. ఋషులు ఆ యజ్ఞమును నిరాకరించినారు.

    ఋజుశ్వుడు ఒక గొఱ్ఱెకు బదులు వంద గొఱ్ఱెలను తోడేలుకు అర్పించినాడు. ఋజశ్వుని తండ్రి అతనిని గుడ్డివానిని చేసినాడు. అప్పుడు అశ్వినులు ఋజశ్వునకు దృష్టి ప్రసాదించినారు.)

    2. మరుత్తులారా ! తనను మీకన్న శ్రేష్ఠుడనుకున్నవ్యక్తికి నా స్తుతులను నిందించువానికి సమస్త శక్తులు అనిష్టకారులు కావలెను. స్వర్గము ఆ బ్రహ్మద్వేషిని దగ్ధము చేయవలెను.

    3. సోమా ! జనులు నిన్ను మంత్ర రక్షకుడని ఎందుకు అందురు? నిన్ను నిందించి మమ్ము ఉద్ధరించినా మనువారు ఎవరు? శత్రువులు మమ్ము నిందించుచున్నను ఎందుకు ఉపేక్షించుచున్నావు? బ్రహ్మద్వేషిమీద సంతాపక ఆయుధము విసరుము.

    4. ఆవిర్భూతములగు ఉషలు నన్ను రక్షించవలెను. నదులన్నియు నన్ను రక్షించవలెను. నిశ్చల పర్వతములు నన్న రక్షించవలెను. దేవ యజనమునకు విచ్చేసిన పితరులు దేవతలు నన్ను రక్షించవలెను.

    5. మేము సదా స్వతంత్ర చిత్తులము కావలెను. మేము సదా ఉదయ సూర్యుని దర్శించవలెను. హవ్యవాహకుడు, యజ్ఞ అధిష్ఠాత, మహైశ్వర్యశాలి అగ్ని మమ్ము అతని ఇష్టప్రకారము తీర్చవలెను.

    6. ఇంద్రుడు మరియు జలరాశితో పొంగు సరస్వతీనది రక్షణలతో మా వద్దకు రావలెను. ఓషధులు సహితముగా పర్జన్యుడు మాకు సుఖదాత కావలెను. తండ్రివంటి అగ్ని అనాయాసముగా స్తుత్యుడై ఆహ్వానయోగ్యుడు కావలెను.

    7. విశ్వదేవగణములారా ! మా ఆహ్వానములు వినండి. రండి. పరచిన కుశలపై కూర్చొండి.

    8. దేవతలారా ! ఘృతయుక్త హవ్యము. మిమ్ము సేవించు వ్యక్తివద్దకు మీరందరు రండి.

    9. అమరపుత్రులగు విశ్వదేవగణము మాత్రమే మా స్తుతులను వినవలెను. మాకు సుఖములు అందించవలెను.

    10. యజ్ఞ సమృద్ధికారకులు, సమయమునకు స్తోత్రములు వినువారగు విశ్వదేవగణములు చక్కగా తమకు ఉపయుక్తమగు దుగ్ధము స్వీకరించవలెను.

    11. మరుత్తులతో ఇంద్రుడు, త్వష్టతో మిత్రుడు, ఆర్యమ మా సమస్త స్తోత్రములను, సమస్త హవ్యములను స్వీకరించవలెను.

    12. దేవతలను పిలుచు అగ్ని దేవతలలో మహాయోగ్యుని తెలిసి మర్యాదపూర్వకముగా ఈ యజ్ఞక్రియను నెరవేర్చవలెను.

    13. విశ్వదేవగణములారా ! మీరు అంతరిక్షమున, భూలోకమున లేక స్వర్గమున ఉందురు. మా ఆహ్వానములు వినండి. అగ్ని రూప జిహ్వతోగాని మరెట్లయినగాని మా ఈ యజ్ఞమును స్వీకరించండి. మీరందరు మేము పరచిన కుశలమీద ఆసీనులు కండి. సోమరసము త్రాగండి. ఉల్లాసవంతులు కండి.

    14. యజ్ఞార్హ దేవగణము, స్వర్గము, పృథ్వి, జలరాశిపుత్రుడు అగ్ని మా స్తోత్రములను వినవలెను. దేవతలారా! మీరు ఇష్టపడని స్తుతిని మేము ఉచ్ఛరించరాదు. మేము మీకు దగ్గరివారము కావలెను. సుఖములు పొందవలెను. సంతోషించవలెను.

    15. పృథ్వి, స్వర్గము లేక అంతరిక్షమున అవిర్భవించిన మహామహులు, సంహారక శక్తియుక్తులగు దేవగణములు రాత్రింబవళ్లు మాకు, మా సంతతికి అన్నము ప్రసాదించవలెను.

    16. అగ్ని, పర్జన్యులారా ! మా యజ్ఞకార్యమును రక్షించండి, మీరు సులభ ఆహ్వానయోగ్యులు. కావున ఈ యజ్ఞమున స్తుతులు వినండి. మీలో ఒకడు అన్నము ఇచ్చును. మరొకడు గర్భోత్పత్తి చేయును. కావున మీరు మాకు అన్నమును సంతానమును ఇవ్వండి.

    17. పూజ్యులగు విశ్వదేవగణములారా ! నేడు మా ఈ యజ్ఞమున కుశలు పరచినంత, అగ్ని ప్రజ్వలితమైనంత, నా స్తోత్రోచ్చారణము జరిగినంత. నమస్కారయుతముగా నీ సేవ చేసినంత హవ్యములు స్వీకరించి తృప్తులగుడు.     


                                        ఏబది మూడవ సూక్తము

       ఋషి - భరద్వాజుడు, దేవత - పూష, ఛందస్సు - 7 అనుష్టుప్, మిగిలినవి గాయత్రి.

    1. మార్గపతి పూషా ! కర్మానుష్ఠానము. అన్నలాభము కొఱకు యుద్ధరంగమున రథమువలె నిన్ను అభిముఖుని చేసెదము.

    2. పూషా ! మా వద్దకు మానవహితైషి, ధనదానమున ఉదారుడు, విశుద్ధ దానవంతుడగు ఒక గృహస్థుని పంపుము.   

    3. దీప్తిసంపన్నుడవగు పూషా ! పిసినారిని దానము చేయుటకు ప్రోత్సహించుము. అతని హృదయమును కోమలము చేయుము.

    4. ప్రచండ బలశాలి పూషా ! ధనలాభమునకు సకల మార్గములను వెల్లడించుము. విఘ్నకారులగు దొంగలు మున్నగు వారిని సంహరింపుము. మా పూజలను సఫలము చేయుము.

    5. జ్ఞానివగు పూషా ! రంపమువంటి దానితో పణులు లేక లుబ్థులు హృదయములను విచ్చును. వారిని మాకు అప్పగించుము.

    6. పూషా ! సూక్ష్మమగు రంపము వంటి దానితో ఫణిలేక దొంగ గుండె చీరుము అతని హృదయమున సద్భావన నింపుము. నాకు అప్పగించుము.

    7. జ్ఞానివగు పూషా ! దొంగల గుండెలమీద వ్రాయుము. వారిలోని కఠోరతను తగ్గించుము. వారిని మాకు అప్పగించుము.

    8. దీప్తిసంపన్న పూషా ! అన్న ప్రేరకమగు ఉలిని పట్టుము. దానితో లోభుల హృదయముల మీద వ్రాయుము. వారి కఠోరతను మెత్తపరచుము.

    (అనంత కాలమున బుద్ధుడు, క్రీస్తు, మహాత్ముడు ఈ భావనలనే ప్రవచించినారు. శిక్షించుటకుకాక సంస్కరించుటకు ప్రాధాన్యత ఇచ్చినారు)

    9. దీప్తిశాలి పుషా ! నీవు గోవులను, పశువులను నడిపించు అస్త్రమునే మాకు ఉపకారము చేయుమని ప్రార్థింతుము.

    10. పూషా ! మా అనుభవమునకుగాను మాయాగకర్మకు గోవులను, అశ్వములను, అన్నమును పరిచారకులను పుట్టించుము.


                                        ఏబది నాలుగవ సూక్తము

                   ఋషి - భరద్వాజుడు, దేవత - పూష, ఛందస్సు - గాయత్రి.

    1. పూషా ! మాకు వస్తుతః మార్గదర్శకము చేయువాడు దొంగిలించిన సొమ్ము దొరికించునట్టి విలక్షణ వ్యక్తిని పరిచయము చేయుము.

    2. పూష అనుగ్రహమున మాకు సమస్త గృహములను చూపి, 'ఇవిగో ఇవి నీ తప్పిపోయిన పశువులు' అని చూపించగల వ్యక్తి లభించవలెను.

    3. పూష ఆయుధమగు చక్రమునకు హాని జరుగదు. ఈ చక్రపు తొడుగు సడలదు. దీని వాడి మొక్కవోదు.

    4. పూషకు హవ్యము ఇచ్చి సేవించు వ్యక్తికి పూష కొంచమైనను ఉపకారముచేయడు. అయినను ప్రధానముగా ఆ వ్యక్తియే ధనము పొందును.

    5. మా గోవులను రక్షించుటకుగాను పూష వాటిని అనుసరించవలెను. అతడు మా అశ్వములను రక్షించవలెను. మాకు అన్నము ఇవ్వవలెను.

    6. పూషా ! రక్షణకుగాను సోమాభిషవము చేయు యజమాని గోవులను అనుసరించుము. అట్లే స్తోత్రములు ఉచ్చరించు మా గోవులను కూడ అనుసరించుము.

    7. పూషా ! మా గోవులకు నష్టము కలుగరాదు. అవి పులులు మున్నగువాని వాత పడరాదు. బావిలో పడరాదు. కావున నీవు అహింసిత గోవులవెంట సాయంత్రము రమ్ము.

    8. మా స్తోత్రములను వినువాడు దారిద్ర్యనాశకుడు. తరగని ధనమునకు, సకల జగములకు అధిపతి పూషవద్ద మేము ధనము ప్రార్థింతుము.

    9. పూషా ! మేము మే ఉపాసన చేసినంతకాలము మేము ఎన్నడును హతులముకారాదు. ఇప్పుడు మేము స్తుతించుచున్నాము. హతులముకారాదు.

    10. పూష తన కుడిచేతితో మా గోధనము తప్పిపోకుండ చూడవలెను. తప్పిపోయిన వాటిని తిరిగి రప్పించవలెను.


                                          ఏబది అయిదవ సూక్తము

                     ఋషి - భరద్వాజుడు, దేవత - పూష, ఛందస్సు - గాయత్రి.

    1. పూషా ! నీవు దీప్తి సంపన్నుడవు. ప్రజాపతి పుత్రుడవు. నీ స్తోతలు నావద్దకు రావలెను. మేము ఇద్దరము కలసెదము. నీవు మా యజ్ఞమునకు నేతవగుము.

    2. పూష మాకు మంచి రధి, కపర్ది. అతుల ఐశ్వర్యములకు అధిపతి. మాకు మిత్రుడు. అతనిని ధనము కొరకు ప్రార్థింతుము.

    3. పూషా ! నీవు దీప్తిశాలివి. ధనప్రవాహమవు. ధనరాశివి. మేకలే నీకు అశ్వములు. నీవు విశేష స్తోతకు మిత్రుడవు.

    4. నేడు మేము మేక వాహనుడు, అన్నయుక్తుడగు పూష లేక సూర్యుని స్తుతింతుము. జనులు అతనిని ఉషకు ప్రియుడు అందురు.

    5. రాత్రిరూపమాతకు పూషభర్త. అతనిని మేము స్తుతింతుము. మా సోదరి ఉషకు ప్రియుడు మా స్తోత్రములు వినవలెను.

    6. రథమునకు కట్టిన అజములు శ్రోతల ఆశ్రయదాత పూష రథమును గుంజూచు ఇచటికి రావలెను.


                                         ఏబది ఆరవ సూక్తము

    ఋషి - భరద్వాజుడు, దేవత - పూష, ఛందస్సు - గాయత్రి, చివరిది అనుష్టుప్.

    1. పూషకు నేయి కలిపిన సత్తుపిండి భోగముచేసి స్తుతించువాడు అన్యదేవతలను స్తుతించనవసరములేదు.

    2. రథిశ్రేష్ఠుడు, సాధురక్షకుడు, సుప్రసిద్ధ దేవత ఇంద్రుడు తన మిత్రుడు పూష సాయమున శత్రు సంహారము చేయును.

    3. చాలకుడు, రథిశ్రేష్ఠుడగు పూష సూర్యుని హిరణ్మయ రథ చక్రమమును కదిలించును.

    4. పూష బహులోక వందనీయుడు. మనోహరుడు. జ్ఞాని. మేము నిత్యము ఏ ధనము లక్ష్యముగా నిన్ను స్తుతింతుమో, అట్టి వాంఛిత ధనమును మాకు ప్రసాదించుము.

    5. గోకామియగు పూషా ! నీవు సమస్త మానవులకు గోలాభము కలిగించుము. పూషా ! దూరదేశములందు కూడ కీర్తివంతుడవయినావు.

    6. పూషా ! ఈనాటి రేపటి యజ్ఞములు నెరవేరుటకు నీ రక్షణలు అభ్యర్థించుచున్నాము. ఆ రక్షణలు పాపములకు దూరపువి. ధనములకు దగ్గరివి.


                                      ఏబది ఏడవ సూక్తము

     ఋషి - భరద్వాజుడు, దేవత - పూష, ఇంద్రుడు, ఛందస్సు - గాయత్రి.

    1. ఇంద్రపూషలారా ! మా శుభముల కొఱకు నేడు మేము నీ స్నేహము కోఱుచున్నాము. అన్నప్రాప్తి కొఱకు మిమ్ము ఆహ్వానించుచున్నాము.

    2. మీలో ఒకరు ఇంద్రుడు పాత్రలోనున్న అభిషుత సోమపానమునకు వెళ్లును. మరొకరు పూష యవల సత్తు తినగోరును.

    3. ఒకరి వాహనము మేక మరొకరిది స్థూలకాయులగు రెండు అశ్వములు. ఇంద్రుడు ఆ అశ్వములతోనే వృత్రుని సంహరించినాడు.

    4. ఇంద్రుడు అతిశయమగు మహా వృష్టి కురిపించినపుడు పూష అతనికి సహాయకుడగును.

    5. వృక్షపు గట్టి కొమ్మను పట్టుకున్నట్లు మేము ఇంద్రుడు, పూషల కృపావృద్ధిమీద ఆధారపడుదుము.

    6. సారథి కళ్లెమును లాగినట్లు మేము మా ప్రవృష్ట కళ్యాణమునకుగాను ఇంద్రుని, పూషను ఆకర్షింతుము.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS