"పుర్రె ! ఇంత చిన్నగా ఉందేమిటీ ? పిల్లలదా ?" అన్నాడు.
"వాట్ !" అంది పూనా నుంచి వచ్చిన ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్, అదిరిపడి, "ఇంగ్లీషులో మాట్లాడు" అంది కోపంగా.
సుందరం కొంచెంకూడా బెదరక చిరునవ్వుతో ఆమెవంక తిలకిస్తూ వూరుకున్నాడు.
"ఆర్. ఓ.పీ. పొజిషన్ పెట్టి చూపించు" అన్నది ధాటీగా.
"ఆ పొజిషన్లూ అవీ నాకు తెలియవు" అన్నాడు సుందరం, వచ్చీ రాని యింగ్లీషులో.
అతని సమాధానం విని ఎగ్జామినర్లిద్దరూ ఒకరిముఖం ఒకరు చూసుకుని, ఏమిటా మొదట్లోనే ఇట్లావుంది పరిస్థితి అన్నభావాలు కళ్ళలో వెలిబుచ్చుకున్నారు.
రెండో ఎగ్జామినర్ ఒక డెలివరీ ఫోర్స్ సెప్స్ అతని ముందుకుతోసి "ఇదేమిటి ?" అంది.
"పట్టకారు" అని సుందరం సమాధానం.
"వాట్ పట్టకారు ? ఏమిటి నువ్వు మాట్లాడేది ? అసలు నీ ఏప్రాసేదీ ?"
"నాకు లేదు."
"ఆ సంచి ఏమిటి చేతిలో ? అందులో ఏమున్నాయి ?"
"జంతికలు"
"వాట్ !" అని ఎగ్జామినర్లిద్దరూ నోళ్ళు తెరిచి ఆశ్చర్యంగా చూశారు.
నేను ఎంతసేపటికీ కొయ్యలా నిలబడటంచూసి సుశీలగారు "ఏమిటి డాక్టర్ ! ఎంత సేపలా చూస్తావు ?" అని నా ప్రక్కకొచ్చి నిలబడి, బయటకు తొంగిచూసి "మైగాడ్ ! ఇతనెవరు ? మన స్టూడెంటు కాదనుకుంటానే" అంది.
"అవును మేడమ్ ! అతను నా కజిన్. చాలా పొరపాటు జరిగిపోయింది" అని జవాబిచ్చాను వొణికే గొంతుతో.
"అసలెవరు నువ్వు ? పరీక్ష ప్యాసవ్వాలని లేదా ? ఏమిటా మొండిసమాధానాలు ? ఇంత మొండిగా ప్రవర్తించినందుకు ఫలితం రుచిచూడవలసిన ఉంటుంది సుమా" అని గర్జిస్తోంది ఎగ్జామినర్. కోపంతో అసలే ఎర్రగా వున్న ఆమెముఖం మరింత ఎర్రబడిపోయింది.
"పరీక్ష ఏమిటి ? ఫలితమేమిటి ? నన్ను సుందరం అంటారు. మా అన్నయ్య యిక్కడ హౌస్ సర్జనుగా వుంటే, చూట్టానికి వచ్చాను" అని సుందరం కూడా కోపంగానే మాట్లాడాడు.
వాళ్ళిద్దరూ మతులుపోయినట్లు కళ్ళు పెద్దవిచేసి చూస్తూ కూర్చుండిపోయారు ఒకనిమిషం గడిచాక వారిలో ఒకరు తేరుకుని "మరైతే లోపలి కెందుకు వచ్చావు ?" అనడిగింది.
"నే నక్కడ నిలబడితే మీరే రమ్మన్నారుగా. నేను వచ్చానంటారేం ?"
ఇహ చూస్తూ ఊరుకుంటే పరిస్థితి మరింత అభాసవుతుందని నేను, యిహ ఉపేక్షచేయకుండా యివతలకు వచ్చి సుందరాన్ని బలవంతంగా రెక్కపట్టుకుని లేపి "ఇతను మా తమ్ముడు .నాకోసం వచ్చి అక్కడ నిలబడటం మూలాన పొరపాటు జరిగిపోయింది, ఏమీ తెలియని అమాయకుడు. దయ వుంచి యీ అనర్ధానికి క్షమించండి" అని వినయంగా వేడుకున్నాను.
ఎగ్జామినర్స్ యీ సంఘటనను చాలా సున్నితంగా స్వీకరించారు. గంభీరంగా ఉండవలసిన వాతావరణమంతా నవ్వులతో నిండిపోయింది. విద్యార్ధులు, నర్సులు, అసిస్టెంట్లు ,.ఎగ్జామినర్లు ఒకటే నవ్వులు! వాళ్ళంతా మంచి మూడ్ లోకి వచ్చారు. ఆ మంచి మూడ్ లో ఆరోజు చాలామందిని ప్యాస్ చేసి ఉంటారని నా నమ్మకం.
సుందరం తమ్ముడు లజ్జితుడై ఎర్రబడ్డ ముఖంతో నా గదికి వెళ్ళిపోయాడు.
ఇలాంటివే తమాషాలు అప్పుడప్పుడూ జరుగుతూవుంటాయి. ఒకసారి గైనిక్ ఓ.పి.లో ఒక నడివయసును స్త్రీ చీటీతీసుకుని లోపలకు వస్తే అలవాటు ప్రకారం బల్ల ఎక్కించి ,పి.వి. అదీ చేసి పరీక్షించటమయ్యాక, ఏమీదోషం కనబడక, "అసలింతకీ బాధ ఏమిటమ్మా" అని అడిగితే "నాకేం బాధవుందీ ? మా అమ్మాయిని తీసుకొచ్చాను. పరీక్ష చేయించటానికి" అంది. యిప్పటివరకూ జరిగినదంతా తనకు పట్టనట్లు. "మరైతే నువ్వెందుకు బల్లెక్కావు ?" అని అడిగితే "నాకేం తెలుసు ? మా అమ్మాయి చీటీ నేను పట్టుకుని నించుండినాను. మీరు లోపలకు పిల్చినారు. నేనువచ్చినాను" అన్నది. అక్కడున్న మేమందరమూ నవ్వుకోక యిదయ్యాం.
నా గైనిక్ పోస్టింగు చాలా తేలిగ్గా, ఆడుతూ పాడుతున్నట్లు అయిపోయింది. ఎక్కువ పని లేకపోవటాన చాలా పుస్తకాలు చదువుకోటానికీ, మిగతా వార్డులకు వెళ్ళి కేసులు చూడటానికీ వీలయేది. రాత్రి సమయంలో థియేటరులో దీపం కనబడితే వెళ్ళటం మానలేదు. అలా అర్దరాత్రి నిశ్శబ్దంగా వున్న సమయంలో రకరకాల రోగులనూ, రోగాలనూ దాచుకున్న వార్డులముందు నుండి మెల్లగా సాగిపోతూంటే ఆ అడుగుల చప్పుడు చెవులకు ఎంతో మధురంగానూ, హుందాగానూ వినిపించేది.
కొంతమంది తల్లులు పిల్లలు పుట్టగానే, వారి నక్కడే వుంచి, ఎవరికీ తెలియనివ్వకుండా వెళ్ళిపోతుండేవారు. ఆ పిల్లలు దిక్కులేని వారన్నమాట. వారిని సిస్టర్లే పెంచేవారు. ఏ సిస్టరు డ్యూటీలో వుంటే ఆమె సంరక్షణ చేస్తూ వుండాలి. వారిని హాస్పిటల్ బేబీస్ అంటారు. ఆ పిల్లలు అలా వార్డులలోనే పెరిగి పెద్దవారవుతూ వుంటారు. ఈలోగా ఎవరైనా సంతానహీనులైన తల్లిదండ్రులు వచ్చి, తమకు ఆస్తి పాస్తులున్నట్లు నిరూపిస్తూ ఆ పిల్లల్ని వారికి దత్తత చేస్తూ వుంటారు.
ఎప్పుడైనా తీరిక వున్నప్పుడు హాస్పిటల్ బేబీస్ తో ఆడుకుంటూ వుండేవాణ్ని.
* * *
తర్వాత పబ్లిక్ హెల్త్ పోస్టింగ్ పడింది. ఇందులో పనిచేసే రెండు నెలల్లోనూ మొదటినెల ప్రతిరోజూ ఒక్కో ప్రదేశానికి వెళ్ళి వస్తూ వుండాలి పన్నెండుమంది హౌస్ సర్జన్లు పనిచేసే వాళ్ళం. చేతిలో ఒక జీపూ, వ్యానూ వుండేవి. అందరం వాటిలో ఎక్కి ఒకరోజు హోటళ్ళ తణిఖీ, ఒకరోజు కిరాణా కొట్లకి వెళ్ళి ఆహారంలో కల్తీ చేసే వారిని పట్టుకోవటానికీ, ఒకరోజు బి.సి.జి. వాక్సినేషన్ లు యివ్వటానికి చిన్న చిన్న స్కూళ్ళకూ, మరో రోజు దగ్గర్లో వున్న కుష్ఠురోగుల కాలనీకి తనిఖీకి వెళ్ళేవాళ్ళం. అప్పుడప్పుడూ ఊళ్ళోని పెద్ద పెద్ద పారిశ్రామిక కేంద్రాలూ, అక్కడి ఆరోగ్య పరిస్థితిలూ చూసి వచ్చేవాళ్ళం .లేకపోతే మలేరియా డిపార్టుమెంటుకు వెళ్ళి అక్కడ దేశంలోని మలేరియాను రూపుమాపే ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించి అక్కడి ఆఫీసరుతో ఊళ్ళోని మురికి ప్రాంతాలలోని కొన్ని యిళ్ళలో ప్రవేశించి అక్కడి బావుల స్థితిగతులు పరీక్షించి, నీటిని తోడి, అందులో మలేరియాని కలిగించే దోమల పూర్వదశయైన లార్వా వున్నాయేమో చూచి డి.డి.టి. చల్లి వచ్చేవాళ్ళం. లేకపోతే దగ్గర పల్లెలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ కు వెళ్ళి, అందులోని స్టాఫ్, ఆ హాస్పిటల్ పనిచేసే విధానమూ గమనించే వాళ్ళం.
రెండవ నెలలో అక్కడికి పది మైళ్ళలో వున్న తాడిపర్తి అనే గ్రామంలో వుండిపోయాం. రోజూ ఉదయమే అందరం బయల్దేరి ఇంటింటికి వెళ్ళడం, ప్రతి కుటుంబములోని సభ్యులపేర్ల జాబితా సేకరించటం, వారందరి యోగక్షేమాలు విచారించటం, నిశితంగా పరీక్ష చేయటం, వారికి ఆరోగ్యసూత్రాలు వల్లించటం, ఎవరైనా అనారోగ్యంగా కనిపిస్తే వాళ్ళకి మందులివ్వటం, వాళ్ళు ఏమి తింటారని అడగటం, బియ్య మెంత పోసుకుంటారు ,తూకమెంత, కూరలేమి తింటారు, ఎంతెంత తింటారు, నెయ్యి ఎంత, నూనె ఎంత అని విచారణ చేసి వివరాలు సేకరించటం, బసకు వచ్చాక, వాటి ఆహారపు విలువలను నిర్ణయించడం, దాన్నిబట్టి ఆహారపు స్థితిగతుల్ని అంచనా వెయ్యటం _ ఇదీ పని. కొందరు నవ్వుకునేవారు కొందరు వెక్కిరించేవారు. కొందరు నిజాయితీగా సమాధానాలిచ్చేవారు.
ఈ పనంతా ఉదయం రెండు మూడు గంటలు తిరిగేసరికి అయిపోయేది. ఇహ అప్పట్నుంచీ పేకాట ఆడుకోవటం, లేకపోతే వూరు ఎలా వుందా అని నాలుగు మూలలా చూచి రావటం, కొండలెక్కటం, యిహ పోతే మెస్ లో యివాళ ఏం కూర చేసుకుందామనీ, ఏం పచ్చడి చేసుకుందామనీ వాదులాడుకోవటం, అభిప్రాయాలు ఏకీభవించకపోతే దెబ్బలాడుకోవటం యిలా వుండేది.
నేను బాగా పేకాట అడగలనని చాలామందికి తెలియదు .లిటరేచర్ ఆడినప్పుడల్లా నేను వున్న పార్టీయే గెలుస్తూ వుండేది.
"ఏమిటో అనుకున్నాం. మధు అన్ని విషయాలలోనూ గట్టివాడే పేకాట దంచేస్తున్నాడు" అని ఆశ్చర్యం వెలిబుచ్చారు.
మా అందరికీ బాస్ అక్కడ హెల్త్ ఆఫీసర్. సాయంత్రమవగానే అతనూ ,అతని స్నేహితులూ, గెస్ట్ హౌస్ లో చేరి డబ్బు పెట్టి పేకాడుకునేవారు. కొన్నాళ్ళకు మా హౌస్ సర్జన్లు కూడా డబ్బుతో ఆడటం మొదలుపెట్టారు. నన్నూ రమ్మని పిలిచారు. నేను రానని మృదువుగా చెప్పి తప్పించుకున్నాను.
మధ్యాహ్నమూ, సాయంత్రమూ, రాత్రీ కావలసినంత తీరిక. మధ్యాహ్నం గదిలోనే కూర్చుని ఏమయినా చదువుకుంటూ కూర్చునే వాణ్ని. నాకు చదువంటే యిష్టం. ఒక్క మెడికల్ పుస్తకాలే కాదు. టైముండాలే గాని కనబడినవన్నీ చదువుతాను. వార్తాపత్రిక యీ చివరి నుంచి ఆ చివరిదాకా చదవందే తోచదు, రోజూ. అట్లాగే సాహిత్యం, ఇంగ్లీషు, తెలుగు క్లాసిక్సన్నీ వీలైనంతవరకూ చదువుతూనే వున్నాను. ఇలాంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీరావు కాబట్టి _ చరిత్ర, సంస్కృతి వీటి గురించి చదవాలని మనసు ఉవ్విళ్ళూరుతూ వుండేది.
మా క్వార్టర్సుకు దగ్గరగానే స్మశానముంది. సాయంత్రాలు ఒక్కడినీ అటువేపు వాహ్యాళికి వెళ్ళి పుర్రెలు, బొమికలు మధ్య నుంచి నడుస్తూ పోయి ఏ చెట్టు క్రిందనో కొంతసేపు కూర్చుని గడిపేవాణ్ని. చిన్న వూరు అయినా రోజూ ఏదో ఒక మూల కాష్టం తగలడుతూనే వుండేది.
అలా ఏకాంతంగా కూర్చుని, అలాంటి ప్రదేశంలో గడుపుతూంటే కాసేపు హాయిగా పిల్లనగ్రోవి వాయించుకోవాలని కోర్కె రగిలేది.నా చిన్నతనాన మా ఊళ్ళో గుడి మండపంమీద కూర్చునీ, ఏటి వొడ్డున కూర్చునీ పిల్లనగ్రోవి తనివితీరా వాయించుకుంటూ వుండేవాణ్ని. అందరితో కలిసి వుంటున్నా, సమానంగానే వుంటున్నట్లు బయటకు కనిపిస్తున్నా అవకాశం చూసుకుని తోటల్లోకీ, ఊరి బయటవున్న అడవిలోకి వెళ్ళి ఏకాంతంగా తిరుగుతూ వుండేవాణ్ని. పిల్లనగ్రోవి ఊదుతూ అలా తిరుగుతూంటే "యిదిగో, మధు యిక్కడ వున్నాడు" అని మా పెద్దవాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చి పట్టుకున్న సందర్భాలనేకం వున్నాయి.
