Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 28

 

                                    సేతుబంధే చ రామేశమ్

    క్షేత్ర మహిమ:

    రామేశ్వర జ్యోతిర్లింగము దక్షిణ సముద్రతీరమున ధనుష్కోటి సమీపమున విరాజిల్లుచున్నది. రామేశ్వర మహాక్షేత్రము భారత భూమి యందలి పుణ్య క్షేత్రములలో నగ్రగణ్యము. ఈ క్షేత్ర మహిమ స్కంద పురాణములో నీక్రింది విధముగ వర్ణితమైనది.

        శ్లో|| ఆస్తి రామేశ్వరం నామ రామసేతౌ ప్రతిష్టితమ్
        క్షేత్రణామపి సర్వేషాం తీర్దానామపి చొత్తమమ్||
        సేతుం రామేశ్వరం లింగం గంధమాదన పర్వతమ్
        చింతయన్ మనుజ స్సత్యం సర్వపాపైః ప్రముచ్యతే||

    రామేశ్వర శివలింగము ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదునొకండవది. ఈ శివలింగము సీతామనోహరుఁడైన శ్రీరామచంద్రుని కరకమలములచే సుప్రతిష్ఠతమైనది. రామేశ్వరస్వామి దేవాలయము వెయ్యి యడుగుల పొడవును, ఆఱువందల యేబది యడుగుల వెడల్పును, నూటయేబడి యడుగుల యెత్తును గలిగి, యనల్పశిల్ప కళాలక్ష్మి కాలవాలమై యలరారును, ఇందలి నందీశ్వరుఁడు,  రజత రధము, స్వర్ణ గోపురములు దర్శనీయములు, రామతీర్థము, సేతు మాధవ తీర్ధము, అమృతవాటిక , హనుమంత్కుండము మొదలగునవి సమస్త దోషహారములు. గంగజలముతో రామేశ్వరముతో శివలింగము నభిషేకించినవారు జీవన్ముక్తులగుదురని పురాణ ప్రమాణము.]
    
    పురాణ కధ :

    శ్రీరాముడు రావణ సంహారానంతరము సీతను గూడి సుపరివారముగా పుష్పక విమానారూధుఁడై సముద్రము దాటి గంధమాదన పర్వతమునకు విచ్చేసెను. అచ్చం మునీశ్వరులు శ్రీరామచంద్రుని సందర్శించిరి. పులస్త్యబ్రహ్మ పుత్రుడగు రావణుని సంహరించుట వలన సంభవించిన బ్రహ్మహత్యా పాప మెట్లు పరిహరమగునని శ్రీరాముడు వారిని ప్రశ్నించెను. "ఈ ప్రదేశమున శివలింగమును ప్రతిష్టించి పూజింపుము. సమస్త దోషము శమించు" నని మునులు పలికిరి.
    శ్రీరామచంద్రుడు శివలింగమును గొనిరమ్మని హనుమంతుని కైలాసమున కంపెను. వాయునందనుడు వచ్చుట రవంత విలంబమైనది. సుముహుర్తము సమీపించినది. మహర్షుల యజ్ఞానుసారము సీతాదేవి చేతులతో నచ్చటి యిసుకప్రోవుచేసి శివలింగమును సిద్దము చేసినది. శ్రీరాముడు యధావిధిగా ప్రతిష్టాపన మొనర్చినాడు.
    ఇంతలో వాయుపుత్రుడు వచ్చి వ్రాలినాడు. జరిగిన విషయము తెలిసికొని సంక్షోభించినాడు. శ్రీరాముని పాదముల పైబడి వెక్కి వెక్కి యేడ్చినాడు. భక్తవత్సలుడైన ప్రభువు పవనతనయ ననునయించి తొందరపడుటకు గల కారణము చెప్పినాడు.
    సమీరకుమారుడు స్వామి పలుకులకు సంతుష్టుఁడు కాలేదు. శ్రీరాముడు ఛిఱునవ్వు నవ్వుచు "అట్లయిన హనుమా! సుముహూర్త మతిక్రమించునని గదా ప్రతిష్ట జరిపిలిమి. నీకిష్టము లేనిచో నా శివలింగము తీసివేయుము. నీవు తెచ్చిన లింగమునే యచ్చట ప్రతిష్టింతము" అన్నాడు. హనుమంతుడు సంతోషముతో ఎగిరి గంతువేసినాడు. ముందుకు దూకినాడు. చేతులతో బట్టి శివలింగమును పెకలింప బూనినాడు.
    శివలింగము కదలలేదు. పవనపుత్రుడు బలమంతయు నుపయోగించినాఁడు. స్వామి చలింపలేదు. తన సుదీర్ఘవాలము నా వాలుకాలింగము చుట్టూ జుట్టి యంజనానందునుఁడు బలవంతముగ నొక్క గుంజు గుంజినాడు. లవమాత్రము లాభములేక పోగా అయూపునకల్లంత దూరమున నెగిరిపడి మారుతి మూర్చిల్లినాడు. సీత భీతిల్లి శ్రీరాముని బతిమాలినది. శ్రీరాముడు శీతల హస్తస్పర్శచే మూర్చ వాపి మారుతుని జేరదీసి యొడిలో గూర్చుండ బెట్టుకొన్నాడు. కన్నీరు తుడిచి బుజ్జగించినాడు. "నాయనా! శాస్త్రోక్తంగా స్వామిని ప్రతిష్టించితిమి. ప్రపంచములోని యే శక్తియు నిప్పుడీ శివలింగమును కదిలింపలేదు" అని యోదార్చి అతడు కొనివచ్చిన శివలింగము నాసమీపమున శాస్త్రోక్తముగ ప్రతిష్టచేయించి హనుమంతుని సంతుష్టాంతరంగుని గావించినాడు. రామునిచే ప్రతిష్టితమైన శివలింగము రామేశ్వర నామమును, హనుమంతుడు గొనివచ్చిన శివలింగము హనుమదీశ్వర నామమునను ప్రసిద్దములై పూజలందుకొనుచున్నవి.

        శ్లో || స్వయం హరేణ దత్తం తు హనుమన్నామకం శివమ్
        సంపశ్యన్ రామనాధంచ కృతక్రుత్యో భవేన్నర||
        
                                                  ఘుశ్మేశం చ శివాలయే

    క్షేత్ర మహిమ :

    దక్షిణ భరతమున ఘుశ్మేశ్వర జ్యోతిర్లింగము సువిరాజమానమైయున్నది. దీనికి సమీపము నందే ప్రపంచ ప్రసిద్ది గాంచిన ఎల్లోరా గుహలున్నవి. ఇందలి కైలాసమందిర సౌందర్యము నయనాంద సందాయకము. అనల్పశిల్ప సంశోభితము. ఘుశ్వేశ్వరుషి సేవించిన వారికి పునర్జన్మము లేదు. సకల సౌభాగ్యములు సంప్రాప్తించును.
    
    పురాణ కధ :
    
    దక్షిణ భారత ప్రాంతములో అత్యంత శోభావంతమైన దేవగిరి దుర్గము విరాజిల్లుచున్నది. తదుపాంతముననే "సుధర్ము"డను బ్రాహ్మణుడు నివసించుచుండెను. అయన ధర్మపత్ని సుదేహ.
    జ్యోతిశాస్త్రవేత్తలు సుదేహ జన్మలగ్నాదికములు పరిశీలించి ఆమెకు సంతాన ప్రాప్తి లేదని వక్కణించిరి. సుతులు లేనీ వారికి గతులు లేవని పండితులు సెలవిచ్చిరి. సుదేహ భర్తను సమీపించి "నాధా! మీరు నా సోదరియైన ఘుశ్మను వివాహమాడుడు. ఆమె మూలముననైన సంతానము కలిగిన అదియే మనకు పదివేలు!" అన్నది . ఎట్టకేలకు అంగీకరించి , సుధర్ముడు ఒక శుభ ముహూర్తమున ఘుశ్మను పరిణయమాడెను.
    ఘుశ్మ మహాపతివ్రత, పరమేశ్వర భక్తురాలు. పతిసేవతో పాటు అక్కగారికి కూడ సేవ చేయుచుండెను. ఆ సాద్వి పూజలు ఫలించినవి. ఆమె జీవితము ధన్యమైనది. శివుడు అనుగ్రహించెను. ఘుశ్మ  గర్భవతి యయ్యెను. ఒక శుభలగ్నమున సమస్త శుభాలక్షణ సంపన్నుడైన ఒక పుత్రుడు జన్మించెను. ఆనాడు వారి ఆనందమునకు అవధులు లేవు. చంద్రుని గాంచిన సముద్రుని వలె సుధర్ముని హృదయము పుత్రసందర్శనముచే పొంగిపోయినది.
    కొంతకాలము గడచినది. సుదేహ మనస్సులో అసూయాంకురము తలయెత్తినది. ఆమెలో అనురాగము అంతరించినది. ద్వేషము రగుల్కోనినది. రాక్షసప్రవృత్తి ప్రకోపించినది. ఇల్లంతయు ఘుశ్మదే! ఈ వైభవమంతయు ఘుశ్మదే! ఇచ్చట తానెవరు? తన దేమున్నది?
    సుదేహ కరమున చురకత్తి తళతళ మెరిసినది. ఆ కరళకాళరాత్రిలో నిద్రాసక్తుడై ఉన్న కుమారుని దేహము రక్తసిక్తమైనది. సుతుని మృతకళేబరము నా పాపాత్మురాలు ప్రక్కనున్న సరోవరములో పాఱవైచినది!
    తెల్లవారినది. ఘుశ్మ పూజాగృహములో శివపూజతత్పరయైయున్నది. సుదేహ పరుగెత్తుకొని వచ్చి 'అబ్బాయిని ఎక్కడకు పంపితివి?" అని అడిగినది. పరమేశ్వర పారవశ్యములో మైమరచి యున్న ఘుశ్మ కు ఆమె పలుకులు వినబడలేదు.
    ఘుశ్మ పూజ పూర్తి చేసి, పార్ధివశివలింగములకు సమీపము ననున్న సరోవరములో కలుపుటకై వెళ్ళినది. ఆమె కుమారుడు సరోవరజలములలో నుండి ఈదుకొని వచ్చుచుండెను. అతడు తల్లితో 'అమ్మా! నేను చనిపోయి పునర్జన్మ ఎత్తినట్టు కలగంటిని" అని పలికెను. ఘుశ్మ ఆశ్చర్యచకితురాలై చూచుచుండ నందసుదానందముతో వచ్చి కన్నతల్లిని కౌగలించుకొనెను. ఇందుశేఖరుడు వారి ముందు సాక్షాత్కరించి "ఘుశ్మ! నీవు ధన్యురాలవు. కటిక రాకసియై నీ కుమారుని చిత్రవధ చేసిన మహా పాపాత్మురాలు సుదేహ! ఇప్పుడే ఆ పుత్రఘాతుకిని శిక్షింతు" ననెను. ఘశ్మ సాంబశివుని సన్నిధిలో చేతులు జోడించి "స్వామీ! ఆమెను క్షమించు. ఆమె అమాయకురాలు" అని ప్రార్ధించెను.
    సుందాంశుశేఖరుడు సుప్రసన్నుడైనాడు. "నీ ఔదార్యమునకు మెచ్చితిని. నీ వాంచితము సఫలమగుగాక! ఇక నుండి నీపేరు మీదుగా ఘుష్మేశ్వర నామముతో నే నిచ్చట వెలసియుండును." అని పలికి గౌరీ కాంతు దంతర్దానమయ్యెను. నాటి నుండి ఘుశ్మేశ్వరుడు జ్యోతిర్లింగరూపములో భూజనుల పూజలందుకొనుచున్నాడు. ఘుశ్మేశ్వర శివలింగ సందర్శనముచే సమస్త పాపములు పరాస్తములగును. శుక్లపక్షమున చంద్రరేఖవలె వారి సుఖమయజీవితము దినదినాభ్యుదయము నందును.

    ఈశానస్సర్వవిద్యానా మీశ్వర స్పర్వభూతనాం బ్రహ్మాది
    వతిర్ బ్రహ్మనోధిపతీర్ బ్రహ్మ శివో మేస్తు సదాశివోమ్||

    ఇవి ద్వాదశ జ్యోతిర్లింగములు. ఏవం విధమైనది జ్యోతిర్లింగవైభవము. ఈ శివమహాక్షేత్రములను శంకరాచార్యులవారు సందర్శించి సమర్పించి సంస్తుతించిరి. అస్తోత్రశ్లోకములను సతాత్పర్యముగ నిందు బొందుపరచితిమి. కవుల యనువాదపద్యములు చేర్చితిమి. అయాపుణ్యక్షేత్రముల చిత్రములు సమకూర్చితిమి. ఏతన్మహగ్రంధప్రకాశమునాకు హేతుభూతలయినవారు వదాన్యశిరోమణులు వైదికాచారపరాయణులు శ్రీమనికొండ కాశీవిశ్వనాధము గారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS