గౌతముని శాంతభావమునకు మహేశ్వరుడు మరింత సంతోషించెను. కరుణాకల్యాణవీక్షణములతో "గౌతమా! ఇదిగో నీ కాంక్షితము ననుసరించి గంగను ప్రసాదించుచున్నాను. ఈ గంగ గౌతమీ నామము ధరించి నీ కీర్తి ప్రవాహమువలె ప్రవహించు గాక. త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగరూపముతో నేనీ గౌతమీ తీరమున నిలిచి నీ వంటి భక్తుల ననుగ్రహించు చుండును" అని అంతర్ధానమయ్యేను.
ఋషులు గౌతముని పాదముల పైబడి తమ్ము క్షమింపుమని ప్రార్ధించిరి. సర్వదేవతలు సంతోషించిరి. నాటి నుండి గంగ గౌతమీ నామముతో భూతలమును ప్రపూత మొనర్చుచు ప్రవహించెను. సాంబశివుడు త్ర్యంబకేశ్వర రూపముతో తత్తీరమున విరాజిల్లెను.
వైద్యనాధం చితాభూమౌ
క్షేత్ర మహిమ:
సురాసుర సమారాధిక చరణద్వయుడైన మృత్యుంజయుఁడు వైద్యనాధ జ్యోతిర్లింగ రూపములలో ఉత్తర భారతమునందు "చితాభూమి" అను ప్రదేశములో సుప్రతిష్టితుఁడై యున్నాడు. సందర్శన మాత్రముననే సర్వపాపములను హరించివేయుచు, శరణాగతులకు భక్తీ ముక్తులకు ప్రసాదించుచు స్వామి విరాజిల్లుచున్నాడు. సమస్త శారీరక మానసిక వ్యాధులను పరిమార్చు ప్రభువగుట వలన స్వామికి "వైద్యనాదు" డను సార్ధక నామధేయము వచ్చినది.
పురాణ కధ :
ఒకప్పుడు రాక్షసాధీశ్వరుఁడైన రావణాసురుఁడు కైలాసపర్వతము మీద గౌరీవల్లభ నారధించెను. ఎంతకాలమునకు పరమ శివుడు ప్రసన్నుడు కాలేదు. పట్టినపట్టు వీడక రావణుడు పంచాగ్ని మధ్యమునఁ గూర్చుండి భయంకర తపోదీక్ష నవలంభించెను. ఇల్టు లంకేశ్వరుడు గ్రీష్మకాలమున భగభగమండు జ్వాలనజ్వాలా మధ్యమున కూర్చుండియు, వర్షాకాలమున జడివానలో నిలబడియు, శీతాకాలమున కంఠ దఘ్నజలములలో నిలుచుండియు ఘోర తపస్సు చేసెను. కాని పరమేశ్వరుడు ప్రత్యక్షము కాలేదు. మహా మనస్వియైన దశకంధరుఁడు దృడదీక్షా ధురంధరుడై కరాళ ఖడ్గముతో నొక్కొక్క శిరమును ఖండించి యుమారమణు'నకు సమర్పింపసాగెను. క్రమముగా రావణుని తొమ్మిది శిరములు పరమేశ్వరునకు పూజాపుష్పములైనవి. ఒక్కటియే తల మిగిలి యున్నది. స్వామి సాక్షాత్కారింపలేదు. లంకేశ్వరుడు సంకోచింపక తన పదియవ శిరస్సును ఖండించుటకై ఖడ్గము నేత్తెను. భక్త వత్సలుఁడైన పార్వతీ పతి రాక్షసేశ్వరుని ముందు సాక్షాత్కరించి వారము కోరుకొమ్మనేను. పరమేశ్వరానుగ్రహమున పౌలస్యునకు పది తలలు ప్రాప్తించెను.
రావణుడు నతమస్తకుఁడై హస్తములు జోడించి "పరమేశ్వరా! నిన్ను నావెంట లంకనగరమునకు గొనిపోయి స్వేచ్చగా ఆరాధించుకొందును. ఈ నా మనోరధమునీడేర్చి నన్ను కటాక్షించుము" అని అభ్యర్ధించెను. పరమశివుఁడు పౌలస్త్యుని భక్తికి మెచ్చి "రాక్షసరాజా! ఈ శివాలింగమునకు నాకు మారుగా ఇచ్చుచున్నాను. ఇది మహా మహిమాన్వితము" సకల ఫలప్రదము. దీనిని లంకకు గొనిపోయి పూజించుకొనుము. ఒక్కమాట. మధ్యేమార్గమున దీనిని భూమిపై నుంచకుము. ఉంచితివా, అక్కడే సుస్థిర సుప్రతిష్టమగును" అని శివలింగము నొసం ఁ గి సదా శివుఁ దదృశ్యఁ డయ్యెను.
రావణుడు సంతుష్టాంతరంగుడై శివలింగమును గైకొనిలంకకు ప్రయాణమైనాడు. మార్గమధ్యములో "చితాభూమి" అను ప్రదేశమునకు వచ్చునప్పటికి సంధ్య వార్చుట కేగవలసి వచ్చినది. అత్రోవ వెంట వెళ్ళుచున్న గోపాలబాలుని పిలిచి, శివలింగము నతని చేతికిచ్చి రావణుడు వెడలెను.
ఒక్క ముహూర్తమాత్రము గోపాలబాలుఁడు శివలింగము నేట్టేట్టులో పట్టుకొనగలిగెను. తర్వాత దాని భారమును భరించలేక అతడు శివలింగమును భూమి మీద పెట్టెను. రావణుడు సంధ్య వార్చుకొని వచ్చునప్పటికి శివలింగము భూమిలో పాదుకొని పోయింది. అఖండబలసపమన్వితుడైన యసురెంద్రుడు దానిని పెకల్చుటకు విశ్వ ప్రయత్నమూ చేసెను. భూమి యంతయు కదలినదే కాని శివలింగము మాత్రమూ లవలేశము లేవలేదు. చేయునది లేక రాక్షసరాజు తన రత్నాంగుళీయకమును శివలింగము శిరస్సుపై నుంచి లంకకు వెళ్ళిపోయెను. సుప్రతిష్ఠతుఁడైన స్వామిపై పుష్పవృష్టి కురిసెను. బ్రహ్మ విష్ణు దేవేంద్రాదులు వచ్చి భక్తితో పరమశివు నర్చించిరి. అప్పటి నుండి స్వామి "వైద్యనాధ" నామముతో చితాభూమి యందు విరాజిల్లు చుండెను.
నాగేశం దారుకావనే
క్షేత్ర మహిమ:
నాగేశ్వరజ్యోతిర్లింగము దారుకావనములో గోమతీ ద్వారక సమీపమున వెలసియున్నది. స్వామిని దర్శించి సేవించిన వారికి శాశ్వతమైన పుణ్యలోకములు సంప్రాప్తించును. స్వామి యావిర్భావకధను వినిన మాత్రముననే సకల పాతకములు శమించును. సర్వార్దములు సమకూరును.
శ్లో|| ఏతద్ యః శ్రుణుయాన్నిత్యం నాగేశోద్భువ మాదరాత్
సర్వాన్ కామానియాద్ దీమాన్ మహాపాతక నాశనాత్|| (శివపురాణము)
పురాణ కధ:
పూర్వము దారుక అనునొక రాక్షసి యుండెను. ఆమె భర్త దారకుడు. ఆ దానవదంపతులు మానవులను హింసించుచుండిరి. మహర్షుల యాశ్రమములలో జొచ్చి వారి యజ్ఞయాగాదులను విధ్వంసమొనర్చుచుండిరి. పశ్చిమసముద్ర తీరమున దారుకుడు వెయ్యి యోజనముల పొడవును అంతిమ వెడల్పు గల ఒక పెద్ద వనమును నిర్మించుకొని అవనములో భార్యతో గూడి విలాసముగా విహరించుచుండెను. అమాయకులగు సాధవుల ననేక విధముల పీడింపసాగెను. వాని పీడపడలేక వారందరు ఔర్వమహర్షి సన్నిధి కేగి తమ పాట్లు విన్నవించుకొనిరి. శరణాగతులైన వారిని రక్షింపనెంచి ఔర్వమహర్షి "నిరపరాధులైన భూమి మీది ప్రజలను హింసించినచో రాక్షసులు తత్ క్షణమే మరణించేద'రని ఘోరముగా శపించెను. ఈ విషయ మెరిగి దారకుఁడు వరబలమున వనమునంతటిని పైకెత్తి సముద్ర మద్యములో స్థాపన మొనర్చెను. ఔర్వమహర్షి శాపములో 'భూమి మీది ప్రజ' లనుటచే దారకుఁడు సముద్ర మద్యములో వనస్థాపన మొనర్చి , సముద్రచారులను సంహరించుచు నిర్భయముగా నిర్విచారముగా కాలము గడుపుచుండెను.
ఒక పర్యాయము పశ్చిమ సముద్రములో అనేక నావలు ప్రయాణించుచుండెను. వానిలో నెందరో ప్రజలుండిరి. ఇది చూచి దారకుడు వారిపై దాడి చేసెను. వారి నందఱను నిర్భంధించి కారాగారములో బంధించెను. వారిలో "సుప్రియు" దనునుత్తమవైశ్యు డొకదుండెను. సుప్రియుఁడు ధర్మాత్ముడు. సదాచార సంపన్నుడు. విభూతి రుద్రాక్షధారియై అనన్యభక్తీతో పరమశివుని ఆరాధించు భక్తాగ్రగన్యుడు. కారాగారముననున్నను సుప్రియుఁడు శివర్చానము మానలేదు. "నమశ్శివాయ" యను పంచాక్షరీమంత్రమును తా నొక్కడే జపించుచుండుట గాక, తన వారి కందఱకు నుపదేశించి వారిని శివభక్తులుగా నోనర్చెను.
ఇది చూచి రాక్షసులందఱు సుప్రియుని మీద కారాలు మిరియాలు నూరుట ప్రారంభించిరి. దారకుడు శివభక్తి తత్పరుఁడైన సుప్రియుని ముందు నిలిచి "ఓరీ! మానవధమా! ఏమిటీ దొంగ వేషాలు/ అసలు నీవెవరి యాజ్ఞాతో ఈ పూజాపురస్కారములు కొనసాగిన్చుచున్నావు?" అని గర్జించెను. దారుకుని తర్జనభర్జనలకు సుప్రియుఁడు చలింపలేదు. అతడు నిమీలితనేత్రుడై నిష్టాగరిష్ఠుడై నిశ్చలచిత్తముతో శివపూజ కావించుచుండెను. దారకుడు కోపోద్రేకముతో ఈ తుంటరిని వెంటనే కొనిపోయి చిత్రవధ చేయుడని సేవకుల కాజ్ఞాపించెను. రక్కసులోక్క పెట్టున నట్టహసములొనర్చి సుప్రియుని పై లంఘించిరి.
సుప్రియుడు నిటల ఘటితాంజలి పుటుఁడై నిటలాక్షునిట్లు ప్రార్ధించెను. "శంకరా! సాధుజనవశంకరా! ఈ దాసుని రక్షించుము. కళ్యాణమూర్తి! త్రిలోకనాధా! భవానీమనోహరా! భక్తవత్సలా! పరమశివా! ఈ దుష్టులను శిక్షించుము. నా దుఃఖమును దూరము గావించుము."
పరమేశ్వరుడు భక్తుని ప్రార్ధనము నాలకించెను. క్షణములో నచ్చట నొక మహామందిరము విరాజిల్లినది. మందిర మధ్యభాగమున జ్యోతిర్లింగము, దివ్యదీప్తితో తేజరిల్లింది! వెనువెంటనే సుప్రియుడు ఆ శివలింగము నాలింగనము చేసికొనెను. పర్వత రాజపుత్రితో పరమశివుఁడు ప్రత్యక్షమయ్యెను. తన చేతిలోని పాశుపాతాస్త్రముతో దారుకాది దానవాదిపతులను హతమార్చెను. అనంతరము ఆ వనమెల్ల భక్తులకు నివాసయోగ్యమగునట్లు వరము ప్రసాదించి అదృశ్యమయ్యెను. అదియే దారుకావనము. అందలి జ్యోతిర్లింగమే నాగనాధ నామముతో నలరారెను.
