Previous Page Next Page 
హౌస్ సర్జన్ పేజి 26


    "విన్నాను."

    "ఏడాది చేశారు. ఈ ఏడాదిలోపల ఎన్ని  విపరీతాలు  జరుగుతాయో ఎవరు చెప్పగలరు ? ఆ తర్వాత ఆమె రాగలుగుతుందో _ ఏమవుతుందో?"

    నేను మౌనంగా  అలకిస్తున్నాను.

    ఈ హాస్పిటల్ లోని  నర్సు అందరిలోకీ  లలిత నా బెస్ట్ ఫ్రెండ్ ! దాని జీవితం యిలా అయిపోయిందంటే, నేను వొంటరి దానిలా అనిపిస్తూ పిచ్చెక్కుతోంది." ఆమె గొంతులో  ఏడవగా ఏడవగా ఏర్పడ్డది జీర.

    "కొన్ని సంఘటనలు  అలా జరుగుతాయి, దురదృష్టవంతులకు. బాధపడకండి, నళినీ" అన్నాను.

    కాసేపుండి ఆమె వెళ్ళిపోయింది, కళ్ళు తుడుచుకుంటూ.

    సిస్టర్సును చూస్తే  ఒకందుకు నా హృదయం జాలిలో నిండిపోయేది. ఎవరో ఎక్కడో తప్ప వారంతా అతి బీద కుటుంబాల నుండి  వచ్చినవారు .వారిమీద ఎంతో  ఆశ పెట్టుకుని వుంటారు, వారి తల్లిదండ్రులు. అందమైన తెల్లటి యూనిఫారమ్ లో చూసే  నర్సుకూ; వారి కుటుంబ  నిజ పరిస్థితికీ ఎంతమాత్రం  సంబంధంలేదు. వారి నిజ జీవిత చరిత్ర తెలిస్తే  వారిని గురించి  ఊహించుకున్న  అభిప్రాయాలన్నీ  తారుమారవుతాయి.

    ఇలాగే అనుకోని సంఘటన లెదురవుతూ  వుంటాయి. ఒకసారి పనివుండి టి.బి. వార్డుకు వెళ్ళాను. అక్కడ మంచంమీద  ఆలోచిస్తూ  పడుకుని వున్న యువతి నన్ను చూసి  బెదిరినట్లయి  తల ప్రక్కకు త్రిప్పుకుంటోంది. ఆమెను చూసి చకితుణ్నయి దగ్గరగా  వెళ్ళి "మీరు......." అన్నాను.
    ఆమె యిహ  బావుండదని  కాబోలు  లేచి కూర్చుని, "అవును, నేనే" అంది.
    ఆమె నేను మెడికల్ వార్డులో  పనిచేసినప్పుడు  అక్కడ  పనిచేసిన సిస్టర్. మొదట్లో నాతో చాలాసార్లు దుడుకుడుగా మాట్లాడింది.
    "మీకు...."
    "అవును. నాకు టి.బి. అందుకే  యీ నరకంలోకి  వచ్చి  చేరాను" అంటూంటే  ఆమె కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి.                         
    ఆమె నోదార్చి  అక్కడి నుండి బయటపడేసరికి  ఉక్కిరి బిక్కిరి అయినంత  పనయింది.
    తర్వాత అక్టోబరు నెలలో  పరీక్షలు  వచ్చాయి. థియరీ  అయిపోయింది. ఓరల్స్, ప్రాక్టికల్స్  మొదలయాయి. హాస్పిటలంతా  తెగ  హడావుడిగా  వుంది. బెడ్ లన్నీ  ఒక ప్రక్కకి లాగేసి, మధ్య మధ్య తెరలు అమర్చి  ఎగ్జామినర్స్  కూర్చోవటానికి  అనువైన  ప్రదేశాలు  అమరుస్తున్నారు. సిస్టర్లు చాలా కష్టపడి వార్డులన్నీ  శుభ్రంగా  తీర్చిదిద్ది అందంగా తయారుచేస్తున్నారు. అవసరాన్ని బట్టి  పేషెంటును  ఒక వార్డునుంచి  మరో వార్డుకు పంపించి  ఎక్కడ ఏమేమి కావాలో  అమరుస్తున్నారు. విద్యార్ధులు మూడు రోజులు ముందుగానే  వార్డుల్లోకి  వచ్చి, పరీక్షలో పెట్టటానికి  అవకాశముండే ముఖ్యమైన  కేసులన్నీ  చూసుకుని వారి ముఖాలూ, పేర్లూ గుర్తుపెట్టుకుని  వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత వారినింక  ఆ వార్డులలోనికి  రానివ్వరు  ఎగ్జామినర్స్  నలుమూలలనుంచీ  వచ్చేసి ,కార్లలో దిగి ఠీవిగా నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, చేతిలో ఫైళ్ళు  వూపుకుంటూ  హాస్పిటల్ లో సంచారం మొదలు పెట్టారు.

    గైనిక్ వార్డులో  విద్యార్ధులకు  ఎనలేని  సహాయం  జరిగిపోతుంది. ఉదయం ఎనిమిది గంటలకల్లా విద్యార్ధులకు  కేసులిచ్చేస్తారు .మెల్లిగా  పది గంటలకుగాని ఎగ్జామినర్స్  అక్కడ దిగరు. ఈలోగా  అద్భుతమైన సదుపాయాలు జరిగిపోతున్నాయి. అంతవరకూ  ఎంతో  గంభీరంగా, కోపంగా కనిపించే  అసిస్టెంట్లు  కూడా ప్రతి స్టూడెంటు దగ్గరా ఆగి  కేసు తెలిసిందా అని అడిగి ,తెలియదంటే  అదేమిటో  చెప్పి, ఆ కేసులో  ఎగ్జామినర్స్ సాధారణంగా అడిగే ప్రశ్నలూ, చెప్పవలసిన  సమాధానాలూ గబగబ తర్ఫీదు యిచ్చి  వెళ్ళిపోతున్నారు. గైనిక్ లో పనిచేసే హౌస్ సర్జన్లు  కూడా యధాశక్తి తమ పాత్ర నిర్వహిస్తున్నారు. కొందరు విద్యార్ధులు మొదట అర్ధమైనట్లు  తలఊపి, అసిస్టెంటు  అటుప్రక్కకి  వెళ్ళిపోగానే  ఏమి చెప్పిందో మరిచిపోయి  తబ్బిబ్బుపడి, హౌస్ సర్జన్లను  పిలిచి  అడుగుతున్నారు.

    తర్వాత ఎగ్జామినర్స్ రావటం, ఒక్కొక్క విద్యార్దినీ లోపలకు పిలవటం, నెత్తురులేని  ముఖాలతో  పులిబోనులోకి  వెడుతున్నట్లు  లోపలకు ప్రవేశించటం, ప్రశ్నలు, జవాబులు ,వేళాకోళాలు, ఎగ్జామినర్స్ వున్నట్లుండి గట్టిగా  నవ్వటం....ఇలా ఉంది  వాతావరణం.     

    మధ్యాహ్నం  ఓరల్సు. నేను బల్లమీద స్పెసిమన్సూ  అవీ సర్దిస్తూ  హడావుడిగా ఉన్నాను. ఆ స్పెసిమన్స్ మీద  వాటి పేర్లను  సూచించే  లేబిల్సు మీద  నల్లకాయితాలు  అంటిస్తారు. వాటిని విద్యార్ధికి  చూపించి  అదేమిటో గుర్తుపట్టమని  అడిగి, ఇహ  దాని గురించి  తర్జన భర్జన  జరుపుతారు.

    నేను హడావుడిగా  అటూ యిటూ  తిరుగుతూండే  సమయంలో ఎక్కడి నుంచో  "అన్నయ్యా!" అన్న పిలుపు వినిపించింది.

    ఎవరిదా  పిలుపు  అనుకుంటూ  తల వెనక్కి  త్రిప్పి  చూసేసరికి, బెంచీలమీద పుస్తకాలు  వొడిలో  పెట్టుకుని ఆత్రంగా  పేజీలు  త్రిప్పేస్తూన్న  విద్యార్ధులూ, వారి ప్రక్కగా  నిలబడి  ఓ ఎర్రటి  కుర్రాడూ  కనిపించాడు.

    "సుందరం !" అన్నానతన్ని  గుర్తుపట్టి, దగ్గరగా  వెడుతూ, "ఎప్పుడు వచ్చావు ?"

    నన్ను చూడగానే  అతని ముఖం చాటంత  అయింది. సుందరం తెల్లటి  ప్యాంటువేసుకుని, అందులో  తెల్లటి షర్టు  టక్ చేశాడు. చేతిలో  సంచి వుంది. అతను  మా పెదనాన్నగారి అబ్బాయీ. స్కూల్ ఫైనల్ ప్యాసయి యిహ చదువుకు స్వస్తిచెప్పి  యింట్లోనేవుండి  తండ్రికి  సాయంగా  పొలంపని చూస్తున్నాడు. శుద్ధ అమాయకుడు. అతని అమాయకత్వాన్ని  లోకువ కట్టేసి  ఆ పల్లెటూళ్ళో  మిగతా  కుర్రాళ్ళు  అతన్నేడిపిస్తూ  వుండేవారు.

    "ఇప్పుడే  బస్సుదిగి  వస్తున్నాను. మొదటిసారిగా  వేశాను. నా   యిన్ షర్టు బాగుందా ?" అని అడిగాడు. తన బట్టలవంక  చూసుకుంటూ. ఇన్ షర్టు వేసుకున్నానన్న  సంతోషంతో బాటు, బాగుండకపోతే  ఎదుటివారు అవహేళన చేస్తారన్న  భయంకూడా  అతని  మాటల్లో  కనిపించింది.

    "ఫస్టుగా వుంది నీకేమిటి ? దొరబిడ్డలా  ఉన్నావు" అన్నాను అతన్లోని కాంప్లెక్స్ పోగొడదామని.

    నా మాటలకు  మురిసిపోయాడు. తనలో తను ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు.

    "ఇంత హఠాత్తుగా  వచ్చావెం ? ఏమిటి కథ ?" అనడిగాను.

    "చెల్లాయికి  పెళ్ళి  సంబంధమొకటి  చూశారు. పెళ్ళికొడుకుది యీ ఊరు. నువ్వున్నావుకదా, నీ సాయంతో  వివరాలన్నీ  కనుక్కురమ్మన్నారు. ఎడ్రస్ తీసుకొచ్చాను" అని జేబులోంచి  ఏదో కాయితం  బయటకు తియ్యబోతున్నాడు.

    నేను వారిస్తూ  "సాయంత్రం  చూద్దాం, ఉంచులే ? ఇప్పుడు కొంచెం పని తొందరలో  ఉన్నాను. నువ్వు నా రూముకెళ్ళి  విశ్రాంతి  తీసుకో. పని చూసుకుని  నేను  వస్తాను" అని నా గది తాళం చెవి తీసియిచ్చి, క్వార్టర్సుకు వెళ్ళవలసిన  దారీ, నా రూమ్ నెంబరూ  చెప్పాను.

    అతను తాళంచెవి  అందుకుని  "అదిసరేగాని, అన్నయ్యా! వీళ్ళంతా అలా ఎందుకు కూర్చున్నారు? ఏం చేస్తారిప్పుడు ?" అనడిగాడు సుందరం, విద్యార్ధులవంక  కుతూహలంగా  చూస్తూ.

    "వాళ్ళకు  పరీక్షలు  జరుగుతున్నాయిరా. అసలు నువ్వు లోపలకు ఎలా వచ్చావు ? గేటు దగ్గర జవాన్ ఆపుతాడే !"

    "ఏమో, నన్నెవరూ  ఆపలేదు. నీ పేరుచెప్పి, నువ్వెక్కడ ఉంటావని వాకబుచేస్తూ తిన్నగా లోపలకు వచ్చేశాను" అన్నాడు, తనకేమీ  తెలియదన్నట్లు.

    ఒకసారి  అతనివంక చూసి, అతని తెల్లబట్టలూ, చిన్న ఆకృతీ చూసి బహుశా స్టూడెంటయి  ఉంటాడని  పట్టించుకుని  ఉండరని  సమర్ధించుకుని  "పోన్లే, ఎగ్జామినర్స్  వచ్చే వేళయింది. ఇహ యిక్కడ  వుండకూడదు. రూమ్ కెళ్ళి  రెస్ట్ తీసుకో ! నేను  సాయంత్రం  వస్తాను" అన్నాను తొందరపెడుతూ.

    సుందరం  "సరే" అని అక్కణ్నుంచి కదలబోతూ, మళ్ళీ  ఆగి, "అన్నయ్యా! అమ్మ జంతికలు పంపించింది  నీకు" అన్నాడు.

    నేను గతుక్కుమని  ఆ మాటలు  యితరులెవరైనా  విన్నారేమోనని అటూ యిటూ చూసి  "సరేలే, గదిలో వుంచు" అన్నాను.

    ఇంతలో  మెట్లదగ్గర  ఎవరో  వస్తున్నట్లు అలికిడవటం, వస్తున్నా రొస్తున్నారని విద్యార్ధుల్లో కలకలం చెలరేగటం, సుశీలగారు నన్ను  "డాక్టర్ ! ఒకసారి రండి" అని ఏదో పనివుండి ఆతృతగా పిలవటం, "నువ్వింక వెళ్ళిపో సుందరం, నేను తర్వాత  కలుస్తాను" అని నేను కూడా హడావుడిగా లోపలికి  వెళ్ళిపోవటం గబగబ జరిగిపోయాయి.

    ఎగ్జామినర్స్ వచ్చేశారు. రెండు గదులలో  రెండు బ్యాచీల విద్యార్ధులకు ఒకేసారి ఏర్పాట్లు గావించబడ్డాయి. ఎగ్జామినర్లలో  ఎక్కువభాగం స్త్రీలే .ఇద్దరుమాత్రం  పురుషులున్నారు. ఎందుకో  ఉద్యోగ  నిర్వహణలో పురుషులకంటే  స్త్రీలు చాలా కఠినంగా  ఉన్నట్లు  కనిపిస్తారు. అది నిజమో ,నిజమని భ్రమింపచేయటమో  తెలియదు.

    తెర అవతల  నేనూ, సుశీలగారూ  వారికోసమని  ప్లేట్లలో  బిస్కెట్లూ, కాఫీలూ సర్దుతున్నాము. బయట ఎగ్జామినర్స్  కుర్చీలలో  ఆసీనులై, ఫైల్సన్నీ  సర్దుకుని  "ఇహ  ఒక్కొక్కరినీ  పిలుద్దామా ?" అనుకోవటం వినిపించింది.

    నేను కుతూహలంగా  స్క్రీన్ యివతలకు  ముఖంపెట్టి  తొంగిచూశాను. వెంటనే  గుండె ఆగిపోయినట్లయింది. గుమ్మందగ్గర సుందరం చేతిలో  సంచితో ఎదురుగా  నిలబడి చోద్యం  చూస్తున్నాడు. మొదట రావలిసిన విద్యార్ధి అతని ప్రక్క నిలబడి బిక్కుబిక్కుమని  చూస్తున్నాడు.

    అంతలో  ఓ లేడీ  ఎగ్జామినర్, గుమ్మంవైపు  తలత్రిప్పి  సుందరం వంక చూస్తూ "యస్. కమిన్" అంది.

    అతనికి  మనసులో  ఏమనిపించిందో, తననే  పిలిచారనుకున్నాడు  కాబోలు గబగబ లోపలికి వస్తున్నాడు.

    నేను నెత్తిబాదుకుని, వెనక్కి  తిరిగి వెళ్ళిపొమ్మని  అతనికి సౌంజ్ఞలు చేస్తున్నాను. నావంక చూస్తేగా! వచ్చి వాళ్ళు  కెదురుగా  నిల్చున్నాడు.

    "కూర్చో" అన్నారు వారు, యింగ్లీషులో, కుర్చీ చూపిస్తూ. సుందరం వెంటనే కూర్చున్నాడు.

    ఒక ఎగ్జామినర్  అతనివంక  ఫెటల్ స్కల్, పెల్విస్ తోసి, "వీటిని తీసుకో" అంది.

    అతను వాటిని అందుకుని, వాటిని అటూ యిటూ త్రిప్పి, చిత్రంగా పరీక్ష చేస్తున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS