ఇతనికీ అదే దారిలో పోవాలని ఉందా? కాకపోతే ప్రతి విషయం ఇంత డ్రమెటిక్ గా చేస్తాడెందుకు?
నిఖిల్ తో అసిస్టెంట్ రాజు నెమ్మదిగా అన్నాడు. "మీరు తప్పుగా అనుకోకపోతే నేనొకటి చెప్పదలుచుకున్నాను."
"చెప్పు!" అన్నాడు నిఖిల్.
"మీకు మిత్రులతోబాటు శత్రువులు కూడా ఎక్కువయిపోతున్నారు. అందుకని మీరు ఎక్కడ నిద్రపోయేదీ ముందుగా ఎవరికీ తెలియకూడదు. రెండోది రెండురోజులపాటు మీరు వరుసగా ఒకేచోట నిద్రపోకూడదు."
నవ్వాడు నిఖిల్. "పాలస్తీనియన్ గెరిల్లా లీడరు యాసిన్ అరాఫత్ లాగానా?"
"అవును"
కొంచెం ఆలోచించి "సరే!" అన్నాడు నిఖిల్.
తన సూచనని నిఖిల్ అంత సులభంగా ఒప్పుకుంటాడని ఊహించని రాజు మొహంలో సంతోషం కనబడింది.
తర్వాత అమూల్యవైపు తిరిగాడు నిఖిల్, "దినదిన గండం బ్రతుకు నాది. క్షణం కన్నుమూస్తే మళ్ళీ కళ్ళుతెరిచేదాకా భరోసాలేని జీవితం. కానీ చనిపోయేటప్పుడు బ్రహ్మచారిగా పోవడంకంటే వివాహితుడిగా పోవడమే బావుంటుంది. అవునా? ఏడ్చేవాళ్ళు కనీసం ఒక్కళ్ళన్నా ఉంటారు. నాకోసం కాకపోయినా కనీసం తాళిబొట్టు కోసం" అన్నాడు. అతని మొహంలో అరుదుగా కనబడే నవ్వు కనబడుతోంది. అప్పటిదాకా అతి టెన్షన్ గా ఉన్న వాతావరణం కొంచెం చల్లబడింది. వింటున్న అందరూ కూడా నవ్వు మొహాలు పెట్టారు.
"రేపే ముహూర్తం!" అన్నాడు నిఖిల్ అమూల్యతో.
ఆపాదమస్తకం దహించుకుపోతున్నట్లు ఫీలయింది అమూల్య.
రేపేనా ముహూర్తం. అయితే రేపట్లోగా ఏదన్నా చేసి తీరాలి తను! ఒకసారి తరుణ్ కి మెసేజ్ పంపగలిగితే ఎంత బాగుండు?
పెదిమలు కొరుక్కుంటూ ఆలోచనలో పడింది అమూల్య.
* * *
ఏజంట్ తరుణ్ తన బాస్ మిశ్రా దగ్గర నిలబడి ఉన్నాడు. పైపు కాలుస్తూ కాసేపు తరుణ్ వైపు చూశాడు మిశ్రా. "బిలియన్స్ ఆఫ్ బ్లూ బ్లిస్టరింగ్ బర్నాకిల్స్!" అని మొదలెట్టాడు. అతిపెద్ద, అతిచిత్రమైన ఊతపదాలు ఉపయోగించడం ఆయన హాబీ," మూడురోజుల్లో ముగ్గురు ప్రముఖ వ్యక్తులు మాయమయ్యారా? ఏమయి ఉంటారంటావ్?"
"నిఖిల్ ఎత్తుకెళ్ళిపోయి ఉంటాడనుకొంటాను"
"ఈ లోకల్ గూండాకి హఠాత్తుగా బిగ్ షాట్ అయిపోవాలని కోరిక అసలెందుకు పుట్టింది."
"విదేశాల్లో ఉన్న కొన్ని భారత వ్యతిరేక శక్తులు ఇక్కడున్న చిన్న వాళ్ళందరినీ పంపుకొట్టి బెలూన్లా ఉబ్బేసి, డబ్బు సాయంచేసి, వీలయినంత ఆర్భాటం, అల్లరీ చేయించదలుచు కున్నాయనుకుంటాను."
"నథింగ్ మోర్?"
"నథింగ్ మోర్ సర్! ప్రస్తుతానికి!"
"మరి నువ్వేం చేస్తున్నావ్?"
"నేను వాళ్ళమీదకి ఒక బ్రహ్మాస్త్రాన్ని వదిలాను"
"ఏమిటది?"
"మిస్ అమూల్య"
"అమూల్య! అమూల్య!" అని కళ్ళుమూసుకుని ఆలోచించాడాయన. "అమూల్య అంటే ఆ లాయరుపిల్ల! అవునా?"
"అవును సర్?"
వెంటనే మండిపడ్డాడు మిశ్రా "యూ థండరింగ్ నిట్ నిట్టెడ్ నమ్ స్కల్ యూ!" అని తిట్టి "ఆ పిల్ల వెళ్ళి ఏం చేస్తుంది. పాస్ట్ ఎక్స్ పీరియన్స్ ఏమీ లేదు కదా!" అన్నాడు.
"పాస్ట్ ఎక్స్ పీరియన్స్ లేకపోవచ్చు సర్ కానీ పగబట్టిన పాములా ఉంది ఆ పిల్ల! ఆ అమ్మాయిని తక్కువగా అంచనా వెయ్యడానికి లేదు. నా ఉద్దేశంలో తను మన పని సాధించగలదు."
"బిలియన్స్ ఆఫ్ బ్లూ బ్లిస్టరింగ్ బర్నాకిల్స్ ఇన్ ఏ థండరింగ్ టైఫూన్! ఆ పిల్ల అక్కడ ఒకదాని కొకటిచేసి మనపని పాడుచేసిందంటే, యూవిల్ బి హెల్డ్ డైరెక్ట్ లీ రెస్పాన్సిబుల్! ఓకే!" అన్నాడు మిశ్రా.
తల పంకించాడు తరుణ్.
* * *
మర్నాడు -
"నాతో రా!" అన్నాడు నిఖిల్ అమూల్యతో.
"ఎక్కడికి?" అంది అమూల్య.
"దిగంతాల అంచులకి!" అన్నాడు నిఖిల్ అదోలా నవ్వుతూ.
మనసులో అతన్ని శపిస్తూనే వెంట నడిచింది అమూల్య. కార్లో ఎక్కారు.
మళ్ళీ ఇదివరకటి టెన్షనే మొదలయింది అమూల్యకి. ఎక్కడికి తీసుకెళతాడు తనని? ఇప్పుడే పెళ్ళి చేసుకుంటాడా? పెళ్ళంటే ఏమిటి? మంత్రతంత్రాల మధ్య మంగళవాద్యాలమధ్య మాంగల్యం కడతాడా? లేకపోతే రిజిస్ట్రార్ ఆఫీసుకు తీసుకెళ్ళి సివిల్ మేరేజ్ చేసుకుంటాడా? అదీ కాకపోతే ఏ కొండకోనల్లోకో లాక్కెళ్ళి రాక్షస వివాహం చేసుకుంటాడా?
ఈ పెళ్ళి తన చావుకే వచ్చినట్లుంది నిజంగానే! తన చావు ముహూర్తం ఇంత దగ్గరలోనే ఉందని తనెప్పుడూ అనుకోలేదు.
