బాధో తెలీదు కాని ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అసలు ఏమైంది! కబురులేదు.
ఏం జరిగింది అసలే తెలీదు.
ఇంద్రసేన లైటుకూడా వేసుకోకుండా మంచంమీద అలా పడుకుంది.
క్రింద అంబిక వచ్చినట్టు మాట వినిపిస్తుంది.
ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుని వదిన వచ్చిందా లేదా అని మాటలుకోసం విన్నది.
అంబిక గొంతు వినిపించటంతో లేచి గబగబ వెళ్ళింది.
అంబిక రావటంతోనే విసుగ్గా వచ్చింది.
ఆమె ముఖం నల్లగా మాడిపోయి వుంది.
మనిషి ఎలాగో మాడిపోయి ఉంది.
ఆమె ఎంత అలిసిపోయి యింటికి వచ్చినా పెదవులమీద చిరునవ్వు ఎప్పుడూ మాయమవదు.
ఎప్పుడూ యెంత అలసిపోయినా ఎంత విసిగిపోయినా ఆలయంలో వెలిగే జ్యోతిలా ఆమె పెదవులమీద చిరునవ్వు అలాగే వుంటుంది.
కాని ఆరోజు అలాలేదు.
మనసుకి ఏదో దెబ్బ తగిలినట్టు అదోలా వుంది.
అంబిక ఎందుకలా వుంది!
ఏం జరిగింది!
వస్తానన్నవాళ్ళు రాలేదు సరికదా అంబికకు ఒంట్లో బాగోలేనట్టు అదోలా వుంది.
గణేశ్ రావు గారు కూడా కోడలిని ప్రశ్నించలేకపోయారు.
అంబిక చేతిలో స్టెతస్కోప్ టీపాయి మీద పడేస్తూ "ఛ ఛ" అంటూ అక్కడ సోఫాలో కూలబడిపోయింది.
"నేను అనుకున్నది ఏమిటి జరిగిందేమిటి?" అంది తనలో తాను అనుకున్నట్టుగా కాస్త పైకే వినిపించాయి ఆ మాటలు.
అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
జయరామ్ భార్యను అడిగాడు-
"ఏం జరిగింది అంబికా! నువ్వు చెప్పిన ఆ కృష్ణ రాలేదు ఎందుకు!" అతని కంఠస్వరంలో ఆతృత ధ్వనించింది.
"ఏం జరిగిందా చెపుతాను" అంది కోపంగా ఆలోచిస్తూ.
అతనికి ఏం అర్ధంకాలేదు.
"ఆ కృష్ణ మన ఇందూని చూడ్డానికి ఈ ఊరు వచ్చాడు" అంది శాంత గంభీరంగా ఒక్కో అక్షరం నొక్కి పలుకుతూ.
"వచ్చాడా! అయితే మనింటికి ఎందుకు రాలేదు?" అడిగాడు జయరామ్ ఆశ్చర్యంగా.
అదే ప్రశ్న అందరి మనసుల్లో ఉద్భవించింది. కాని ఎవరూ ప్రశ్నించలేదు.
"ఎలా వస్తాడు? ఆ కృష్ణమౌళి మనకి ఒక అడ్డుగోడలా నిలబడితే" అంది.
"కృష్ణమౌళీయా! నీవు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్ధంకావటం లేదు" అన్నాడు జయరామ్.
వచ్చిన అతనికి కృష్ణమౌళికి ఏమిటి సంబంధం అనతని ఉద్దేశం.
"ఏమిటా చెపుతాను. మన ఇందూని చూడడానికి కృష్ణ బయలుదేరి వచ్చాడు. అతను డాల్ఫిన్ లో దిగాడు. మన యింటికి వద్దామని అనుకుంటుండగా కృష్ణమౌళి ఆ హోటల్ కి వెళ్ళాడు. కృష్ణ యిద్దరికీ బాగా తెలుసునట. అతన్ని మనింటికి రాకుండా కృష్ణమౌళి ఆపుచేశాడని తెలిసింది" అంది.
"యేమిటి?" జయరాం కోపంతో మండిపడ్డాడు.
అతనికి వెంటనే వెళ్ళి కృష్ణమౌళిని చంపేయాలనిపిస్తుంది.
"వెళ్ళి వాడిపని చెబుతాను ఉండు" పళ్ళు పటపట లాడించాడు.
"ఏమిటి?" కంగారుగా చూసింది అంబిక భర్తవేపు.
"నా చెల్లెలికి సంబంధం వస్తే వాడు చెడగొట్టేస్తాడా! ఈ జయరామ్ అంటే ఏమిటో తెలియజేస్తాను" అన్నాడు ఫుల్ హాండ్స్ షర్ట్, హ్యాండ్స్ ని పైకి తీసుకుంటూ.
అంబిక భర్తవేపు "ప్చ్" అంటూ చూసింది. మీకు అన్ని విషయాలలోనూ తొందరే. ఆలోచన అసలు లేదు అన్నట్టున్నాయి. ఆమె చూపుల్లో అర్ధం.
అతను భార్యవేపు చూశాడు.
అయితే నన్ను ఏం చెయ్యమంటావు అన్నట్టునాయి అతని చూపులు.
మీకు తొందరపాటు తప్ప కీలెరిగి వాతపెట్టడం అసలు తెలీదు.
అలా అయితేనే ఎదుటివాళ్ళు టక్కున లొంగిపోయి పడివుంటారు.
అలాంటి మెళకువలు తెలుసుకుంటేనే మనం జయంతో ముందుకి దూసుకుపోతుంటాం అన్నట్టు కళ్ళతోనే అతనికి అర్ధమయ్యేటట్టు చెప్పింది.
ప్రతీ విషయానికి శాంతం, శాంతం అంటూ నన్ను యిలాగే ఆపేస్తుంటావు. ఇప్పుడు చూడు ఆ కృష్ణమౌళిగాడు ఏం చేశాడో అన్నట్టు కోపంగా చూశాడు.
"నాకు తెలుసు అతనిని ఏ విధంగా దెబ్బతియ్యాలో! అదే ఆలోచిస్తున్నాను. ఆ వచ్చిన కృష్ణ అతనికి ఫ్రెండ్ అయినంత మాత్రాన ఈ సంబంధం తప్పిపోతుందనే యెందుకు అనుకుంటున్నారు. కృష్ణమౌళి మాటలు నమ్మేటట్టు చేస్తానా! నేను ఆ కృష్ణతో ప్రత్యేకంగా మాట్లాడుతాను. కృష్ణమౌళికి తెలియకుండా సంబంధం నిశ్చయంచేసి కృష్ణతో మన ఇందూ పెళ్ళి జరిపించనూ!" అంది అంబిక.
ఆమె కళ్ళు గర్వంతో మెరిశాయి.
ఆడది తలుచుకోవాలే గాని ఏ పనయినా చిటికెలో సాధించేస్తుంది అన్నట్లున్నాయి ఆమె చూపులు.
అందరూ తేలికయిన మనసుతో ఆమెవేపు చూశారు.
ఇంద్రసేన తేలిగ్గా నిట్టూర్చింది.
తను భయపడినట్లు ఏమి జరగలేదు.
తనకి వదిన వుంది. ఎలాగయినా ఆ కృష్ణని తీసుకురాగలదు. ఆ నమ్మకం తనకుందనుకొని ధైర్యపడింది.
అంబిక తన గదిలోకి వెళుతూ మామగారికి, అత్తగారికి మరీ మరీ చెప్పింది.
"మీరేమీ బాధపడకండి" అని ధైర్యం చెపుతూ.
"ఇందూ పెళ్ళి ఆ కృష్ణతో జరిగిపోతుంది" అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది.
ఆమె వెనకాల జయరాం వెళ్ళిపోయాడు.
* * *
