5. వృత్రహంత ఇంద్రా ! నీవు ఒకరిద్దరు స్తోతలకు రక్షకుడవు. మావంటి వారి రక్షకుడవగుము.
6. ఇంద్రా ! మా వద్దనుండి విద్వేషులను దూరము చేయుము. స్తోతలకు సమృద్ధి ప్రసాదించుము. నీవు శోభన పుత్ర పౌత్రులను ఇచ్చువాడవు. అందుకే జనులు నిన్ను స్తుతింతురు.
7. ఇంద్రుడు ఆహ్వానయోగ్యుడు. స్తుతిపాత్రుడు. మిత్రుడు. నేను స్తోత్రబలమున, మహామంత్రములతో ఆవునువలె కోరికలు పితుకుకొనుటకు ఇంద్రుని పిలుచుచున్నారు.
8. వీర్యవంతుడై, శత్రు సేనను పరాజితము చేయు ఇంద్రుని రెండు చేతులందు దివ్య పార్థివ ధనములు ఉన్నవని ఋషులు ఎన్నోమారులు చెప్పినారు.
9. వజ్రధారి ఇంద్రా ! నీవు శత్రువుల దుర్భేద్య నగరములను నిర్మూలించినావు. యజ్ఞపతి, సర్వోన్నతడవగు ఇంద్రా ! నీవు శత్రువుల మాయలను నష్టపరుతువు.
10. ఇంద్రుడు సత్యస్వభావుడు. సోమపాయి. అన్నరక్షకుడు. అన్నాభిలాషులమగు మేము సద్గుణసంపన్నుడగు ఇంద్రుని ఆహ్వానింతుము.
11. ఇంద్రా ! నీవు తొలుత ఆహ్వాన యోగ్యుడవు. ఇప్పుడు శత్రుమధ్యమున ఉన్న ధనసాధనకుగాను నిన్ను ఆహ్వానించుచున్నాము. మేము నిన్ను పిలుచుచున్నాము. నీవు మా పిలుపులను ఆలకించుము.
12. ఇంద్రా ! నీవు మా స్తోత్రములు వినుము. ప్రసన్నుడవగుము. మమ్ము అనుగ్రహింపుము. అందువలన మేము అశ్వములతో శత్రువుల అశ్వములను ఉత్కృష్ట అన్నమును నిగూఢ ధనము గెలుచుటకు సమర్థులము కావలెను.
13. వీరుడవు, స్తుతిపాత్రుడవగు ఇంద్రా ! నీవు శత్రు మధ్యమున దాచిన ధనమును సాధించుటకు శత్రువులను గెలుచుటకు సమర్థుడవు.
14. శత్రుంజయ ఇంద్రా ! నీ నడక అతిశయ వేగయుక్తము. ఆ నడకలతోనే శత్రువును జయించుటకుగాను మా రథమును తోలుము.
15. ఇంద్రుడు జయశీలుడు రథశ్రేష్ఠుడు. ఇంద్రా ! నీవు మా శత్రువిజయ రథముమీద శత్రువులు దాచిన ధనమును గెలువుము.
16. ఇంద్రుడు సర్వదర్శి. వర్షణశీలి. పుట్టుకతోనే మానవుల అధిపతి అయినాడు. అట్టి ఇంద్రుని స్తుతించండి.
17. ఇంద్రా ! రక్షణల కారణముగా నీవు మాకు సుఖధాతవు. మిత్రుడవు. మా స్తుతులకు ప్రాచీన కాలమునుండి నీవు బంధుత్వము ప్రకటించినావు. ఇప్పుడు మమ్ము సుఖవంతులను చేయుము.
18. వజ్రధర ఇంద్రా ! నీవు రాక్షసనాశమునకుగాను వజ్రము ధరించినావు. నీతో స్పర్థగల వారిని పరాజితులను చేతువు.
19. ఇంద్రుడు ధనదుడు. మిత్రుడు. స్తోతలకు ఉత్సాహదాత. మంత్రములతో ఆహ్వానయోగ్యుడు. ప్రాచీనుడు. ఆ ఇంద్రుడినే ఆహ్వానించుచున్నాను.
20. స్తుతిద్వారా వందనీయుడు. అప్రతిహతగతి గల ఇంద్రుడు ఒక్కడే సమస్త పార్థివ ధనములకు అధిపతి.
21. గోవుల అధిపతీ ! నీవు 'వడవ' లతో కలిసివచ్చి మాకు అన్నము, అసంఖ్యాక అశ్వములు, ధేనువులు ఇచ్చి మా కోరిక తీర్చుము.
22. స్తోతలారా ! గడ్డి గోవుకు సుఖావహమగును. అట్లే సోమరసము సిద్ధముకాగా ఇంద్రునకు సుఖదాయకమగును. ఇంద్రుని స్తోత్రము చాలమందికి వందనీయమగును. రిపుంజయ ఇంద్రునివద్ద ఏకత్రితులై గానము చేయండి.
23. ఇంద్రుడు గృహప్రదాత. అతడు మా స్తోత్రములు విన్నపుడు ధేనువుల సహితముగా అన్నము ప్రదానము చేయుటకు విసుగుచెందడు.
24. దస్యులను వధించు ఇంద్రుడు 'కువత్సు' ని అసంఖ్యాక గోవులున్న గోష్ఠమున ప్రవేశించినాడు. అతడు తన బుద్ధిబలమున మా కొఱకుగాను ఆ గోసమూహములను ప్రకటించినాడు.
25. బహువిధ కర్మలు అనుష్ఠించు ఇంద్రా ! ఆవులు మాటిమాటికి దూడలవద్దకు పోయినట్లు మా స్తుతులన్నియు మాటిమాటికి నీవైపునకు మరలును.
26. ఇంద్రా ! నీ బంధుత్వము నశించునదికాదు. నీవు గోవులు కోరువారలకు గోవులు, అశ్వములు కోరువారలకు అశ్వములు ప్రసాదింతువు.
27. ఇంద్రా ! మహాధనమునకుగాను ప్రదత్తమయిన సోమరసమును త్రాగుము. తృప్తుడవగుము. నీ ఉపాసకులను నిందకులకు అప్పగించవు.
28. స్తుతులతో వందనీయుడవగు ఇంద్రా ! పాడి ఆవులు దూడలవద్దకు చేరినట్లు తేప తేప సోమరసము అభిషుతమైనపుడు మా స్తుతులు వేగముగా నీవైపు సాగును.
29. అసంఖ్య శత్రునాశక ఇంద్రా ! యజ్ఞ మండపమున హవిరూప అన్నముతో అర్పించబడిన స్తోతల స్తోత్రములు నిన్ను బలశాలిని చేయవలెను.
30. ఇంద్రా ! అత్యున్నతములగు మా స్తోత్రములు నీ వద్దకు చేరవలెను. మమ్ము మహాధనప్రాప్తికి ప్రోత్సహించుము.
31. గంగయొక్క ఉన్నత తటములవలె ప్రాణుల మధ్య ఉన్నత స్థానమందు బ్రుబునామక అసురుడు లేక వణిజుడు నిలిచి ఉన్నాడు.
32. నేను ధనార్ధిని. బ్రుబుడు వదాన్యతతో నాకు వాయువేగముగల వేయి ఆవులను వెంటనే ఇచ్చినాడు. మేమందరము వేయిగోవులు ఇచ్చిన విద్వాంసుడు, వేల స్తోత్రముల పాత్రుడు బ్రుబుని ప్రశంసింతుము.
నలుబది ఆరవ సూక్తము
ఋషి - బృహస్పతి పుత్రుడు శంయుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - బృహతి.
1. మేము స్తోతలము. అన్నప్రాప్తికొఱకు నిన్ను పిలిచెదము. నీవు సాధుజన రక్షకుడవు. అందువలన అశ్వములతో కూడిన యుద్ధమున శత్రువులను గెలుచుటకు నిన్ను ఆహ్వానింతుము.
2. విచిత్ర వజ్రపాణి వజ్రీ ! యుద్ధమున గెలిచినవానికి నీవు అడిగినంత అన్నము ప్రదానము చేస్తావు. అట్లే నీవు మా స్తుతులకు ప్రసన్నుడవయి అడిగినన్ని గోవులను, రథములాగగల పుష్టికరమగు అశ్వములను ప్రసాదించుము. నీవు శత్రునాశకుడవు. ప్రతాపవంతుడవు.
3. ఇంద్రుడు ప్రబల శత్రునిహంత. సర్వదర్శి. ఆ ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. సహస్రశేఫ, అతులధన సంపన్న, సత్పాలక ఇంద్రుడు రణభూమిలో మాకు సమృద్ధి కలిగించవలెను.
(శేఫ శిశ్నము స్త్రీలోలుడయిన ఇంద్రుడు పర్వదినములందు వేయి శిశ్నములు కలవాడగునని కథనము)
4. ఇంద్రా ! ఋక్కులలో వర్షించినట్లే నీ రూపము ఉన్నది. తుముల యుద్ధమున వృషభమువలె అత్యంత క్రోధమున మా శత్రువులను ఆక్రమించుము. అందువలన మాకు సంతతిగలిగి చాలకాలము సుఖములు అనుభవించవలెను. నీవు రణభూమిలో మాకు రక్షకుడవగుము.
5. సుందర హనువులు. దవడలు కలవాడా ! అద్భుత వజ్రపాణి ఇంద్రా ! నీవు అన్నముతో స్వర్గమును, భూమిని పోషించుచున్నావు. అటువంటి ప్రకృష్టతమము, అత్యంత బలవర్ధకము, పుష్టిసాధకమగు అన్నముతో మావద్దకు విచ్చేయుము.
6. దీప్తిశాలి ఇంద్రా ! నీవు మమ్ము రక్షింతువు. అందుకే మేము ఆహ్వానిస్తాము. దేవతలందరిలో బలవంతుడవు. శత్రుంజయుడవు. గృహదాత ఇంద్రా ! సమస్త రాక్షసులను వేరు చేయము. మమ్ము శత్రువులను జయించువారిని చేయుము.
7. ఇంద్రా ! మానవులందున్న బలము, ధనము, అయిదులోకముల అన్నమును అన్నింటిని మహాబల సహితముగా మాకు అందించుము.
("యద్వా పఙ్చక్షితీనాం" అని మంత్రము. పంచ క్షితీనాం నిషాదపంచమాశ్చత్వా రోవర్ణః అని శాయణుని వ్యాఖ్య. నిషాదులతో అయిదుగురయిన చతుర్వర్ణములు అని అర్థము. క్షితి అనగా భూమి లోకములను అర్థము వాడినాను)
8. ఐశ్వర్యశాలివగు ఇంద్రా ! శత్రువుతో యుద్ధము మొదలయినంత మేము వారిని గెలువవలెను. అందుకొఱకు నీవు మాకు త్రక్షు, ద్రాహ్య, పురు వీరుల సమస్త బలము ప్రసాదించుము.
9. ఇంద్రా ! హవ్యరూప ధనముగల వారికి మఱియు నాకు ఒక గృహమును ప్రసాదించుము. అది కలప, ఇటుకరాతితో కట్టబడి ఉండవలెను. అందులో చలి, వేది బాధించరాదు. అది సమృద్ధము, ఆచ్చాదితము కావలెను. శత్రువుల సమస్త దీప్తియుక్త ఆయుధములను దూరముగా ఉంచుము.
(గృహనిర్మాణ సామాగ్రిలో నాటికి నేటికి చెప్పుకొనతగిన మార్పు వచ్చినట్లు కనిపించదు. అదే ఇటుక అదే రాయి, అదే కలప ! శీతాతపములు సోకని ఇల్లు బహుశః నేటి AIR CONIDITION వంటివి కావచ్చును. ప్రేలుడు పదార్థములు ఇంటికి దగ్గరలో ఉండరాదనుట నాటి నిశిత పరిశీలనకు నిదర్శనము)
10. ఐశ్వర్యశాలి ఇంద్రా ! మా గోవులను అపహరించుటకు శత్రువువలె మామీద ఆక్రమణ చేసినవారినుండి రక్షించుటకు తరలిరమ్ము.
11. ఇంద్రా ! ఇప్పుడు ఇప్పుడే మాకు ధనము నిమ్ము. పక్షయుక్తములు, తీక్ష్ణా గ్రములు. దీప్తములగు శత్రువుల బాణములు ఆకాశము నుండి రాలినప్పుడు మమ్ము రక్షించిన వారున్నారు. నీవు వారిని యుద్ధభూమిలో రక్షింపుము.
("యదన్తరిక్షే పతయన్తి పర్ణివో" అని మంత్రము రెక్కలు కలిగి ఆకాశము నుండి పడునట్టి అని అర్థము. ఇవి క్షిపణుల వంటివికావచ్చును !
నన్ను రక్షించిన వారిని రక్షించుమనుట ఎంత కృతజ్ఞత ! ఎంత ఉదారత !! ఎంతటి సదాశయము !!!)
12. శత్రువులముందు వీరపురుషులు తమ పరాక్రమము ప్రదర్శింతురు. పైతృక స్థానమును విడుతురు. అప్పుడు నీవు మమ్ము మా సంతానపు దేహములను రక్షించుటకు గుప్త రూపమున కవచములు అందించుము. శత్రువులను దూరము చేయుము.
(పైతృక స్థానమును విడుచుట అనగా విస్తృత పరచుట. దానికి మరింత చేర్చుట)
13. మహా యుద్ధ సమారోహము. ఉత్సవము జరుగవలెను. కాని మా గుఱ్ఱములను దగ్గరి దారిన కుటిల ప్రాంతములనుండి సాగునదియు, మాంసము కొఱకు మహావేగమున ఎగురు శ్యేనమువంటి వేగమున పంపుము.
14. అశ్వములు భయమున సకిలించును. అయినను పల్లమునకు దూకు నదులవలె అశ్వములు వేగవంతములు, దృఢవంతములై మాంసము కొఱకు ఉదుకు పక్షులవలె గోవులను సాధించుటకు జరుగు సంగ్రామమున మాటి మాటికి పరుగులు పెట్టును.
నలుబది ఏడవ సూక్తము
ఋషి - భరద్వాజపుత్రుడు గర్ణుడు దేవత - వేరు వేరు, ఛందస్సు వేరు వేరు.
1. ఇది అభిషుత సోమము. రుచికరము, మధురము, తీవ్రము, రసవంతము, దీనిని ఇంద్రుడు స్వీకరించును. అప్పుడు యుద్ధమున ఇంద్రునిముందు ఎంతటివాడును నిలువజాలడు.
2. ఈ యజ్ఞమున త్రావిన సోమము ఎంతో హర్షము కలిగించినది. వృత్రవధ సమయమున ఇంద్రుడు దీనిని త్రావి ప్రసన్నుడయినాడు. అతడు శంబరుని తొంబది తొమ్మిది పురములను ధ్వంసము చేసినాడు.
3. త్రావినంత ఈ సోమము నా మాటల స్ఫూర్తిని పెంచును. ఇది కోరిన వృద్ధిని ప్రసాదించును. ఈ సుబుద్ధి సోమమే స్వర్గము, పృథ్వి, దివారాత్రులు, జలము, ఓషధులు మున్నగు ఆరింటిని సృష్టించినది. ప్రాణులందు ఎవడును సోమము నుండి దూరముగా ఉండజాలడు. (రాత్రింబవళ్లు రెంటితో ఆరు అగును)
4. ఫలితముగా ఈ సోమరసమే పృథ్విని విస్తరింప చేసినది. స్వర్గమును గట్టిపరచినది. ఈ సోమమే ఓషధులు, జలము, ధేనువులను ఉత్కృష్టములగు మూడు ఆధారములను రసవంతములను చేసినది. ఈ సోమమే విస్తృత అంతరిక్షమును భరించి ఉన్నది.
5. నిర్మల ఆకాశమున నిలిచిన ఉషకన్న ముందే ఈ సోమరసము సూర్యుని జ్యోతిని ప్రకటించును. జలవర్షి, బలశాలి అగు ఈ సోమరసమే మరుత్తులతో కలిసి గట్టి స్తంభమున స్వర్గమును నిలిపి ఉంచినది.
6. ఇంద్రా ! నీవు వీరుడవు. ధనము కొఱకు మొదలైన సంగరమున నీవు శత్రుసంహారము చేయుము. సాహసముగా కలశమందున్న సోమరసము త్రాగుము. మధ్యాహ్న యజ్ఞమును నీవు మరింత సోమపానము చేయుము. ధనపుత్రా ! మాకు ధనము నిమ్ము.
7. ఇంద్రా ! మార్గదర్శివలె ముందునడిచి మమ్ము కనిపెట్టి ఉండుము. మాముందుకు శ్రేష్ఠ ధనము తెమ్ము. మమ్ము దుఃఖమునుండియు, శత్రువులనుండియు రక్షింపుము. ఉత్కృష్ట చేతనై మమ్ము కోరుకున్న ధనమువైపు నడిపించుము.
8. ఇంద్రా ! నీవు జ్ఞానివి. మమ్ము విస్తీర్ణ లోకమునకు సుఖమయి, భయరహితమైన ఆలోకములకు నిర్విఘ్నముగ నడిపింపుము. నీవు ప్రాచీనుడవు. మేము నీ మనోజ్ఞ, బృహత్ బాహువులను రక్షణకొఱకు ఆశ్రయించినాము.
