ఆ గుంపు మధ్య నిఖిల్ నిలబడి ఉన్నాడు. ఊహించని సంఘటన ఏదో జరిగినట్లు పాలిపోయింది అతని మొహం. కానీ కొద్ది క్షణాలలోనే తేరుకొని చెప్పడం మొదలెట్టాడు.
"ఫ్రెండ్స్! నా మీద హత్యా ప్రయత్నం జరగడం ఇది మొదటిసారి కాదు. ఎన్నోసార్లు ఎన్నోచోట్ల మృత్యువుకి మూడడుగుల దూరంలోకి వెళ్ళిపోయాను నేను.
కానీ ఇవాళ జరిగింది మామూలు హత్యా ప్రయత్నం కాదు. ఇది నమ్మకద్రోహం. నయవంచన నా ఉప్పుతిని నాకే అపకారం తలపెట్టిన నమక్ హరాం ఇక్కడే ఉన్నాడు."
చిక్కటి నిశ్శబ్దం అలముకొంది అక్కడంతా.
కొంచెంసేపు అన్హరినీ పరిశీలనగా చూసి నిఖిల్ మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు. "మొదటగా ఆ హత్యా ప్రయత్నం చేసినవాడిని మెచ్చుకోవాలి నేను. ఎందుకంటే చాలా తెలివిగా జరిగిన ప్రయత్నం ఇది!"
అందరూ చెవులప్పగించి వింటున్నారు.
"నా బెడ్ రూంలో ఫాన్ దగ్గరనుంచి ఒక దారం వేలాడదీశారు. దానిపైన విషం ఉన్న రబ్బరుతిత్తి పెట్టి ఉంది. సరిగ్గా దానికిందే నా మంచం. దారం మంచందాకా వేలాడుతోంది.
ఫ్రెండ్స్ నేను నిద్రపోయేటప్పుడు నోరు కొద్దిగా తెరిచి ఉంచుతానని తెలిసిన మనిషే ఈ పని చేశాడు.
తీవ్రాతి తీవ్రమైన విషం అది! సముద్ర సర్పాలనుండి తీయబడిన విషం! ఒక్క కాటుకు ముగ్గురు మనుషులు చచ్చిపోయేంత పవర్ ఉన్న విషం అది!
హంతకుడు విషం ఉన్న రబ్బరుతిత్తిని రిమోట్ కంట్రోల్ తో నొక్కాడు. విషం దారాన్ని తడుపుతూ మెల్లిగా కిందికి వచ్చేసింది.
కానీ సరిగ్గా ఆ విషంచుక్క పడే సమయానికి నేను కాకతాళీయంగా పక్కకి పొర్లడం, విషపుచుక్క నా చెవిలో పడడం జరిగింది. నన్ను చంపడానికి బ్రిలియంట్ ఐడియా వేశాడు నందూ. కానీ.....సారీ నందూ! బెటర్ లక్ నెక్స్ ట్ టైం అని కూడా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే దేరీజ్ నో నెక్స్ ట్ టైం ఫర్ యూ!"
"బాస్!" అని పరిగెత్తుకొచ్చి అతని కళ్ళను చుట్టేసుకున్నాడు నందూ. "బాస్! నిఖిల్! నేను నీ క్లాస్ మేట్ ని రా! ప్రాణమిత్రునిరా! తెలియక చేసిన పొరబాటు మన్నించి నా ప్రాణాలు కాపాడరా!"
విరక్తిగా నవ్వాడు నిఖిల్. "మై ఫ్రెండ్! మై ఎనిమీ!" అంటూ అతన్ని కాలితో వెనక్కి నెట్టేసి నిటారుగా నిలబడ్డాడు.
అప్పుడు గమనించింది అమూల్య. అలివ్ కలర్ ప్యాంట్, షర్టూ వేసుకుని ఉన్నాడు నిఖిల్. సాధారణంగా ఆ రంగు మిలటరీవాళ్ళు మాత్రమే వేసుకుంటారు.
తను ఒక మిలటరీ జనరల్ అనుకుంటున్నాడా నిఖిల్? ఎందుకిలాంటి బట్టలు వేసుకున్నాడు యూనిఫారంలాగా! అందులోనూ అర్దరాత్రిపూట?
"నాకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టమని మీకందరికీ తెలుసు. ఎగ్జోటిక్ యానిమల్స్ ని పెంచడం నాకు సరదా! కాని నాకు తెలియకుండానే నేను ఒక విషపు మిన్నాగుని కూడా పెంచానని ఇవాళే తెలిసింది!" అన్నాడు పరీక్షగా ఒకతనివైపు చూస్తూ అతని పేరు నందూ.
"నిఖిల్! నిఖిల్!" అన్నాడు నందూ, ఏడుస్తూ ప్రాధేయపడుతూ.
నిఖిల్ మొహం కఠినంగా మారింది. నందూ ప్రార్ధన లక్ష్యపెట్టకుండా ఒక బటన్ పుష్ చేశాడు. వెంటనే వాళ్ళందరి మధ్యా ఒక ఆరడుగుల మేర నేల ప్రక్కకు జరిగిపోయింది. లోపల నీళ్ళు కదులుతూ గోడలని తాకుతున్న శబ్దం. ఆ నీళ్ళలో భయంకరమైన ఫిరాన్హా చేపలు ఉన్నాయి. చాలా చిన్న చేపలే అవి. ఇరవైనుంచి ఇరవైఅయిదు సెంటీమీటర్లు పొడుగు ఉంటాయి. తమకంటే చిన్నచేపలని తిని బతికే కెన్నీబాల్స్ ఫిరాన్హాలు. కానీ పొరబాటున అవి ఉన్నచోటుకి వెళ్ళిన ఏ జంతువైనా, ఎంత పెద్ద మృగాన్నైనా సరే నిర్భయంగా ఎటాక్ చేస్తాయి వందల సంఖ్యలో వచ్చేసి! ఈ చిన్నచేపల వాతపడ్డ పెద్దసైజు ఎద్దుకూడా కొద్ది నిమిషాల తర్వాత ఆస్థిపంజరమై మిగులుతుంది.
వాటిని చూడగానే వెర్రికేక పెట్టాడు నందూ. "నిఖిల్!"
నీళ్ళలో ఫిరాన్హా చేపలు ఒక్కసారిగా కదిలిన చప్పుడు.
భయభ్రాంతుడయిపోయిన నందూ తూలి కాలుజారి ముందుకు ఒరిగిపోయాడు.
అతని తల నీళ్ళలో మునిగిపోయింది. తన మొహం చుట్టూ కందిరీగలు మూగినట్లు కాసేపు విదిలించుకోబోయాడు నందూ. కానీ అతనికి సాధ్యం కాలేదు అది.
అందరూ చూస్తూ ఉండగానే అతని తల మాయమయిపోయింది. కేవలం కపాలం మిగిలింది. కింద రక్తమాంసాలున్న శరీరం! పైన కపాలం! భయంకరంగా ఉంది ఆ దృశ్యం.
నిఖిల్ సైగ అందుకున్న ఒకతను వచ్చి నందూ శరీరాన్ని పూర్తిగా నీళ్ళలోకి నెట్టేశాడు.
మళ్ళీ బటన్ నొక్కాడు నిఖిల్. నేల మూసుకుపోయి మామూలుగా అయిపోయింది.
వణికిపోతూ చూస్తోంది అమూల్య. ఇతను అభినవ రాబిన్ హుడ్ కాడు! అపర హిట్లర్ అనిపించింది ఆమెకి. అన్నీ హిట్లర్ పద్దతులే! అందుకే అలాంటి డ్రస్సు కూడా వేసుకుంటున్నాడు ఇప్పుడు!
చనిపోయిన ఆ దౌర్భాగ్యుడిని చూస్తే దుఃఖం వచ్చేస్తుంది అమూల్యకి. ఆ దుఃఖంలోనే మరో ఆలోచనకూడా వచ్చింది. తను ఇక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దొరికిపోతే తనకోసం ఈ హిట్లర్ తయారుగా ఉంచే చావు ఎలా ఉంటుంది?
మామూలుగా చంపడు తనని! అంతవరకూ ఖచ్చితంగా తెలుసు.
ఇలాంటి చిత్రాతిచిత్రమైన పద్దతులు అందరు డిక్టేటర్లూ అవలంబిస్తారు. తాము మామూలు మనుషులం కామనీ సాక్షాత్తు దైవాంశ సంభూతులమనీ వెర్రిగొర్రెల్లాంటి జనాలని నమ్మించడానికి!
ఎన్నో లక్షలమందిని చంపిన హిట్లరూ అంతే! సభలకు మామూలుగా వచ్చేవాడు కాడట. అతను రావడానికి ముందే సభ ప్రారంభమయి ఉంటుంది. అనుచరులెవరో అనౌన్స్ చేస్తారు. ఆరుగంటల పదినిమిషాల పది సెకండ్లవుతోంది మరో సెకండులో వస్తారు హిట్లర్. అరుగోవచ్చేశారు! హెయిర్ హిట్లర్!" అని చెయ్యెత్తి ఆకాశంవైపు చూపించేసరికి ఆకాశం గర్జిస్తున్నట్లు హెలికాఫ్టర్ మోత వినబడేది. దాన్లో ఉండేవాడు హిట్లర్. దేవదూతలా దిగేవాడు. జనం ఇంప్రెస్ అయిపోయి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయేవారు.
